Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2016-17 రైల్వే బ‌డ్జెట్ పై ప్ర‌ధాన మంత్రి ప్ర‌తిస్పంద‌న పూర్తి పాఠం


ప్ర‌గ‌తిశీల దేశానికి చెందిన క్రియాశీల‌మైన రైల్వేల‌కు ఆలోచ‌నాత్మ‌క బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టిన రైల్వే శాఖ మంత్రి శ్రీ సురేశ్ ప్ర‌భుకు అభినంద‌న‌లు.

పేద‌లు, మ‌హిళ‌ల్లో గౌర‌వాన్ని, యువ‌త‌లో ఉత్సాహాన్ని, మ‌ధ్య త‌ర‌గ‌తిలో మంద‌హాసాన్నిపెంచేందుకు ఈ బ‌డ్జెట్ లో చేత‌నైనంత ప్ర‌య‌త్నం చేశారు.

గ‌త సంవ‌త్స‌ర బ‌డ్జెట్‌లో చేసిన వాగ్దానాల‌కు ఈసారి బ‌డ్జెట్ లో పొల్లు పోకుండా లెక్క‌లు చెబుతూనే.. రానున్న కాలానికి ఆశావాదంతో కూడిన వ్యూహాన్ని అనుస‌రించ‌డం జ‌రిగింది. ఈ దిశ‌లో గ‌డ‌చిన ఒక సంవ‌త్స‌ర కాలంలో మాకు చాలా వ‌ర‌కు సాఫ‌ల్యం ద‌క్కింది. దీనిని మ‌రింత మెరుగుప‌రిచేలా ఈ బ‌డ్జెట్‌లో శ్ర‌ద్ధ తీసుకున్నాము.

ప‌రిశుభ్ర‌త‌, యాత్రికుల‌కు స‌దుపాయాలు కానివ్వండి.. సాంకేతిక విజ్ఞానాన్ని మ‌రొక మెట్టు పైన నిల‌బెట్ట‌డం కానివ్వండి.. ఇవి ఇదివ‌ర‌క‌టి రెండు రైల్వే బ‌డ్జెట్ ల ప్ర‌ధానోద్దేశాలుగా ఉంటూ వ‌చ్చాయి. దీనితో పాటే రైల్వే ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌డం ఒక్క‌టే కాకుండా, వాటిని ప్రారంభించ‌డం కోసం ప‌రిశ్ర‌మించాం. దీనిని దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో ఒక చెప్పుకోద‌గిన మ‌లుపు వైపు ముందడుగు వేయ‌డం కోసం విధాన‌ప‌రంగా చేప‌ట్టిన ఒక మార్పుగా నేను భావిస్తున్నాను. బీద‌ల కోసం సూప‌ర్ ఫాస్ట్ రైలును తీసుకువ‌స్తూ అంత్యోద‌య ఎక్స్‌ప్రెస్‌, ఇంకా దీనద‌యాళ్ రైలు పెట్టెల‌ను ఆరంభించ‌డం మా ప్ర‌భుత్వానికి పేద‌ల ప‌ట్ల ఉన్న అంకిత భావాన్ని స్ప‌ష్టం చేసేదే.

రైల్వే శాఖ‌లో ఐటీతో కూడిన ఒక కొత్త టెక్నాల‌జీ, మ‌రింత ఎక్కువ‌ పెట్టుబ‌డులు, ప్ర‌భావాన్విత‌ కార్యాచ‌ర‌ణ‌ల‌కు చోటు ఇచ్చిన ఈ రైల్వే బ‌డ్జెట్, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థను మ‌రింత ముందుకు తీసుకువెళ్ళ‌డంలో సానుకూల‌ భూమిక‌ను పోషించ‌గ‌ల‌దు.

దేశంలోని వెనుక‌బ‌డిన రంగాల‌లో, మ‌రీ ముఖ్యంగా ఈశాన్య ప్రాంత రాష్ట్రాల‌లో రైల్వే మార్గాల అనుసంధానాన్ని విస్తృతం చేస్తామ‌ని ప్ర‌భుత్వం ఇచ్చిన హామీని నెర‌వేర్చే దిశ‌లో చ‌క్క‌ని అడుగులు ప‌డ్డాయి. అంతే కాదు, మ‌న రైలు మ‌ర్గాలను ఎప్ప‌టి నుంచో పీడిస్తున్న సామ‌ర్థ్య లోపం అనే స‌మ‌స్యను గ‌త ఏడాది కాలంలో చాలా వ‌ర‌కు ప‌రిష్క‌రించ‌గ‌లిగాం. ఈ గ‌మ్యం దిశ‌గా తాజా రైల్వే బ‌డ్జెట్ మ‌రింత ప‌టిష్ట‌మైన రంగాన్ని సిద్ధం చేసింది.

శ్రీ సురేశ్ ప్ర‌భు స‌మ‌ర్పించిన మొద‌టి, ఇదివ‌ర‌క‌టి రైల్వే బ‌డ్జెట్ ల‌ను మ‌నం చూసి ఉన్నాం. నేను ఆయ‌నను విమ‌ర్శించాల‌నుకోవ‌డం లేదు కానీ, పూర్వ ప్ర‌భుత్వ‌పు బ‌డ్జెట్‌ల‌ను ప‌రిశీలించిన‌ట్ల‌యితే, ఈ సారి సురేశ్ ప్ర‌భు బ‌డ్జెట్ లో రెండున్న‌ర రెట్ల పెట్టుబ‌డుల‌తో పాటు ఏకంగా ఒక పెద్ద గంతునే వేసిన‌ట్ల‌యింది. దేశ న‌వ నిర్మాణ ప్ర‌క్రియ‌లో ప్ర‌స్తుత‌ బ‌డ్జెట్ ఒక మ‌హ‌త్వ‌పూర్ణ స్తంభం అవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అన్నింటిక‌న్నా మంచి మాట ఏమిటంటే.. మ‌న రైల్వేల అభివృద్ధిలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ఉత్సాహంతో పాలు పంచుకోబోతున్నాయి. దీనికి సంబంధించి ఒక విస్తృత‌మైన మార్గ‌ద‌ర్శినిని ఆవిష్క‌రించ‌డం జ‌రిగింది. అంత‌టితోనే ఆగ‌కుండా.. ప్ర‌యాణికుల‌, రైల్వే ఉద్యోగుల స‌హ‌కారం తీసుకునే ప్ర‌య‌త్నం కూడా జ‌రిగింది. ఖ‌ర్చు పెట్ట‌డంలో క్ర‌మ‌శిక్ష‌ణను పాటించ‌డం, కార్యాచ‌ర‌ణ‌లో ద‌క్ష‌త‌ను క‌న‌బ‌ర‌చ‌డం, వినియోగ‌దారుల ప‌ట్ల జ‌వాబుదారుత‌నం వ‌హించ‌డం.. వీటిపై మా ప్ర‌భుత్వం దృష్టిని కేంద్రీక‌రించింది. దీనికి ఈ రైల్వే బ‌డ్జెట్ అద్దం ప‌డుతోంది.

మ‌రోసారి రైల్వే శాఖ మంత్రి శ్రీ సురేశ్ ప్ర‌భుకు మ‌రీ మ‌రీ అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. అలాగే రైల్వే కుటుంబానికి, టీమ్‌ రైల్వేకు కూడా ఇవే నా అభినంద‌న‌లు.

అంద‌రికీ ధ‌న్య‌వాద‌ములు.