పిఎంఇండియా
తాష్కెంట్‌లోని స్వర్గీయ శాస్త్రి స్మారక చిహ్నం వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పుష్పాంజలి ఘటించారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి 1965లో తాష్కెంట్లో మరణించి ఈ ఏడాదితో 60 ఏళ్లు పూర్తవుతున్నాయి. స్వర్గీయ శాస్త్రి స్మారకార్థం ఆయన పేరుతో గల ఒక వీధిలో ఈ స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. తాష్కెంట్లో మాజీ ప్రధానమంత్రి జీవితాన్ని, వారసత్వాన్ని ఎంతో ఆప్యాయంగా స్మరించుకుంటారు. తాష్కెంట్లో ఈ స్మారక చిహ్నం గల వీధితో పాటుగా ఆయన పేరు మీద ఒక స్థానిక పాఠశాల, భారతీయ సాంస్కృతిక కేంద్రం ఉన్నాయి.
శాస్త్రి స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించిన ప్రధానమంత్రి, అనంతరం తాష్కెంట్ స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌ను సందర్శించారు. విశ్వవిద్యాలయంలో ప్రధానమంత్రి శ్రీ మోదీకి ఉజ్బెకిస్తాన్ ప్రధానమంత్రి, విశ్వవిద్యాలయ రెక్టార్ ఆత్మీయ స్వాగతం పలికారు. విశ్వవిద్యాలయంలోని మహాత్మాగాంధీ కేంద్రంలో భారతీయ విద్యావేత్తలు, అక్కడ చదువుతున్న విద్యార్థులతో ప్రధానమంత్రి సంభాషించారు. హిందీ భాష, ఇతర భారతీయ విషయాలను బోధించడంలో ఈ విశ్వవిద్యాలయానికి అద్భుతమైన రికార్డు ఉంది. తన అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి… హిందీ భాష చదివే ఉజ్బెక్ విద్యార్థుల కోసం లాల్ బహదూర్ శాస్త్రి స్కాలర్షిప్ను ప్రకటించారు. ఈ సంవత్సరంతో ఈ విశ్వవిద్యాలయంలో హిందీ బోధనకు 80 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సాంస్కృతిక సారూప్యతల దృష్ట్యా… ఉజ్బెక్ విద్యార్థుల్లో హిందీ నేర్చుకోవడం పట్ల గణనీయమైన ఆసక్తి ఉంది. ఉజ్బెక్, హిందీ భాషల్లో సుమారు 3000కు పైగా ఉమ్మడి పదాలు ఉన్నాయి.
***