Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వ్యవసాయ రంగం, ఇంకా వ్యవసాయంతో సంబంధం గల రంగాలలో భారతదేశం మరియు పోర్చుగల్ ల మధ్య అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ ఒ యు)పై సంతకాలకు ఆమోదం తెలిపిన మంత్రిమండల


భారతదేశం మరియు పోర్చుగల్ ల మధ్య వ్యవసాయ రంగం, ఇంకా వ్యవసాయంతో సంబంధం గల రంగాలలో సహకారం కోసం ఒక ఒప్పందంపై సంతకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

ఈ రంగాలలో శాస్త్ర విజ్ఞాన సమాచారం మరియు సాంకేతిక విజ్ఞాన సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం, చిన్న చెట్లు మరియు వృక్ష సంబంధ ఉత్పత్తుల వ్యాపారం, దిగుమతి చేసుకొన్న మొక్కలలో చీడపీడల తాలూకు సమాచారం మార్పిడి, శిక్షణ కార్యక్రమాలు, చర్చాసభలు, నిపుణులు మరియు సలహాదారుల సందర్శనలు సహా వివిధ కార్యకలాపాలు ఈ ఒప్పందం పరిధిలోకి రాగలవు.

రెండు దేశాలకు చెందిన ప్రతినిధులతో కూడిన ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం వీలు కల్పిస్తుంది. ప్రస్తుత అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ ఒ యు) అమలును పర్యవేక్షించడం, వ్యవసాయ సంబంధ సహకారం కోసం నిర్దిష్ట ప్రతిపాదనలు చేయడం, వ్యవసాయ రంగం, ఇంకా వ్యవసాయంతో సంబంధం గల రంగాలలో భవిష్యత్తులో సహకారం కోసం మార్గదర్శకాలను, ప్రాధమ్యాలను సూచించడం కూడా ఈ సంయుక్త కార్యాచరణ బృందం విధులుగా ఉండబోతున్నాయి.

సంతకాలు జరిగిన నాటి నుండి ఒప్పందం అమలులోకి వస్తుంది. అయిదు సంవత్సరాల పాటు ఒప్పందం అమలులో ఉంటుంది. ఒప్పందం గడువు ముగియడానికి కనీసం ఆరు నెలల ముందే ఇరు పక్షాలలో ఏదైనా ఒక పక్షం ఈ ఒప్పందాన్ని రద్దుపరచాలనే తన ఉద్దేశాన్ని వెల్లడిస్తూ దౌత్య మార్గాల ద్వారా అవతలి పక్షానికి లిఖితపూర్వక నోటీసును ఇవ్వకపోతే గనక, తదుపరి అయిదు సంవత్సరాల వరకు కూడా ఒప్పందం దానంతట అదే అమలు అయ్యేందుకు వీలు ఉంది.

***