పిఎంఇండియా
హిందుస్తాన్ వెజిటబుల్ ఆయిల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ విఒసి) యాజమాన్యంలో ఉన్నటువంటి అన్ని భూ సంబంధ ఆస్తులను తగిన రీతిలో వినియోగించేందుకు/ విక్రయించేందుకుగాను గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్ ఒహెచ్ యుఎ) కు గాని లేదా దాని అధీకృత ఏజెన్సీ కి గాని బదలాయించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ప్రభుత్వం వద్ద నుండి హెచ్ విఒసి తీసుకొన్నటువంటి రుణాల తాలూకు వడ్డీ తో సహా హెచ్ విఒసి యొక్క అన్ని రుణాలను- హెచ్ విఒసి యొక్క భూ సంబంధ ఆస్తుల బదిలీకి ప్రతిగా- రద్దు చేయడం జరుగుతుంది. వేరు వేరు న్యాయస్థానాలు/ ప్రత్యేక న్యాయస్థానాలు/ ప్రాధికార సంస్థలలో నడుస్తున్నటువంటి కేసుల కారణంగా భవిష్యత్తులో హెచ్ విఒసి కి ఎదురుకాగల అన్ని ఆకస్మిక రుణాల విషయం లోనూ ప్రభుత్వం బాధ్యతను తాను స్వీకరిస్తుంది.
ఏడు నగరాలలో ఉన్నటువంటి స్థలాలు అనేక సంవత్సరాలుగా వినియోగంలో లేవు. ఈ సంపత్తిని ఎమ్ ఒహెచ్ యుఎ కు బదలాయించడం వల్ల ఈ భూమిని ప్రజా ప్రయోజనాలకుగాను వినియోగించేందుకు వీలవుతుంది. ఇది వ్యాపారం నిలిచిపోయి ఖాయిలా పిఎస్ యు గా ఉన్న హెచ్ విఒసి ని త్వరగా ఎత్తివేసేందుకు కూడా మార్గాన్ని సుగమం చేయగలదు.
***