పిఎంఇండియా
విశాఖపట్టణం విమానాశ్రయం వద్ద ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కు ఉన్న 11.45 ఎకరాల స్థలాన్ని మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ (ఎమ్ఎమ్ఎల్‌పీ)ని ఏర్పాటు చేయడం కోసం మెస్సర్స్ కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీఓఎన్‌సీఓఆర్) కు ఇచ్చివేసి, దానికి బదులుగా అంతే విస్తీర్ణం గల స్థలాన్ని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ (వీపీటీ) నుంచి తీసుకొనే ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది.
ఈ స్థలం మార్పిడి అటు ఏఏఐ తో పాటు, ఇటు వీపీటీ కి కూడా ప్రయోజనకరమే కానుంది. వీపీటీ ఇవ్వజూపిన స్థలం ఏఏఐకి ఇప్పుడు ఉన్న భూమిని ఆనుకొనే ఉంది. భవిష్యత్తులో విశాఖపట్టణం విమానాశ్రయం విస్తరణ ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొంటే ఈ స్థల బదలాయింపు ఏఏఐ కి అనువుగా ఉంటుంది. ఇక మెస్సర్స్ సీఓఎన్‌సీఓఆర్ నెలకొల్పనున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ , ఇతర వినియోగదారు సంబంధిత సదుపాయాలు కూడా ఆంధ్ర ప్రదేశ్‌లో సరకు రవాణా సామర్థ్యం పెంపుదలకు, సమీకృత రైలు- రోడ్డు మార్గ లాజిస్టిక్స్ హబ్ అభివృద్ధికి, తద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా, వ్యాపార పరంగా మరింత ముందంజ వేయడానికి తోడ్పడుతాయి.
నేపథ్యం:
మెస్సర్స్ కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీఓఎన్‌సీఓఆర్) రైల్వేల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఇది విశాఖపట్టణం సమీపంలో దాదాపు 98 ఎకరాల స్థలాన్ని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ (వీపీటీ) దగ్గరి నుంచి లీజుకు తీసుకుని అందులో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ (ఎమ్ఎమ్ఎల్‌పీ)ని ఏర్పాటు చేయనుంది. వీపీటీ షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేస్తున్న ఓడరేవు నిర్వహణ ట్రస్టు. సీఓఎన్‌సీఓఆర్ తలపెట్టిన ప్రాజెక్టు కు మొత్తం 98 ఎకరాల స్థలాన్ని అప్పగించడంలో భాగంగా వీపీటీకి, ఏఏఐ కి మధ్య 11.45 ఎకరాల స్థలం మార్పిడి చోటు చేసుకోనుంది.