పిఎంఇండియా
వసాయం మరియు ఆహార సంబంధిత పరిశ్రమ రంగంలో సహకారం అంశంపై భారతదేశం, కిర్గి స్తాన్ ల మధ్య ఒప్పందంపై సంతకాలు చేసేందుకు వ్యవసాయం మరియు వ్యవసాయదారుల సంక్షేమ మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఇండియా , కిర్గి స్తాన్ ల మధ్య కుదరనున్న ప్రతిపాదిత ఒప్పందంలో వ్యవసాయం మరియు వ్యవసాయంతో సంబంధం గల రంగాలకు సంబంధించిన పరిశోధన, పశుసంవర్ధన, ఏవియన్ ఇన్‌ఫ్లూయంజా, ఫుడ్ అండ్ మౌత్ డిజీజ్ (ఎఫ్ఎమ్ డి), పశువుల చికిత్సకు ఉపయోగించే మందులు, మొక్కల పెంపకం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విత్తనాల ఉత్పత్తి, విత్తన ధృవీకరణ, వివిధ రకాల నీటి పారుదల, భారతదేశ ప్రయోగాత్మక ప్రాజెక్టు స్థాపన, ఫూడ్ ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ టెక్నాలజీ లను సమర్ధంగా వినియోగించుకొనేందుకు సమాచార సాంకేతిక విజ్ఞానం వినియోగంతో పాటు వివిధ అంశాలు ఇమిడి ఉండనున్నాయి.
సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడమే కాకుండా మొక్కల రకాల హక్కులకు సంబంధించిన రక్షణ విషయంలో, వ్యవసాయం, ఆహార వాణిజ్యం, పండ్లతోటలు, వ్యవసాయ పరిశోధన- విద్య , పండ్ల తోటల పరిశోధన- విద్య రంగాలు, ఆహార రక్షణ ప్రమాణాలు, చేపలు/ రొయ్యల పెంపకం, మత్స్య సంపద తదితర రంగాలలో సహకారానికి కూడా ఈ అవగాహనపూర్వక ఒప్పందం వీలు కల్పిస్తుంది.
ఈ ఒప్పందం ఇరు దేశాల ప్రతినిధులతో ఒక సంయుక్త కార్యాచరణ బృందం ఏర్పాటుకు వీలు కల్పిస్తోంది. ఈ బృందం సహకరించుకోవలసిన ప్రణాళికలను రూపొందించవలసివుంటుంది. అలాగే, ఈ ఒప్పందం అమలులోను, ఉభయ పక్షాలు నిర్ధరించే కార్యభారాల నిర్వహణలోను తలెత్తే సమస్యలకు పరిష్కారాలను కూడా సూచిస్తుంది.
ఈ ఒప్పందం ఒప్పంద పత్రంపై సంతకాలు జరిగిన తేదీ నుండి అయిదు సంవత్సరాల కాలం పాటు అమలులో ఉంటుంది. ఆ తరువాత కూడా దీనిని మరో అయిదు సంవత్సరాల పాటు కొనసాగించవచ్చు. అయితే ఉభయ పక్షాలలో ఎవరైనా ఒప్పందం నుండి వైదొలగాలని భావిస్తే అందుకు ఒప్పంద గడువు ముగియడానికి కనీసం ఆరు నెలల ముందు తాము వైదొలగదలచుకున్న విషయాన్ని లిఖితపూర్వకంగా దౌత్య వర్గాల ద్వారా అవతలి పక్షానికి తెలియజేయవలసి ఉంటుంది.
***