పిఎంఇండియా
గౌరవనీయులైన సభ్యులకు,
ప్రధాన ఆర్థిక వ్యవస్థల మందగమనం, వాణిజ్య మార్కెట్లలో ఒడిదొడుకులు, వివిధ దేశాలు కరెన్సీ విలువను పోటాపోటీగా తగ్గించుకోవటం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది.
ఈ పరిస్థితుల్లో అభివృద్ధి, పెట్టుబడి వ్యూహాలు, ఉపాధి అవకాశాల విషయాల్లో సమన్వయం కోసం టర్కీ అధ్యక్షుడు చేస్తున్న ప్రయత్నాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మన వాగ్దానాలను అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు ద్రవ్య విధానంపైనే పూర్తిగా ఆధారపడకుండా ప్రభుత్వ పెట్టుబడులను పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
జీ-20 దేశాలు కేంద్రీయ బ్యాంకులతో మాట్లాడుతూ ద్రవ్య విధానం చర్యలపై తీసుకుంటున్న చొరవ వల్ల ఆర్థిక మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లను స్థిరంగా ఉంచుకునేందుకు వీలవుతుంది.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బహుముఖ అభివృద్ధి బ్యాంకులు తమ మూలధనాన్ని పెంచుకోవటం ద్వారా మౌలిక వసతుల పెట్టుబడులకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. కొత్త అభివృద్ధి బ్యాంకుల వంటి నూతన సంస్థలను ఆహ్వానించటం ద్వారా ఆర్ధిక వ్యవస్థకు కాస్త ఆసరా లభిస్తుంది.
వాతావరణ మార్పులపై చర్చించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఏదేమైనా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్థిరమైన అభివృద్ధి కోసం బహుముఖ ఆర్థిక వ్యవస్థలు నియంత్రణలు, భద్రత పేరుతో నిబంధనలు విధించి.. పురోగతికి అడ్డుగోడగా నిలవటం సరికాదు.
2030 కల్లా పేదరికాన్ని అంతమొందించాలనే ప్రధాన లక్ష్యంతోపాటు ఇతర సమస్యలపై పోరాటం కోసం ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి స్వీకరించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో జీ-20 దేశాల ప్రయత్నాలు కీలకం కావాలి.
ఈ ఏడాది కోసం జీ-20 దేశాలు మహిళలు, యువతకు ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం.
స్థిరమైన దీర్ఘ కాల ప్రపంచ ఆర్థిక అభివృద్ధి వల్ల మూలనిధి పెరగటంతో పాటు కార్మికులు ఒకచోటు నుంచి మరో చోటుకు మారటం, వారి నైపుణ్యం పెరగటం వంటివి జరుగుతాయి.
గౌరవనీయులైన సభ్యులారా,
ఈ ఏడాది 7.5 శాతం అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. వచ్చే ఏడాదికి 8 శాతం మించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మేం ద్రవ్యోల్బణంతో పాటు వాడుక ఖాతా, ఆర్థిక లోటును తగ్గించుకున్నాం.
ఆర్థిక రంగంలో సమ్మిళిత అభివృద్ధి, వచ్చే ఏడాదికల్లా ప్రపంచ స్థాయిలో కనీస అవసరాలు తీర్చాలనే లక్ష్యం, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, పారిశ్రామిక వాడలు, స్మార్ట్ సిటీల ద్వారా అభివృద్ధి, ఉపాధి కల్పన ద్వారా సమగ్రాభివృద్ధి కోసం మా పథకాలు అమల్లో ఉన్నాయి.
ఇదే ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి బలాన్ని చేకూరుస్తుంది.
ధన్యవాదాలు!
My speech on global economy & how our Government's initiatives will be a source of strength for the world economy. https://t.co/jJXmdlO86E
— Narendra Modi (@narendramodi) November 15, 2015