పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో… పరిశోధన, ప్రణాళిక, పరిశీలన, పర్యవేక్షణ, ప్రభావ అంచనాల బలోపేతం లక్ష్యంగా ‘ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్–లాజిస్టిక్స్ అథారిటీ‘ (ఐటీఎల్ఏ) పేరుతో ఒక ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్‌పీవీ) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ ఆమోదం… రవాణా రంగానికి సంబంధించిన వివిధ మంత్రిత్వ శాఖలు, సంస్థల మధ్య విడిగా సాగుతున్న ప్రణాళికలు, అమలు వల్ల ఎదురవుతోన్న దీర్ఘకాలిక సవాళ్లను పరిష్కరించడానికి ఉద్దేశించినది. రవాణా మార్గాల మధ్య మెరుగైన సమన్వయం, సమగ్రతను పెంపొందించడం ద్వారా దేశంలో రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి సామర్థ్యాన్ని, స్థిరత్వాన్ని, ప్రభావాన్ని ఐటీఎల్ఏ మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
కింద పేర్కొన్న కీలక పాత్రలు, బాధ్యతలను ఐటీఎల్ఎ కలిగి ఉంటుంది:
జాతీయ అత్యున్నత సంస్థ: రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో సమగ్ర ప్రణాళిక, పరిశోధన, ప్రాజెక్టుల పరిశీలన, పర్యవేక్షణ, విధానపరమైన మద్దతు, డేటా విశ్లేషణల కోసం ఐటీఎల్ఏ దేశంలోనే అత్యున్నత సంస్థగా పనిచేస్తుంది.
దీర్ఘకాలిక జాతీయ రవాణా ప్రధాన ప్రణాళిక: పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాల పరిమితిని దృష్టిలో ఉంచుకుని ఐటీఎల్ఏ ఒక సమగ్రమైన జాతీయ రవాణా ప్రధాన ప్రణాళికను రూపొందిస్తుంది. రహదారులు, రైల్వేలు, ఓడరేవులు–నౌకాయానం, పౌర విమానయానం, అంతర్గత జలమార్గాలు, తీరప్రాంత నౌకాయానం, పట్టణ రవాణా, లాజిస్టిక్స్ వంటి అన్ని రకాల రవాణా మార్గాలు ఈ ప్రణాళికలో భాగంగా ఉంటాయి.
సమగ్ర ప్రణాళికా విధానం: వివిధ రవాణా మంత్రిత్వ శాఖల స్వల్పకాలిక ప్రణాళికలు (సుమారు 5 సంవత్సరాలు), వార్షిక ప్రణాళికలను ఐటీఎల్ఏ సమీక్షిస్తుంది. రవాణా శాఖల ప్రణాళికలు జాతీయ రవాణా ప్రధాన ప్రణాళికకు అనుగుణంగా ఉండేలా చూడటానికి, బహుళ–నమూనా మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఈ సమీక్ష ఉపయోగపడుతుంది.
భారీ ప్రాజెక్టుల సాంకేతిక మూల్యాంకనం: భారత ప్రభుత్వం రూ. 500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చుతో చేపట్టే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఐటీఎల్ఏ సాంకేతిక మూల్యాంకనాన్ని నిర్వహిస్తుంది. ఆర్థికపరమైన మూల్యాంకనం మాత్రం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆర్థిక సమీక్షా విధానాల ద్వారానే యథావిధిగా కొనసాగుతుంది.
పర్యవేక్షణ, ప్రభావ అంచనా: రూ. 500 కోట్లకు పైబడిన రవాణా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలును ఐటీఎల్ఏ నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం ఒక సమన్వయ వ్యవస్థను అందించడంతో పాటు, ఆయా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత వాటి వల్ల చేకూరిన ప్రయోజనాలను అధ్యయనం చేస్తుంది.
జాతీయ రవాణా డేటా నిధి (ఎన్‌టీడీఆర్): రవాణా, లాజిస్టిక్స్ రంగానికి సంబంధించిన సమాచారాన్ని ఒకే చోట చేర్చడం ద్వారా ఐటీఎల్ఏ ఒక ఉమ్మడి డేటా నిధిని ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం జీఎస్‌టీఎన్ ఇ–వే బిల్లు, ఫాస్ట్‌ట్యాగ్, వాహన్, జీపీఎస్ ఆధారిత వ్యవస్థలు, పట్టణ ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలు, ఇతర ప్రభుత్వ డేటాబేస్‌ల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ సమాచారం ఆధారంగా సరుకు రవాణా ప్రవాహం, గమ్యస్థానాల విశ్లేషణ వంటి ‘డేటా విశ్లేషణ‘ చేసి… దానిని భవిష్యత్తు ప్రణాళికలు, పర్యవేక్షణ, ప్రభావ అంచనాల కోసం ఉపయోగిస్తుంది.
జాతీయ లాజిస్టిక్స్ విధానం (2022) సమీక్ష, నవీకరణకు సంబంధించి సలహాలు, సహాయం అందించడం.
లాజిస్టిక్స్ రంగంలో సామర్థ్యాలను మెరుగుపరచడం, శిక్షణ, నైపుణ్యాభివృద్ధి.
రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడం.
బహుళ రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడం, ప్రపంచ స్థాయిలో లాజిస్టిక్స్ సామర్థ్యం విషయంలో భారత్ స్థానాన్ని మెరుగుపరచడం ద్వారా భారత విజన్ 2047ను సాకారం చేయడంలో ఐటీఎల్ఏ ఏర్పాటు కీలక పాత్ర పోషిస్తుంది. పరిశోధన, ప్రణాళిక, బిగ్ డేటా అనుసంధానం, ప్రాజెక్టుల పర్యవేక్షణ, మూల్యాంకనం కోసం సంస్థాగత సామర్థ్యాన్నీ ఐటీఎల్ఏ పెంపొందిస్తుంది. సామర్థ్య నిర్మాణానికీ, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అవలంబించడానికీ ఇది మద్దతునిస్తుంది.
***