Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సూర‌త్ లో అత్యాధునిక ఆసుప‌త్రి ని ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

సూర‌త్ లో అత్యాధునిక ఆసుప‌త్రి ని ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు సూర‌త్ లో అత్య‌ధునాత‌న సూప‌ర్ స్పెశాలిటీ స‌దుపాయాల తో కూడిన రసీలాబెన్ సేవంతిలాల్ శాహ్ వీనస్ హాస్పిట‌ల్ ను ప్రారంభించారు. ఈ ఆసుప‌త్రి ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం లో భాగం గా ప్ర‌జ‌ల కు కూడా సేవ‌లను అందించ‌నుండటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

జ‌న స‌మూహాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, ఒక ఆరోగ్య‌వంత‌మైన భార‌త‌దేశం కోసం త‌న ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌న్నారు. ప్ర‌భుత్వం తీసుకొన్న పేద‌ల‌ అనుకూల‌ నిర్ణ‌యాల‌ ను గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. ‘ప్ర‌ధాన మంత్రి సుర‌క్షిత్ మాతృత్వ అభియాన్’ తో పాటు ‘మిశ‌న్ ఇంద్ర‌ధ‌నుష్’ వంటి కార్య‌క్ర‌మాలు ప్ర‌సూతి మ‌ర‌ణాల రేటు ను త‌గ్గించ‌డం లో ఒక కీల‌క‌మైన పాత్ర‌ ను పోషించిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

ఎర్ర కోట లో ప్ర‌ధాన మంత్రి చేసిన ‘స్వ‌చ్ఛ‌త అభియాన్’ ప్ర‌క‌ట‌న ను గేలి చేసిన వారికి ఆయ‌న దీటు గా స‌మాధాన‌మిస్తూ, ప్ర‌స్తుతం ముమ్మ‌ర పారిశుధ్య కార్య‌క్ర‌మం కార‌ణం గా జ‌నాభా లో 97 శాతం మంది కి ప‌రిశుభ్ర‌మైన టాయిలెట్ లు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. వ్యాధి నివార‌క ఆరోగ్య సంర‌క్ష‌ణ యొక్క ప్రాముఖ్యాన్ని కూడా ఆయ‌న స్ప‌ష్టం చేస్తూ, వెల్ నెస్ లో యోగా యొక్క భూమిక ను ప్ర‌పంచం గుర్తించిందని పేర్కొన్నారు.

‘ఆయుష్మాన్ భార‌త్’ ప‌థ‌కం పూర్తి గా ఒక స‌రికొత్త ఇకో సిస్ట‌మ్ ను ఆవిష్క‌రిస్తుంద‌ని, దీని ద్వారా మ‌రింత స్వ‌స్థమైనటువంటి భార‌త‌దేశాన్ని ఆవిష్క‌రించ‌డానికి వీల‌వుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ఈ ప‌థ‌కం రెండో అంచె నగరాల లోను, మూడో అంచె ల న‌గ‌రాల లోను కొత్త ఆసుప‌త్రుల ను ఏర్పాటు చేసేందుకు అండ‌ గా నిలుస్తుంద‌ని, త‌ద్వారా ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగం లో ఉద్యోగ అవ‌కాశాలు కూడా పెరుగుతాయని ఆయ‌న వివ‌రించారు. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌ కు మరిన్ని జ‌న‌రిక్ ఔష‌ధాలు అందుబాటు లోకి వ‌చ్చాయ‌ని, ఇవి ఆరోగ్య సంర‌క్ష‌ణ వ్య‌యాన్ని త‌గ్గ‌ించడమే కాక అనేక విలువైన ప్రాణాల ను కూడా కాపాడుతాయన్నారు.

ఆర్థికం గా బ‌ల‌హీన‌ంగా ఉన్న వ‌ర్గాల వారి కి 10 శాతం రిజ‌ర్వేశన్ కోటా ను ముందుగా అమ‌లు చేస్తున్నందుకు గుజ‌రాత్ ను ప్ర‌ధాన మంత్రి అభినందించారు.