పిఎంఇండియా
ఇక్కడకు రావడానికి ముందు నేను ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాలకు చెందిన మహిళలతో కూడిన స్వయం సహాయక బృందాలు (ఎస్ హెచ్ జి) ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ సందర్శించాను. ఆ ప్రదర్శనలో ఉంచిన కళాకృతులు, ఇతర ఉత్పత్తులు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆ ఉత్పత్తులు ప్రదర్శించడం ద్వారా తమలోని అపారమైన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పిన స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళల ప్రతినిధులుగా ఈ సభలో పాల్గొన్న మహిళలను అభినందించడంతో నా ప్రసంగాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను.
దీన్ దయాళ్ అంత్యోదయ యోజన ద్వారా ఈ స్వయం సహాయక బృందాలకు కొత్త ఉత్తేజం లభిస్తోంది. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ అందిస్తున్న వడ్డీ సబ్సిడీతో ఈశాన్య ప్రాంత అభివృద్ధి ఆర్థిక సహాయ సంస్థ ఏర్పాటు చేస్తున్నక్రెడిట్ లింకేజిల ద్వారా భారీ సంఖ్యలో ఎస్హెచ్జిలు లబ్ధి పొందుతున్నాయి.
ఎస్ హెచ్ జిలు…ప్రత్యేకించి మహిళా ఎస్ హెచ్ జిల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే ఈశాన్య ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజి నిధిని 2015 డిసెంబర్ లో కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2023-24 నాటికి ఈశాన్య రాష్ట్రాల్లోని మూడింట రెండు వంతుల గ్రామీణ గృహాలకు కుటుంబాలకు జాతీయ గ్రామీణ జీవనాధార మిషన్ (ఎన్ఆర్ఎల్ ఎం) పరిధిని విస్తరించడం దీని లక్ష్యం.
మిత్రులారా
ఈ రోజు నేను ఫుట్ బాల్ స్టేడియం శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరించాను. ఈశాన్య ప్రాంత ప్రజలు ప్రత్యేకించి మేఘాలయకు చెందిన వారికి ఫుట్ బాల్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఫుట్ బాల్ ఒక వ్యామోహం. మారుమూల ప్రాంతాల్లోని వారు కూడా ఫుట్ బాల్ ఆడతారు. యూజెనిసన్ లింగ్డో, ఐబర్ ఖోంజీ, మర్లాంకి సూతింగ్ వంటి ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారులు ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖులు. వారు, వారితో పాటు వారి నిర్వహణలోని ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్ లు అంతర్జాతీయ టోర్నమెంట్ లలో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించి దేశానికి, రాష్ట్రానికి కూడా గర్వకారణంగా నిలిచారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఫుట్ బాల్ పట్ల ఆసక్తి గల పిల్లలు, యువకులను గుర్తించి వారిని వృత్తి నిపుణులుగా తీర్చి దిద్దేందుకు మేఘాలయ మిషన్ ఫుట్ బాల్ పేరిట రాష్ర్ట ప్రభుత్వం ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి నా దృష్టికి వచ్చింది. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ మద్దతుతో రూ.38 కోట్ల వ్యయంతో చేపట్టిన ఫుట్ బాల్ స్టేడియం ఈ కల సాకారం కావడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నాను.
2017 సంవత్సరంలో భారతదేశం అండర్ 17 ఎఫ్ ఎఫ్ ఐ ఎ వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని ఫుట్ బాల్ క్రీడను ఈశాన్య ప్రాంతంలోనే కాకుండా దేశం మొత్తంలో ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
మేఘాలయలో ఫుట్ బాల్ క్లబ్ లు, సంఘాలు భారీ సంఖ్యలోనే ఉన్నాయి. అండర్ 17 వరల్డ్ కప్ సన్నాహకంగా మీరు ఎన్నో స్థానిక టోర్నమెంట్ లు కూడా నిర్వహించవచ్చు.
మిత్రులారా
ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం కురిసే ప్రదేశంగా చిరపుంజి గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు చిరపుంజికి మరో ఘనత కూడా దక్కింది. అక్కడ ఏర్పాటు చేసిన డాప్లర్ వెదర్ రాడార్ ను ఇటీవలే జాతికి అంకితం చేశాం. ఈ రాడార్ ఏర్పాటు చేసినందుకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ, భారత్ ఎలక్ట్రా నిక్స్, భారత వాతావరణ శాఖలను నేను అభినందిస్తున్నాను.
అద్భుతమైన సౌందర్యానికి, సాహస కృత్యాలకు ఆలవాలం అయిన ఈశాన్య ప్రాంతాన్ని ఇటీవల కాలంలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగి పడడం వంటి ప్రకృతి వైపరీత్యాలు కల్లోలం చేశాయి.
వాతావరణాన్ని మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు వాతావరణ రాడార్ వ్యవస్థ ఎంతో సహాయకారిగా నిలుస్తుంది. అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా ఏర్పడుతున్న ముప్పును ఈ రాడార్ వ్యవస్థ సహకారంతో తగ్గించగలుగుతాం.
ఈ రోజు నేను ఈశాన్య మండలి సమావేశంలో పాల్గొన్నాను. గవర్నర్లు, ముఖ్యమంత్రులతో మాట్లాడాను. ఈశాన్య ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించిన అవగాహన కలిగేందుకు ఈ సమావేశం సహాయపడింది. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ఇప్పటికీ ఎంతో చేసినా చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది.
“యాక్ట్ ఈస్ట్ పాలసీ”ని మా ప్రభుత్వం ఎంతో సానుకూల దృక్పథంతో ఆచరిస్తోంది.
ఈశాన్య ప్రాంతం ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా విలసిల్లుతోంది. ఈ ప్రాంతంలో రహదారి, రైలుమార్గాలు, జలమార్గాలు, టెలికాం, విద్యుత్ లను అభివృద్ధి చేయడం ద్వారా ఇక్కడ మౌలిక వసతులను తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు నేను మూడు కొత్త రైళ్ళను ప్రారంభించాను. ఈశాన్య ప్రాంతాలను రైల్వే నెట్ వర్క్ తో అనుసంధానం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎన్ డిఎ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఈశాన్య రాష్ట్రాలలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి రూ.10,000 కోట్ల కు పైగా ఖర్చు చేసింది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ మరో రూ.5,000 కోట్లు ఖర్చు చేయబోతోంది.
2014 నవంబర్ లో మేఘాలయ, అరుణాచలప్రదేశ్ రెండింటినీ రైల్వే పటంలో చేర్చాం. ఇటీవల అగర్తలలోని త్రిపురను బ్రాడ్ గేజ్ రైల్వే మార్గంతో అనుసంధానం చేశాం. ఈశాన్య రాష్ట్రాల చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఇప్పుడు మణిపూర్, మిజోరంలకు బ్రాడ్ గేజ్ పాసింజర్ రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. గౌహతిలోని కామాఖ్యను జమ్ము లోని కట్ డా రైల్వే మార్గం ద్వారా వైష్ణోదేవితో అనుసంధానం చేశారు.
పొరుగు దేశాలకు కూడా రోడ్డు, రైలు మార్గాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈశాన్య ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఇది కొత్త ఉత్తేజం ఇస్తుంది.
ఈశాన్య ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి కోసం 2014 జూలైలో కేంద్ర ప్రభుత్వం “నేషనల్ హైవేస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్” ను ఏర్పాటు చేసింది. బ్రహ్మపుత్ర నదిపై ఈ సంస్థ మూడు కొత్త వంతెనలు నిర్మిస్తోంది. రూ.10,000 కోట్ల వ్యయంతో 34 రోడ్డు ప్రాజెక్టులు ఈశాన్య ప్రాంతంలో 1,000 కిలోమీటర్ల నిడివిలో నిర్మాణంలో ఉన్నాయి. ఈశాన్య ప్రాంతంలోని ప్రతి ఒక్క జిల్లా కేంద్రాన్ని నేషనల్ హైవేకు అనుసంధానం చేసే పథకం కూడా అమలులో ఉంది.
ఈశాన్యంలో అంతర్గత జలవనరుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యాన్ని ఇస్తోంది. ఈశాన్యంలోని 19 జలమార్గాలను జాతీయ జలమార్గాలుగా ప్రభుత్వం ప్రకటించింది.
ఈశాన్య రాష్ట్రాలకు నిరంతర విద్యుత్ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం కట్టుబాటుతో ఉంది. ఈ లక్ష్యంతో కేంద్రప్రభుత్వం విద్యుత్ విభాగంలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతోంది. విద్యుత్ ప్రసార వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ.10,000 కోట్ల వ్యయంతో 8 ఈశాన్య రాష్ట్రాలను కలుపుతూ రెండు ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి.
బిశ్వనాథ్-చరియాలి నుంచి ఆగ్రాకు ట్రాన్స్ మిషన్ నెట్ వర్క్ ను ప్రారంభించడం ద్వారా ఈశాన్య ప్రాంతానికి వెలుపలి నుంచి 500 మెగావాట్ల అదనపు విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. దేశంలో ఇప్పటికీ విద్యుత్ సరఫరాకు నోచుకోని 18,000 గ్రామాల్లో 7,000 కు పైగా గ్రామాలకు ఇప్పటికే విద్యుత్ వసతిని కల్పించాం. 2018 నాటికి ఈశాన్య ప్రాంతాలతో సహా దేశంలోని ఏ ప్రాంతంలో అయినా ఏ ఒక్క గ్రామం విద్యుత్ సదుపాయం లేని గ్రామంగా మిగిలిపోదని నేను విశ్వసిస్తున్నాను.
రూ.5,300 కోట్లకు పైగా వ్యయండితో ప్రభుత్వం ఈశాన్య ప్రాంతం కోసం ఒక సమగ్ర టెలికాం ప్రణాళిక అమలుపరుస్తోంది. బంగ్లాదేశ్ కు చెందిన కాక్స్ బజార్ ద్వారా దేశంలో అంతర్జాతీయ గేట్ వేతో అనుసంధానం అయిన మూడో నగరంగా అగర్తల నిలిచింది. దీని వల్ల టెలికాం కనెక్టివిటీ పెరిగి ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు లభిస్తుంది.
కొద్ది నెలల క్రితం నేను గంగ్ టోక్ సందర్శించిన సమయంలో సిక్కింను దేశంలోనే తొలి సేంద్రియ రాష్ర్టంగా ప్రకటించడం జరిగింది. ఇతర ఈశాన్య రాష్ట్రాలు కూడా దీని నుంచి స్ఫూర్తి పొంది సంపూర్ణ సేంద్రియ రాష్ట్రాలుగా అవతరించాలి. వాస్తవానికి దేశానికి ఆర్గానిక్ ఉత్పత్తుల అక్షయపాత్రలుగా నిలిచే అర్హత ఈశాన్య రాష్ట్రాలకు పూర్తిగా ఉంది. దీని వల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయదారుల ఆదాయాలు కూడా పెరుగుతాయి.
మిత్రులారా
ఈ రోజు ఏ ఒక్కరూ చిన్నపాటి రుణం కోసం బ్యాంకర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. చిన్న తరహా వ్యాపారవేత్తలకు ఎలాంటి హామీలతో పని లేకుండా రుణాలందించేందుకు కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. 2015-16లొ 3.48 కోట్ల మంది పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ఈ యోజన ద్వారా రూ.1.37 లక్షల కోట్ల రుణాలందించడం జరిగింది. ప్రతి ఆరు రుణాల్లో ఒకటి ఈశాన్య ప్రాంతాలకు దక్కింది. ఇక్కడ రూ.2,800 కోట్ల కు పైగా రుణాల వితరణ చోటు చేసుకొంది.
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద ఈశాన్య ప్రాంతంలో 93 లక్షలకు పైగా బ్యాంకు ఖాతాలు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద 21 లక్షల మంది, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 19 లక్షల మంది బీమా ప్రయోజనం పొందారు.
వ్యవసాయం తర్వాత అధిక సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్నది జౌళి రంగం. ఇందులో కూడా దుస్తుల రంగం అతి పెద్దదిగా ఉంది. ఈ విభాగంలో భారీ సంఖ్యలో మహిళలు ఉపాధి పొందుతున్నారు.
ఈశాన్య ప్రాంతాల్లో పారిశ్రామిక కార్యకలాపాలను ఉత్తేజితం చేసేందుకు ఈశాన్య ప్రాంత టెక్స్ టైల్ ప్రమోషన్ స్కీమ్ ను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలలోను రూ.145 కోట్ల పెట్టుబడితో ఒక్కో అపరెల్, గార్మెంట్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. ఎనిమిదింటిలో ఏడు ఇప్పటికే పని చేస్తున్నాయి.
మిత్రులారా
మేఘాలయకు ప్రత్యేక చారిత్రక, సాంస్కృతిక, ప్రాంతీయ వైభవం ఉన్న ప్రాంతంగా గుర్తింపు ఉంది. ప్రకృతిసిద్ధమైన సౌందర్యం, వన్య ప్రాణులకు మేఘాలయ పెట్టింది పేరుగా నిలుస్తోంది. మేఘాలయ సందర్శన పట్ల ఆసక్తి ప్రదర్శించని పర్యాటకులు ఉండనే ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈశాన్య ప్రాంతాల్లో ప్రత్యేకించి మేఘాలయలో పర్యాటక రంగం ప్రత్యేకించి సాహసయాత్రలకు అపార అవకాశాలున్నాయి.
పర్యాటకులకు మెరుగైన అవకాశాలతో ప్రత్యేకించి చక్కని రోడ్ కనెక్టివిటీ, హోటళ్ళు, పరిశుభ్రతతో ఈశాన్యంలో టూరిస్టు సర్క్యూట్ లు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో టూరిస్టు సర్క్యూట్ ల అభివృద్ధి కి స్వదేశ్ దర్శన్ పేరిట ఒక కొత్త కార్యక్రమం కేంద్రప్రభుత్వం చేపట్టింది. ఇందులో ఒక సర్క్యూట్ ఈశాన్య ప్రాంతానికి కూడా కేటాయించారు.
2014 అక్టోబర్ 2న కేంద్రప్రభుత్వం స్వచ్ఛ భారత్ ఉద్యమం చేపట్టింది. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళిగా 2019 అక్టోబర్ నాటికి దేశాన్ని స్వచ్ఛతకు మారుపేరుగా తీర్చి దిద్దడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. 2014 ఆగస్టు 15వ తేదీ నుంచి 2015 ఆగస్టు 15వ తేదీ లోగా అంటే ఏడాది లోగానే స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమం కింద రెండు లక్షలకు పైగా స్కూళ్ళలో 4.17 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది.
పరిసరాల స్వచ్ఛత కోసం చేపట్టిన ప్రజా ఉద్యమమే స్వచ్ఛభారత్. ఈ ఉద్యమంలో అత్యంత లబ్ధి పొందిన వారు సమాజంలోని నిరుపేదలే. మీరందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై బహిరంగ మలవిసర్జన లేని స్వచ్ఛ పర్యావరణం అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని నేను కోరుతున్నాను.
స్వచ్ఛ భారత్ అభియాన్ తో ఈశాన్య ప్రాంతంలో కూడా పరిశుభ్రత సంప్రదాయానికి కొత్త ఉత్తేజం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మేఘాలయలోని మైలీనాంగ్ గ్రామం దేశంలోనే స్వచ్ఛమైన గ్రామంగా గుర్తింపు పొందింది. గంగ్ టోక్ తో సహా సిక్కిం మొత్తం ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది.
ఈశాన్యం మార్గదర్శి-స్వచ్ఛ భారత్ అభియాన్ (నార్త్ ఈస్ట్ లీడ్స్ ద వే-స్వచ్ఛభారత్ అభియాన్) పరుగుపందెం విజేతలందరినీ నేను అభినందిస్తున్నాను. ఈ పరుగుపందెం నిర్వహించినందుకు ఈశాన్య రాష్ర్ట మండలిని కూడా నేను అభినందిస్తున్నాను. ఈశాన్యంలోనే స్వచ్ఛ నగరంగా గుర్తింపు పొందినందుకు గంగ్ టోక్ కు ప్రత్యేక ప్రశంసలు.
షిల్లాంగ్ లో ఈశాన్య మండలి సర్వ సభ్య సదస్సు ను నిర్వహించినందుకు మేఘాలయ ప్రజలకు నా అభినందనలు. ఇంత అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు.
జైహింద్
***