పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం న్యూఢిల్లీలో జరిగిన సి ఎస్ ఐ ఆర్ సొసైటీ సమావేశానికి అధ్యక్షత వహించారు.
దేశానికి ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడంలో సి ఎస్ ఐ ఆర్ సొసైటీ చూపిన చొరవ తో పాటు దేశంలో ప్రధాన నవకల్పన కర్తగా ఈ సంస్థకు ఉన్న గుర్తింపును గురించి ఈ సందర్భంగా ప్రధాన మంత్రి కి నివేదించడం జరిగింది.
సి ఎస్ ఐ ఆర్ ప్రయోగశాలల ద్వారా కొనసాగుతున్న పరిశోధనల పర్యవసానంగా పెద్ద సంఖ్యలో స్టార్ట్-అప్ లు ఆవిర్భవించగలిగే అవకాశం ఉందని సభ్యులు వివరించారు. ప్రయోగశాలల పరిశోధన కృషిని వాణిజ్య సరళి వినియోగానికి అనువుగా మార్పిడి చేయవలసి వుందని వారు అభిప్రాయపడ్డారు. వైద్య ఉపకరణాల తయారీ, శక్తి, ఇంకా వ్యర్ధాల నిర్వహణ వంటివి సి ఎస్ ఐ ఆర్ కీలక పాత్రను పోషించగలిగిన రంగాలలో కొన్ని అని వారు ప్రస్తావించారు.
సి ఎస్ ఐ ఆర్ ప్రయోగశాలల పనితీరును మదింపు చేయడానికి పరామితులను నిర్దేశించవలసిందిగా ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. వేరు వేరు ప్రయోగశాలల మధ్య అంతర్గత స్పర్థ నెలకొనేటట్లుగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచన చేశారు.
భారతదేశంలోని వేరు వేరు ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న కనీసం వంద సమస్యలను పట్టికీకరించవలసిందని సి ఎస్ ఐ ఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్) శాస్త్రవేత్తలను ప్రధాన మంత్రి కోరారు. అలాగే ఆ సమస్యలను నిర్దిష్ట కాలావధి లోపు సాంకేతిక విజ్ఞానం సాయంతో పరిష్కరించే సవాలును స్వీకరించాలని కూడా వారికి ఆయన సూచించారు.
అవరోధాలను అధిగమించడంలో సి ఎస్ ఐ ఆర్ మార్గదర్శకత్వ బాధ్యతను తీసుకోదగిన కొన్ని కీలక రంగాలను ప్రధాన మంత్రి ఏకరువు పెట్టారు. ఈ రంగాలలో.. ఆదివాసీలలో ప్రబలుతున్న సికిల్ సెల్ అనీమియా, రక్షణ రంగ పరికరాల తయారీ, సైనికులకు తోడ్పడే ప్రాణ రక్షక సామగ్రి రూపకల్పన, సౌర శక్తికి సంబంధించిన వినూత్న ఆవిష్కరణలు, ఇంకా వ్యవసాయ రంగానికి సంబంధించిన వినూత్న ఆవిష్కరణలు ఉన్నాయి.
సామాన్యుడి జీవనాన్ని మరింత మెరుగుపరచగల విధంగా సి ఎస్ ఐ ఆర్ పనిచేయాలని తాను కోరుకుంటున్నట్లు ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. అంతే కాకుండా పేదల, సమాజంలోని అణగారిన వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలకు సాంకేతిక విజ్ఞానం సాయంతో పరిష్కారాలను సమకూర్చాలని ఆయన నొక్కిచెప్పారు.
***