Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స‌ర్దార్ స‌రోవ‌ర్ ఆనకట్ట ను గుజ‌రాత్ లో దేశ ప్రజలకు అంకితం చేసిన తరువాత ప్ర‌ధాన మంత్రి ఉపన్యాసం


భారత మాత వర్ధిల్లాలి.

భారత మాత వర్ధిల్లాలి.

ద‌భోయ్ ని నేను అనేక సార్లు సందర్శించాను. ఇక్క‌డ‌కు కొన్ని సార్లు బ‌స్సు లో వ‌చ్చే వాడిని. మ‌రికొన్ని సార్లు స్కూట‌ర్ పైన వ‌చ్చే వాడిని. ఇక్క‌డ కొన్ని సార్లు కార్య‌కర్త‌ల స‌మావేశాన్ని నిర్వ‌హించాను. మ‌రికొన్నిసార్లు బ‌హిరంగ స‌భ‌ లలో ప్ర‌సంగించాను. మీ అంద‌రితో నాకు అనేక జ్ఞాప‌కాలు ఉన్నాయి. అయితే గ‌తంలో ఏనాడూ నేను ఈ స్థాయిలో భారీ జ‌న‌ సందోహాన్ని చూడ‌లేదు. ఈ స్థాయిలో ప్ర‌జ‌లు ఇక్క‌డ‌కు రావ‌డం వారికి న‌ర్మ‌ద మాత‌ ప‌ట్ల వున్న భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌కు నిద‌ర్శ‌నం.

నేడు విశ్వ‌క‌ర్మ జ‌యంతి. ఈ దేశంలో శ‌తాబ్దాల త‌ర‌బ‌డి త‌మ చేతులను ఉప‌యోగిస్తూ ప‌ని చేసిన వారిని, నిర్మాణ రంగంలో త‌మ‌ స్వేదాన్ని చిందించిన‌ వారిని, సాంకేతిక నిపుణులుగా, ఇంజినియర్ లుగా, మేస్త్రీలుగా ప‌ని చేసిన‌ వారిని, సున్నం, సిమెంటు కార్మికుల‌ను, భ‌వ‌న నిర్మాణ శాస్త్ర నిపుణుల‌ను వీరంద‌రినీ విశ్మ‌క‌ర్ములుగా చూస్తూ వ‌చ్చాం. ఈ రోజు విశ్వ‌క‌ర్మ జ‌యంతి ఉత్స‌వం. కాబ‌ట్టి ఇలాంటి క‌లిసొచ్చే సంద‌ర్భం మ‌రొక‌టి ఉండ‌దు. విశ్వ‌క‌ర్మ జ‌యంతి రోజునే ఆయ‌న అనుచ‌రులు, అంటే ఈ స‌ర్దార్ స‌రోవ‌ర్ ఆనకట్టను నిర్మించిన వారు త‌మ క‌ఠిన‌మైన ప‌రిశ్ర‌మ‌ను స్మరించుకోవ‌డానికి, తాము అమ‌లు చేసిన అసాధార‌ణ‌మైన విధానాల‌ను స్మ‌రించుకోవ‌డానికి అవ‌కాశం ల‌భించ‌డం గొప్ప కాక‌తాళీయ ఘ‌ట‌న‌. ఈ బ్రహ్మాండమైన స‌ర్దార్ స‌రోవ‌ర్ ఆనకట్టను భార‌త‌ మాత‌కు బ‌హూక‌రించ‌డం నాకు ల‌భించిన ఒక ప్రత్యేక అధికారం.

సోదరులు మరియు సోద‌రీమ‌ణులారా, నా పుట్టిన‌ రోజు సంద‌ర్భంగా అనేక మంది నాకు అభినంద‌న‌లు తెలియజేస్తున్నారు. నాకు అభినంద‌న‌లు తెలుపుతున్న‌ వారికి, నాకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ వారికి, నా హృద‌యపూర్వ‌క‌మైన‌, ప్ర‌గాఢ‌మైన కృత‌జ్ఞ‌త‌లను వ్యక్తం చేస్తున్నాను. ప్ర‌జ‌లు నా ప‌ట్ల చూపిన ప్రేమాభినాలను నేను మ‌రచిపోను. వారి ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా న‌న్ను నేను తీర్చిదిద్దుకొంటాను. నా జీవితం లోని ప్ర‌తి క్ష‌ణాన్ని వారి క‌ల‌ల సాకారం కోసం వెచ్చిస్తాను. వారి క‌ల‌ల‌ కోస‌మే నేను జీవిస్తాను. ప్ర‌జ‌ల క‌ల‌ల్ని నిజం చేయ‌డానికి నేను నా జీవితాన్ని త్యాగం చేస్తాను. 125 కోట్ల మంది ప్ర‌జ‌ల శ‌క్తితో ప్ర‌జ‌ల క‌ల‌ల్ని నిజం చేస్తే మ‌నం త‌ప్ప‌కుండా నూత‌న భార‌త‌దేశాన్ని నిర్మించ‌గ‌లం.

నాడు ఒక గాంధీ, ఒక బ‌క్క‌పలచని గాంధీ, సాబర్ మతీ ఆశ్ర‌మంలో జీవిస్తూ, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ప్ర‌జ‌లంద‌రినీ ఏకం చేశారు. న‌ర్మ‌ద మాత, సాబర్ మతీ మాత ల ఆశీస్సుల‌తో అనేక మంది స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల త్యాగాలతో, ఆశీస్సుల‌తో ఆయ‌న ఆ ప‌నిని చేయ‌గ‌లిగారు. ఈ దేశం యొక్క మ‌హ‌నీయుల దీవెనల‌తో, ఈ దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏళ్ల‌య్యే శుభ సంద‌ర్భం నాటికి, 125 కోట్ల మంది ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో ఏ అవ‌కాశాన్ని అయినా వ‌ద‌లివేయకుండా ఒక నూత‌న భార‌త‌దేశం నిర్మాణం జ‌రుగుతుంది. ఈ విష‌యంలో నాకు పూర్తి న‌మ్మ‌కం ఉంది.

సోదరులు మరియు సోదరీమణులారా,ఈ స‌ర్దార్ స‌రోవ‌ర్ ఆనకట్టను చూసి భార‌త‌దేశ ఉక్కు మ‌నిషి శ్రీ స‌ర్దార్ వ‌ల్ల‌భ్ భాయ్ పటేల్ ఆత్మ, ఎక్క‌డ ఉన్నా స‌రే ఆశీస్సుల వ‌ర్షాన్ని కురిపిస్తుంది. ఆయ‌న ఒక గొప్ప దార్శ‌నికుడు. ఈ దేశానికి స్వాతంత్ర్యం రాక‌ ముందు 71 సంవ‌త్స‌రాల క్రిత‌మే, నేను పుట్ట‌క మునుపే, మ‌న లోని చాలా మంది జన్మించ‌క‌ ముందే స‌ర్దార్ స‌రోవ‌ర్ ఆనకట్టను గురించి స‌ర్దార్‌ ప‌టేల్ గారు క‌ల‌లు కన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చింది. ఈ రోజున నేను ఎంతో ధీమా తో చెప్ప‌గ‌ల‌ను.. మ‌న దేశానికి చెందిన ఇద్ద‌రు మ‌హ‌నీయులు మ‌రికొన్ని సంవ‌త్స‌రాలు జీవించి ఉంటే ఈ స‌ర్దార్ స‌రోవ‌ర్ ఆనకట్ట 60వ, 70వ ద‌శ‌కాల్లోనే పూర్త‌యి ఉండేది. ప‌శ్చిమ భార‌త‌దేశం లోని రాష్ట్రాల‌న్నీ త‌గినంత నీటి వ‌స‌తిని పొంది ఉండేవి. ఈ రాష్ట్రాలలో ప‌చ్చ‌ద‌నం విస్త‌రించి ఉండేది. ఆ విధంగా జ‌రిగి ఉంటే, ప‌శ్చిమ భార‌త‌దేశంలోని రాష్ట్రాల‌న్నీ ఈ దేశానికి అద్భుత‌మైన ఆర్ధిక సామ‌ర్థ్యాల‌ను అందించి ఉండేవి. ఈ ఇద్ద‌రిలో ఒక‌రు స‌ర్దార్ వ‌ల్ల‌భ్ భాయ్ ప‌టేల్‌. న‌ర్మ‌ద న‌ది ఘ‌న‌త కార‌ణంగా గుజ‌రాత్‌, మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్ లలో వ‌చ్చే గొప్ప మార్పుల‌ను ఆయ‌న ముందే ఊహించారు. న‌ర్మ‌ద నది ప్రాజెక్టు రూపురేఖ‌ల్ని ఆయ‌న ముందే ఊహించారు. ఇదే కోవ‌లోకి వ‌స్తారు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌. బాబా సాహెబ్ అంబేడ్కర్ గురించి అధ్య‌య‌నం చేసిన వారు ఎవ‌రైనా స‌రే ఆయ‌న రూపొందించిన అనేక ప‌థ‌కాలను గురించి తెలుసుకొని ఉంటారు. దేశంలో నీటి విప్ల‌వం కోసం ఆయ‌న ఆ ప‌థ‌కాల‌ను ర‌చించారు. నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌ను, స‌ముద్రాల ప‌రంగా భార‌త‌దేశానికి చేకూరే సామ‌ర్థ్యాల‌ను ఆయ‌న ముందే ఊహించారు. మంత్రిగా ఆయ‌న ప‌ని చేసిన అతి తక్కువ స‌మ‌యంలోనే ఈ ప‌నిని చేశారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ ఊహించిన‌న్ని నీటి ప్రాజెక్టులను ఏ ప్ర‌భుత్వ‌మూ కూడా క‌నీసం ఆలోచించనైనా లేదు.

ఈ ఇద్ద‌రు మ‌హ‌నీయులు మ‌రికొంత‌కాలం బ‌తికుంటే వారి సేవ‌లు మ‌న దేశానికి మ‌రికొంత కాలం అంది వుంటే, నా దేశ పౌరులారా, ఈ రోజు వ‌ర‌ద‌ల కార‌ణంగా నాశ‌న‌మవుతున్న రాష్ట్రాలు ఆ క‌ష్టాల‌ బారిన ప‌డేవి కావు. అంతే కాదు, క‌ర‌వు కార‌ణంగా ఇబ్బంది ప‌డుతున్న రాష్ట్రాలు ఆ స‌మ‌స్య‌ల‌ బారి నుండి ఏ నాడో బయటప‌డేవి. అభివృద్ధి బాట‌లో ప‌య‌నించి ఉన్న‌త శిఖ‌రాల‌ను అందుకొనేవి. ఈ మ‌హ‌నీయుల‌ను చాలా కాలం క్రిత‌మే కోల్పోవ‌డం మ‌న దుర‌దృష్టం. ఈ రోజు మ‌నం స‌ర్దార్ స‌రోవ‌ర్ ఆనకట్ట ను భారతదేశ పౌరులకు అంకితం చేస్తున్నాం. ఈ ప్రాజెక్టును ఇప్పుడు దేశం లోని 125 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు అంకితం చేయ‌డం జ‌రుగుతోంది. అంతే కాదు స‌ర్దార్ ప‌టేల్‌, గాంధీ జీ లు న‌డ‌యాడిన నేల‌కు అంకితం చేయ‌డం జ‌రుగుతోంది. గైక్వాడ్ ల కార‌ణంగా బాబా సాహెబ్ అంబేడ్కర్ జీవితంలో మార్పులు తెచ్చిన ఈ నేల‌కు ఈ ప్రాజెక్టును అంకితం చేయ‌డం జ‌రుగుతోంది. ఈ ప్రాజెక్టు ఈ దేశానికి చెందిన నూత‌న శ‌క్తికి ప్ర‌తీక‌గా నిలుస్తుంది. ఈ న‌మ్మ‌కంతో, ఈ మ‌హ‌నీయుల‌ను స్మ‌రించుకొంటూ ఈ మ‌హ‌త్త‌ర‌మైన‌టువంటి, భవ్య‌మైనటువంటి ప్రాజెక్టును దేశ ప్ర‌జ‌ల‌కు, భార‌త‌ మాత‌కు అంకితం చేస్తున్నాను.

సోదరులు మరియు సోదరీమణులారా,

ప్రాజెక్టులను రూప‌క‌ల్ప‌న చేయ‌డం, వాటిని పూర్తి చేయ‌డ‌మ‌నేది స‌హ‌జంగా జ‌రిగే ప‌ని. కానీ న‌ర్మ‌ద మాత ఎన్నో క‌ష్టాలు ప‌డింది. ఈ ప్రాజెక్టు అనేక క‌ష్టాల‌ను అనుభ‌వించింది. ఈ ప్రాజెక్టు పూర్తి కాకుండా దాదాపుగా ఈ ప్ర‌పంచంలో అనేక శ‌క్తులు ప‌ని చేశాయి. స‌ర్దార్ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు నిధుల‌ను ఇవ్వ‌కూడ‌ద‌ని ప్ర‌పంచ‌ బ్యాంకు నిర్ణ‌యించింది. ఆర్ధిక సాయం లేకుండా భారతదేశం వంటి దేశాల‌కు ఇలాంటి భారీ ప్రాజెక్టును పూర్తి చేయ‌డం అసాధ్యం. ఈ ప్రాజెక్టు నిర్మాణం ప‌ర్యావ‌ర‌ణానికి వ్య‌తిరేకంగా ఉంద‌ని ప్ర‌పంచ బ్యాంకు చెప్పింది. అసాంఘిక శ‌క్తుల త‌ప్పుడు ప్ర‌చారం కార‌ణంగా అలా జ‌రిగింది. వారు చాలా అబ‌ద్ధాలను ప్ర‌చారం చేశారు. సోదరులు మరియు సోదరీమణులారా, మ‌నం కూడా నిర్ణ‌యించుకున్నాం. ప్ర‌పంచ‌ బ్యాంకు ముందుకు వ‌చ్చినా, రాక‌పోయినా స‌ర్దార్ స‌రోవ‌ర్ ప్రాజెక్టు ను పూర్తి చేయాల‌ని బ‌లంగా సంక‌ల్పించాం. ఆ సంక‌ల్ప బ‌లం కార‌ణంగా ఇప్పుడు ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోగ‌లిగాం.

2001లో కచ్ఛ్ ప్రాంతంలో భూకంపం వ‌చ్చిన అనంతరం ఈ ప్రాంతాన్ని ప‌ర్యావ‌ర‌ణ హితంగా, జీవ‌వైవిధ్య‌ హితంగా పున‌ర్ నిర్మాణం చేసుకోవ‌డం జ‌రిగింది. ప‌ర్యావ‌ర‌ణం పేరు చెప్పి స‌ర్దార్ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు సహాయాన్ని అందించ‌డానికి నిరాక‌రించిన ప్ర‌పంచ బ్యాంకు.. ఆ త‌రువాత త‌న ప్ర‌తిష్టాత్మ‌క‌మైన, భారీ ప‌ర్యావ‌ర‌ణ అవార్డును అంటే ‘గ్రీన్ అవార్డు’ ను గుజ‌రాత్ ప్ర‌భుత్వానికి అందజేసింది. భూకంపం త‌రువాత రాష్ట్రంలో జ‌రిగిన అభివృద్ధి ప‌నులను చూసి ఈ పురస్కారాన్ని ప్ర‌క‌టించడమైంది.

సోదరులు మరియు సోదరీమణులారా,

భార‌త‌దేశ ప్ర‌జ‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారంటే ప్ర‌పంచం రువ్వే ప్ర‌తి స‌వాలును ఎదుర్కొనే శ‌క్తి ఈ దేశానికి స‌మ‌కూరుతుంది. దీనికి ఉదాహ‌ర‌ణే స‌ర్దార్ స‌రోవ‌ర్ ఆనకట్ట ప్రాజెక్టు. మ‌న దేశంలో కొన్ని సార్లు ఆయా రాష్ట్రాల శ‌క్తి సామ‌ర్థ్యాల‌ పైన చ‌ర్చ‌లు జ‌రుగుతుంటాయి. వాటి స్పర్ధ త‌త్వం మీద తుల‌నాత్మ‌క అధ్య య‌నాల‌ను నిర్వ‌హిస్తుంటారు. కానీ ఒక‌సారి ప‌శ్చిమ భార‌త‌దేశ రాష్ట్రాల‌ను, వాటి చ‌రిత్ర‌ను చూడండి.. స్వాతంత్ర్యం తరువాతి చ‌రిత్ర‌ను చూడండి. వాటి అభివృద్దికి ఏదైనా అడ్డంకి ఉన్న‌దంటే అది నీరే. నీటి క‌ట‌క‌ట కార‌ణంగా అటు జంతువులు కావ‌చ్చు, ఇటు మ‌నుషులు కావ‌చ్చు త‌మ ప్రాంతాల‌ను వ‌దిలి, త‌మ పొలాల‌ను వ‌దిలి నీటి కోసం 200 నుంచి 400 కిలోమీట‌ర్ల వ‌ర‌కు వ‌ల‌స పోవ‌డం జ‌రుగుతోంది. ఎక్క‌డ నీరు ల‌భిస్తే అక్క‌డ వారు కొన్ని నెల‌ల‌ పాటు తాత్కాలిక నివాసాల‌ను ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. వారి ప్రాంతాలలో వ‌ర్షాలు ప‌డినప్పుడు అక్కడకు తిరిగి రావ‌డం జ‌రుగుతోంది. ఇలాంటి దుర్భ‌ర‌మైన జీవితాన్ని గ‌తంలో ఎవ‌రైనా ఊహించారా ? నీళ్లు లేకుండా జీవ‌నం ఎలా సాగుతుంది ?

నేను గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ప‌ని చేస్తున్న కాలంలో దేశ స‌రిహ‌ద్దు ప్రాంతాల‌ను సంద‌ర్శిస్తుండే వాడిని. ఇది నా స్వ‌భావం. అక్క‌డ సైనికుల‌తో క‌లిసి దీపావ‌ళి పండుగ‌ను జ‌రుపుకునే వాడిని. ఒక‌సారి నేను గుజ‌రాత్ స‌రిహ‌ద్దుకు వెళ్లి అక్క‌డి స‌రిహ‌ద్దు భ‌ద్ర‌త ద‌ళానికి చెందిన సైనికులను క‌లుసుకొన్నాను. వారు త‌మ‌కు కావల‌సిన నీటిని వంద‌లాది ఒంటెల మీద పెట్టుకొని తెచ్చుకునే వారు. మ‌న దేశాన్ని కాపాడే సైనికులు ఎడారి ప్రాంతంలో విధులను నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో త‌మ‌కు కావాల‌సిన తాగునీటిని ఈ విధంగానే తెచ్చుకోవాల్సి వ‌చ్చేది. ఇది చూసి నేను చాలా ఆవేద‌న చెందాను. స‌ర్దార్ స‌రోవ‌ర్ ఆనకట్ట ప‌నులు మొదలైన‌ప్పుడు నాలో ఒక కోరిక క‌లిగింది. భారతదేశం, పాకిస్తాన్ స‌రిహ‌ద్దులో నీటి ఎద్దడితో ఇబ్బంది ప‌డుతున్న బిఎస్ఎఫ్ సైనికుల‌ కోసం న‌ర్మ‌ద నది నీటిని తీసుకుపోవాల‌ని భావించాను. వెంట‌నే 700 కిలోమీట‌ర్ల పొడ‌వైన గొట్టపుమార్గాన్ని వేయ‌డం జ‌రిగింది. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఒంటెల మీద నీటిని తెచ్చుకొంటున్న సైనికులు ఇక ముందు ఆ ప‌ని చేయాల్సిన అవ‌స‌రం లేకుండా నీటిని అందించ‌డం జ‌రిగింది. న‌ర్మ‌ద నీరు జవానులకు అందిన ఆ రోజున బిఎస్ఎఫ్ సైనికుల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. న‌ర్మ‌ద న‌ది నుండి 700 కిలోమీట‌ర్ల దూరంలోని సైనికుల‌కు నీరును తీసుకుపోవ‌డ‌మ‌నేది ఇంజినీయరింగ్ అద్భుతం అని పేర్కొనవ‌చ్చును. ఈ గొట్టపుమార్గాన్ని వేసిన‌ప్పుడు ఒక్కోసారి 60 అంత‌స్తుల ఎత్తుకు కూడా నీటిని తీసుకుపోయి ఆ త‌రువాత కింద‌కు తీసుకువచ్చి స‌రిహ‌ద్దుల‌కు చేర్చ‌డం జ‌రుగుతోది.

సోదరులు మరియు సోదరీమణులారా, మొత్తం స‌ర్దార్ స‌రోవ‌ర్ ఆనకట్ట ప్రాజెక్టు అనేది ఇంజినీరింగ్ అద్భుత‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. కాలువ‌ల నెట్ వ‌ర్క్ అనేది ఇంజినీయరింగ్ అద్భుతం. ఈ దేశంలోని భ‌వ‌న నిర్మాణ నిపుణుల‌ను, ఇంజినీర్ల‌ను, విద్యార్థుల‌ను, స్ట్ర‌క్చ‌ర‌ల్ డిజైన్ విద్యార్థుల‌ను, సివిల్ ఇంజినీయర్ల‌ను, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీయర్ల‌ను కోరుతున్నాను. మీరు ఈ ప్రాజెక్టుల‌ను మీ అధ్య‌య‌నంలో భాగం చేసుకోండి. భ‌విష్య‌త్ నిర్మాణ రంగానికి ఎలాంటి నూత‌న మార్గం ఇవ్వాలో తెలుసుకునే అవ‌కాశం ల‌భిస్తుంది.

సోదరులు మరియు సోదరీమణులారా, ఈ ప్రాజెక్టు ల‌క్ష‌లాది మంది రైతుల భ‌విష్య‌త్ ను మారుస్తుంది. ఒక్క గుజ‌రాత్ రైతుల‌కే కాదు, మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, మ‌హారాష్ట్ర రైతుల‌కు కూడా ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. గుజ‌రాత్ రాష్ట్ర ఆధ్వ‌ర్యంలో నిర్మాణం కొన‌సాగింది. సోదరులు మరియు సోదరీమణులారా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా మా మీద విమ‌ర్శ‌లు వచ్చాయి. మా పైన అనేక నింద‌లు వేశారు. ఈ ప్రాజెక్టును ఆపేయ‌డానికిగాను అనేక కుట్ర‌లు జ‌రిగాయి. అయితే మేం ఏనాడూ దీనిని రాజ‌కీయ త‌గాదాల విష‌యంగా మారకుండా చూసుకున్నాం. ఈ ప్రాజెక్టు 21వ శ‌తాబ్దం లోని భ‌విష్య‌త్తు త‌రాల జీవితాల‌ను మార్చేస్తుంది. కాబ‌ట్టే దీనిని రాజ‌కీయాల బారిన ప‌డ‌కుండా చూసుకున్నాం.

సోదరులు మరియు సోదరీమణులారా, ఈ నియ‌మాన్ని నేను ఇప్ప‌టికీ అనుస‌రిస్తున్నాను. మేం అనేక అడ్డంకుల‌ను ఎదుర్కొన్నాం. ఇబ్బందులు క‌లిగించింది ఎవ‌రు ? నా ద‌గ్గ‌ర పూర్తి జాబితా ఉంది. కానీ దీనిని రాజ‌కీయం చేయ‌ను. ఆ మార్గంలో నేను ప్ర‌యాణం చేయ‌ను.

గుజరాత్ లోని సాధువుల‌ను, మునులను ఎంతో మందిని నేను చూశాను. వారి ల‌క్ష్యం ఆధ్యాత్మిత‌క సందేశాన్ని బోధించ‌డం. కానీ స‌ర్దార్ స‌రోవ‌ర్ న‌ర్మ‌దా ప్రాజెక్టు స‌మ‌స్య ముందుకొచ్చిన‌ప్పుడు గుజ‌రాత్ సాధువులు అంద‌రికంటే ముందుగా ఆందోళ‌న‌ల‌కు దిగారు. నిరాహార దీక్ష‌ల‌కు కూర్చున్నారు. ఇదొక‌టే కాదు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధుల‌ను ఇవ్వ‌బోమ‌ని ప్ర‌పంచ‌ బ్యాంకు చెప్పిన‌ప్పుడు గుజ‌రాత్ లోని దేవాల‌యాలు నిధులు అందించాయి. అప్పుడే ఈ ఆనకట్ట పూర్త‌యింది. ఇది ఏదో ఒక పార్టీ, ఒక ప్ర‌భుత్వం చేసిన కృషి కాదు. ఇది కోట్లాది మంది ప్ర‌జ‌ల శ్ర‌మ‌. నీటి కోసం త‌పించే ప్ర‌జ‌ల కృత‌నిశ్చ‌యంతో ఈ ప‌ని పూర్త‌ి అయింది. గుజ‌రాత్ లోని ఎండిపోయిన ప్రాంతాల‌కు, దేశంలోని ఎండిపోయిన ప్రాంతాల‌కు ఈ నీరు ఉప‌యోగ‌ప‌డుతుంది.

సోదరులు మరియు సోదరీమణులారా, మ‌నిషి జీవితంలో కొన్ని సంద‌ర్భాల్లో ఘ‌న‌మైన ఆకాంక్ష‌లు ఆవిర్భ‌విస్తాయి. న‌ర్మ‌ద మాత విష‌యంలో ఏదో ఒక‌టి చేయాల‌నేది నా జీవితంలో భావోద్వేగ‌ విలువ‌ క‌లిగిన ఒక ఆశ‌యం. నా జ‌న్మ‌భూమిని చూసిన‌ప్పుడు ఈ ఎండిపోయిన‌, పిడ‌చ‌క‌ట్టుకు పోయిన నేల‌ను చూసిన‌ప్పుడు, నా మాతృమూర్తి నీటి కోసం అల్లాడుతుంటే చూసిన‌ప్పుడు, చ‌లించిపోయాను. న‌ర్మ‌ద న‌ది నీటిని ఈ నేల‌కు అందించిన‌ప్పుడు ఈ నేల‌ త‌ల్లి బిడ్డ‌కు అంత‌కంటే గొప్ప భావోద్వేగ‌ సంద‌ర్భం ఏముంటుంది ? నా రాష్ట్రంలో లక్ష‌లాది మంది మాతృమూర్తులు, కుమార్తెలు తాగునీటి కోసం మూడు కిలోమీట‌ర్ల వ‌ర‌కూ ప్ర‌యాణం చేయాల్సి వ‌చ్చేది. చ‌దువుల‌ను వ‌దిలేసిన బాలిక‌లు త‌మ త‌ల్లుల‌కు స‌హ‌క‌రిస్తూ తాగునీటిని తెచ్చుకొనే వారు. ఈ రోజున న‌ర్మ‌ద న‌ది కార‌ణంగా వారి క‌ష్టాలు తొల‌గిపోయాయి. దాంతో ల‌క్ష‌లాది మంది త‌ల్లుల ఆశీర్వాదాలు నాకు ల‌భిస్తున్నాయి. ఈ నేల‌ తల్లి బిడ్డ‌నైన నాకు ఇంత‌కంటే గొప్ప‌ భావోద్వేగ క్ష‌ణాలు ఏముంటాయి ?

ఏమీ మాట్లాడలేని అమాయ‌క ప‌శువులు మాన‌వాళికి సేవ చేస్తున్నాయి. ఆ ప‌శువులు నీటి కోసం, మేత కోసం 200 కిలోమీట‌ర్ల వ‌ర‌కైనా న‌డుస్తూ ప్ర‌యాణం చేసేవి. ఈ రోజున న‌ర్మ‌ద న‌ది నీరు అందుతోంది కాబ‌ట్టి వాటికి తాగునీటితో పాటు ప‌చ్చ‌గ‌డ్డి కూడా దొరుకుతోంది. ల‌క్ష‌లాది ప‌శువులు ఇప్పుడు ఆశీస్సులు అందిస్తుంటే ఈ భ‌ర‌త‌ మాత బిడ్డ‌నైన నాకు అది నా జీవితంలో అత్యంత భావోద్వేగ క్ష‌ణంగా నిలిచిపోవ‌డం చాలా స‌హ‌జ‌మైన విష‌య‌మే.

సోదరులు మరియు సోదరీమణులారా,

సొంత జ‌న్మ‌దినాల‌ను జరుపుకొనే వారి లాంటి వాడిని కాను నేను. అయితే నా పుట్టిన రోజునే విశ్మ‌క‌ర్మ జ‌యంతి. ఈ రోజున‌ ఈ శ‌తాబ్ది త‌రాల సంప‌ద సృష్టి జ‌రిగింది. నా జీవితంలో చాలా సంవ‌త్స‌రాల‌ పాటు ఇలాంటి సంద‌ర్భం రాదు. ఇటువంటి క్ష‌ణాల‌ను నాకు గుజ‌రాత్ ఇచ్చింది.

సోదరులు మరియు సోదరీమణులారా,

అభివృద్ధికి సంబంధించి ఇది భారీ ఉదాహ‌ర‌ణ‌. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎంత కాంక్రీటు ఉప‌యోగించారో చ‌దువుకున్న‌ వారు అధ్య‌య‌నం చేయ‌గ‌ల‌రా ? క‌శ్మీరు నుండి క‌న్యాకుమారి దాకా 8 అడుగుల వెడ‌ల్పయిన రహదారిని, అలాగే కాండ్లా నుండి కోహిమా దాకా 8 మీట‌ర్ల రహదారిని నిర్మిస్తే ఎంత కాంక్రీటు అవ‌స‌ర‌మ‌వుతుందో అంత కాంక్రీటును ఈ ప్రాజెక్టులో ఉప‌యోగించ‌డం జ‌రిగింది. ఈ ప్రాజెక్టు కోసం చేయ‌ని ప‌ని లేదు.

సోదరులు మరియు సోదరీమణులారా, న‌ర్మ‌ద న‌ది నీరు కేవ‌లం నీరు మాత్ర‌మే కాదు. ఇది ప‌రుసవేది లాంటిది. ప‌రుసవేది ని ఇనుము కు త‌గిలిస్తే ఆ ఇనుము బంగార‌ం అవుతుంది. అదే విధంగా న‌ర్మ‌ద న‌ది నీరు కూడా దేశంలోని ఏ నేల‌ను తాకితే, ఆ నేల స్వర్ణమ‌య‌ం అవుతుంది.

కాబ‌ట్టి సోదరులు మరియు సోదరీమణులారా, దేశ భ‌విష్య‌త్తు ను స్వర్ణభరితం చేసే ప‌ని ని న‌ర్మ‌ద న‌ది నీటి ద్వారా పూర్తి చేయ‌గ‌లం. ఇది నా క‌ళ్ల‌కు క‌నిపిస్తోంది. సోద‌ర సోద‌రీమ‌ణులారా ఈ నీరు రైతుల‌కు ల‌బ్ధి చేకూరుస్తుంది. తాగునీరు అందుబాటులోకి వ‌స్తోంది. గుజ‌రాత్ లో ఆర్ధిక విప్ల‌వం రాబోతోంది. మీరు చూడండి, మ‌న దేశంలో ప‌శ్చిమ భార‌త‌దేశం నీటి కోసం అల్లాడుతోంది. తూర్పు భార‌త‌దేశానికి విద్యుత్తును, గ్యాస్ ను అందిస్తే అభివృద్ధి జ‌రుగుతుంది. కేంద్రంలో మా ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుండి మీరు చూశారు.. దేశంలో స‌మ‌తుల్య‌త క‌లిగిన అభివృద్ధిని సాధించ‌డానికిగాను మీరు మాకు అధికార‌మిచ్చారు. ప‌శ్చిమ భార‌త‌దేశానికి నీరు కావాలి, తూర్పు భార‌త‌దేశానికి విద్యుత్తు, గ్యాస్ కావాలి. ఆ ప‌ని చేస్తే ఇరు ప్రాంతాలు బ‌లోపేత‌మ‌వుతాయి. దాంతో నా మాతృమూర్తి హ‌స్తాలు రెండూ ప‌ని చేయ‌గ‌లుగుతాయి. అందుకోసమే మేము ప‌ని చేస్తున్నాం.

సోదరులు మరియు సోదరీమణులారా,

స‌ర్దార్ స‌రోవ‌ర్ ఆనకట్ట ఏదో ఒక రాష్ట్రానికి చెందిన‌ది కాదు. స‌రోవ‌ర్ ఆనకట్ట నుండి రాజ‌స్థాన్‌ కు నీటిని విడుద‌ల చేసిన‌ నాటి సంఘ‌ట‌న ఇంకా నాకు గుర్తుంది. ఆ స‌మ‌యంలో వ‌సుంధ‌ర గారు ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. భైరాన్ సింగ్ గారు ఉప రాష్ట్ర‌ప‌తిగా ఉన్నారు. వారు జ‌స్వంత్ సింగ్ గారితో క‌లిసి నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. భైరాన్ సింగ్ గారు, జ‌స్వంత్ సింగ్ గార్లు నాతో చెప్పిన విష‌యం ఇప్పుడు వివరిస్తాను. రాజ‌స్థాన్ కు నీటిని ఇవ్వ‌డం ఎంత గొప్ప విష‌య‌మో మీకు తెలుసా మోదీ గారూ, మోదీ గారూ మొత్తం చ‌రిత్ర‌ను చూడండి. కొంచెం నీటి కోసం శ‌త‌బ్దాల క్రితం దేశాలు క‌త్తులు దూసుకొనేవి. వాటి మ‌ధ్య‌ యుద్ధాలు జ‌రిగేవి. చాలా రాజ్యాలు అప‌జ‌యం పొందాయి. చ‌రిత్ర‌లో విజ‌యాలను గురించి కీర్తించారు. కానీ ఒక పోరాటం లేకుండానే, ఒక ఆందోళ‌న లేకుండానే, ఒక గొడ‌వ లేకుండానే, ఒక ఉద్య‌మం లేకుండానే మీరు నేరుగా రాజ‌స్థాన్ కు నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. న‌ర్మ‌ద న‌ది మీద క‌ట్టిన స‌ర్దార్ స‌రోవ‌ర్ ప్రాజెక్టు నీటిని అందిస్తున్నారు. పాకిస్తాన్ స‌మీపం లోని బాడ్ మేర్ కు నీటిని అందిస్తున్నారు..అంటూ వారు నాతో ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు.

సోదరులు మరియు సోదరీమణులారా, ఆ ఇద్ద‌రు నేత‌ల క‌ళ్ల‌లో నేను భావోద్వేగాలను చూశాను. దేశ పాల‌కులుగా ఉన్న అలాంటి నేత‌ల‌కు ఆ స‌మ‌యంలో పార్టీ కంటే దేశం ముఖ్య‌మైంది. న‌ర్మ‌ద ప్రాజెక్టు నిర్మాణ ద‌శ‌లో ఉన్న స‌మ‌యంలో, దేశం కంటే పార్టీయే ముఖ్య‌మ‌నుకున్న నేత‌లు ఉన్న స‌మ‌యంలో న‌ర్మ‌ద ప్రాజెక్టుకు అనేక అవాంత‌రాలు వ‌చ్చాయి.
ఈ రోజు ఆనకట్ట ప‌ని పూర్త‌ి అయింది.. మ‌ధ్య ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు, ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ గారికి నా గౌర‌వ‌ప్ర‌ద‌మైన కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను. ఈ రోజు ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్త‌య్యింది.. మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ దేవేంద్ర ఫ‌డ్న‌విస్ కు నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను. ఈ రోజు ఈ ప్రాజెక్టు పూర్త‌య్యింది.. నా ఆదివాసీ సోద‌రులు మరియు సోద‌రీమ‌ణుల‌కు శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. ప్ర‌జ‌లంద‌రి సంక్షేమం కోసం వారు వారి ఆస్తుల‌ను స్వ‌చ్ఛందంగా వ‌దులుకొన్నారు. వారు చూపిన ఔదార్యానికి రాబోయే ప్ర‌భుత్వాలు కూడా వారికి త‌గిన గౌర‌వం ఇవ్వాలి. రాబోయే ప్ర‌భుత్వాలు కూడా వారి మంచి చెడులను గురించి ప‌ట్టించుకొంటాయ‌ని నేను న‌మ్ముతున్నాను. నా మాతృభూమి యొక్క దాహం ఆదివాసీ సోద‌రులు మరియు సోద‌రీమ‌ణుల త్యాగాల కార‌ణంగా తీరుతోంది. న‌ర్మ‌ద న‌ది నీటితో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఈ జీవితానికి ఇంత‌కంటే గొప్ప ప్ర‌యోజ‌నం ఏముంటుంది ?

సోదరులు మరియు సోదరీమణులారా,

దేశ ఐక‌మ‌త్యం కోసం కృషి చేసిన ఘ‌న‌త శ్రీ స‌ర్దార్ సాహెబ్ ది. ఆయ‌నే గాని లేక‌పోతే దేశం ముక్క ముక్క‌లుగా ఉండేది. అలాంటి దు:స్థితి ఎలా ఉంటుందో మ‌నం సులువుగానే అవ‌గాహ‌న చేసుకోవ‌చ్చు. క‌శ్మీర్ ను మిన‌హాయిస్తే దేశం మొత్తాన్ని ఒక్క తాటి మీదకు తేవ‌డానికి శ్రీ స‌ర్దార్ సాహెబ్ కార‌ణం. ఈ నాడు మ‌నం మెరుగైన భార‌త‌దేశం కోసం ముందుకు క‌దులుతున్నాం. దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌దుపరి స‌రదార్ గారి లోని గొప్ప వ్య‌క్తిత్వాన్ని గుర్తించి ఉండాల్సింది. త‌దుపరి త‌రాలు త‌గిన స్ఫూర్తిని పొంది ఉండాల్సింది. కానీ కొన్ని కార‌ణాల‌వ‌ల్ల ఆ ప‌ని జ‌ర‌గ‌లేదు.
భార‌త‌దేశ భావి త‌రాలు శ్రీ స‌ర్దార్ ను గుర్తించుకునేలా చేయ‌డ‌మ‌నేదాన్ని నా ప‌విత్ర‌మైన బాధ్య‌త‌గా భావిస్తున్నాను. ఆయ‌న జ్ఞాప‌కాలు స‌జీవంగా ఉండిపోవాలి. ఆయ‌న అందించిన స్ఫూర్తి స‌జీవంగా ఉండాలి. కొన్ని సార్లు ప్ర‌తీకాత్మ‌కంగా చేసిన ప‌నులు కూడా స్ఫూర్తిని అందిస్తుంటాయి. నా ఈ కల‌లను సాకారం చేసుకోవ‌డానికి నేను ప‌ని చేస్తున్నాను. మీకు నా గురించి తెలుసు.. చిన్న చిన్న సాధార‌ణ ప‌నులు నాకు స‌రిపోవు. చిన్న‌గా నేను ఆలోచించ‌ను, చిన్న చిన్న ప‌నులు నేను చేయ‌ను. దేశంలో 125 కోట్ల మంది ప్ర‌జ‌లు భార‌త‌ మాత క‌ల‌లను సాకారం చేయ‌డానికి కృషి చేస్తుంటే చిన్న చిన్న క‌ల‌లు క‌నడం భావ్యం కాదు. అందుకు అనుగుణంగానే ఆలోచించాను. స‌ర్దార్ సాహెబ్ విగ్ర‌హాన్ని నెల‌కొల్పాల‌ని అనుకున్న‌ప్పుడు అది ఈ ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్త‌యిన విగ్ర‌హంగా ఉండాల‌ని నేను నిశ్చ‌యించాను. ఆయ‌న విగ్ర‌హ నిర్మాణ‌మంతా క‌లిపితే 190 మీట‌ర్ల ఎత్తు ఉంటుంది. కేవ‌లం ఆయ‌న విగ్ర‌హ‌మే అయితే అది 182 మీట‌ర్ల ఎత్తు ఉంటుంది. అమెరికా లో ఉన్న స్టాట్యూ ఆఫ్ లిబర్టీ తో పోల్చిన‌ప్పుడు ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ మ‌న స‌ర్దార్ సాహెబ్ విగ్రహం రెండింత‌లు ఉన్నతంగా.. నా సోదరుడి యొక్క విగ్రహం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కన్నా రెండు రెట్లు ఉంటుంది.

స‌ర్దార్ వ‌ల్ల‌భ్ భాయ్ ప‌టేల్ విగ్ర‌హానికి ప‌ర్యాట‌కుల సంద‌ర్శ‌న ఎలా ఉంటుందో ఒక సారి ఊహించ‌ండి. ద‌క్షిణ గుజ‌రాత్ కు వెళ్తే అక్క‌డ సపుతారా ప్రాంతం ఉంది. సౌరాష్ట్ర ప్రాంతానికి వెళ్తే గిర్ అడ‌వులు, సింహాలు కనిపిస్తాయి. కచ్ఛ్ ప్రాంతానికి వెళ్తే అక్క‌డ అద్భుత‌మైన ఎడారి ప్రాంతం క‌నిపిస్తుంది. ఉత్త‌రానికి వెళితే అక్క‌డ అంబే దేవ‌త ఉన్నారు. మ‌రికొంత ముందుకు వెళ్తే అక్కడ అబూ క‌నిపిస్తుంది. కానీ ఇక్క‌డ ప‌ర్యాట‌క ప‌రంగా ఇంత‌వ‌ర‌కూ ఏమీ లేవు. మునుముందు ఇక్క‌డ ప‌ర్యాట‌క రంగం అభివృద్ధి చెందడానికి అవ‌కాశాలు చాలా ఉన్నాయి. సోదరులు మరియు సోదరీమణులారా, స‌ర్దార్ వ‌ల్ల‌భ్ భాయ్ విగ్ర‌హాన్ని సంద‌ర్శించ‌డానికి నిత్యం ల‌క్ష‌లాది మంది ఇక్క‌డ‌కు వ‌స్తారు. ఇది ప‌ర్యాట‌క కేంద్రంగా మారుతుంది. దాంతో ఈ ప్రాంతంలో వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. నేను ఈ స్వప్నాన్ని కాంచాను.

ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఈ నేల మీద మాత్ర‌మే ప్రాణ్య త్యాగాలు చేశారా ? కొంత మంది అనుకుంటున్నారు. కేవ‌లం కొద్దిమంది మాత్ర‌మే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టార‌ని. కేవ‌లం కొంత మంది పాత్ర‌మే త్యాగాలు చేశారని, వారి కోసం మాత్ర‌మే గీతాలాప‌న చేస్తున్నార‌ని భావిస్తున్నారు. దేశ స్వాతంత్ర్య చ‌రిత్ర‌ను మ‌రచిపోయారు. దేశం కోసం ప్రాణ త్యాగ‌తం చేసిన వారిని స్మ‌రించుకోవ‌డానికి కొంత మంది సిగ్గు ప‌డుతున్నారు. 1857 నుండి 1947 వ‌ర‌కు నా ఆదివాసీలు ఎందరో ప్రతి ఒక్క పాల‌కుడితోనూ పోరాడి అనేక త్యాగాలు చేశారు. ఆదివాసీలు వారి మాటలను విన‌లేద‌ని, వారు చెప్పిన‌ట్లుగా చేయ‌ లేద‌ని బ్రిటిషు పాల‌కులు వారిని వంద‌ల సంఖ్యలో ఉరికంబానికి ఎక్కించారు. దేశ స్వాతంత్ర్య పోరాట స‌మ‌యంలో మ‌న రాష్ట్రాలలో ఎక్క‌డైతే ఆదివాసీలు ఉన్నారో అక్క‌డల్లా వారు పోరాటాలు చేశారు. ఎవ‌రితో పోల్చినా స‌రే, త్యాగాలు చేయ‌డంలో వారు ఏమాత్రం వెనుక‌బ‌డి లేరు. అంతే కాదు స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రారంభించ‌డంలో వారు కీల‌క‌మైన పాత్రను పోషించారు. ఈ విష‌యాన్ని భ‌విష్య‌త్తు త‌రాలు త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి. అడ‌వులలో, కొండ‌ కోన‌లలో నివసిస్తూ, వేసుకోవ‌డానికి స‌రైన బ‌ట్ట‌లు లేకపోయినప్పటికీ వారు భార‌త‌ మాత దాస్య శృంఖ‌లాల‌ను తెంచివేయడానికి ఎన్నో త్యాగాలు చేశారు. ఈ విష‌యంలో ఏనాడూ వెనుక‌బ‌డి లేరు. వారికి త‌గిన గౌర‌వాన్ని ఇవ్వాలి. వారి నుండి రాబోయే త‌రాలు త‌గిన స్ఫూర్తిని పొందాలి. మ‌న దేశంలో ఏ రాష్ట్రంలోనైతే స్వాతంత్ర్య పోరాట స‌మ‌యంలో త్యాగాలు చేశారో, ఆ రాష్ట్రాలలో వారి కోసం ఒక వస్తు ప్రదర్శన శాలను క‌ట్టించాల‌ని మా ప్ర‌భుత్వం భావిస్తోంది.

మ‌న ఆదివాసీలను త‌లుచుకొని భ‌విష్య‌త్తు త‌రాలు గ‌ర్వప‌డాలి. మ‌న ఆదివాసీ పూర్వుల ధైర్య సాహసాల‌ను భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌తో త‌లచుకోవాలి. వారు మ‌న భర‌త‌ మాత కోసం ప్రాణాలను అర్పించిన విష‌యాన్ని మ‌రచిపోవ‌ద్దు. కాబ‌ట్టి ఏ రాష్ట్రంలోనైతే ఆదివాసీ ధైర్య‌ సాహ‌సాల గాథలు ఉన్నాయో అక్క‌డ ఆధునిక‌ డిజిట‌ల్ సాంకేతిక‌త‌ను ఉప‌యోగించుకొని మేం ఒక వర్చువ‌ల్ మ్యూజియమ్ ను నిర్మిస్తాం. ఇలాంటి మ్యూజియమ్ కోసం గుజ‌రాత్ లో పునాదిరాయి వేసే అదృష్టం ఈ రోజున నాకు ల‌భించింది. ఈ ప‌ని నెమ్మ‌దిగా ఇత‌ర రాష్ట్రాల‌కు కూడా విస్త‌రించాలి. ఈ ప‌ని చేయ‌డం నా జీవితానికి ల‌భించిన ఒక ఆశీర్వచనంగా భావిస్తున్నాను. బిర్సా ముండా గారు మొదలుకొని జంభుఘోడా కు చెందిన నాయ‌కుల‌ సంఘం దాకా నా సాహసికులైన ఆదివాసీలకు నేను సమ్మానపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఈ పునాదిరాయిని వేసే అదృష్టం నాకు ల‌భించడం నా భాగ్యం. ఈ మ్యూజియమ్ స‌మీప భ‌విష్య‌త్తు లో లబ్ధిని చేకూర్చుతుంది.

ఈ యావత్తు స‌ర్దార్ స‌రోవ‌ర్ ఆనకట్ట ప్రాజెక్టు ఒక అతి పెద్ద ప‌ర్యాట‌క కేంద్రంగా అవ‌త‌రించగలదు. ఇక్క‌డ జల క్రీడ‌లు, సాహ‌సోపేతమైనటువంటి నీటి ఆటలు, వినోద క్రీడలు అభివృద్ధి చెందుతాయి. నిన్న‌టి వ‌ర‌కూ ఒక అడ‌వి లాగా ఉన్న ఈ ప్రాంతం త్వరలో అనేక ఆర్ధిక కార్య‌క్ర‌మాల ప్రాంతంగా మారుతుంది. సాధార‌ణంగా ప్ర‌జ‌లు ఉపాధి కోసం న‌గ‌రాల‌కు వ‌ల‌స వెళ్తుంటారు. ఇప్పుడు ఉపాధి అనేది.. వెతుక్కుంటూ ఇక్క‌డి ప్ర‌జ‌ల ముంగిట‌కు వ‌స్తోంది. ఇది త‌ప్ప‌కుండా త్వ‌ర‌లో సాకార‌మ‌వుతుంది. బ‌రోడా, భరూచ్ ల‌ నుండి రహదారులను నిర్మించిన తరువాత‌, రైల్వే లైన్ లను వేసిన త‌రువాత‌, వేగ‌వంత‌మైన ర‌వాణా సౌక‌ర్యాల‌ను క‌ల్పించిన త‌రువాత ప‌ర్యాట‌కులు ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్య‌లో తరలివ‌స్తారు. ఇది ఒక ముఖ్య‌మైన ప‌ర్యాట‌క కేంద్రంగా మారుతుంది. శ‌తాబ్దాల క్రితం తాజ్ మ‌హల్ ను నిర్మించ‌డం జ‌రిగింది. ఇప్ప‌టికీ మ‌నం తాజ్ మ‌హల్ ను ప్ర‌పంచానికి చాలా గ‌ర్వంగా చూపిస్తున్నాం. సోద‌రులారా, ప్ర‌పంచానికి చూపించడానికి మ‌న‌ దేశంలో ప్ర‌తి మూల‌ ఏదో ఒక ప్ర‌త్యేక‌త ఉంది. ఈ స‌ర్దార్ స‌రోవ‌ర్ ప్రాజెక్టు, స‌ర్దార్ ప‌టేల్ విగ్ర‌హం, మ‌న ఆదివాసీల ఘ‌న‌తను చాటే వస్తు ప్రదర్శన శాల.. ఇలాంటి ప్ర‌త్యేక‌త‌లతో ఈ ప్రాంతం ఒక పెద్ద ఆక‌ర్ష‌ణీయ కేంద్రంగా రూపుదాలుస్తుంది. దేశ, విదేశీ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకొంటుంది.

ఇంతటి ఓ ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాన్ని ఈ రోజు ప్రారంభించుకొంటున్నాం.. ఆనకట్ట ను ప్రారంభించ‌డం జ‌రుగుతోంది. ఈ రోజున శ్రీ స‌ర్దార్ సాహెబ్ విగ్ర‌హ నిర్మాణం గురించి నేను చాలా విపులంగా స‌మీక్షించాను. ఇక్క‌డ ఎంత వేగంగా ప‌ని జ‌రుగుతున్నదీ తెలుసుకున్నాను. ఈ విగ్ర‌హం కోసం ఉప‌యోగిస్తున్న సాంకేతిక‌తను గురించి అడిగి తెలుసుకున్నాను. ఇవి తెలుసుకోద‌గ్గ విష‌యాలు. అంతే కాదు, అవ‌గాహ‌న చేసుకోవ‌డానికి ప‌నికొచ్చేవి కూడాను.

నా దేశ ప్ర‌జ‌ల‌కు ఈరోజున అమూల్య‌మైన బ‌హుమ‌తుల‌ను అందించినందుకు నేను గ‌ర్వ‌ిస్తున్నాను. మ‌రి ఇంకో విష‌యంలో కూడా మ‌ధ్య‌ ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి ని అభినందించాల‌ని అనుకుంటున్నాను.. న‌ర్మ‌ద న‌ది కొండ‌ల‌ మీద‌ నుండి రాదు; అడ‌వుల‌ నుండి పారుతుంది. కాబ‌ట్టి న‌ర్మ‌ద న‌ది ప్ర‌వ‌హించే అడ‌వుల‌ను ప‌చ్చ‌ద‌నంతో ఉంచ‌డానికిగాను మ‌ధ్య‌ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఓ ఉద్య‌మాన్ని ప్రారంభించారు. 8-9 నెల‌ల‌ పాటు పాద‌యాత్రలను నిర్వ‌హించారు. ఈ ఉద్య‌మం కోసం కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి, న‌ర్మ‌ద న‌ది అడ‌వులను ప‌చ్చ‌ద‌నంతో ఉండేటట్టు చూశారు. రాబోయే శ‌తాబ్దంలో కూడా న‌ర్మ‌ద న‌దిలో నీటి స్థాయి త‌గ్గ‌కుండా ఉండేలా ఈ కార్య‌క్ర‌మాన్ని వారు ముందుండి న‌డిపించారు. ఈ ప‌విత్ర‌మైన కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టినందుకు మ‌ధ్య‌ ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు, ముఖ్య‌మంత్రికి నా హృద‌యపూర్వ‌క అభినంద‌న‌లు. న‌దిని సంర‌క్షించే పనులు గ‌తంలో మ‌న దేశంలో జ‌రగ‌లేదు. ఈ రోజున నేను గ‌మ‌నిస్తున్నాను. మ‌న దేశంలో అనేక సంస్థ‌లు, ప‌లువురు సాధువులు, న‌దుల ర‌క్ష‌ణ‌ కోసం ఉద్య‌మాలు చేస్తున్నారు. వారు ఈ ప‌నిని త్యాగ‌ భావంతో, భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌తో చేస్తున్నారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించుకోవ‌డానికి ప‌లువురు అనేక విధాలుగా కృషి చేస్తున్నారు. వారికి నా హృదయ పూర్వ‌క అభినంద‌న‌లు. ఈ ముఖ్య‌మైన ప‌నిలో భాగ‌మైన అంద‌రికీ అభినంద‌న‌లు.

సోదరులు మరియు సోదరీమణులారా, గ‌త రాత్రి ఢిల్లీ నుండి బ‌య‌లుదేరుతున్న స‌మ‌యంలో నాకు ఒక విషాద‌కర వార్త తెలిసింది. ఆయ‌న ఒక ధైర్య‌శాలి అయిన సైనికుడు, క‌మాండ‌ర్‌. ఆయ‌న పేరు శ్రీ అర్జున్ సింగ్. మ‌న దేశానికి చెందిన ఆ సేనాపతి 1965 యుద్ధ స‌మ‌యంలో అత్యంత ధైర్య‌ సాహ‌సాలను ప్ర‌ద‌ర్శించారు. ఆయ‌న‌కు ఇప్పుడు 98 సంవ‌త్స‌రాలు. కొద్ది రోజుల క్రిత‌మే ఒక కార్య‌క్ర‌మంలో ఆయ‌నను క‌లుసుకొన్నాను. ఏ కార్య‌క్ర‌మానికి వ‌చ్చినా స‌రే, ఆయ‌న పూర్తి యూనిఫారమ్ లో వ‌స్తారు. వీల్ చైర్ లో వ‌స్తారు. ఎప్పుడు న‌న్ను చూసినా, లేచి నిల‌బ‌డి వంద‌నం చేస్తారు. మార్ష‌ల్. మీరు నిల‌బ‌డకండి అని నేను అభ్య‌ర్థించినప్పటికీ ఆయన నా మాటలను విన‌రు. ఆయ‌న న‌ర‌ న‌రాన క్ర‌మ‌శిక్ష‌ణ ప్ర‌వ‌హిస్తోంది. నా మాటలను ఆలకించకుండా లేచి నిల‌బ‌డే వారు.

ఆయ‌న‌కు నిన్న‌ గుండెపోటు వ‌చ్చిందనే విష‌యం తెలిసింది. ఆయ‌నను చూడ‌డానికి ఆసుప‌త్రికి వెళ్లాను. ఆయ‌న‌లో ప్ర‌జ్వ‌రిల్లే భావాలు అదే విధంగా ఉన్నాయి. ఆయ‌న స్ఫూర్తి ఒకే విధంగా ఉంది.. శ‌రీరం స‌హ‌క‌రించ‌క‌పోయినా స‌రే, ఆయ‌న లేచి నిల‌బ‌డాల‌నే త‌న క్ర‌మ‌శిక్ష‌ణ‌ను మ‌రచిపోనేలేదు. అది ఆయ‌న ర‌క్తంలో ఇమిడిపోయింది. ఎంతో ధైర్య‌వంతుడైన సైనికుడిని మ‌నం కోల్పోయాం. సెలవు తీసుకొన్న ఆయనకు శిర‌స్సును వంచి, న‌మ‌స్క‌రిస్తున్నాను. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలని ప్రార్థిస్తున్నాను. ఆయ‌న చూపిన ధైర్య‌ సాహ‌సాల‌ను ఈ దేశం ఏనాడూ మ‌రువదు. ఆయ‌న క్ర‌మ‌శిక్ష‌ణ‌, త్యాగాలు, భ‌ర‌త‌ మాత‌ ప‌ట్ల ఆయ‌న‌కు ఉన్నటువంటి అచంచల భ‌క్తి ప్ర‌ప‌త్తులను ఈ దేశం గుర్తుంచుకొంటుంది. ఆయ‌న నుండి పొందిన స్ఫూర్తి తో ఈ దేశ భ‌విష్య‌త్తు త‌రాలు తల్లి భార‌తి కోసం ఏదైనా చేయాల‌ని సంక‌ల్పించుకొందురుగాక; 2022 కల్లా ఒక నూత‌న భార‌త‌దేశం నిర్మాణంలో వారు విజ‌యులు అగుదురు గాక.

ఈ స్ఫూర్తి తోనే నేను మ‌రోసారి గుజ‌రాత్ ప్ర‌భుత్వానికి, గుజ‌రాత్ ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను. ఈ ప్రాజెక్టు కోసం శ్ర‌మించిన నాలుగు రాష్ట్రాల‌కు నా అభినంద‌న‌లు. న‌ర్మ‌ద మాత కార‌ణంగా మ‌న గృహాల‌కు విద్యుత్తు ల‌భిస్తోంది. న‌ర్మ‌ద న‌దితో నేల త‌ల్లి స‌స్య‌ శ్యామ‌లంగా మారుతుంది. అంతే కాదు, మ‌న గృహాలు విద్యుత్తు కాంతుల‌తో వెలుగొందుతాయి. న‌ర్మ‌ద మాత‌కు వంద‌నాలు చేస్తూ, మీ అంద‌రికీ విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.. మీ రెండు పిడికిళ్లు బిగించండి. నేను న‌ర్మ‌దే అంటాను. మీరు నాతో క‌లిసి స‌ర్వ‌దే అనండి. న‌ర్మ‌ద న‌ది మ‌న‌తో ఉంటే మ‌న‌కు అన్నీ ప్రాప్తించిన‌ట్టే..

ఈ నినాదంలో అంద‌రూ గొంతు క‌ల‌పండి.. మీ సామ‌ర్థ్యాన్ని చూపండి.

న‌ర్మ‌దే-స‌ర్వ‌దే

న‌ర్మ‌దే-స‌ర్వ‌దే

న‌ర్మ‌దే-స‌ర్వ‌దే

న‌ర్మ‌దే-స‌ర్వ‌దే

న‌ర్మ‌దే-స‌ర్వ‌దే

అనేకానేక ధన్యవాదాలు.