Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘వ్యాపారం చేయడం లో సౌలభ్యం’ అంశం పై ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగం


 

ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్‌ జైట్లీ గారు, వాణిజ్య‌ం మరియు ప‌రిశ్ర‌మ‌ శాఖ మంత్రి శ్రీ సురేశ్ ప్ర‌భు గారు, వరల్డ్ బ్యాంకు ఉపాధ్య‌క్షుడు శ్రీ శేఫర్‌, ఆనంద్ మ‌హీంద్రా గారు,  రాసేశ్ షా గారు, సౌమిత్ర భ‌ట్టాచార్య‌ గారు, బి.కె. గోయంకా గారు, ర‌మేశ్ భార‌తి మిత్తల్‌ గారు,  వ్యాపార లోకం ప్ర‌తినిధులు, ఇక్క‌డకు విచ్చేసిన ఇత‌ర ముఖ్యులారా.  మీ అంద‌రికీ లోక్ క‌ల్యాణ్‌ మార్గ్‌ లోకి ఇదే నా స్వాగ‌తం.  దీపావ‌ళి సంద‌ర్భం గా మీ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌డం మాత్ర‌మే కాకుండా మీరంద‌రూ దేశాన్ని అత్యంత క్లిష్ట‌, అనుచిత ప‌రిస్థితి నుండి ఒక గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్థాయి కి తీసుకువ‌చ్చినందుకు మిమ్మ‌ల్ని అభినందించ‌డానికి, నా కృత‌జ్ఞ‌త‌లను వ్యక్తంచేయడానికి మీ అంద‌రినీ ఈ రోజు ఇక్క‌డకు నేను ఆహ్వానించాను.  మీరు ‘వ్యాపారం చేయడం లో సౌలభ్యాని’కి సంబంధించి దేశాన్ని ఉన్న‌త శిఖ‌రాల‌కు తీసుకుపోయారు.  ఇక్క‌డ ఈ స‌మావేశానికి తరలి రానటువంటి వారి తో పాటు ప్రతి ఒక్కరికీ నేను కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేయదలచాను.

ఎంతో మంది ప్ర‌భుత్వ అధికారులు, ఉద్యోగులు, మ్యునిసిప‌ల్ కార్పొరేశన్ లలోని ఎంద‌రో అధికారులు, పోర్టు లో, ఎయిర్‌పోర్టు లో అనుమతి ఇవ్వవలసిన అధికారులు, వ్యాపార ప్ర‌పంచం లోని వారు ఇలా అంద‌రూ చెప్పుకోద‌గిన పాత్ర వ‌హించారు.  
నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల క్రితం నేను మొట్టమొదటి సారి గా రానున్న సంవ‌త్స‌రాల్లో మ‌నం అగ్రగామి 50 దేశాల జాబితా లో ఉంటామ‌ని చెప్పిన‌పుడు, చాలా మంది దీనిని విశ్వ‌సించ‌లేదు.  2014 సంవ‌త్స‌రానికి ముందున్న అస్థిర‌త‌, విధాన‌పరమైన 
అచేత‌న‌ స్థితి ల కార‌ణం గా దేశం క‌నీసం తొలి 100 దేశాల జాబితా లో స్థానాన్ని సంపాదించుకోగ‌ల‌ద‌న్న న‌మ్మ‌కం కూడా లేకుండా పోయింది.  వారు ఇలా అనుకోవ‌డం  త‌ప్పు కాద‌నుకుంటాను.  అవినీతి , కుంభ‌కోణాలు, అస్థిర ఆర్థిక‌ వ్య‌వ‌స్థ‌,  నియంత్ర‌ణ‌ లేని కోశ సంబంధ లోటు ల వంటి వార్త‌ల‌నే వారు చ‌దువుతూ, వింటూ వ‌స్తున్నందువ‌ల్ల నేను ఇంత‌కు ముందు చెప్పిన‌ట్టు జ‌నం విశ్వ‌సించ‌క‌పోవ‌డం స‌హ‌జం.  అంతేకాదు భారతదేశం మునిగిపోతందని, ఇత‌ర దేశాల‌ను కూడా ముంచుతుంద‌ని ప్ర‌పంచం అన‌డం మొద‌లు పెట్టింది.  అయితే ప‌ట్టుమ‌ని నాలుగు సంవ‌త్స‌రాల్లో ప‌రిస్థితి లో 180 డిగ్రీ ల మార్పు ను మీరు చూడగలుగుతున్నారు.

ఇక ‘వ్యాపారం చేయడం లో సౌలభ్యం’ గురించి చూసిన‌ట్ట‌యితే, మ‌నం 142వ ర్యాంకు నుండి 77వ ర్యాంకు కు మ‌న ప‌రిస్థితి ని మెరుగుప‌రచుకున్నాం.  మ‌నం అందులో దాదాపు స‌గం స్థానాలను అధిగమించాం.

మిత్రులారా,

కేవలం నాలుగు సంవ‌త్స‌రాల్లో 65 స్థానాలు ఎగబాకాం.  ఏ దేశానికైనా ఇది ఊహించ‌ని రికార్డు.  నాలుగు సంవ‌త్స‌రాల క్రితం ‘వ్యాపారం చేయడం లో సౌలభ్యం’లో 6వ స్థానం లో ఉన్న భార‌త‌దేశం, ఇవాళ ద‌క్షిణాసియా లో మొద‌టి స్థానం లో 
ఉంది.  ఇలాగ త‌న స్థానాన్ని మెరుగుప‌రచుకున్న దేశాల‌ తో భారతదేశం వరుస‌గా రెండో సంవ‌త్స‌రం తొలి 10 స్థానాలలో నిల‌చింది.  గ‌త 7-8 సంవ‌త్స‌రాల‌లో ఏ ఇత‌ర దేశం కూడా ప‌ట్టుమ‌ని రెండు సంవ‌త్స‌రాల‌లో 53 ర్యాంకులు మెరుగు ప‌రుచుకో 
లేదు.

మిత్రులారా,

ప్ర‌పంచ‌ వ్యాప్తం గా ఎవ‌రూ ఎన్న‌డూ ఊహించ‌ని విజ‌యాన్ని మ‌నం సాధించగ‌లిగాం.  తొలి 50 దేశాల జాబితా లో చేరాల‌న్న మన ల‌క్ష్యాని కి కొద్ది అడుగుల దూరం లోనే మ‌నం ఉన్నాం.  వరల్డ్ బ్యాంకు నివేదిక ప్ర‌కారం, భారతదేశం 10 ప్ర‌మాణాల‌లో 8 ప్ర‌మాణాల విష‌యం లో త‌న ప‌నితీరు ను మెరుగుప‌రచుకుంది.  రెండు ప్ర‌మాణాల విష‌యం లో మ‌నం 100 ర్యాంకులను అధిగ‌మించాం.

దేశం లో మార్పు వాతావ‌ర‌ణాన్నితీసుకు వచ్చేందుకు, మ‌న ర్యాంకు ల‌క్ష్యాల‌ను మెరుగు ప‌రుచుకునేందుకు,  రాష్ట్ర‌ప్ర‌భుత్వాల‌తో నిరంత‌రాయంగా క‌లిసిప‌నిచేస్తున్నాం.  పోటీత‌త్వంతో కూడిన స‌హ‌కార ఫెడ‌ర‌లిజాన్ని బ‌లోపేతం చేసేందుకు మ‌న రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు ఉత్సాహంతో ప‌నిచేస్తున్నాయి. మ‌నం ఇప్పుడు జిల్లా స్థాయి లో సుల‌భ‌త‌ర వాణిజ్యానికి సంబంధించిన  సంస్క‌ర‌ణ‌ల అమ‌లు దిశ‌ గా ముందుకు పోతున్నాం.  ఇందుకు సంబంధించిన మార్గసూచీ విష‌యం పై నిర్ణ‌యం తీసుకునేందుకు భాగ‌స్వాముల‌ తోను, రాష్ట్ర‌ ప్ర‌భుత్వాల‌ తోను మ‌నం నిరంత‌ర సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాం.  రాష్ట్రం లో జిల్లా స్థాయి లో ఒకే ర్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ ను ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.  మ‌నం జిల్లా ల‌కు ర్యాంకులను ఇచ్చేందుకు  ప్ర‌య‌త్నిస్తున్నాం, దీని వ‌ల్ల జిల్లాలు మ‌రింత‌గా ముందుకు పోవ‌డానికి ఉత్సాహంతో పోటీ ప‌డుతాయి.

మిత్రులారా,
 
మ‌న దేశ ప్ర‌గ‌తి, మౌలిక స‌దుపాయాల అభివృద్ధి, ఉపాధి అవ‌కాశాలు, త‌ల‌స‌రి ఆదాయం పెంపుదల వంటివి జ‌ర‌గాలంటే వ్యాపారం, వాణిజ్యం, వ్య‌వ‌స్థాప‌క‌త ల వంటివి అవ‌సరం.  పెట్టుబ‌డులు త‌ర‌లి వ‌చ్చి, వ్యాపారం, వాణిజ్యం స‌రైన దిశ‌లో ముందుకు పోతూ వీటి నుండి సామాన్యుడు ప్ర‌యోజ‌నాన్ని పొందిన‌పుడే ఇది సాధ్య‌ం అవుతుంది.  అందువ‌ల్ల విధానాల ఆధారంగా జ‌రిగే పాల‌న‌, పార‌ద‌ర్శ‌క విధానాలను గురించి మేం నొక్కి పలుకుతూ ఉంటాం.  విచ‌క్ష‌ణాధికారం తో కూడిన‌ విధానాల‌ను త‌గ్గించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం.  వరల్డ్ బ్యాంకు కేటాయించిన ర్యాంకు లు మ‌నం ఇప్ప‌టికే ప‌నిచేస్తున్న లేదా అనుస‌రిస్తున్న ప‌లు ప్ర‌మాణాల‌ను ప‌రిగ‌ణ‌న‌ లోకి తీసుకోని విష‌యాన్ని మీలో చాలా మంది గ‌మ‌నించే ఉంటారు.  ర్యాంకింగు లు అనేవి కొన్ని ప్ర‌మాణాల ఆధారంగా మాత్ర‌మే లెక్కిస్తున్న‌టువంటివి.  కానీ మ‌న సంస్క‌ర‌ణ‌ల వ్యూహం, ప‌నితీరు, ప‌రివ‌ర్త‌న విస్తృత‌మైంది.  అంతేకాదు, మ‌న సంస్క‌ర‌ణ‌ల వ్యూహం వరల్డ్ బ్యాంకు ర్యాంకింగు లకు మించిన‌ది.  మ‌నం సామాన్యుల‌ జీవ‌నాన్ని సరళపరచే , వ్యాపార కార్య‌క‌లాపాల‌ను మెరుగుప‌రచే దిశ‌ గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం.  సుల‌భ‌త‌ర వ్యాపార కార్య‌క‌లాపాలు మ‌న‌ దేశం లో మెరుగుప‌డుతుండ‌డం తో చిన్న వ్యాపారులు వారి కార్య‌క‌లాపాల‌ను ఎటువంటి అడ్డంకులు లేకుండా కొన‌సాగించ‌డానికి, ప్ర‌భుత్వ అనుమ‌తులు, కీల‌క ప‌ర్మిట్ లు త్వ‌ర‌గా పొంద‌డానికి వీలు క‌లుగుతోంది.  ఇటువంటి చ‌ర్య‌లు భార‌త‌దేశ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ లకు ప్రేర‌ణ‌ను ఇస్తున్నాయి.  అలాగే దేశ అవ‌స‌రాలను, ఆకాంక్ష‌ల‌ను ప‌రిగ‌ణ‌న లోకి తీసుకోవ‌డం జ‌రిగింది.

మిత్రులారా,

దేశ వ్యాపార కార్య‌క‌లాపాల‌ను పార‌ద‌ర్శ‌కం గా ఉంచేందుకు ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డం జ‌రిగింది.  మ‌న ప్ర‌భుత్వం ఆలోచ‌న విధానాన్ని మార్చ‌డ‌మే కాదు, అనుస‌రించే విధానాన్ని కూడా మార్చింది.  జిఎస్‌ టి, నోట్ల చట్టబద్ధత రద్దు, బేనామీ ఆస్తుల‌కు సంబంధించిన చ‌ట్టం, ఇన్ సాల్వన్సి కోడ్‌, ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డి దేశాన్ని విడచిపెట్టి పోయే వారికి సంబంధించి తెచ్చిన‌ చ‌ట్టాలు.. ఇవ‌న్నీ ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధికి నిద‌ర్శ‌నం.  ప్ర‌భుత్వం తీసుకున్న ఈ చ‌ర్య‌ల‌ ఫలితంగా దేశం లో అవినీతిప‌రులు భ‌య‌ప‌డుతున్నారు, నిజాయతీప‌రులు త‌గిన గౌర‌వాన్ని పొందుతున్నారు.  ఇప్పుడు మ‌రింత ఎక్కువ మంది ప‌న్నులను చెల్లించ‌డం ప్రారంభించారు.  తాము ప‌న్నుల రూపంలో చెల్లించిన డ‌బ్బు స‌క్ర‌మం గా వినియోగ‌మ‌వుతున్న‌ట్టు వారు వారు విశ్వ‌సించ‌సాగారు.

మిత్రులారా,

ఈ సంస్క‌ర‌ణ‌లు, నిర్ణ‌యాలు అంత సుల‌భ‌మైన‌వేమీ కావు. టెక్నిక్‌ల‌ను, చ‌ట్టాలను, సాఫ్ట్‌వేర్ ను మార్చవలసివ‌స్తుంది.  కొన్ని సంద‌ర్భాల‌లో సాఫ్ట్‌వేర్ ను మార్చ‌డం సుల‌భం కావ‌చ్చు కానీ అల‌వాట్ల‌ను మార్చ‌డం స‌వాలుతో కూడుకున్న‌ది.  ఈ సంస్క‌ర‌ణ‌ల‌కు అనుగుణం గా వ్య‌వ‌స్థ‌ ను  స‌న్న‌ద్ధపరచడం అంత సుల‌భ‌మైన విష‌యం ఏమీ కాదు.  అయితే మ‌నం ఈ ల‌క్ష్యాన్నిఅతి త‌క్కువ వ్య‌వ‌ధి లో  చేరుకోవ‌డంలో సఫలత ను సాధించాం.  ఇవాళ మ‌నం వివిధ స్థాయిల‌ లోని వ్య‌వ‌స్థ‌ల‌ను వ్యాపార వ‌ర్గాల‌కు, పౌరుల‌కు అనుకూలంగా ఉంచే దిశ‌ గా ముందుకు పోతున్నాం.  గ‌త నాలుగు సంవ‌త్స‌రాల‌లో, దేశం లో కాలంచెల్లిన 1400కు పైగా   చ‌ట్టాల‌ను తొల‌గించ‌డం జ‌రిగింది.  అంత‌క్రితం వాణిజ్య వివాదాల ప‌రిష్కారానికి స‌గ‌టున 1500 రోజులు ప‌ట్టేది.  1500 రోజులు అంటే దాదాపు 4 సంవ‌త్స‌రాలు అని అర్థం.  ఎంతో కృషి త‌రువాత ఈ స‌మ‌యాన్ని 400 రోజుల‌కు త‌గ్గించ‌గ‌లిగాం.  మేం దీనిని మ‌రింత త‌గ్గించేందుకు కృషి చేస్తున్నాం.  దిగుమ‌తైన ఉత్ప‌త్తుల‌కు సంబంధించి 2014కు ముందు క్లియ‌రెన్సు లు పొంద‌డానికి స‌గ‌టున 280 గంట‌లు ప‌డితే, ఇప్పుడు దానిని స‌గ‌టున 144 గంట‌ల కంటే త‌క్కువ‌కు కుదించాం.  ఈ స‌మ‌యాన్ని కూడా ఇంకా త‌గ్గించ‌నున్నాం.  గ‌తం లో ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తుల‌కు నెల‌లు, సంవ‌త్స‌రాలు ప‌ట్టేది.  కానీ ప్ర‌స్తుతం ఇందుకు కొద్ది వారాల స‌మ‌య‌మే ప‌డుతోంది.  ఇటీవ‌ల నిర్మాణ ప‌నుల‌కు, ఇత‌ర చిన్న ప‌నుల‌కు ప‌ర్యావ‌ర‌ణ క్లియ‌రెన్సుల‌ను వికేంద్రీక‌రించాం.  వీటిని స్థానిక సంస్థ‌ల‌కు అప్ప‌గించాం.  జిఎస్‌ టి దేశ లాజిస్టిక్ రంగాన్ని బ‌లోపేతం చేసింది.  గ‌త పాల‌న‌ తో పోలిస్తే ట‌ర్న రౌండ్ స‌మ‌యం దాదాపు 15 శాతం త‌గ్గింది.  ఇది కంపెనీల కాలాన్ని, డ‌బ్బు ను ఆదా చేసింది.  గ‌తం లో వ్యాపారులు కార్మిక చ‌ట్టాలు పాటించ‌డానికి 50నుంచి 60 ర‌కాల రిజిస్ట‌ర్ లను నిర్వ‌హించవలసి వ‌చ్చేది.  మా ప్ర‌భుత్వం ఈ రిజిస్ట‌ర్ ల సంఖ్య‌ ను 5కు కుదించింది.  50-60 రిజిస్ట‌ర్ లకు సంబంధించిన అదే ప‌ని ని 5 రిజిస్ట‌ర్ లతో సుల‌భ‌త‌రం చేశాం.  పాత పద్ధ‌తుల‌ను మార్చివేశాం.  అలాగే, గ‌తంలో పాస్‌పోర్టు పొంద‌డానికి మూడునుంచి నాలుగువారాల స‌మ‌యం ప‌ట్టేది. కానీ ఇప్ప‌డు ప్ర‌జ‌లు ప‌ట్టుమ‌ని వారం రోజుల లోపు పాస్‌పోర్టు పొంద‌గ‌లుగుతున్నారు. గ‌తంలో ప్ర‌జ‌లు త‌మ ఆదాయ‌ప‌న్ను రిఫండ్ కోసం 8 నుంచి10 నెల‌లు వేచి చూడవలసి వ‌చ్చేది.  కానీ ఇప్పుడు అదే ప‌ని కొద్ది వారాల‌లో జ‌రిగిపోతున్న‌ది.  నాలుగైదు సంవ‌త్స‌రాల క్రితం చూసిన‌ట్ట‌యితే రైల్వే రిజ‌ర్వేశన్ వెబ్‌సైట్ ర‌ద్దీ  స‌మ‌యాలలో మొరాయించేది.కానీ ఇప్పుడు రిజ‌ర్వేశన్ ట్రాఫిక్ పెరిగినా దానిని త‌ట్టుకునే విధంగా  రైల్వే వెబ్‌సైట్‌ ను అప్‌డేట్, అప్‌గ్రేడ్ చేశాం.  ఇది కోట్లాది  రైల్వే ప్ర‌యాణికుల‌కు ఉప‌యోగ‌ప‌డుతోంది.  సామాన్య‌ ప్ర‌జ‌ల జీవన నాణ్య‌త‌ ను పెంచేందుకు ప‌రిశుభ్ర‌త విష‌యం లో వీధుల‌ నుండి రైల్వే ప్లాట్‌ఫార్మ్ వ‌ర‌కు అన్ని చోట్లా విస్తృత ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తున్నాం.  రాత్రివేళ‌ల్లో ఉద్యోగ విధులను నిర్వ‌ర్తించే మ‌హిళ‌లు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా చూసేందుకు చ‌ట్టాల‌లో త‌గిన మార్పు ల‌ను ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చింది.  రాత్రి పొద్దు పోయే వ‌ర‌కు చిన్న దుకాణాల య‌జ‌మానులు, వ్యాపారులు వారి సంస్థ‌ల‌ను తెరచి ఉంచుకునేందుకు వీలు క‌ల్పించే విధం గా చ‌ట్టాలను మార్చ‌డం జ‌రిగింది.
 
మిత్రులారా,

ఇటీవ‌ల మ‌నం సూక్ష్మ‌, చిన్న మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల రంగం అభివృద్ధి కి గ‌ట్టి కృషి చేశాం.  జిఎస్‌ టి తో అనుసంధాన‌మైన వ్యాపారులు ఇప్పుడు 59 నిమిషాల‌ లోనే  కోటి రూపాయ‌ల వ‌ర‌కు రుణ‌ స‌దుపాయాన్ని పొంద‌డానికి అవ‌కాశం ఉంది.  దీనితో పాటు ఉత్ప‌త్తి ని పెంచ‌డానికి, మార్కెట్ ప‌రిధి ని విస్తృతం చేయ‌డానికి లైసెన్సింగ్‌, ఇన్వెస్టిగేశన్ కు సంబంధించి న ఇబ్బందులను తొల‌గించ‌డానికి నిర్ణ‌యాలు తీసుకున్నాం.  ప్ర‌ధాన‌మంత్రి రోజ్‌గార్ ప్రోత్సాహ‌న్ యోజ‌న లో భాగంగా కొత్త ఉద్యోగ అవ‌కాశాలను క‌ల్పించే కంపెనీల‌కు, వ్య‌వ‌స్థ‌ ల‌కు ఆర్థిక స‌హాయం ఇవ్వ‌డం జ‌రుగుతుంది.  ఈ ప‌థ‌కం లో కొత్త‌ గా ఉపాధి అవ‌కాశాలను క‌ల్పించే సంస్థ‌ల‌కు మూడు సంవ‌త్స‌రాల‌పాటు ఇపిఎఫ్ కంట్రిబ్యూశన్‌ ను ప్ర‌భుత్వ‌మే చెల్లిస్తుంది.  అప్రెంటిస్‌శిప్ చ‌ట్టాన్ని కూడా ప్ర‌భుత్వం మార్చింది.  కొత్త అప్రెంటిస్‌షిప్ ఇన్సెంటివ్ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది.  ఈ ప‌థ‌కం లో సంస్థ య‌జ‌మాని అప్రెంటిస్‌ ల‌ను నియ‌మించుకుంటే వారికి చెల్లించే స్ట‌యిపండ్‌ లో నాలుగో వంతు మొత్తాన్ని ప్ర‌భుత్వం చెల్లిస్తుంది.  చాలా ప‌రిశ్ర‌మ‌లు ఈ వ్య‌వ‌స్థ‌ లో చేరుతున్నాయి.

మిత్రులారా,

క‌నీస ప్ర‌భుత్వం, గ‌రిష్ఠ పాల‌న‌ ను విశ్వ‌సించే వ్య‌క్తి ని నేను.  ఫ‌లితం గా భార‌త ప్ర‌భుత్వ ప్ర‌స్తుత ప్ర‌తిష్ఠ మెరుగుప‌డుతూ ముందుకు పోతోంది.  ప్ర‌జ‌లకు జీవించడంలో సౌలభ్యాన్ని తీసుకువచ్చేందుకు సంస్క‌ర‌ణ‌లు కొన‌సాగుతున్నాయి. ఐఎంఎఫ్‌, మూడీ స్, వరల్డ్ ఎకనామిక్  ఫోరమ్, యుఎన్‌సిటిఎడి త‌దిత‌ర ర్యాంకింగ్‌ ల‌లో భార‌త‌దేశం స్థితి మెరుగుప‌డే దిశ‌ గా లేదా ఇప్ప‌టికే మెరుగుప‌డిన స్థాయి లో ఉంది.  ఇంకా ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే మ‌న సంస్క‌ర‌ణ‌ల వేగాన్ని, మ‌న ప్ర‌గ‌తి ని చూసి ఈ  సంస్థ‌లు భార‌తదేశ భ‌విష్య‌త్తు పై ఎంతో న‌మ్మ‌కం తో ఎంతో ఆశ తో ఉన్నాయి.

మిత్రులారా,

ఈ నిర్విరామ ప్ర‌య‌త్నాలు భారతదేశాన్ని త్వ‌ర‌లోనే 5 ట్రిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌ లో నిల‌బెట్ట‌నున్నాయి.  ఈ ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు మ‌నం ఆర్థిక వ్య‌వ‌స్థ‌ లోని ప్ర‌తి రంగాన్ని మెరుగుప‌ర‌చవలసివుంది.  అలాగే మ‌నం మ‌రో విష‌యాన్ని కూడా గుర్తుంచుకోవాలి.  వివిధ రంగాల నిర్వ‌చ‌నాలు మారుతున్నాయి.  ఇప్పుడు ఉత్పాద‌క‌, సేవ‌ల రంగాలు ఒక‌దానికి మరొక‌టి  పూర‌కాలు గా ఉన్నాయి.  సేవ‌ల రంగం నుండి ఉత్పాద‌క రంగానికి విలువ జోడింపు జ‌రుగుతోంది.  అలాగే ఉత్పాద‌క రంగానికి సంబంధించిన కొన్ని అంశాలు సేవ‌ల రంగాన్ని మెరుగుప‌రుస్తున్నాయి.  కొత్త సాంకేతికత లు, కృత్రిమ మేధ‌స్సు, స‌మాచార సాంకేతిక ప‌రిజ్ఞానం వంటివి ఉత్పాద‌క రంగ వాతావ‌ర‌ణం లో ముఖ్య‌మైన భాగాంగా మారాయి.  మ‌నం ఈ మార్పు ను దృష్టిలో పెట్టుకోవాలి.

మిత్రులారా,

అభివృద్ధి గ‌మ‌నం లోకి వాస్త‌వాల‌ను చొప్పించేందుకు, మౌలిక మార్పు ల‌ను మ‌రింత స‌మ‌ర్థం గా అమ‌లు చేసేందుకు ప్ర‌భుత్వం పారిశ్రామిక విధానం పై క‌స‌ర‌త్తు చేస్తోంది.  పారిశ్రామిక రంగాన్ని నూత‌న కోణం లో అర్థం చేసుకోగ‌ల విధానం, ప‌రిశ్ర‌మ‌ కు కొత్త 
కోణాన్ని వివ‌రించ‌గ‌ల విధానానికి కృషి జ‌రుగుతోంది.  ఈ పారిశ్రామిక విధానాలు న‌వ భార‌త వాణిజ్య‌వేత్త‌ల నూత‌న దార్శ‌నిక‌త‌ కు అనుగుణంగా ఉండ‌నున్నాయి.  వ్యాపారం చేయడం లో సౌలభ్యానికి ప్రాధాన్య‌ం ఈ పారిశ్రామిక విధానం లోనూ అలాగే ఉంటుంది.

మిత్రులారా,

వ్యాపారం చేయడం లో సౌలభ్యం ర్యాంకింగు ల‌లో మ‌నం పైన ఉన్న 50 ర్యాంకు ల‌లో స్థానం సంపాదించుకునేందుకు గ‌ట్టి కృషి చేయాలి.  రాగ‌ల రోజుల‌లో ఈ అంశంపై నేను వివిధ విభాగాల‌తో స‌మీక్ష స‌మావేశాలను నిర్వ‌హించ‌ద‌ల‌చాను.  ఈ ఏడాది డిసెంబ‌ర్ కల్లా అమ‌లు చేసే నిర్ణ‌యాలు వ‌చ్చే ఏడాది ర్యాంకింగ్‌పైన ప్ర‌భావాన్ని ప్రసరిస్తాయి.  ప్ర‌తి రంగం లో- అంటే ఉదాహ‌ర‌ణ‌ కు- ప‌రిశుభ్ర‌మైన ఇంధ‌న రంగం, డిజిట‌ల్ ప్ర‌పంచం, ఆరోగ్య రంగం, ర‌వాణా త‌దిత‌ర రంగాల‌లో మీరు చేసే కృషి దేశాన్ని స్వ‌యం స‌మృద్ధం  చేస్తుంది.

ప్రస్తుత వ్య‌వ‌స్థ‌ లో, అన్ని ప్ర‌క్రియ‌ ల‌లో మాన‌వ ప్రమేయాన్ని క‌నిష్ఠ స్థాయి కి త‌గ్గించాలి.  ఇది స‌ఫ‌లం కావాలంటే, మ‌న జీవ‌న రంగం లోని ప్ర‌తి పార్శ్వం లో  ఆధునిక డిజిట‌ల్ సాంకేతిక ప‌రిజ్ఞాన వాడ‌కాన్ని గ‌రిష్ఠం గా ఉప‌యోగించాలి. ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించ‌డానికి, దస్తావేజు పత్రాలను స‌మ‌ర్పించ‌డానికి, రుసుము చెల్లించ‌డానికి ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ కార్యాల‌యాల, ఆయా ఏజెన్సీల కార్యాల‌యాల చుట్టూ తిర‌గనక్కర లేని ప‌రిస్థితుల‌ను, ఆ ర‌క‌మైన ప‌ని సంస్కృతి ని మ‌నం అభివృద్ధి చేయాలి.  ఇలాంటి ప‌ని విధానాలు పాల‌న‌ ను బ‌లోపేతం చేస్తాయి.  సుల‌భ‌త‌ర వాణిజ్యానికి సంబంధించిన ప్ర‌యోజ‌నాల‌ను, సుల‌భ‌త‌ర జీవ‌నానికి సంబంధించిన ఫ‌లితాల‌ను దేశం లోని ప్ర‌తి పౌరుడికి అందేలా చేయ‌డానికి మాకుమీ సల‌హా లు కావాలి.

మిత్రులారా,

మీ ఆత్మ‌విశ్వాసం, ప్ర‌స్తుతం మీకు ఉన్న న‌మ్మ‌కం.. ఇవే నాకు గొప్ప‌ బ‌లాలు.  మీ నుండి వ‌చ్చే ప్ర‌తి సూచ‌న‌ ను, ప్రతి స‌ల‌హా ను నేను స్వాగ‌తిస్తాను.  మోడీ జీ నిర్దేశిస్తున్న‌ట్టుగా లక్ష్యాలను కార్పొరేట్‌ రంగం కూడా నిర్దేశించ‌ లేద‌ని మ‌హేంద్ర‌ గారు అన్నారు.  గుజ‌రాతీ ప్ర‌జ‌ల‌కు చిన్న‌త‌నం లోనే ఒక‌టి బోధిస్తారు, లేదా చిన్న‌త‌నం లో ప్ర‌తివారికీ ఇదే బోధిస్తుంటారు- ‘ల‌క్ష్యాన్ని చేరుకోలేక‌పోవ‌డాన్ని 
క్ష‌మించ‌వచ్చు; కానీ త‌క్కువ  ల‌క్ష్యాన్ని నిర్దేశించుకోవ‌డాన్ని క్ష‌మించ‌డానికి వీలు లేదు’ అని. 

ఇదే నా మంత్రం.  మ‌నం నిర్దేశించుకొనే ల‌క్ష్యం మ‌న స్థాయి లోనే ఉండాలి కానీ మ‌నం దాని ప‌ట్టు లో ఉండ‌కూడ‌దు.  మ‌నం ఒక్క ఉదుటున గెంతితే ల‌క్ష్యాన్నిచేరుకోగ‌ల‌మ‌నే విధం గా వుండాలి.  ఇది మ‌న‌కు ద‌గ్గ‌ర‌గా ఉంద‌ని విశ్వ‌సించేటట్టు ఉండాలి.  ఈ 
మ‌న‌స్త‌త్వం తోనే  ల‌క్ష్యాల‌ ను నిర్దేశించ‌డం నా అల‌వాటు.  ఈ ర‌క‌మైన ఆలోచ‌న విధానం మ‌న దేశం లో ఉద్భ‌వించింద‌ని, ఇది మంచి ఫ‌లితాల‌ ను ఇస్తోంద‌ని నేను విశ్వ‌సిస్తున్నాను.

మీ అందరినీ నేను మ‌రొక్క‌ మారు అభినందిస్తూ నా ప్ర‌సంగాన్ని ముగిస్తాను.

అనేకానేక ధ‌న్య‌వాదాలు.

**