Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శాంతియుత ప్రయోజనాల కోసం అంత‌రిక్షాన్ని ఉప‌యోగించుకొనేందుకు భార‌తదేశం, ఆర్మేనియా ల‌ మ‌ధ్య అవ‌గాహ‌నపూర్వక ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం శాంతియుత ప్రయోజనాల కోసం అంత‌రిక్షాన్ని ఉప‌యోగించుకొనేందుకు భార‌తదేశం, ఆర్మేనియా ల‌ మ‌ధ్య అవ‌గాహ‌నపూర్వక ఒప్పందానికి (ఎమ్ఒయు) ఆమోదం తెలిపింది.

ఈ ఎమ్ఒయు పై 2017 ఏప్రిల్‌ లో సంత‌కాలు జ‌రిగాయి.

ఈ ఎమ్ఒయు అంత‌రిక్ష విజ్ఞానం, సాంకేతిక విజ్ఞానం, భూమికి సంబంధించిన రిమోట్ సెన్సింగ్ ఉప‌క‌ర‌ణాలు, ఉప‌గ్ర‌హ క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ, ఉప‌గ్ర‌హ ఆధారితమైన మార్గదర్శక వ్య‌వ‌స్థ‌, గ్ర‌హాలపై అన్వేషణ, అంతరిక్ష నౌక‌ల, అంత‌రిక్ష వ్య‌వ‌స్థ‌ల, భూత‌ల వ్య‌వ‌స్థ‌ల వినియోగం, అంత‌రిక్ష సంబంధిత సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం వంటి రంగాలలో సహకారానికి వీలు క‌ల్పిస్తుంది.

ఈ ఎమ్ఒయు ద్వారా అంత‌రిక్ష విభాగం, భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ‌ (డిఒఎస్- ఐఎస్ ఆర్ఒ), విద్యా మంత్రిత్వ‌ శాఖ ప‌రిధిలోని స్టేట్ క‌మిటీ ఆఫ్ సైన్సెస్‌, సైన్సెస్ ఆఫ్ ద రిప‌బ్లిక్ ఆఫ్ ఆర్మేనియా ల స‌భ్యుల‌తో కూడిన సంయుక్త కార్యాచ‌ర‌ణ బృందం ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. ఈ కార్యాచ‌ర‌ణ బృందం ప్ర‌స్తుత ఎమ్ఒయు నిర్ణీత కాల‌ప‌రిమితిలోగా అమ‌లుకు సంబంధించిన అంశాల‌పై ప‌రిశీల‌న జ‌ర‌ప‌నుంది.

భూమికి సంబంధించిన రిమోట్ సెన్సింగ్, ఉప‌గ్ర‌హ క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌, ఉప‌గ్ర‌హ నావిగేష‌న్‌, అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌, అంత‌రిక్షంలో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల రంగాల‌లో నూత‌న ప‌రిశోధ‌న‌లు, వాటిని ఉప‌యోగంలోకి తీసుకు రావ‌డం వంటి అంశాల‌లో నూత‌న ప‌రిశోధ‌న‌ల‌కు ఇది ఊతం ఇవ్వ‌నుంది.

మాన‌వాళి ప్ర‌యోజనం కోసం అంత‌రిక్ష సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు సంయుక్త కార్య‌క‌లాపాలు సాగించడానికి ఈ అవ‌గాహ‌నపూర్వక ఒప్పందం వీలు క‌ల్పిస్తుంది. దీనితో అన్ని వ‌ర్గాలు, అన్ని ప్రాంతాలు ప్ర‌యోజ‌నం పొంద‌నున్నాయి.
ఈ అవ‌గాహ‌నపూర్వక ఒప్పందంలో భాగంగా ఆర్థిక‌ వ‌న‌రుల‌ను ఆయా దేశాల నిబంధ‌న‌లు, బ‌డ్జెట్ నిబంధ‌న‌లు , వ‌న‌రుల అందుబాటుకు లోబ‌డి సంబంధిత దేశాల కార్య‌నిర్వాహ‌క వ్య‌వ‌స్థ‌లు స‌మ‌కూర్చుతాయి.

ఈ ఎమ్ఒయు లో భాగంగా చేప‌ట్టే సంయుక్త ప్రాజెక్టులు అవి చేప‌ట్టే త‌ర‌గ‌తి, రంగాన్ని బ‌ట్టి వాణిజ్య‌, వాణిజ్యేత‌ర ప్రాతిప‌దిక‌న ప‌రస్ప‌ర చెల్లింపులు లేకుండా ప్ర‌తిఫ‌లంగా ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్ల‌ ద్వారా లేదా కాంట్రాక్టు ల ద్వారా స‌మ‌కూర్చ‌వ‌చ్చు.

పూర్వరంగం

అంత‌రిక్ష రంగంలో స‌హ‌కారానికి ఆర్మేనియా ఆస‌క్తిని వ్య‌క్తం చేసింది. అందుకు అనుగుణంగా అంత‌రిక్ష రంగంలో స‌హ‌కారానికి ఒక ముసాయిదా అవ‌గాహ‌నా ఒప్పందాన్ని ప్ర‌భుత్వ స్థాయిలో ప‌రిశీల‌న‌ కోసం గ‌తంలో రూపొందించారు. ఇందుకు సంబంధించి 2017 ఏప్రిల్‌లో ఆర్మేనియా వైపు నుండి ఆమోదం ల‌భించింది. ఇందుకు అనుగుణంగా అంత‌రిక్షాన్ని శాంతియుత ప్ర‌యోజ‌నాల‌కోసం వాడేందుకు భార‌త ప్ర‌భుత్వం, ఆర్మేనియా ప్ర‌భుత్వాల మ‌ధ్య 2017 ఏప్రిల్ 25న ఉప‌ రాష్ట్ర‌ప‌తి యెరెవాన్‌ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఒప్పందంపై సంత‌కాలు జ‌రిగాయి.

***