Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వాతంత్ర్య దిన వేడుకలకు దేశం సన్నద్ధం


దేశం రేపు 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనున్నది. ఈ సందర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆగస్టు 15వ తేదీ నాడు సుమారు ఏడున్నర గంటలకు ఎర్ర కోట బురుజుల మీది నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. స్వాతంత్ర్య దిన సన్నాహాలలో భాగంగా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రజలలో దేశభక్తి భావనను పెంచేలా రోజంతా, ఆ తరువాత కూడా వివిధ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మధ్య ప్రదేశ్ లో స్వాతంత్ర్య సమర యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జన్మస్థలం నుండి ఆగస్టు 9 నాడు తిరంగా యాత్ర ను జెండా ఊపి ప్రారంభించారు. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ అన్ని వర్గాల ప్రజలలోను దేశ భక్తి భావనలను ప్రేరేపించేటందుకు ఈ యాత్రను ఉద్దేశించారు. తిరంగా యాత్ర లను ఆగస్టు 23 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ యాత్రలలో 75 మంది మంత్రులు పాల్గొని, స్వాతంత్ర్య సమరంతో సంబంధం ఉన్న 150 ప్రదేశాలను సందర్శించనున్నారు. ఏడుగురు మహిళా మంత్రులు సైనికులకు రాఖీలు కట్టేటందుకు దేశ సరిహద్దులలో పర్యటించనున్నారు.

సంస్కృతి మంత్రిత్వ శాఖ న్యూ ఢిల్లీ లోని రాజ్ పథ్ పచ్చిక మైదానంలో వారం రోజుల పాటు ‘భారత్ పర్వ్’ ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం దేశభక్తి భావనను అంకురింపచేయడమూ, దేశ ఘన సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పడమూ, ఇంకా సామాన్య ప్రజలు విరివిగా ఇందులో పాలుపంచుకొనేటట్లు చేయడమూను. ‘భారత్ పర్వ్’ ను ఆగస్టు 12 వ తేదీ సాయంత్రం సమాచార – ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు, సంస్కృతి పర్యటన శాఖ మంత్రి శ్రీ మహేశ్ శర్మ ల సమక్షంలో రక్షణ మంత్రి శ్రీ మనోహర్ పర్రికర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాలుపంచుకోవచ్చు. ప్రవేశం ఉచితం. ఈ కార్యక్రమంలో భాగంగా సాయుధ బలగాల బ్యాండ్ లు ఇచ్చే ప్రదర్శనలు, 50 స్టాల్స్ తో కూడిన పలు రకాల వంటల శాల, హస్తకళల ప్రదర్శన, 17 విధాలైన ఇతివృత్తాలతో కూడిన మండపాలు, వేరు వేరు రాష్ట్రాలకు/సంఘటనలకు/ సాంస్కృతిక మరియు సాంఘిక సంస్థలకు చెందిన సాంస్కృతిక ప్రదర్శనలు వంటివి ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయి. సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ “ఆజాదీ 70 సాల్- యాద్ కరో కుర్బానీ” (70 సంవత్సరాల స్వాతంత్ర్యం- త్యాగాన్ని గుర్తు చేసుకొందాం) పేరిట ఒక ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేసింది.

స్వాతంత్ర్య దిన వేడుకలను ప్రజల ఉత్సవంగా మలచడానికిగాను దేశమంతటా అనేక విశిష్ట కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. న్యూ ఢిల్లీ లోని సిరి ఫోర్ట్ ఆడిటోరియం లో “ఇండిపెండెన్స్ డే ఫిలిం ఫెస్టివల్” ఆగస్టు 12 నుండి వారం రోజుల పాటు సాగుతోంది. అదే రోజున ద ఫెస్టి వల్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇతివృత్తంతో కూడిన గేయం తిరంగా యాత్ర ను విడుదల చేశారు. మొట్టమొదటి సారి రవీంద్రనాథ్ టాగోర్, బంకిం చద్ర చటర్జీ, ముహమ్మద్ ఇక్బాల్, కవి ప్రదీప్, శకీల్ బదాయూని, నౌశాద్, పీతాంబర్ దాస్ తదితర దేశభక్తి గేయకారులు/రచయితల జీవితచరిత్ర, ఇంకా ప్రాంతీయ భాషలలో నుండి ఆచార్య ఆత్రేయ (1972) తెలుగులో రాసిన భారతమాతకు జే జే లు వంటి పాటలను వాటి సంక్షిప్త పుట్టుపూర్వోత్తరాలను కూడా పాటలకు ముందుగా ప్రసారం చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా స్వాతంత్ర్య ఉత్సవానికి సంబంధించిన ఒక వెబ్ పేజీని తీసుకువచ్చారు. ఇందులో ప్రాచీన గ్రంథాలయాలలో నుండి తీసిన ఛాయాచిత్రాలు, వీడియోలు, ఆడియో, సోషల్ మీడియా లింకులు, ఎంపిక చేసిన కథానాయకుల యదార్థాలు, గ్రాఫిక్ లు, పత్రికా ప్రకటనలు మరియర ప్రధాన మంత్రి ప్రసంగాలు పొందుపరిచారు. ప్రభుత్వం తలపెట్టిన కార్యకలాపాలకు ప్రచారం కోసం ట్విటర్, ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను విస్తృత‌ంగా ఉపయోగిస్తున్నారు.

దేశంలోని ప్రధాన కట్టడాలన్నింటినీ విద్యుత్తు దీపాలతో అలంకరిస్తున్నారు. స్వాతంత్ర్య సమచం గురించిన చర్చల కోసం సంస్థలు ప్రసిద్ధులను ఆహ్వానిస్తున్నాయి. బడి పిల్లలను వారి వారి పట్టణాలు/నగరాలలో మహనీయుల జన్మస్థలాలు/విగ్రహాలు/కట్టడాలను సందర్శించవలసిందిగా ఉత్సాహపరుస్తున్నారు. ఆగస్టు 23న ఉదయం 11 గంటలకు ఏకకాలంలో 15 లక్షల పాఠశాలలు మరియు 40 వేల కళాశాలల్లో విద్యార్థులు జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలాపించనున్నారు. వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ‌ పోటీలు, చిత్రలేఖనం, బొమ్మలు గీయడం, దేశభక్తి గీతాల ఆలాపన, అలాగే, మహాత్మ గాంధీ, సుభాష్ చంద్ర బోస్ వంటి జాతీయ నాయకుల మరియు అనేక మంది ఇతర స్వాతంత్య్ర యోధులు ధరించిన దుస్తులను పోలిన వస్త్రధారణ లలో పోటీలను నిర్వహించనున్నారు.

కలర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే కార్యక్రమాన్ని అఖిల భారత స్థాయిలో ఆగస్టు 9 నుండి ఆగస్టు 15 వరకు చేపడుతున్నారు. దీనిని జాతీయ ఉధ్యమం జరిగిన 70 నగరాలు / పట్టణాలలో నిర్వహిస్తున్నారు. మొట్టమొదటిసారిగా మహిళా మంత్రులు రక్షా బంధన్ దినం.. ఆగస్టు 18వ తేదీన సరిహద్దులకు వెళ్ళి సైనికులకు రాఖీలు కట్టనున్నారు. ఇందుకోసం నాలుగు సరిహద్దు పాయింట్లు.. ఈస్టర్న్ కమాండ్ లో టేంగా మరియు బైసాఖీ, మరియు నార్దర్న్ కమాండ్ లోని బారాముల్లా మరియు కుప్వారా లను సైన్యం గుర్తించింది.

స్వాతంత్య్ర దినం అనేది దేశం కోసం ప్రాణాలు అర్పించిన పరాక్రమవంతులైన జవాన్లను జ్ఞాప‌కం చేసుకునే స‌మ‌యం కూడా. ప్రజలు పాలుపంచుకోవడం వల్ల ఈ వేడుకలు నిజంగానే ప్రజల పండుగగా మారాయి. ఇది దేశ భక్తి భావాన్ని పెంచి పోషించడంలోను, సామాన్య ప్రజానీకం మరింత ఎక్కువ సంఖ్యలో పాలుపంచుకోవడంలోనూ ఎంతగానో దోహదం చేయనున్నది.

***