Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వ‌యం నియమిత గోర‌క్ష‌కులపై ప్ర‌ధాన మంత్రి ఆగ్ర‌హం వెలిబుచ్చారు; గోర‌క్ష‌కుల మని చెప్పుకొనే నేర‌గాళ్ల ప‌ట్ల చ‌ర్య‌లు తీసుకోవాలని విజ్ఞ‌ప్తి చేశారు.


గోవుల ర‌క్ష‌కులమంటూ తమకు తామే ప్ర‌చారం చేసుకొంటున్న‌ వారి ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. వారు గోర‌క్ష‌ణ పేరిట దుకాణాలను నడుపుతున్నారని, ఆవుల సంరక్షకులుగా మారు వేషాలు వేస్తున్న నేర‌గాళ్ల‌ పైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. పాలుపంచుకొనే తరహా పాలన కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ వెబ్ వేదిక అయిన MyGov మొదలై ఇప్పటికి రెండు సంవ‌త్స‌రాలు అయిన సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ఇదివరకు ఎన్నడూ లేని విధంగా టౌన్ హాల్ నుండి ఒక ముఖాముఖి సంభాషణలో పాలుపంచుకొంటూ, అటువంటి వారి సమాచారాన్ని సిద్ధం చేయాలని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సూచించారు. ప్లాస్టిక్ ను తింటూ ఆవులు చ‌నిపోతున్నాయ‌ని, వాటి సంక్షేమం ప‌ట్ల ని జంగా ఆందోళన చెందుతున్న‌ వారందరూ అవి ప్లాస్టిక్ పదార్థాన్ని తిన‌కుండా చూడడంపై శ్రద్ధ తీసుకోవాల‌ని ప్ర‌ధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

ప్ర‌ధాన మంత్రి సుపరిపాల‌న‌, విదేశీ విధానం, ఇంకా పాలుపంచుకొనే తరహా ప్ర‌జాస్వామ్యం సహా వేరు వేరు విషయాల పైన ప‌లువురు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు.

వోటు వేయ‌డంతోనే బాధ్య‌త తీరిపోయింది అని పౌరులు అనుకున్నారంటే ప్ర‌జాస్వామ్య స్ఫూర్తి అసంపూర్ణంగా మిగిలిపోతుందని ఆయన అన్నారు. ప్ర‌జ‌లు వారివంతుగా పాల్గొనే కోవకు చెందిన ప్ర‌జాస్వామ్యం ఏర్పడడం అనేది ఎంతో అవసరం అని ఆయన స్పష్టంచేశారు. విధానాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం ఎంత‌ ముఖ్య‌మో వాటిని చిట్ట చివరి లబ్ధిదారుకు సైతం ఆ విధానం ఫలితాలను అందేటట్లు చూడడం అంతే ముఖ్య‌మైనటువంటిది అని ఆయన చెప్పారు. ప్రయోజనాలు ఎవ‌రికైతే ఉద్దేశించిన‌వో వారికి అందితీరాల‌ని ఆయ‌న అన్నారు. సుప‌రిపాల‌న అంటే అర్థం- అక్కర లేని ప్రక్రియలను తొలగించడ‌మే- అని ఆయన వివ‌రించారు. ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించే వ్య‌వ‌స్థ‌లు ప్ర‌జాస్వామ్యానికి అతి పెద్ద బ‌ల‌ం అని కూడా ఆయ‌న పేర్కొన్నారు.

ఆర్ధిక‌ వ్యవస్థను బ‌లోపేతం చేయగలిగిన రంగ‌ం ఏదైనా ఉందీ అంటే, అది వ్య‌వ‌సాయ‌ రంగమేన‌ని శ్రీ న‌రేంద్ర మోదీ చెప్పారు. రూర్బ‌న్ మిష‌న్ ను గురించి ప్రస్తావిస్తూ -పల్లెల స్వరూపాన్ని పరిరక్షిస్తూనే- పల్లె ప్రాంతాల‌కు ఆధునిక సదుపాయాల‌ను స‌మ‌కూర్చాలన్నది తన స్వప్నమని వివ‌రించారు.

చేనేత గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ”దేశం కోసం ఖాదీ – ఫ్యాష‌న్ కోసం ఖాదీ” అనే సిద్ధాంతం ప్ర‌జ‌ల‌కు మార్గాన్ని సూచించగల సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతంగా పనిచేయగలదని పేర్కొన్నారు.

ఇండియా ఫస్ట్ (భార‌త‌దేశానికే ప్ర‌థమ తాంబూలం) అనేది త‌న ప్ర‌భుత్వం అనుసరిస్తున్న విదేశీ విధానంలో కేంద్ర బిందువు వంటి అంశం అని ప్రధాన మంత్రి అన్నారు. ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల‌తో భార‌త‌దేశాన్ని జోడించడంలో విదేశాలలో నివసిస్తున్న భార‌తీయులు, భార‌తీయ సంత‌తి కీల‌క పాత్రను పోషించారని ఆయన చెప్పారు.

ప్ర‌జ‌ల‌తో ప్రధాన మంత్రి సంభాషణలో ఆరోగ్య‌ సంరక్షణ, ప‌ర్యాట‌క రంగం వంటి అంశాలు కూడా చోటు చేసుకున్నాయి. సంభాషణ సుమారు 100 నిమిషాల పాటు కొనసాగింది.

అంత‌క్రితం, ప్ర‌ధాన మంత్రి ఆకాశవాణి ద్వారా పాల్గొనే ‘మ‌న్ కి బాత్’ ( మనసులోని మాట) కార్య‌క్ర‌మం తో పాటు, MyGov వెబ్ వేదికకు అభిప్రాయాలను పంపుతున్న కొందరితో శ్రీ మోదీ వేదిక మీద నుండి కొద్దిసేపు ముచ్చ‌టించారు.

ఒక కొత్త PMO App ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. అంతే కాకుండా, ఈ యాప్ ను రూపొందించ‌డంలో స‌హాయం చేసిన యువ నిపుణుల‌తో కూడా ఆయన భేటీ అయ్యారు.