Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శాస్త్ర విద్య‌, ప‌రిశోధ‌నల‌కు సంబంధించిన‌ 5 సంస్థ‌ల్ని నెల‌కొల్ప‌డానికిగాను స‌వ‌రించిన వ్య‌య అంచ‌నాలు


కొల్‌క‌తా, పుణే, మొహాలి, భోపాల్‌, తిరువ‌నంత‌పురంల‌లో 5 శాస్త్ర విజ్ఞాన‌ విద్య‌, ప‌రిశోధ‌నా సంస్థ‌ల్ని( ఇండియ‌న్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్‌…ఐఐఎస్ఇఆర్ లు) నెల‌కొల్పాల‌ని గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. వీటి నిర్మాణానికి అయ్యే ఖ‌ర్చు రూ.2,500 కోట్లుగా గ‌తంలో నిర్ణ‌యించి ఆమోదం తెలిపారు. ఈ వ్య‌యాన్ని ఇప్పుడు స‌వ‌రించి రూ. 4,799 కోట్లు గా అంచ‌నా వేశారు. ఈ స‌వ‌ర‌ణ అంచ‌నాకు ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ప్ర‌స్తుతం ఈ 5 సంస్థ‌ల నిర్మాణం కొన‌సాగుతోంది. స‌వ‌రించిన వ్య‌య అంచ‌నాల కార‌ణంగా ఈ సంస్థ‌ల నిర్మాణం వేగ‌వంత‌మ‌వుతుంది. కేంద్ర మంత్రిత్వ శాఖ, ఈ సంస్థ‌ల ప‌రిపాల‌నా బోర్డుల గ‌వ‌ర్న‌ర్లు వీటి నిర్మాణాన్ని త్వ‌ర‌గా పూర్తి చేస్తాయి. దాంతో 2018-19 నాటికి ఈ సంస్థ‌లు పూర్తిగా ప‌నిచేస్తాయి. ఆ స‌మ‌యానికి ఈ సంస్థలు సొంత క్యాంప‌స్ ల‌ను క‌లిగి ఉంటాయి. వీటిలో 9, 275 మంది విద్యార్థులు విద్య‌ను అభ్య‌సిస్తారు. వీటిలో 928 మంది బోధ‌నా సిబ్బంది, 1.020 మంది బోధ‌నేత‌ర సిబ్బంది ప‌ని చేస్తారు.

ఈ విద్యాసంస్థ‌లు అండ‌ర్ గ్రాడ్యుయేట్ విద్య‌, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య‌, ప‌రిశోధ‌న లను ఒకే గొడుగు కింద‌కు తెస్తాయి. ఈ సంస్థ‌లు జాతీయ ప్ర‌యోగశాల‌ల‌తోను, ఇంకా ఇత‌ర ప‌రిశోధ‌నా సంస్థ‌ల‌తోనూ ఎప్ప‌టిక‌ప్పుడు సంప్ర‌దింపులు చేస్తూ ఉంటాయి. త‌ద్వారా ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకునే వాతావ‌ర‌ణం ఏర్ప‌డి సంబంధిత ప‌రిశోధ‌న‌లు వేగ‌వంత‌మ‌వుతాయి. ప‌రిపాల‌న వ్య‌వ‌స్థ కూడా సులువుగా ప‌ని చేస్తుంది. వివిధ విభాగాల మ‌ధ్య‌ అంత‌ర్గ‌త ప‌రిశోధ‌నకు ప్రోత్సాహం ల‌భిస్తుంది.

ప్రాథమిక శాస్త్ర విజ్ఞానంలోని ప‌లు రంగాలు అప్ల‌యిడ్ సైన్సులుగా అంటే లేజ‌ర్లు, సూప‌ర్ కండ‌క్టివిటీ, సెమీ కండ‌క్ట‌ర్లు, నానో మెటీరియ‌ల్స్ లాంటి.. ఆచ‌ర‌ణాత్మ‌క శాస్త్ర విభాగాలుగా అవ‌త‌రించాయి. ఈ శాస్త్ర విభాగాల్లో జ‌రిగే ప‌రిశోధ‌న ద్వారా మ‌న దేశానికి ప‌లు మేధోప‌ర‌మైన హ‌క్కులు ద‌క్కే అవ‌కాశ‌ముంది. త‌ద్వారా దేశానికి గ‌ణ‌నీయ‌మైన ఆదాయం వ‌స్తుంది.

ఈ శాస్త్ర విజ్ఞాన సంస్థ‌లు అనేక మంది స‌మ‌ర్థులైన నిపుణుల‌ను దేశానికి అందిస్తాయి. త‌ద్వారా సాంకేతిక మాన‌వవ‌న‌రులు విప్ల‌వాత్మ‌కంగా అభివృద్ధి చెందుతాయి. అది దేశ ఆర్థిక ప్ర‌గ‌తికి దోహ‌దం చేస్తుంది.