Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స‌వ‌రించిన ప్ర‌త్యేక ప్రోత్సాహ‌కాల ప్యాకేజి స్కీమ్ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ఎల‌క్ట్రానిక్ రంగంలో పెట్టుబ‌డులు మ‌రిన్ని ఆక‌ర్షించ‌డం ద్వారా 2020 నాటికి ఎల‌క్ట్రానిక్స్ దిగుమ‌తులను నికరంగా సున్నా స్థాయికి త‌గ్గించేందుకు ఉద్దేశించిన స‌వ‌రించిన ప్ర‌త్యేక ప్రోత్సాహ‌క ప్యాకేజి స్కీమ్ కు (ఎమ్-ఎస్ఐపిఎస్) మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ మంత్రివర్గ సమావేశానికి అధ్య‌క్ష‌త‌ వహించారు.

ఎల‌క్ట్రానిక్స్ సిస్ట‌మ్ డిజైన్, త‌యారీ (ఇఎస్ డిఎం) రంగంలోకి మ‌రిన్ని పెట్టుబ‌డులను ఆక‌ర్షించ‌డంతో పాటు ఎమ్-ఎస్ఐపిఎస్ స‌వ‌ర‌ణ వ‌ల్ల దేశంలో ఉపాధి అవ‌కాశాలు పెరిగి, దిగుమ‌తుల‌పై ఆధార‌పడడం త‌గ్గుతుంది. ఈ స్కీమ్ కింద ఇప్ప‌టికే ఆమోదం పొందిన ప్రాజెక్టుల వ‌ల్ల ఒక మిలియ‌న్ ఉద్యోగాలు (ప్ర‌త్య‌క్ష‌ంగాను, ప‌రోక్ష‌ంగాను) అందుబాటులోకి వ‌స్తాయి.

ఈ విధానం ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల త‌యారీలో పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌కు అన్ని రాష్ట్రాలకు, జిల్లాల‌కు అవ‌కాశం క‌ల్పిస్తోంది. ఈ స్కీమ్ కింద ఇప్ప‌టికి 243 ద‌ర‌ఖాస్తులు రాగా 17,997 కోట్ల రూపాయ‌ల విలువ గ‌ల 75 ద‌ర‌ఖాస్తుల‌కు ఆమోదం తెలిపారు.

స‌వ‌ర‌ణ‌లోని ప్ర‌ధానాంశాలు :

ఎ) ఈ స్కీమ్ కింద ద‌ర‌ఖాస్తుల‌ను 2018 డిసెంబ‌రు 31వ తేదీ వ‌ర‌కు లేదా ఈ స్కీమ్ లో చేరే వారికి అందించేందుకు నిర్దేశించుకున్న‌10,000 కోట్ల రూపాయ‌ల ప్రోత్సాహ‌కాల క‌ల్ప‌న ల‌క్ష్యం చేరిన వెంట‌నే ఏది ముందు పూర్త‌యితే ఆ నాటి వ‌ర‌కు స్వీక‌రిస్తారు. 10,000 కోట్ల రూపాయ‌ల ల‌క్ష్యాన్ని చేరిన త‌రువాత మ‌రింత ఆర్థిక క‌ట్టుబాటు అవ‌స‌ర‌మా అన్న విష‌యం ప‌రిశీలిస్తారు.

బి) కొత్త అనుమ‌తుల‌న్నింటికీ ద‌ర‌ఖాస్తు తేదీ నుంచి కాకుండా అనుమ‌తి ల‌భించిన తేదీ నుంచి ఈ స్కీమ్ కింద ప్ర‌క‌టించిన ప్రోత్సాహ‌కాలు అందుబాటులో ఉంచుతారు.

సి) ప్రాజెక్టుకు అనుమ‌తి ల‌భించిన తేదీ నుండి 5 సంవత్సరాల లోపు అమ‌లుచేసిన పెట్టుబ‌డుల‌కే ఈ ప్రోత్సాహ‌కాలు అందుబాటులో ఉంటాయి.

డి) అన్ని ర‌కాలుగాను అర్హ‌త గ‌ల ద‌ర‌ఖాస్తుల‌కు పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించిన తేదీ నుండి సాధార‌ణంగా 120 రోజుల వ్య‌వ‌ధిలో అనుమ‌తులు మంజూరు చేస్తారు.

ఇ) ఈ స్కీమ్ కింద ప్రోత్సాహ‌కాలు పొందిన యూనిట్ క‌నీసం మూడు సంవ‌త్స‌రాల పాటు వాణిజ్య‌ప‌రంగా ఉత్ప‌త్తి చేస్తామ‌న్న హామీ ప‌త్రం స‌మ‌ర్పిస్తుంది.

ఎఫ్) ప్రాజెక్టుకు అనుమ‌తి మంజూరు చేసే క‌మిటీకి ఎల‌క్ట్రానిక్స్ మ‌రియు ఐటి శాఖ కార్య‌ద‌ర్శి అధ్య‌క్ష‌త వ‌హిస్తారు.

జి) 6,850 కోట్ల రూపాయ‌ల (సుమారు ఒక బిలియ‌న్ యుఎస్ డాల‌ర్లు) పెట్టుబ‌డికి పైబ‌డిన మెగా ప్రాజెక్టుల ప‌రిశీల‌న కోసం నీతి ఆయోగ్ సిఇఒ, వ్య‌య‌ శాఖ కార్య‌ద‌ర్శి, ఎల‌క్ట్రానిక్ మ‌రియు ఐటి శాఖ కార్య‌ద‌ర్శి స‌భ్యులుగా కేబినెట్ కార్య‌ద‌ర్శి నాయ‌క‌త్వంలో ఒక ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు చేస్తారు.

పూర్వరంగం

ఎల‌క్ట్రానిక్స్ సిస్ట‌మ్ డిజైన్, త‌యారీ (ఇఎస్ డిఎం) రంగంలోకి భారీ మొత్తంలో పెట్టుబ‌డులు ఆక‌ర్షించేందుకు ప్ర‌త్యేక ప్రోత్సాహ‌క ప్యాకేజిలు అందించేందుకు కేంద్ర‌ మంత్రివర్గం 2012 జూలైలో ఎమ్-ఎస్ఐపిఎస్ ను ఆమోదించింది. ఈ స్కీమ్ కింద ప్ర‌త్యేక ఆర్థిక మండ‌ళ్ళ‌లో (ఎస్ఇజడ్) ఏర్పాటు చేసే ప‌రిశ్ర‌మ‌ల‌పై పెట్టుబ‌డి వ్య‌యంలో 20 శాతం, నాన్ సెజ్ ల‌లో ఏర్పాటు చేసే ప‌రిశ్ర‌మ‌ల‌పై పెట్టుబ‌డి వ్య‌యంలో 25 శాతం స‌బ్సిడీగా అందిస్తారు. విధివిధానాలు మ‌రింత స‌ర‌ళం చేయ‌డం, ప‌రిధిని విస్త‌రించ‌డం కోసం 2015 ఆగ‌స్టులో ఈ స్కీమ్ ను స‌వ‌రించారు. ఎల‌క్ట్రానిక్స్ సిస్ట‌మ్ డిజైన్, త‌యారీ (ఇఎస్ డిఎం) విభాగంలోకి ఈ స్కీమ్ 1,26,838 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు ఆక‌ర్షించింది. ఇందులో 17,997 కోట్ల రూపాయ‌ల విలువ గ‌ల పెట్టుబ‌డుల‌కు ఎల‌క్ట్రానిక్ మ‌రియు ఐటి శాఖ అనుమ‌తులు మంజూరు చేసింది. ఎమ్-ఎస్ఐపిఎస్ దేశంలో ఎల‌క్ట్రానిక్స్ విభాగంలో పెట్టుబ‌డులు సానుకూల ప్ర‌భావం చూప‌గ‌లిగింది.