Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్టార్టప్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాని – స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు కార్యాచరణ ప్రణాళిక ఆవిష్కారం

స్టార్టప్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాని – స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు కార్యాచరణ ప్రణాళిక ఆవిష్కారం

స్టార్టప్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాని – స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు కార్యాచరణ ప్రణాళిక ఆవిష్కారం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం న్యూ ఢిల్లీలో స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంత క్రితం ఔత్సాహిక పారిశ్రామిక వ్యవస్థాపకుల కోసం వివిధ అంశాలపై ఒక రోజు వర్క్ షాప్‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక వర్చుయల్ ఎగ్జిబిషన్ ను ప్రధాని సందర్శించారు. స్టార్టప్‌ వ్యవస్థాపకులతో ఆయన మాట్లాడారు. ప్రధాని ప్రసంగానికి ముందే.. 10 అత్యుత్తమ స్టార్టప్ ఐడియాలు సృష్టించిన‌ వారు తమ ఆలోచనలను ప్రధాన మంత్రితో పంచుకున్నారు. ఆగస్టు 15న స్టార్టప్ ఇండియా ఆలోచనను తాను ప్రకటించినపుడు దీనిని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ వేళ దీని విలువ ఏమిటో ప్రజలకు అర్థమైందని ప్రధాని అన్నారు.

విజయవంతమైన స్టార్టప్‌లు కొందరు వ్యక్తులకు తట్టే ఆలోచన ద్వారా గాని, లేదా ప్రజలు ఎదుర్కొంటున్న ఏదైనా సమస్యకు పరిష్కారం కనుగొనాలన్నకోరిక ద్వారా గాని రూపుదాలుస్తాయని ప్రధాని అన్నారు. డబ్బు సంపాదించటమే ప్రధాన లక్ష్యం కాదని.. పని చేస్తున్నపుడు డబ్బులు వస్తూనే ఉంటాయన్నారు. ఇతరుల కోసం ఏదైనా చేయాలనేదే స్టార్టప్ ఆవిష్కర్తలకు ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని శ్రీ మోదీ చెప్పారు.

భారతదేశ యువతను ఉద్యోగాల కోసం ఎదురుచూసే పరిస్థితి నుంచి.. వారే ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగడం చూడాలని తాను కోరుకుంటున్నానని ప్రధాని చెప్పారు. ఒక స్టార్టప్ ద్వారా కనీసం ఐదుగురికి ఉపాధి లభించినా, అది జాతికి గొప్ప సేవచేయడమే అవుతుందన్నారు. పంటల వ్యర్థాలు, సైబర్ సెక్యూరిటీ సహా పలు అంశాలపై స్టార్టప్ సృష్టికర్తలు దృష్టిని కేంద్రీక‌రించాల‌ని ప్రధాని ప్రస్తావించారు.

స్టార్టప్ ఇండియా కార్యాచరణ ప్రణాళిక ముఖ్యాంశాలను ప్రధాని ఆవిష్కరించారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్లతో ఒక స్టార్టప్ నిధిని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.

స్టార్టప్ లకు మొదటి మూడేళ్ల పాటు లాభాలకు ఆదాయపు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ప్రధాని తెలిపారు. స్టార్టప్‌ల కోసం ప్రభుత్వం ఒక సరళమైన నిష్క్ర‌మ‌ణ‌ విధానం (ఎగ్జిట్ పాలసీ) ని రూపొందించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, అలాగే స్టార్టప్‌ పేటెంట్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడం కోసం కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు.

స్టార్టప్ వ్యాపారాలను మొదలుపెట్టే వారికి పేటెంట్ రుసుంలో 80 శాతం మినహాయింపును ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు. 9 కార్మిక, పర్యావరణ చట్టాల్లో స్టార్టప్‌లు తమకు తామే సర్టిఫికెట్టు ఇచ్చుకొనేందుకు వీలుండే వ్యవస్థ (సెల్ఫ్ సర్టిఫికేషన్ కాంప్లయన్స్ సిస్టమ్)ను ప్రవేశపెడతామని వెల్లడించారు. కొత్త ఆలోచనలకు మరింత చేయూతను అందించేందుకు అటల్ ఇన్నోవేషన్ మిషన్‌ను ప్రారంభించనున్నట్లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు.

***