పిఎంఇండియా
2017-18 లో 4,10,000 బ్యాలట్ యూనిట్ (బి యు) లు మరియు 3,14,000 కంట్రోల్ యూనిట్ (సి యు)ల కొనుగోలుకు, 2018-19 లో 4,35,306 బ్యాలట్ యూనిట్ లు మరియు 71,716 కంట్రోల్ యూనిట్ లను ఒక్కొక్క యూనిట్ క్రమానుగతంగా రూ.7,700 ఇంకా రూ.9,300 తాత్కాలిక ఖరీదుతో కొనుగోలు చేయడం కోసం ఎన్నికల సంఘం చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇందుకోసం మొత్తం రూ.1,009.6 కోట్లు అవుతుంది. బెంగళూరుకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బి ఇ ఎల్), ఇంకా హైదరాబాద్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఇ సి ఐ ఎల్) ల నుండి వీటిని కొనుగోలు చేస్తారు.
మెస్సర్స్ బి ఇ ఎల్, మెస్సర్స్ ఇ సి ఐ ఎల్ లకు వాటి నిర్మాణ సామర్థ్యం మరియు గతంలో యంత్రాల సరఫరాలో అవి కనబరచిన పనితీరు ల ఆధారంగా భిన్నమైన పరిమాణంలో ఆర్డర్ లు ఇచ్చే అధికారాన్ని కూడా ఎన్నికల సంఘానికి మంత్రివర్గం కట్టబెట్టింది.
ఇది 2000-2005 మధ్య కాలంలో కొనుగోలు చేసిన పాతబడిపోయిన ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను దశలవారీగా తొలగించడానికి, 2019 లో లోక్ సభకు జరపవలసి ఉన్న సాధారణ ఎన్నికలను, అలాగే కొన్ని రాష్ట్రాల విధాన సభల ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకొని స్టాక్ ను నింపేందుకు ఎన్నికల సంఘానికి వీలు కల్పించగలదు. వేరు వేరు పరిమాణాలలో ఆర్డర్ లను ఇచ్చే అధికారాన్ని ఎన్నికల సంఘానికి దఖలుపరచడం యూనిట్ లు సకాలంలో అందేటట్లుగా సేకరణ ప్రక్రియను ఉత్తమమైన పద్ధతిలో నిర్వహించేందుకు తోడ్పడగలదు.