Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శిక్షపడ్డ ఖైదీల తరలింపుపై యూరప్ మండలి ఒప్పందానికి భారతదేశ అంగీకారం


ఈ విషయంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన అంశాలు ఇలా ఉన్నాయి..

1. శిక్షపడ్డ ఖైదీల తరలింపుపైన యూరప్ మండలి ఒప్పందానికి ఆమోదం తెలిపామనే విషయాన్నిఅధికారిక ఉత్తరం ద్వారా తెలియజేస్తూ ఈ ఒప్పందంలో ఇండియా భాగస్వామ్యంకోసం యూరప్ మండలిని అభ్యర్థించాలి.

2. ఒప్పందంలో ఇండియా కూడా భాగస్వామిగా మారిందనే అధికారిక ఆహ్వానం యూరప్ మండలినుంచి అందగానే ఒప్పందం ప్రకారం శిక్షపడ్డ ఖైదీల తరలింపుకు అంగీకరించాలి.

శిక్షపడ్డ ఖైదీల తరలింపుపై యూరప్ మండలి ఒప్పందాన్ని అంగీకరించడంవలన భారతదేశానికి పలు ప్రయోజనాలుంటాయి. ఈ ఒప్పందంలో 64 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ ఒప్పందానికి భారతదేశ అంగీకారంవల్లన ఈ దేశాలన్నిటితో ద్వైపాక్షిక ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఈ ఒప్పందంలో భాగస్వాములం కావడంవల్ల యూరప్ మండలిలోని దేశాల్లో శిక్షపడ్డ భారతీయ ఖైదీలను మన దేశానికి తరలిస్తారు. దాంతో వారు తమ మిగిలిన శిక్షా కాలాన్ని ఇండియాలో పూర్తి చేస్తారు. వీలున్నప్పుడల్లా వారిని వారి కుటుంబసభ్యులు పరామర్శించవచ్చు. ఇదే నియమం మనదేశంలో శిక్షపడ్డ యూరప్ మండలి దేశాల ఖైదీలకు వర్తిస్తుంది. ఇలాంటి అప్పగింత ఏర్పాటువల్ల శిక్షపడ్డ ఖైదీలకు వారి శిక్షాకాలం పూర్తయిన తర్వాత పునరావాస ఏర్పాటు సులువుగా ఉంటుంది.

నేపథ్యం

శిక్షపడ్డ ఖైదీల తరలింపుపైన యూరప్ మండలి ఒప్పందం 1983 ఏప్రిల్ 12న కుదిరింది. 1985 జులై 1నుంచి అమలులోకి వచ్చింది. అప్పటినుంచి ఇంతవరకూ 64 దేశాలు ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపాయి.

భారతదేశంలో శిక్షపడ్డ విదేశీ ఖైదీలను వారి వారి దేశాలకు తరలించి మిగిలిన శిక్షాకాలాన్ని వారు వారి దేశాల్లో పూర్తి చేయడానికి వీలుగా 2004కు ముందు భారతీయ శిక్షా స్మృతిలోగానీ ఇంకా ఇతర చట్టాల్లోగానీ ఎలాంటి వెసులుబాటు లేదు. అలాగే ఇతర దేశాల్లో శిక్షపడ్డ భారతీయ ఖైదీలను మన దేశానికి తరలించి వారి మిగతా శిక్షాకాలాన్ని దేశంలోనే పూర్తి చేయించే అవకాశముండేది కాదు. మానవతా దృష్టితో ఆలోచించి శిక్షపడ్డ విదేశీ ఖైదీలను వారి వారి దేశాలకు తరలించాలని అలాగే శిక్షపడ్డ భారతీయ ఖైదీలను భారతదేశానికి రప్పించి ఇక్కడే వారి మిగిలిన శిక్షా కాలన్ని పూర్త చేయించి ఆయా ఖైదీల పునారావాస ఏర్పాట్లు సులువుగా ఉండేలా చేయాలని మన దేశం భావించింది.

ఈ ఉద్దేశ్యంతో రిపాట్రియేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్-2003ను (ఖైదీల అప్పగింత చట్టం-2003) అమలులోకి తెచ్చాం. ఈ చట్టంలోని లక్ష్యాలను సాధించాలంటే ఈ విషయంలో పరస్పర ప్రాధాన్యతలు కలిగిన దేశాలతో ఒప్పందం తప్పనిసరి.

ఈ విషయంలో ఇంతవరకు 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలపైన మన దేశం సంతకాలు చేసింది. ఇంటర్ అమెరికన్ కన్వెన్షన్ ఆన్ సర్వింగ్ క్రిమినల్ సెంటెన్సెస్ అబ్రోడ్ (ఐఏసి) అనే ఒప్పందానికి కూడా మనదేశం అంగీకారం తెలిపింది. ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్లో(ఓఏఎస్) సభ్యత్వంగల దేశాలు ఐఏసి ఒప్పందంలో సంతకం చేశాయి. అయితే ఈ ఒప్పదానికి ఓఏఎస్లో సభ్యత్వంలేని దేశాలు కూడా ఆమోదం తెలపవచ్చు.

ప్రస్తుతం 36 దేశాలతో ఈ విషయంలో మనం ఒప్పందంలో ఉన్నాం. ( ద్వైపాక్షి అంగీకారంద్వారా 20 దేశాలతోనూ, 16 దేశాలతో ఇంటర్ అమెరికన్ కన్వెన్షన్ ఆన్ సర్వింగ్ క్రిమినల్ సెంటెన్సెస్ అబ్రోడ్ ద్వారా) ఈ ఒప్పందాలతో శిక్షపడ్డ ఖైదీల తరలింపు సులువుగా జరుగుతుంది. ఈ దేశాల వివరాలు ఇలా ఉన్నాయి. బ్రిటన్, మారిషస్, ఫ్రాన్స్, బల్గేరియా, ఈజిప్ట్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, శ్రీ లంక, కంబోడియా, ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, ఇటలీ, మాల్దీవులు, టర్కీ, థాయ్ లాండ్, రష్యా, కువైట్, హాంగ్ కాంగ్, అర్జెంటీనా, బెలిజె, కెనడా, చెక్ రిపబ్లిక్, చిలీ, కోస్టారికా, ఈక్వడార్, ఎల్ సాల్వడార్, గాటెమాలా, మెక్సికో, నికరాగువా, పనామా, పరాగ్వే, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఉరుగ్వే, వెనిజులా.