పిఎంఇండియా
నమస్కారం!
దేశ పౌరులమైన మనమంతా ఇవాళ ఒక ఉన్నత, బృహత్తర సంకల్పంతో ఇక్కడ సమావేశమయ్యాం. ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు, సాధువులు సహా 28,000కు పైగా ప్రాంతాల నుంచి ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా అనుసంధానితులైన కోటి మందికి పైగా యువ మిత్రులు ఇందులో భాగస్వాములయ్యారు. ఈ బృహత్సంకల్పంలో భాగంగా నేటి శుభ సందర్భాన లక్షలాది యువతను ప్రత్యేకంగా స్వాగతిస్తూ, అభినందనలు తెలుపుతున్నాను. వ్యక్తి.. కుటుంబం.. సమాజం.. అన్నింటినీ మించి దేశ హితమే ఈ ఉద్యమ పరమోద్దేశం.
మిత్రులారా!
ఈ వికసిత భారత్ సంకల్ప కార్యక్రమానికి ‘మాదకద్రవ్య రహిత యువతరం’ అని జోడించడంలోనే దాని పరమావధి స్పష్టమవుతోంది. భారత్ ఒక అభివృద్ధి చెందిన దేశంగా రూపొందాలని లక్ష్యనిర్దేశం చేసుకున్న తరుణాన మన యువత మాదకద్రవ్య వ్యసన రహితులై శారీరకంగా, మానసికంగా సదా చక్కని ఆరోగ్యం, ఆత్మవిశ్వాసంతో ఉండటం అత్యావశ్యకం. ఈ ప్రచార కార్యక్రమం పరమావధి ఇదే… వ్యసనంతో కలిగే ముప్పును యువత అర్థం చేసుకుని, అప్రమత్తం కావడమే కాకుండా వారు దానికి దూరంగా ఉండాలని మనం సమష్టిగా సంకల్పించుకోవాలి. ఈ దిశగా జాతీయ మాదకద్రవ్య విముక్త యువతరం కార్యక్రమం’ ఇప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తుంది.
మిత్రులారా!
వాస్తవానికి ఈ కార్యక్రమం నిరుడు పావన వారణాసిలో ప్రయోగాత్మకంగా ప్రారంభం కావడంపై పార్లమెంటులో కాశీ నగరానికి ప్రతినిధిగా నేనెంతో గర్విస్తున్నాను. దీనికి శాస్త్రీయ దృక్పథంతోపాటు ఆధ్యాత్మిక శక్తి, సాధువుల ఆశీస్సులు సహా మన సుసంపన్న సాంస్కృతిక వారసత్వం కూడా ఉంది. శతాబ్దాలుగా మత్తును తిరస్కరించిన సాంస్కృతిక నిబద్ధతకు ఇదొక ప్రతీక. అందుకే, లక్షలాది ప్రజానీకం సంక్షేమం లక్ష్యంగా 125కు పైగా ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. మరోవైపు వివిధ సామాజిక-స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ దిశగా ప్రతినబూనాయి. వీరందరూ ఒక్కటై, కాశీ డిక్లరేషన్ పేరిట కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఆ విధంగా వారణాసిలో మొలకెత్తిన ఆలోచన ఇవాళ ఒక జాతీయ ప్రాజెక్టుగా విస్తరించిన నేపథ్యంలో నేటినుంచి దేశవ్యాప్తంగా ‘మాదకద్రవ్య రహిత యువత’ ఉద్యమంగా అమలవుతుంది.
మిత్రులారా!
సామాజిక హితం కోరి ఏదైనా సత్కార్యం తలపెట్టినపుడు వ్యక్తిగతంగా ఆ ప్రయత్నం ఒక భారంగా లేదా నిరుత్సాహంగా పరిణమించవచ్చు. కానీ, అది సామూహిక ఉద్యమంగా మారి, లక్షలాదిగా జనం భుజంకలిపి నడిస్తే, వ్యక్తులుగా మనకు నవ్యోత్తేజం కలుగుతుంది. సమష్టి కృషి సదా అత్యంత శక్తిమంతం కాబట్టి, ఈ రోజు ప్రారంభమయ్యే ఉద్యమం ప్రతి యువ హృదయాన్ని ఆకట్టుకుంటుంది. కొద్దిరోజుల కిందటే దేశంలోని లక్షలాది యువత వ్యసన విముక్తి దిశగా శపథం చేశారు. మీరంతా దకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, పాఠశాలలు-కళాశాలల్లోనే కాకుండా సామాజికంగానూ వ్యసన విముక్తి సందేశ వ్యాప్తికి పాటుపడాలని ఇవాళ మీరు సంకల్ప దీక్ష చేపడుతున్నారు.
మిత్రులారా!
ఈ ప్రతిజ్ఞా కాలం 100 వారాలపాటు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం నాడు కళ, సంస్కృతి, క్రీడలు, ధ్యానం, ఆధ్యాత్మికత, సేవ సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తారు. తద్వారా వ్యసన విముక్తి సందేశం మరింత మంది వ్యక్తులకు చేరుతుంది. తద్వారా మనం ఈ 100 ఆదివారాల్లో మాదకద్రవ్య రహిత భారత్ దిశగా 100 బలమైన అడుగులు వేసినట్లు కాగలదు.
మిత్రులారా!
వేలాది పాఠశాలలు-కళాశాలలు-విశ్వవిద్యాలయాల నుంచి లక్షలాదిగా విద్యార్థులు నేటి కార్యక్రమంతో ఆన్‌లైన్ ద్వారా సంధానితులయ్యారు. ‘మై భారత్’, ‘ఎన్‌ఎస్‌ఎస్’ల నుంచి లక్షలాది కార్యకర్తలు పాలుపంచుకుంటున్నారు. వివిధ ప్రాంతాలు, సంస్థలు, నేపథ్యాల నుంచి కోటి మందికి పైగా యువత దీనితో మమేకమయ్యారు. ఇంతటి ఘనమైన ఉద్యమానికి సారథులు మీరే! ఈ దేశ యువతరం కర్తవ్య నిర్వహణలో ఎంతో చైతన్యం, వివేచన, బాధ్యతతో వ్యవహరిస్తారనే నా విశ్వాసాన్ని మీరు మరింత బలోపేతం చేశారు. ఇందుకుగాను మీకందరికీ నా శుభాకాంక్షలు.
నా యువ మిత్రులారా!
ఈ దేశానికి మీరే అమృత తరం… అంటే- రాబోయే పాతికేళ్లలో మీ జీవితాలను మీరే తీర్చిదిద్దుకుంటారు. అంతేకాదు… 2047 నాటికి వికసిత భారత్‌గా అవతరించాలన్న లక్ష్యం వైపు ప్రస్థానంలో దేశానికి సారథులు మీరే. శిఖరాగ్రానికి చేరి, ఆ విజయ ఫలాలను ఆస్వాదించేదీ మీరే! మీ శక్తి, సృజనాత్మకత, ప్రతిభ దేశానికెంతో అవసరం. కాబట్టి, మీ కోసమే కాకుండా దేశం కోసం వ్యసనాలకు దూరంగా ఉండటం తప్పనిసరి. మత్తుపదార్థాలు యువత ఏకాగ్రతను చెడగొట్టి, క్రమంగా తమ కలల నుంచి వారిని దూరం చేస్తాయి. ఇలాంటి సమస్యను, దానివల్ల తలెత్తే సంక్షోభాలను, వాటిని అధిగమించే సామూహిక పథాన్ని ఇప్పుడిక్కడ ప్రదర్శించిన లఘు నాటకం అద్భుతంగా ఆవిష్కరించింది. సంక్షిప్త నాటకమే అయినప్పటికీ, ఇది నాటకానికి మాత్రమే పరిమితం కాదు… మనల్ని మేల్కొల్పి, పోరాట స్ఫూర్తినిచ్చే ఒక శక్తిమంతమైన సందేశం.
మిత్రులారా!
ఇవాళ్టి యువతరం అంకుర సంస్థల ద్వారా రాణిస్తోంది… కృత్రిమ మేధ (ఏఐ)ను ఆకళింపు చేసుకోవడంలో ముందంజ వేసింది. క్రీడా రంగంలో త్రివర్ణ పతాకను రెపరెపలాడించడం.. అంతరిక్షం నుంచి విజ్ఞానశాస్త్ర రంగం దాకా కొత్త రికార్డులు సృష్టించడం నేడు మన ముందున్న వాస్తవం. అయితే, ఒక యువకుడు మత్తుపదార్థాలకు బానిసగా మారితే, నష్టం అతడికి మాత్రమే పరిమితం కాదు… ఒక సంకల్పం వికలమైపోతుంది. ఒక కుటుంబం విచ్ఛిన్నమవుతుంది.. సమాజం వేదన పడుతుంది. అతని వ్యసనం తల్లి చిరునవ్వును చిదిమేస్తుంది… తండ్రి ఆశలను ఛిన్నాభిన్నం చేస్తుంది. అక్కచెల్లెళ్ల బంధాన్ని బలహీనపరుస్తుంది.. తమ్ముడి ఆదర్శాన్ని దూరం చేస్తుంది. ముఖ్యంగా తమ కళ్లెదుటే బిడ్డ జీవితం క్షీణించిపోవడాన్ని నిస్సహాయంగా చూస్తూండిపోయేలా పెద్దలను నిశ్చేష్టులను చేస్తుంది. కుటుంబాలలో, సమాజంలో ఇలాంటి విపరిణామాల వల్ల దేశమూ బలహీనపడటం శత్రువులకు ఆసరాగా మారుతుంది. ఉగ్ర కుట్రలలో భాగంగా మన యువతను మరింతగా వ్యసనపరులుగా మార్చడానికి కుయుక్తులు పన్నుతారు. శాంతి, సహనాలతో జీవించే భారత్ వంటి దేశాలను నాశనం చేసేందుకు మత్తు పదార్థాల సరఫరాను ఒక ఆయుధంగా మలచుకుంటారు. అందుకే, యువతరంలో ఏ ఒక్కరూ ఈ ఉచ్చులో చిక్కుకోకుండా వెయ్యికళ్లతో కాపాడుకోవాల్సింది మనమే!
మిత్రులారా!
వ్యసనానికి దూరంగా ఉండటమంటే మన సామర్థ్యాన్ని మనం కాపాడుకోవడమే. గుర్తుంచుకోండి.. మాదక ద్రవ్యాలు తాత్కాలిక ఉత్సాహాన్ని, ఊపును కలిగించవచ్చు. కానీ, వాటికి బానిసలైతే మీ వృత్తి, కుటుంబ జీవనం పతనం వైపు సాగుతుంది. కాబట్టి, ఈ వ్యసనానికి మనం ఎన్నడూ తావివ్వరాదు.
మిత్రులారా!
మన సమాజం కూడా వ్యసనాలను మానవాళికి హానికారులుగా పరిగణించింది. సాధువులు, గురువులు దాని గురించి మనల్ని హెచ్చరిస్తూనే వస్తున్నారు. పవిత్ర గురు గ్రంథ్ సాహిబ్- “జితు పీతై మతి దూరీ హోయ్ బరలు పవై విచి ఐ. ఆప్నా పరైయా నా పచ్ఛనై ఖస్మహు ధాకే ఖై” అంటుంది. అంటే- “మన జ్ఞానం, విచక్షణపై మాదక ద్రవ్యం మత్తు పొరలు కప్పుతుంది. ఆ క్షణంలో వ్యక్తి తనకు, ఇతరులకు మధ్యగల భేదాన్ని గుర్తించలేడు… అటువంటి మత్తు వ్యక్తిగత, సామాజిక పతనానికి మాత్రమే దారితీస్తుంది” అని అర్థం.
మిత్రులారా!
ఇలాంటి వ్యసనాల బారినపడకుండా మన సంస్కృతి సదా హెచ్చరించడమే కాకుండా తదనుగుణ మార్గాలను చూపింది. మాదక ద్రవ్యాలకు మనను దూరంగా ఉంచడంలో సామాజిక మద్దతు, యోగా-ధ్యాన శక్తి వంటివన్నీ అంతరాత్మను చైతన్యవంతం చేస్తాయి. మరోవైపు మాదకద్రవ్య వ్యసనం నుంచి విముక్తం చేసే దిశగా పునరావాస కేంద్రాలు పనిచేస్తున్నాయి. కాబట్టి, ఎవరైనా ఈ వ్యసనానికి బానిసైతే, వారికి అన్ని దారులూ మూసుకుపోయినట్టు కాదు. కుటుంబాలు కూడా పరువుప్రతిష్టల పేరిట అటువంటి వాస్తవాలను దాచకూడదు. మీ బిడ్డకు విముక్తి కోసం వ్యవస్థల సాయం కోరండి.. నిపుణులను సంప్రదించి మనసు విప్పి మాట్లాడండి. వైద్య సహాయం తీసుకోవడంతోపాటు ఇంట్లో సార్వత్రిక సంభాషణ సంస్కృతిని ప్రోత్సహించండి. తద్వారా వ్యసన విముక్తి లక్షణాలు, రహస్య వైఖరి, రాత్రివేళ ఆలస్యంగా ఇంటికి రావడం, డబ్బు కోసం అలవిమాలిన పనులకు పాల్పడటం వంటి ఆరంభ సంకేతాలను గుర్తించి పరిస్థితి చేయిదాటకముందే అప్రమత్తం కావాలి.
మిత్రులారా!
కళాశాలలు-విశ్వవిద్యాలయాల ఆచార్యులకు నాదొక వినతిప్తి: విద్యావేత్తలు సహా విద్యార్థులందరితో మాదకద్రవ్యాల ముప్పు గురించి మాట్లాడండి. మీ ప్రాంగణాలలో దీన్నొక ఉద్యమంలా చేపట్టండి. మీ కృషి విశేష ఫలితాలివ్వగలదు. గుర్తుంచుకోండి.. వ్యసనంపై పోరాడి, దాన్ని జయించిన వారు ఎన్నడూ బలహీనులు కారు- వారే నిజమైన యోధులు. అలాంటివారిని సమాజం గౌరవించాలి.. ఆదరించాలి.. వారికి మరో అవకాశమివ్వాలి… తద్వారా వారి ధైర్యమే వారిని నిర్వచిస్తుంది.
మిత్రులారా!
ఈ ఉద్యమంలో ప్రభుత్వం యువతకు అండదండగా నిలుస్తుంది. మాదకద్రవ్యాల దొంగ రవాణాదారులపై ఇప్పటికే కఠిన చర్యలు చేపడుతున్నాం. అరెస్టుల సంఖ్య అనేక రెట్లు పెరిగిన నేపథ్యంలో రూ.వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విషయంలో మా ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నదో ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉద్యమాన్ని పూర్తిస్థాయిలో కొనసాగిస్తాయని దృఢంగా విశ్వసిస్తున్నాను. మన యువత వ్యసన రహితులై తమ శక్తిసామర్థ్యాలను కాపాడుకుంటూ, వికసిత భారత్ సంకల్ప సాధనకు సారథ్యం వహించగలరని నేనెంతగానో విశ్వసిస్తున్నాను. ఇవాళ ఇక్కడ ఇందరు పూజ్యులైన సాధువులను చూస్తున్న నేను వారికి సగౌరవంగా నమస్కరిస్తున్నాను. దేశవ్యాప్త ఆధ్యాత్మిక-సామాజిక సంస్థలు, భక్తులు, యువత అంతా ఏకమై ఈ ఉద్యమాన్ని జయప్రదం చేయాలి. దేశమంతటా రాబోయే 100 వారాల్లో ప్రతి సంస్థ ఒక వారం వంతున బాధ్యతలు స్వీకరించి ప్రధాన కార్యక్రమాలను నిర్వహించగలిగితే, మన ఉద్యమం ఎంతటి ఉన్నత స్థాయిని చేరగలదో ఒక్కసారి ఊహించండి.
చివరగా- ఈ బృహత్కార్యాన్ని ఆశీర్వదించిన సాధువులకు, ఆచార్యులకు, సంస్థల నాయకులకు నా ధన్యవాదాలు. నేటి కార్యక్రమంలో భాగస్వాములైన కోటి మందికి పైగా యువతకు నా ప్రత్యేక అభినందనలు. ‘మై భారత్’ కార్యకర్తలు ఏది సంకల్పించినా, ఆ లక్ష్యాన్ని సాధిస్తారు కాబట్టి, వారికి నా ప్రశంసలు. ఒకనాడు దేశానికి “చివరి గ్రామాలు”గా పరిగణనలో ఉండి, ఇప్పుడు “ప్రవేశ ద్వారాలు” అని మనం సగర్వంగా పిలుచుకుంటున్న సరిహద్దు గ్రామాల్లో ఒక వారం గడిపిన వారిలో కొందరిని నేను ఇటీవల కలిశాను. వారి అనుభవాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. దేశంపై అవగాహనకు, అంకితభావానికి ప్రతీకగా వారు ఈ భారీ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలుపుతూ, వందనం చేస్తున్నాను. మీ అందరి సమష్టి కృషితో, ఈ ఉద్యమం ఇంటింటికీ, ప్రతి యువ హృదయానికి చేరగలదని, మాదకద్రవ్యాల దొంగరవాణా దారులకు సింహస్వప్నం కాగలదని దృఢంగా విశ్వసిస్తున్నాను. మనమంతా ఏకతాటిపై ముందడుగు వేద్దామనే పిలుపుతో మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగం ముగిస్తున్నాను.
మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు!
గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.
***
Speaking at the launch of 'Nasha Mukt Yuva for Viksit Bharat Sankalp Abhiyan', a 100-week campaign against substance abuse. I urge every citizen, especially our youth, to join this movement. https://t.co/ucvrcAyK4C
— Narendra Modi (@narendramodi) August 2, 2026
आज जब देश ने विकसित भारत का लक्ष्य तय किया है... तो इसके लिए आवश्यक है... देश का युवा, तन से स्वस्थ हो, मन स्वस्थ हो, आत्मविश्वास से भरपूर हो और ड्रग्स जैसी घातक आदत से हमेशा दूर हो: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 2, 2026
हमें हर एक युवा को नशे के चंगुल में फंसने से बचाना है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 2, 2026
समाज का सहयोग, योग और ध्यान की ताकत... ये नशे के खिलाफ हमारे अन्तर्मन को ताकत देते हैं।
— PMO India (@PMOIndia) August 2, 2026
और आज तो हमारे पास... नशा छोड़ने के लिए rehabilitation center जैसी सुविधाएं भी हैं: PM @narendramodi
अगर कोई युवा गलती से नशे में फंस भी गया है तो इसका ये मतलब बिल्कुल नहीं है कि उसके सारे रास्ते बंद हो गए हैं!
— PMO India (@PMOIndia) August 2, 2026
हमें हमेशा इस बात का ध्यान रखना है... घर का कोई बच्चा अगर नशे का शिकार बन गया है... तो इसे सामाजिक प्रतिष्ठा की आड़ में छिपाएं नहीं।
जिसकी जरूरत हो, उसका सहयोग लें।…
एक आवाहन मैं कॉलेज और यूनिवर्सिटीज़ के हमारे प्रोफेसर्स से भी करना चाहता हूँ...
— PMO India (@PMOIndia) August 2, 2026
आप भी कोर्स की पढ़ाई के साथ-साथ स्टूडेंट्स के साथ ड्रग्स के खतरों पर बात करें।
नशे के खिलाफ अपने कैम्पस में एक मूवमेंट चलाएं।
आपके प्रयास बड़े परिणाम ला सकते हैं: PM @narendramodi
काशी की पावन धरती से उठा कल्याणकारी विचार अब एक नेशनल प्रोजेक्ट बन गया है। मुझे पूरा विश्वास है कि 'नशा मुक्त युवा-विकसित भारत संकल्प अभियान' सामूहिकता की ताकत से हर युवा मन को छूने वाला है। pic.twitter.com/Z4CGfOPxHN
— Narendra Modi (@narendramodi) August 2, 2026
ड्रग्स कुछ समय के लिए ‘High’ देता है, लेकिन करियर और फैमिली लाइफ को ‘Low’ कर देता है। इसलिए नशा मुक्त रहकर हमारे युवाओं को अपने Potential को Protect करना है! pic.twitter.com/Pne82x4qyK
— Narendra Modi (@narendramodi) August 2, 2026
नशा मुक्ति की दिशा में देशभर के कॉलेजों और यूनिवर्सिटीज के हमारे प्रोफेसर्स से मेरा यह विशेष आह्वान... pic.twitter.com/uikh4d1qDq
— Narendra Modi (@narendramodi) August 2, 2026