పిఎంఇండియా
శిక్ష పడిన వ్యక్తుల బదలాయింపు పై భారతదేశానికి, సోమాలియాకు మధ్య ఒప్పందం పై సంతకాలకు మరియు తదనంతర దృవీకరణకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ ఒప్పందం పై సంతాకాలు జరిగితే గనుక సోమాలియాలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, అలాగే భారతదేశంలో కారాగారవాస శిక్షను అనుభవిస్తున్న సోమాలీలు, వారి శిక్షా కాలంలో మిగిలిన భాగాన్ని వారి కుటుంబాలకు చేరువగా గడపడం కోసం వెసులుబాటు లభిస్తుంది. అంతేకాకుండా, ఇది ఆయా ఖైదీల సాంఘిక పునరావాసానికి కూడా వీలు కల్పిస్తుంది.
శిక్ష పడిన వ్యక్తుల బదలాయింపు అంశంలో భారత ప్రభుత్వం ఇంతవరకు యునైటెడ్ కింగ్ డమ్, మారిషస్, బల్గేరియా, ఫ్రాన్స్, ఈజిప్ట్, శ్రీలంక, కంబోడియా, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, ఇరాన్, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇజ్రాయిల్, బోస్నియా & హెర్జెగోవినా, యుఎఇ, ఇటలీ, టర్కీ, మాల్దీవ్స్, థాయిలాండ్, రష్యన్ ఫెడరేషన్, కువైట్, వియత్ నామ్, ఆస్ట్రేలియా, హాంగ్ కాంగ్, కతర్, మంగోలియా, కజక్ స్థాన్, బహ్ రెయిన్ మరియు ఎస్టోనియా లతో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంది.
పూర్వరంగం:
విదేశీ ఖైదీలను వారి శిక్షా కాలంలో మిగిలి వున్న కాలాన్ని పూర్తి చేయడం కోసం వారు జన్మించిన దేశానికి వారిని బదలాయించేందుకు ఉద్దేశించినటువంటి దేశీయ చట్టం ఏదీ కూడా 2004కు పూర్వం లేదు. ఇదే విధంగా భారతీయ మూలాలు కలిగిన వ్యక్తులను, ఏదైనా విదేశీ న్యాయస్థానం నేరం చేసినట్లు నిర్ధారిస్తే అటువంటి వ్యక్తులు వారి శిక్షా కాలాన్ని భారతదేశంలో పూర్తి చేసేటట్లుగా వారిని బదలాయించేందుకు ఎంటువంటి సర్దుబాటు కూడా లేదు. అటువంటి ఖైదీలను వారి మాతృ దేశాలకు బదలాయించడమనేది వారి సాంఘిక పునరావాసానికి మార్గాన్ని సుగమం చేయగలుగుతుంది.
కాబట్టి, ఈ ప్రయోజనం నెరవేర్చడం కోసం రీపాట్రియేషన్ ఆఫ్ ప్రిసనర్స్ యాక్ట్ 2003కు చట్ట రూపం కల్పించారు. ఈ చట్టం లక్ష్యాలను సాధించాలంటే ఈ అంశంలో పరస్పర ప్రయోజనం కలిగివున్న దేశాలతో ఏదైనా ఒడంబడిక/ఒప్పందం కుదుర్చుకోవలసి ఉంటుంది. అటువంటి ఒడంబడిక/ఒప్పందాన్ని ఆధికారిక రాజ పత్రంలో ప్రకటించాలి కూడా.