Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్టాండ‌ప్ ఇండియా ప‌థ‌కానికి కేంద్ర మంత్రిమండ‌లి ఆమోదం


ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం స్టాండ‌ప్ ఇండియా (అందిపుచ్చుకో ఇండియా) స్కీముకు ఈ రోజు ఆమోదం తెలిపింది. ఎస్ సీ / ఎస్ టీ మ‌హిళ‌లలో ఔత్సాహిక‌ పారిశ్రామిక‌వేత్త‌ల‌ను ప్రోత్సహించ‌డానికి ఉద్దేశించిన పథకమిది. ఒక బ్యాంకు శాఖ నుంచి ఎస్ సీ, ఎస్ టీ ల‌కు చెందిన మ‌హిళ‌లు కనీసం రెండు ప్రాజెక్టుల‌ను (సగటున ప్రతి కేట‌గిరీ నుంచి ఒక మ‌హిళ ఉండేలా) ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ ప‌థకం ద్వారా తక్కువలో తక్కువ 2.5 ల‌క్ష‌ల మంది రుణ‌గ్ర‌హీత‌లకు ల‌బ్ది చేకూరగలదని భావిస్తున్నారు.

కనీసం 2.5 ల‌క్ష‌ల ప్ర‌తిపాద‌న‌ల‌కు స్కీమును ప్రారంభించిన నాటి నుంచి 36 నెల‌ల్లో ఆమోదముద్ర వేయాల‌నే ల‌క్ష్యాన్ని సాధించాలంటూ నియ‌మం పెట్టడం జ‌రిగింది.

స్టాండ‌ప్ ఇండియా స్కీము ఏం చెబుతుందంటే…

• ఇది భార‌తీయ చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధి బ్యాంకు (ఎస్ ఐ డి బి ఐ) ద్వారా ప్రారంభ మొత్తం రూ.10,000 కోట్ల‌తో రీ ఫైనాన్స్ విండో (పునరార్థిక సహాయ గ‌వాక్షం)గా ప‌ని చేస్తుంది.

• నేష‌న‌ల్ క్రెడిట్ గ్యారంటీ ట్ర‌స్టీ కంపెనీ (ఎన్ సి జి టి సి) ద్వారా క్రెడిట్ గ్యారంటీ వ్య‌వ‌స్థ‌ను నెల‌కొల్ప‌డం జ‌రుగుతుంది.

• ఈ ప‌థ‌కం కింద రుణాల‌ను తీసుకొని వ్యాపారాన్ని మొద‌లుపెట్టిన మ‌హిళ‌ల‌కు ప్ర‌భుత్వం నుంచి అన్ని విష‌యాల్లో సంపూర్ణ‌మైన మ‌ద్ద‌తు (హ్యాండ్ హోల్డింగ్ స‌పోర్ట్‌) ఉంటుంది. లోను తీసుకోక‌ ముందు నుంచీ, వ్యాపార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నంత‌ వ‌ర‌కూ ఈ మ‌ద్ద‌తు లభిస్తుంది. అన్ని ర‌కాల ముఖ్య‌మైన సేవ‌ల‌పైన ఎస్ సీ / ఎస్ టీ ఔత్సాహిక మ‌హిళా పారిశ్రామిక వేత్త‌లకు అవ‌గాహ‌న పెంచ‌డం, వారు ఆన్‌లైన్ వేదిక‌ల్లో నమోదు (రిజిస్ట్రేష‌న్) చేసుకునేలా చూడ‌డం, ఇ- మార్కెట్ ప్రాంతాల‌ గురించి వారికి తెలియ‌జేడంతో పాటు వ్యాపార విధానాల్లో, స‌మ‌స్య పరిష్కారంలో కూడా ఈ మ‌ద్ద‌తు కొన‌సాగుతుంది.

ఈ స్కీము వివ‌రాలు ఇలా ఉన్నాయి..:

• ఎస్ సీ / ఎస్ టీ ల‌కు చెందిన ఔత్సాహిక మ‌హిళా పారిశ్రామిక వేత్త‌ల‌కు అన్ని విధాలా సంపూర్ణ‌మైన మ‌ద్ద‌తు.

• స‌మాజంలో త‌ర‌త‌రాలుగా అన్ని విధాలా వెన‌క‌బ‌డిన ఈ వర్గాలకు, మ‌హిళ‌ల‌కు బ్యాంకులు రూ.10 ల‌క్ష‌ల‌ నుంచి రూ. కోటి దాకా రుణాల‌నిస్తాయి. ఈ రుణాల‌ను 7 సంవ‌త్స‌రాల‌ లోపు చెల్లించ‌వ‌చ్చు. ఈ రుణాల‌తో ఎస్ సీ / ఎస్ టీ లు, మహిళలు వ్య‌వ‌సాయేత‌ర రంగాల‌లో వ్యాపారాన్ని చేయ‌వ‌చ్చు.

• ఈ స్కీము కింద రుణానికి క్రెడిట్ గ్యారంటీ స్కీము ద్వారా ల‌భించే క్రెడిట్ గ్యారంటీ యొక్క‌ భ‌ద్ర‌త‌, మ‌ద్ద‌తు ఉంటుంది. దీనికి సెటిల‌ర్‌గా ఆర్థిక సేవ‌ల విభాగం వ్య‌వ‌హ‌రిస్తుంది. ఆప‌రేటింగ్ ఏజెన్సీగా నేష‌న‌ల్ క్రెడిట్ గ్యారంటీ ట్ర‌స్టీ కంపెనీ లిమిటెడ్ (ఎన్ సి జి టిసి) ఉంటుంది.

• కాంపోజిట్ రుణానికి సంబంధించిన‌ మార్జిన్ మ‌నీని 25 శాతంగా నిర్ణ‌యించారు. ఈ స్కీమును ఆయా రాష్ట్రాల స్కీముల‌తో క‌లిపి అమ‌లు చేస్తే అనేక మంది రుణ‌స్వీకర్తల‌కు వాస్త‌వంగా అవ‌స‌ర‌మ‌య్యే మార్జిన్ మ‌నీ మొత్తం త‌గ్గుతుంది.

• కాల‌క్ర‌మంలో రుణ‌గ్రహీత రుణ చ‌రిత్రను క్రెడిట్ బ్యూరోల‌ ద్వారా పొందుప‌ర‌చ‌డం జ‌రుగుతుంది.

నేప‌థ్యం :

2015 ఆగ‌స్టు 15న స్వాతంత్ర్య దినోత్స‌వ సంబ‌రాల సంద‌ర్భంగా జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ “స్టార్ట‌ప్ ఇండియా- స్టాండ‌ప్ ఇండియా” కార్య‌క్ర‌మాన్ని ప్ర‌క‌టించారు. వీటిలో స్టాండ‌ప్ ఇండియా కార్య‌క్ర‌మాన్ని ఆర్థిక సేవ‌ల విభాగం నిర్వ‌హిస్తుంది. ఎస్ సీ / ఎస్ టీ మ‌హిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌లు మొద‌టిసారిగా చేప‌ట్ట‌ద‌లిచే వ్యాపారాల‌ను ప్రోత్స‌హించ‌డమే స్టాండ‌ప్ ఇండియా స్కీము ముఖ్యోద్దేశం.