పిఎంఇండియా
మధ్య ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీ బెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింహ్, కేంద్ర మంత్రులు శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, శ్రీ పురుషోత్తమ్ రూపాలా, సహాయ మంత్రులు శ్రీ గోపాల్ గారు, శ్రీ ఓంప్రకాశ్, శ్రీ సంజయ్, పార్లమెంటు లో నా సహచరులు శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే, శ్రీమతి సంపతీయ యుకీ, బిజెపి నాయకుడు మరియు జబల్ పుర్ ఎంపీ శ్రీ రాకేశ్ సింహ్ గారు, మండ్ లా జిల్లా పంచాయత్ అధ్యక్షురాలు శ్రీమతి సరస్వతి మారవీ గారు.. త్రిపుర ఉప ముఖ్యమంత్రి కూడా ఇక్కడకు వచ్చారని ప్రకటించడానికి నేనెంతో గర్విస్తున్నాను. త్రిపుర ఎన్నికల సమయంలో ఆయన ప్రశంసనీయమైన కృషి చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి మెజారిటీ ని సాధించింది. త్రిపుర ప్రజలు తీసుకున్న చారిత్రక నిర్ణయం అది.
త్రిపుర జనాభా లో అధిక శాతం గిరిజనులే. మీ రాష్ట్రంలో గోండులకు ఎంత సుదీర్ఘ చరిత్ర ఉందో త్రిపుర లో గిరిజనుల సుదీర్ఘ పాలన కు కూడా అంతే చరిత్ర ఉంది. కొత్తగా ఎన్నికైన త్రిపుర ఉప ముఖ్యమంత్రి శ్రీ జిష్ణు దేబ్ బర్మన్ మనతో ఇక్కడ ఉండడం నాకు ఆనందదాయకం. ఆయన గిరిజన రాచరిక కుటుంబానికి చెందిన వారు. ఆ కుటుంబం ఒకప్పుడు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఆయుధాలు ధరించింది. ఈ రోజు ఆయన ను మధ్య ప్రదేశ్ కు ఆహ్వానించడం నాకు గర్వంగా ఉంది.
సోదర సోదరీమణులారా,
ఈ రోజు మనం నర్మదా నదీ తీరంలో సమావేశమయ్యాం. 1300 కిలోమీటర్ల నిడివి లో ప్రయాణం సాగించే నర్మద మాత ఇక్కడే ఆవిర్భవించి గుజరాత్ కోస్తా వరకు ప్రయాణిస్తూ కోట్లాది ప్రజల అవసరాలను తీరుస్తుంది. వ్యవసాయ కార్యకలాపాలకు, పశు పోషణకు, గ్రామీణ జీవనానికి ఆలంబనగా నిలుస్తుంది. శతాబ్దాలుగా మన జీవితాలకు మద్దతు ను ఇస్తోంది. అటువంటి నర్మద మాతకు నేను శిరస్సును వంచి అభివాదం చేస్తున్నాను.
గతంలో కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించే అదృష్టం నాకు దక్కింది. రాణి దుర్గావతి సాహసాలు, త్యాగ నిరతి మనందరికీ స్ఫూర్తిదాయకం. మన దేశం యొక్క విశిష్ట స్వభావం ఇదే. రాణి దుర్గావతి, రాణి అవంతి బాయి వంటి వీర నారీమణుల కథలు మనం సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించాలని, విదేశీ పాలకులకు తల వంచి ఓటమిని ఎన్నడూ అంగీకరించకూడదని బోధిస్తాయి. మనం గర్వంగా జీవించడమే కాదు, అంతే గర్వంగా మరణించాలి. అలాంటి సంప్రదాయాన్ని గుర్తు చేసుకొంటూ మనం ఈ రోజు ఈ భూమి నుండి గిరిజన ఆత్మగౌరవాన్ని వేడుకగా చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం.
ఈ రోజు పంచాయత్ దినోత్సవం. గౌరవనీయులు బాపూ గారి కలలు సాకారం అయిన అత్యంత ప్రధానమైన రోజు ఇది. మహాత్ముడు భారతదేశానికి గ్రామాలే మూలాధారం అని గుర్తించారు. “గ్రామోదయ్ నుండి రాష్ట్రోదయ్” అనే కల సాకారం చేసుకోవాలని మహాత్మ గాంధీ మనలను ప్రోత్సహించారు. ఈ రోజు పంచాయత్ రాజ్ దినోత్సవం సందర్భంగా దేశంలోని 2.5 లక్షల పంచాయతీలు, ఆయా పంచాయతీల్లో నివసిస్తున్న కోట్లాది ప్రజలు, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న 30 లక్షల మందికి పైగా ప్రతినిధులకు అభివాదం పలుకుతూ, శుభాభినందనలను తెలియచేస్తున్నాను. ఈ 30 లక్షల మంది పంచాయతీ ప్రతినిధులలో మూడో వంతు మంది నాయకత్వ పగ్గాలు చేపట్టేందుకు బరిలో దిగిన మన మాతృమూర్తులు, సోదరీమణులే.
వారు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాల అభివృద్ధికి, ఆయా గ్రామాల ప్రజల సాధికారితకు, గ్రామాలలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి విముక్తికి కేంద్ర ప్రభుత్వం పరిపూర్ణమైన మద్దతును ఇస్తుందని నేను హామీ ఇస్తున్నాను. మా కలలకు, మీ కలలకు అనుబంధం ఉంది. మనందరం కలిసి 125 కోట్ల మంది కలలను పండించగలుగుతాం. ఈ స్ఫూర్తి తోనే గ్రామాల సంక్షేమానికి మనందరం కలిసి ఏదైనా చేయాలని తీర్మానించుకుందాం.
గతంతో మండ్ లా ను ఎప్పుడు సందర్శించినా గోండు రాజులు నిర్మించిన కోట తోనే దానికి గుర్తింపు ఉంది. శతాబ్దాల క్రితమే గోండు రాజులు ఇంత అద్భుతమైన వ్యవస్థ నిర్మించారని మనందరం గర్వంగా చెప్పుకొంటాం. రాచరిక వ్యవస్థ వర్ధిల్లిన ఆ రోజులలో రాజులు, పాలకులు ప్రజాసంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు మనందరం గుర్తు చేసుకొంటాం. ఎంతో గర్వకారణమైన కథలుగా వాటిని భవిష్యత్ తరాలకు చెబుతూ ఉంటాం. ఆ కాలంలో అటువంటి వ్యవస్థ ఉండేది.
ఈ రోజు దాని స్థానంలో ప్రజాస్వామ్యం వచ్చింది. కొంత సమయానికి ప్రజలు మనకు బాధ్యతలను అప్పగించారు. వారు మనపై విశ్వాసం ఉంచారు. ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ప్రజా సంక్షేమం కోసం 5 లేదా 10 లేదా 15 మంచి పనులు చేయాల్సిన అవసరం ఎన్నికైన నాయకునికి లేదా..? అలా చేయగలిగినప్పుడు 20 లేదా 25 లేదా 30 సంవత్సరాల తరువాత వృద్ధాప్యంలో వారు తమ మనుమలకు, మనుమరాళ్లకు గ్రామానికి తాము సారథ్యం వహించిన కాలంలో గ్రామంలో చెరువు తవ్వకం, బావుల తవ్వకం, చెట్ల పెంపకం వంటి వంటి తాము చేసిన మంచి పనులను గురించి చెప్పుకోగలుగుతారు కదా! ఆ పనులు మీకు ఎంతో సంతృప్తి ని ఇచ్చాయని కూడా మీరు వారితో చెప్పుకోగలుగుతారు. ఏ పంచాయతీ అధిపతికి అలాంటి ఆకాంక్ష ఉండదు ?
అలాంటి బలమైన విశ్వాసాన్ని మీ అందరిలో నింపాలని నేను భావిస్తున్నాను. ఐదు సంవత్సరాల పరిమిత కాలంలో ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన బలీయంగా ఉన్నట్టయితే మీ మార్గంలో వచ్చే ఎలాంటి అవరోధాన్నయినా లేదా సవాలునైనా తేలిగ్గా తొలగించుకొని ముందుకు సాగగలుగుతారు.
గ్రామాభివృద్ధి విషయానికి వచ్చే సరికి కొన్ని సందర్భాల్లో బడ్జెటును గురించి మాట్లాడతారు. బడ్జెటు ఒక సమస్యగా ఉన్న రోజులు ఉన్నాయి; కానీ ఈ రోజు అది పెద్ద సమస్య కానే కాదు. అందుబాటులో ఉన్న పరిమిత కాలం లోనే అసలు సిసలైన లబ్ధిదారులకు చేరే విధంగా ఆ సొమ్మును ఎలా సద్వినియోగం చేయాలన్నదే నేటి సమస్య. గ్రామాలలో చేపట్టే పనుల విషయంలో పారదర్శకత్వం, నిజాయతీ ఉండాలి. ప్రాజెక్టు లోకి ఎంత సొమ్ము చేరుతోంది ?, దాని అంతిమ ప్రయోజనం ఏమిటి ? అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలి. నిధుల కొరత కాదు, వాటిని ఎలా ప్రాధాన్య క్రమంలో పెట్టుకోవాలన్నదే సమస్య.
ఒక గ్రామంలో చక్కని పాఠశాల భవనం ఉంది; అర్హుడైన ఉపాధ్యాయుడున్నాడు; ఆ ఉపాధ్యాయునికి క్రమం తప్పకుండా వేతనం అందుతోంది; పాఠశాల కూడా క్రమం తప్పకుండా పని చేస్తోంది.. అయినా గ్రామం లోని 5 మంది లేదా 25 మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లడం లేదు. వారు వ్యవసాయ క్షేత్రాలలో దాక్కుంటున్నారు; చెట్ల కింద కాలం గడుపుతున్నారు.. ఫలితంగా వారంతా నిరక్షరాస్యులుగానే ఉంటున్నారంటే ఎవరిని నిందించాలి ? అది నిధుల కొరత సమస్యా ? ఉపాధ్యాయుల సమస్యా ? కానే కాదు. గ్రామంలో పాఠశాల ఉంది; ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు; ప్రభుత్వం రుసుములు చెల్లిస్తోంది. విద్యార్థుల యూనిఫారానికి కూడా కేటాయింపులు చేసింది. మధ్యాహ్న భోజనం పెడుతోంది.. వంటి విషయాలన్నీ ప్రజలకు తెలిసేలా మనం చెప్పాలి. గ్రామాల లోని ఏ ఒక్క బాలుడు లేదా బాలిక పాఠశాలకు వెళ్లకుండా ఉండిపోకూడదు. పల్లెల లోని బాలల్లో ఏ ఒక్కరూ నిరక్షరాస్యులుగా ఉండిపోకూడదు. ఇలాంటి ప్రతిజ్ఞ ను మనం చేయలేమా ?
సరైన అవకాశాలు, సదుపాయాలు లేక మన తల్లితండ్రులు నిరక్షరాస్యులు కావచ్చు. ఆ రోజులలో ప్రభుత్వ సహాయం లేకపోవడం వల్ల వారికి చదువుకొనే అవకాశం లభించి ఉండకపోవచ్చు. కానీ ఎన్నికైన పంచాయతీ వ్యవస్థ అందుబాటు లోకి వచ్చిన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు ప్రత్యేకించి బాలికలకు చేయూతను ఇచ్చేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. ఐదేళ్ల కాలానికి ప్రజలు ఎన్నుకొని వారి ప్రతినిధులుగా ఉండే అవకాశం మనకు వచ్చినప్పుడు గ్రామంలో బాల బాలికలలో ఒక్కరు కూడా నిరక్షరాస్యులుగా మిగిలిపోకుండా చూసే బాధ్యత మనకు లేదా ? ఒక బాలుడు పెరిగి పెద్దవాడై విద్యావంతుడైనప్పుడు తాను వ్యవసాయ క్షేత్రాల్లో పని చేసే ఒక పేద తల్లి కుమారుడినని, కానీ గ్రామసర్పంచ్ తనను వ్యవసాయ క్షేత్రం నుండి వెలుపలికి తీసుకు వచ్చి అది వ్యవసాయ క్షేత్రాల్లో పని చేయాల్సిన సమయం కాదని, పాఠశాలకు వెళ్లి చదువుకోవలసిన సమయమని బోధించారని చెప్పుకొంటే మీకు ఎంత గర్వకారణంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. “మా గ్రామ అధిపతికి ధన్యవాదాలు, ఆయన కారణంగానే నేను ఒక వైద్యుడిని కాగలిగాను, ఒక ఇంజీనియర్ ను కాగలిగాను, ఒక ఐఎఎస్ అధికారి ని కాగలిగాను; నా కుటుంబ జీవనం మొత్తం మారిపోయింది” అని అతడు చెప్పుకొంటాడా, లేదా ? ఒక గ్రామాధిపతి వలన ఒక జీవితంలో మార్పు వచ్చినా యావత్ దేశం మార్పు దిశగా పయనిస్తుంది.
అందుకే నా సహచర ప్రతినిధులారా, పంచాయతీరాజ్ దినోత్సవాన్ని సంకల్పం స్వీకరించే రోజు గా మనం పాటించాలి. ఈ రోజు ఆరోగ్యం సంరక్షణ రంగంలో ఎన్నో సానుకూలమైన మార్పులు వచ్చాయి. మన పిల్లలకు పోలియో నిరోధక టీకా మందులను సరైన సమయంలో ఇప్పించగలిగితే వారు ఆ మహమ్మారి ప్రభావానికి లోను కాకుండా ఉంటారు. నేటికి కూడా బాల్యంలో పోలియో బారిన పడి దివ్యాంగులుగా జీవితం గడుపుతున్న 40 లేదా 50 సంవత్సరాల వయస్సు లోని వారిని మనం చూస్తూనే ఉన్నాం కదా ? వారిని అలా చూసి, మీకు బాధ కలగడం లేదా ? వారి స్థితికి మీలో సానుభూతి కలగడం లేదా ? మీ అందరిలో తప్పనిసరిగా ఇలాంటి భావం కలిగే వుంటుంది.
నా సోదర సోదరీమణులారా,
ఆ 40 లేదా 50 సంవత్సరాల వ్యక్తికి ఆ మహమ్మారి నుండి సరైన సమయంలో రక్షణ పొందే అదృష్టం లభించకపోవచ్చు. కానీ ఈ రోజు పోలియో టీకా మందులు మీ గ్రామంలో ప్రతి ఒక్క బాలబాలికలకు ఆ భయంకర వ్యాధి నుండి రక్షణను కల్పిస్తున్నాయి. పిల్లల్లో ఏ ఒక్కరికీ పోలియో దరి చేరదు. అధికారం లోకి వచ్చిన వేరువేరు ప్రభుత్వాలు పోలియో వ్యాధి నుండి రక్షణకు టీకా మందులను గురించి టివిలో, వార్తాపత్రికల్లో చక్కని ప్రచారాన్ని నిర్వహించాయి. పోలియో చుక్కలు వేసే తేదీలను నిరంతరం క్రమం తప్పకుండా ప్రకటిస్తూనే ఉన్నాయి. పంచాయతీ ప్రతినిధిగా ఎన్నికైన వారికి పోలియో వ్యాధికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత లేదా ?
ఈ బాధ్యత ప్రభుత్వాధికారులదే అని కొన్ని సమయాల్లో ఈ ప్రతినిధులు భావిస్తారు. అలా కానే కాద. మిత్రులారా, మనం ప్రజాసేవకులం, ప్రభుత్వ సేవకులం కాదు. ప్రజలకు సేవ చేయడానికే మనం ఎన్నికయ్యాం. అందుకే ఏదో ఒక పని ని చేయడానికి మన సమయం, అధికారం వినియోగించినట్టయితే గ్రామాల ముఖచిత్రమే మారిపోతుంది. సాధారణంగా ప్రజలు పెద్ద అంశాల గురించే మాట్లాడతారు. కానీ గ్రామాల్లో పరివర్తన తీసుకురాగలిగే వాస్తవిక మార్పులు చిన్న చిన్న పనుల వల్లే సాధ్యం అవుతాయి.
తన పోషణకే కాకుండా సమాజ పోషణకు కూడా రైతన్నలు కాయకష్టం చేసి శ్రమించే వ్యవసాయ క్షేత్రాల్లో భూసారం సరిగా లేకపోతే ఈ భూమాత ఏదో విధమైన అసంతృప్తికి లోనవుతూనే ఉంటుంది. ఆమె శక్తికి దీటుగా పంటలు పండించడం మానుకొంటుంది. ఆకలి మంటలతో మనం అంతరించిపోతాం. మన భవిష్యత్ తరాలు కూడా బలవంతంగా పేదరికంలో మగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైనా రైతులందరినీ సమావేశపరచి యూరియా ను విచక్షణరహితంగా వినియోగించడం వల్ల భూసారం అంతరించిపోయి భూమి నాణ్యత దెబ్బ తింటున్నదని చెప్పాలని మనం ఆలోచించామా ? మరో రైతు భూమిలో రెండు బస్తాల యూరియా వేశాడని, తన భూమిలో కూడా రైతన్నలు యూరియా వేసిన సందర్భాలు లేవా ? అలాగే ఒక రైతు ఎర్ర పెట్టెలో ఎరువు ను తెచ్చి తన భూమిలో వేస్తే దాన్ని అనుసరించిన రైతులు లేరా ? ఒక గ్రామానికి 50 బస్తాల యూరియా వస్తుంటే 40 బస్తాలే వినియోగించినట్టయితే మిగతా 10 బస్తాలు ఆదా అవుతాయని రైతులందరూ కూర్చొని నిర్ణయించలేరా? ఆ రకంగా మనందరం భూసారాన్ని పరిరక్షించడంలో చురుకైన పాత్ర ను పోషించగలుగుతాం. నాసిరకం ఎరువుల వల్ల భూమి నాణ్యత కూడా దెబ్బ తింటోంది. ఇది చూసి భూమాత నా బిడ్డ తన తప్పు తెలుసుకొని అదనపు యూరియా నాలో పోయకుండా నన్ను కాపాడుతున్నాడని ఆనందించి ఆశీర్వదించదా ? వారి కడుపు ను నింపడానికి నేను మరింత ఎక్కువ పంట పండిస్తానని ఆమె భావిస్తుంది. ఇది మనం చేయగలమా లేదా చెప్పండి.
నేను నా గిరిజన సోదరులను అడగాలనుకొంటున్నాను- మనం ఈ పని ని చేద్దామా.. వద్దా ? ఇప్పుడు ప్రభుత్వం ఒక గొప్ప చట్టాన్ని తీసుకువచ్చింది. ఇవాళ నేను మండ్ లా అడవుల్లో నిలుచున్నాను.. ఇక్కడ వెదురు సాగు చేస్తారు. వెదురును కూడా ‘వృక్ష’ వర్గంలో చేర్చిన కాలమది. నేను కొన్ని ఫైళ్లు చూస్తుండగా ఇది గమనించి ఇంత సుదీర్ఘ కాలం నుండీ వెదురును వృక్షంగా ఎలా పరిగణించారా ? అని తికమకపడ్డాను. ఇలా పరిగణించడంవల్ల అడవుల్లో నివసించే నా గిరిజన సోదరులు వెదురును నరికి అమ్ముకోవడం సాధ్యం కాదు. ఒకవేళ వారు వెదురును నరికి తీసుకుపోతూ అటవీ అధికారుల కంటబడితే ఇబ్బందుల్లో పడే వారు. అలాంటి సందర్భాల్లో వారికి ఇలాంటి సమస్యలు ఎదురయ్యేవి. అందుకే ఈ ప్రభుత్వం వెదురును వృక్ష వర్గం నుండి తొలగించాలన్న కీలక నిర్ణయం తీసుకోవడమే కాకుండా దానిని ‘గడ్డి’ వర్గంలో చేర్చింది. దీంతో రైతులు వారి పొలం గట్ల పైనా వెదురును సాగుచేసుకొనేందుకు వీలు కలిగింది. ఈ వెదురును వారు నిక్షేపంగా అమ్ముకోవచ్చు. దాంతో రకరకాల వస్తువులు కూడా తయారుచేసి విపణిలో విక్రయించుకోవచ్చు. తద్వారా గ్రామాల్లో కొత్త ఉపాధి అవకాశాలు కూడా అందివస్తాయి.
దేశంలో మనకు భారీ వెదురు అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ మనం 12 నుండి 15 వేల కోట్ల రూపాయల విలువైన వెదురును దిగుమతి చేసుకుంటున్నామని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అగరువత్తులు, అగ్గిపుల్లలు, చివరకు గాలిపటాలు తయారు చేయటానికీ మనం వెదురును దిగుమతి చేసుకుంటున్నాం. ఇంటిని కట్టుకొనేందుకు అవసరమైనప్పటికీ మన అడవుల్లో వెదురును నరికేందుకు మనకు అనుమతి లేదు. ఫలితంగా వేలాది కోట్ల రూపాయలు విదేశాలకు ప్రవహిస్తోంది. ఇక ఈ పరిస్థితికి స్వస్తిచెప్పే దిశగా మంచి నాణ్యమైన వెదురును సాగుచేయాలని నా గిరిజన సోదరులతో పాటు గ్రామాల్లోని రైతులందరినీ కోరుతున్నాను. రైతులు వారు పండించే పంటలతో పాటు పొలం గట్ల మీద వెదురు మొక్కలను నాటవచ్చు. రెండేళ్లకు లేదా మూడేళ్లకు అవి వారికి అదనపు ఆర్జనగా అందివస్తాయి. తద్వారా రైతుల ఆదాయం మెరుగుపడుతుంది. ఆ విధంగా తమ పొలం గట్లపై వినియోగించని నేల నుండి కూడా వారు అదనపు ఆదాయం పొందగలుగుతారు. వ్యవసాయ రంగంలో మన రైతుల స్వావలంబనకు మనం తోడ్పడలేమా ? ఈ దిశగా కృషి చేయాలని మన పంచాయతీల ప్రతినిధులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శూన్య బడ్జెటు వ్యవసాయంపై రైతులను చైతన్యవంతులను చేయడానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ దేవవ్రత్ తన సమయాన్ని వెచ్చిస్తున్నారు. మన పంచాయతీల ప్రతినిధులు కూడా దానిని గురించి తెలుసుకొని తమ తమ గ్రామాల్లో రైతులను అందుకు సంసిద్ధం చేయగలరా.. లేదా ?
తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి మెరుగుదల కోసం మేము ఇప్పుడు ఒక ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తున్నాం. ఒక చిన్న రైతు తన పొలంలో కనీసం 50 పెట్టెలలో తేనెటీగలను పెంచగలిగితే ఏటా అతడు 1.5 నుండి 2 లక్షల రూపాయల తేనెను విక్రయించగలడు. ఒకవేళ ఆ తేనెను విక్రయించలేకపోతే సొంతంగా వాడుకున్నా అతడి కుటుంబ ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి- రైతు ఆదాయం పెరగాలా, వద్దా ? ఇది సాధించేందుకు మనకు బడ్జెటు అవసరం ఉంటుందా ? ఏ మాత్రం ఉండదు! ఇవన్నీ ఎవరంతట వారి చొరవతో, వాటంతట అవే సాధ్యమవుతాయి. మనం చేయాల్సిందల్లా నిర్ణయం తీసుకోవడం మాత్రమే. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు వేతనాల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఈ పథకం కింద 2-3 నెలలు.. అంటే- ఏప్రిల్, మే, జూన్ వ్యవధిలో పనుల కోసం సదరు పనులేమిటో ముందుగానే నిర్ణయించగలం. ఉదాహరణకు చెరువు లోతు పెంచడం లేదా చెక్ డ్యాముల ద్వారా నీటిని నిల్వచేయడం, లేదా వాననీటి సంరక్షణ వంటి నిర్దిష్ట పనులకు ఉపాధి హామీ పథకం నిధులను వాడుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి.. ఒక గ్రామంలో నీటి సంరక్షణ వల్ల నానాటికీ తగ్గిపోతున్న భూగర్భ జల మట్టం పెరగదంటారా ? తద్వారా నీటిని తోడుకోవడానికి అయ్యే ఖర్చు తగ్గదంటారా ? కాబట్టి ఇలా నీటి సంరక్షణ చర్యలు చేపట్టినందువల్ల భవిషత్యులో వర్షపాతం తగ్గినా వ్యవసాయానికి కొత్త ఊపిరి వచ్చినట్టే అవుతుంది. అటువంటి పరిస్థితులలో నీటి కొరతతో సదరు గ్రామం అల్లాడే అగత్యం ఏర్పడదు.
పథకాలు లేదా నిధులు ఇక్కడ సమస్య కానే కాదు.. కాబట్టి పంచాయతీల ప్రతినిధులందరికీ నేనొక విజ్ఞప్తి చేస్తున్నాను. విద్య, ఆరోగ్య సంరక్షణ, నీటి పరిరక్షణ లేదా వ్యవసాయ ఆధునికీకరణ వంటి అంశాలలో దృఢమైన నిర్ణయాలు తీసుకోండి. వీటికి సంబంధించి కొత్తగా బడ్జెటు అవసరం ఏమీ ఉండదు. కొత్త బడ్జెటు అవసరమేదీ లేకుండానే గ్రామీణ ప్రజలు ముందడుగు వేస్తూ ఎన్నో మార్పులు తేగలరు. మరొక అంశం గురించి కూడా నేను నొక్కిచెప్పదలిచాను. బ్యాంకు ఖాతాలను తెరచేందుకు మేం ‘జన్ ధన్ యోజన’ పేరిట ఒక పథకాన్ని ప్రారంభించాము. దీంతోపాటు రెండోదిగా కేవలం 90 పైసల రుసుముతో బీమా పథకాన్ని తీసుకువచ్చాము. ఈ 90 పైసలు సమకూర్చుకోలేని అత్యంత నిరుపేదలు ఎవరూ ఉండరన్నది నా విశ్వాసం. చివరకు బీడీ వ్యసనం ఉన్న వారు కూడా రోజుకు కనీసం రెండు రూపాయలైనా ఖర్చు చేస్తారు. కాబట్టి 90 పైసల బీమా రుసుము ను చెల్లించడం కష్టమేమీ కాదు. ఈ వేదికపై ఓ గిరిజన తల్లి కి నేను 2 లక్షల రూపాయలకుపైగా అందజేసే అవకాశం లభించింది. దీనిని మీరంతా చూసే వుంటారు.. ఈ సొమ్ము ను ఆమెకు ఎందుకు చెల్లించాము ? ఆమె 90 పైసల రుసుముతో జీవితబీమా కొనుగోలు చేసింది. ఈ మాత్రందానికీ ఆమె కుటుంబం అభ్యంతర పెట్టింది. దురదృష్టవశాత్తూ ఆ కుటుంబ పెద్ద మరణించాడు.. అయినా ఆ పేద తల్లికి ఇప్పుడు లోటులేదు. 90 పైసల రుసుము పుణ్యమా అని ఇవాళ రెండు లక్షల రూపాయలు ఆమె కుటుంబానికి ఆసరా ఇస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి- ఈ చొరవ కష్టకాలంలో వ్యక్తి కుటుంబాన్ని ఆదుకున్నదా, లేదా ? కాబట్టి గ్రామంలో ప్రతి కుటుంబానికీ జన్ ధన్ బ్యాంకు ఖాతాతో పాటు 90 పైసల కనీస రుసుముతో బీమా ధీమాను కల్పించడం తప్పనిసరి అని నేను ఇప్పుడు పంచాతీయల ప్రతినిధులకు, సర్పంచులకు స్పష్టం చేస్తున్నాను. ఈ ఖాతాతో పాటు బీమా ఉన్న కుటుంబం ఏదైనా దురదృష్టకర పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే వారికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం లభిస్తుంది. అప్పడు ఆ కుటుంబం గ్రామానికి ఎంతమాత్రం భారం కాబోదు. మీరంతా ఈ పని చేయలేరా ?
సోదర సోదరీమణులారా,
మూడు అంశాలపై దృష్టి సారించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను- ఒకటి జన్ ధన్… రెండోది వన్ ధన్… మూడోది గోవర్ధన్. ఈ మూడింటితో మనం గ్రామసీమల్లో గొప్ప ఆర్థిక పరివర్తన తేగలం. జన్ ధన్ యోజన ద్వారా పౌరులలో ప్రతి ఒక్కిరినీ ప్రధాన ఆర్థిక స్రవంతి లోకి తీసుకురాగలం. రెండోది వన్ ధన్- మనకు అటవీ, సహజ వనరులు అపారం. ఓ గ్రామంలో వేప చెట్లు ఎక్కువగా ఉన్నట్లయితే వాటి విలువను అర్థం చేసుకోవడం అవసరం. ఆ చెట్ల నుండి రాలిపడే పండ్లను మహిళా బృందం సేకరించి వాటి విత్తనాలలో నుండి నూనె ను తీస్తే యూరియా కు వేప పూత కోసం దానిని వినియోగించవచ్చు. ఆ మహిళలకు అదో కొత్త ఆదాయ వనరు కాగలదు. ఒకప్పుడు వృథాగా మట్టిలో కలసిపోయే వేప పండ్లు, కాయలు ఇప్పుడు ఒక ఆదాయ వనరు- అదే ‘వన్ ధన్.’ ఇలాంటి మార్పులను మనం తీసుకురాలేమా ? నేను ఇవాళ అడవుల్లో నివసించే నా గిరిజన సోదరులతో పాటు ప్రభుత్వాలకు ఒక మాట ను చెప్పదలచాను. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రారంభించిన వన్ ధన్ వంటి గొప్ప పథకానికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఇక మూడోది గోవర్ధన్ యోజన- పల్లెలలో పశు సంపద సమృద్ధం. వాటి పేడ (గోబర్)ను మనం శాస్త్రీయంగా వినియోగించడం లేదు. గ్రామాలలో వ్యర్థాలను, చెత్తను మనం ఒక సంపదగా పరిగణించినట్లయితే వాటి నుండి గ్యాస్ ను, విద్యుత్తును, ఎరువులను ఉత్పత్తి చేయవచ్చు. యూరియా తో నిమిత్తం లేకుండా గ్రామమే నాణ్యమైన ఎరువును తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా గ్రామాన్ని వ్యాధుల బారి నుండి కూడా కాపాడుకోవచ్చు. అందునా ఇదంతా ఏమాత్రం ఖర్చు లేకుండా సాధించవచ్చు. ఇందుకోసం ప్రభుత్వ పథకాలను కూడా తగువిధంగా వాడుకోవచ్చు.
కాబట్టి సోదర సోదరీమణులారా,
నర్మద నదీమాత జన్మభూమి అయిన మండ్ లా నుండి దేశం లోని అన్ని పంచాయతీలకు, వాటి పరిధిలోగల 2.4 లక్షల గ్రామాలకు దుర్గావతీ మాత ఆశీస్సులతో విజ్ఞప్తి చేస్తున్నాను. రండి… 2022 లో 75వ స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించుకొనే నాటికి మహాత్ముడు కలల సాకారానికి ప్రతిన బూనండి.. ఈ ఏడాది అక్టోబరు 2న మహాత్మ గాంధీ 150వ జయంతి… ఆదర్శ గ్రామాల గురించి గాంధీ గారు కన్న కలలను నిజం చేయడానికి ఇదే గొప్ప అవకాశం. దేశం మార్పు సాధించే దిశగా గ్రామాల్లో మార్పు తేవడం కోసం మనమంతా కృషిచేయాలి. గ్రామాల కోసం నిధులను సద్వినియోగం చేయడం మన కర్తవ్యం. ఇవాళ నేనో కొత్త సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత కార్యక్రమాన్ని ప్రారంభించాను. దీని ద్వారా ప్రభుత్వ పథకాల పురోగతిని పౌరులు తమ మొబైల్ ఫోన్ ల సహాయంతో తెలుసుకోవచ్చు. ఎంత సొమ్ము మంజూరైంది? ఏ ప్రయోజనం కోసం ఎంత కేటాయించబడింది? సదరు లక్ష్యం పూర్తి అయిందా, లేదా ? ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేయాలో అక్కడే ఖర్చయ్యాయా? వగైరా వివరాలపై ఆరా తీసేందుకు వీలు ఉంటుంది. ఉదాహరణకు ఒక బావి నిర్మించడానికి నిధులు కేటాయించినా ఆ పని చేసి ఉండకపోతే దానిపై ప్రభుత్వ అధికారులను ప్రశ్నించవచ్చు. అప్పుడు వారు ఆ పనిని ఒక నెలలోగా పూర్తిచేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు చెప్పండి.. దీనివల్ల వ్యవస్థ పారదర్శకం అవుతుందా, లేదా ? అలాగే గ్రామాల్లో నిజాయతీభరితమైన వాతావరణం ఏర్పడటంతో పాటు ప్రభుత్వాధికారులు జవాబుదారుతనాన్ని వహించవలసి వస్తుందా, లేదా ?
కాబట్టి నా ప్రియమైన సోదర సోదరీమణులారా,
మనం అందరం సకాలంలో సరైన పని ని చేయాలి. ఈ ఐదేళ్ల పాలన స్వర్ణయుగం కావాలి. గ్రామాన్ని పరివర్తన దిశగా నడిపిన మీ కృషిని గ్రామ ప్రజలంతా సదా మననం చేసుకొంటారు. ఈ సంకల్పంతో మనం ముందడుగు వేయాలి. నేడిక్కడ వంటగ్యాస్ ప్లాంటును ప్రారంభించే సదవకాశం నాకు లభించింది. మేం పేద ప్రజలకు ఉచితంగా వంటగ్యాసు సరఫరా చేస్తుండడాన్ని మీరు చూసే వుంటారు. ఇప్పుడు ఇక సిలిండర్ ల తయారీ కోసం కర్మాగారాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుత ఫ్యాక్టరీ 120 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటవుతోంది. ఇకపై దీని పరిధిలోని సత్నా, రేవా, సింగ్రౌలి, శాహ్ డోల్, ఉమరియా, దిండోరి, అనుప్పుర్, మండ్ లా, బాలాఘాట్, జబల్ పుర్, కట్నీ, దమోహ్ జిల్లాలకు సిలిండర్ ల సరఫరా సులభం అవుతుంది. అంతేకాకుండా ఇక్కడి ప్రజలకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీనికి అంతటికీ ఇవాళ మీ అందరి సమక్షంలో శ్రీకారం చుట్టే అవకాశం నాకు దక్కింది.
సోదర సోదరీమణులారా,
నేడు మనం అనేక అంశాలను గురించి మాట్లాడుకోవచ్చు. కానీ, మనమంతా ఇక గ్రామాల్లో ‘జయ్ కిసాన్, జయ్ జవాన్, జయ్ విజ్ఞాన్’ మంత్రంతో ముందడుగు వేయాలి. ఆడబిడ్డలను కిరాతకంగా వేధించే రాక్షసులకు మరణశిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చిందని శివ్ రాజ్ గారు చెప్పడం నేను విన్నాను. ముఖ్యమంత్రి ఆ సంగతిని చెబుతుండగా ఈ ప్రాంగణం మొత్తం ప్రజల కరతాళధ్వనులతో మార్మోగడం నేను గమనించాను. ఈ కరతాళధ్వనులు సమసిపోలేదు… ఢిల్లీలో గల కేంద్ర ప్రభుత్వం మీ హృదయ స్పందనను విని, ఆ తరువాతే నిర్ణయాలు తీసుకుంటుంది. మన కుటుంబాల్లోని ఆడబిడ్డలను గౌరవించడం మనమంతా నేర్చుకోవాలి. మన కుటుంబాల్లోని కుమార్తెలకు మనమంతా ప్రాధాన్యం, ప్రాముఖ్యం ఇవ్వాలి. అలాగే బాధ్యతాయుతంగా మెలగడం ఎలాగో మన కుమారులకు బోధించాలి. బాధ్యతతో ప్రవర్తించడం ఎలాగో మన కుమారులకు నేర్పడం ప్రారంభిస్తే, మన కుమార్తెలను జాగ్రత్తగా చూసుకోవడమన్నది ఇకపై ఎంతమాత్రం కష్టం కాబోదు. దారుణమైన, నీచమైన నేరాలకు పాల్పడే వారికి ఉరి శిక్ష తప్పదు. అయితే, కుమార్తెల భద్రతను గురించి మన కుటుంబాల్లో కూడా తగిన జాగ్రత్త వహించే బాధ్యతను తీసుకోవాలి. మనమంతా దీనిని ఒక ప్రజా ఉద్యమంలా ప్రారంభించాలి. ఇటువంటి సమస్యల నుండి మనం దేశాన్ని విముక్తం చేయగలం. ఇందుకోసం నేను ఇప్పుడు చెప్పిన విషయాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్నందర్నీ కోరుతున్నాను.
సోదర సోదరీమణులారా,
ప్రభుత్వం ఇప్పుడు ఒక బృహత్కార్యాన్ని తలపెట్టింది. దురదృష్టవశాత్తూ మన స్వాతంత్ర్య పోరాటం కొందరు వ్యక్తులకు, కొన్ని కుటుంబాలకు మాత్రమే ముడిపెట్టబడింది. అనేక మంది వీరుల త్యాగాలకు సంబంధించిన వాస్తవ గాథలకు చరిత్ర పుటల్లో ఎందుకు స్థానం లభించలేదన్నది నాకు అర్థం కావడం లేదు. వలస పాలన కాలంలో 1857 కు ముందు అనేక సంవత్సరాలపాటు చాలా మంది భారతదేశానికి చెందిన పూర్వికులు ఆత్మగౌరవం, సంస్కృతి లేదా స్వతంత్రం కోసం పోరాడుతూ ఎన్నో త్యాగాలు చేశారు. అటుపైన 1857 తరువాత కూడా నా గిరిజన సోదర సోదరీమణులు దేశ స్వాతంత్ర్యం కోసం చాలా త్యాగాలు చేశారు. కానీ, ఈ జ్ఞాపకాలన్నీ ప్రజల మదిలో నుండి చెరిపివేయబడిన కారణంగా వీటి గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసును. దేశ ప్రతిష్ఠను రక్షించడం కోసం వారు ఎన్నో గొప్ప యుద్ధాలు చేశారు. దుర్గావతి, అవంతి బాయి, బిర్సా ముండా వంటి మహనీయులు దేశం కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టారు. ఈ నేపథ్యంలో బ్రిటిష్ పాలకులపై పోరాడిన గిరిజన తెగల పూర్వికుల కోసం ప్రతి రాష్ట్రంలో ఒక ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలన్నది నా స్వప్నం. పాఠశాలల విద్యార్థులను వాటికి తీసుకువెళ్లి, దేశ సంస్కృతి, చరిత్రల పరిరక్షణ కోసం ప్రాణాలు ఒడ్డిన గిరిజన సోదరుల గురించి వారికి వివరించాలి. భవిష్యత్తులో మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోనూ ఈ కార్యక్రమాన్ని చేపడుతారు.
కాబట్టి సోదర సోదరీమణులారా,
మండ్ లా గడ్డ మీది నుండి దుర్గావతి మాతను సంస్మరించుకొంటూ పంచాయతీరాజ్ సాధికారిత దిశగా గిరిజన ఉత్సవాలను నిర్వహించిన వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీని ద్వారా భూమాత సంక్షేమంతో పాటు మన ప్రజాస్వామ్యం బలోపేతం కావాలని, గ్రామాలు పచ్చగా విలసిల్లాలని వారు ఆకాంక్షించడాన్ని హర్షిస్తున్నాను. తదనుగుణంగా దేశమంతటా గ్రామ్ స్వరాజ్ అభియాన్ నిర్వహణకు కృషి చేసిన తోమర్ గారు, రూపాలి గారు లతో పాటు వారి శాఖ లోని ఇతర అధికారులను అభినందిస్తున్నాను. ఇక ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి ఏప్రిల్ 30వ తేదీన ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అటుపైన మే 2వ తేదీన రైతుల కోసం కార్యశాలలను నిర్వహిస్తారు. గ్రామీణ జీవితానికి సంబంధించిన అన్ని సమస్యలపైనా చర్చిస్తారు. కాబట్టి మీరందరూ ఇనుమడించిన ఉత్సాహంతో, ఆశాభావంతో ఈ కార్యక్రమాలలో పాలుపంచుకోవాలని మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈ ఆశాభావంతో, మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. అనేకానేక ధన్యవాదాలు.
***
I am delighted to be in Madhya Pradesh on National Panchayati Raj Day. Bapu always highlighted the importance of villages and spoke about 'Gram Swaraj' : PM @narendramodi https://t.co/wF0M74Yg5n pic.twitter.com/wJma6E7qh7
— PMO India (@PMOIndia) April 24, 2018
Let us reaffirm our commitment to serving our villages: PM @narendramodi https://t.co/wF0M74Yg5n
— PMO India (@PMOIndia) April 24, 2018
While talking about rural development, Budgets are important. But, there is a shift in the discourse in the last few years. People are now talking about the need to ensure that money allocated for a project is utilised and it is done in a timely as well as transparent manner: PM pic.twitter.com/QYn8OmIPzJ
— PMO India (@PMOIndia) April 24, 2018
I urge people to focus on the education of their children. This is essential for the child's future: PM @narendramodi pic.twitter.com/4DyGZ7skzz
— PMO India (@PMOIndia) April 24, 2018
Our efforts are towards self-reliance in the agriculture sector: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 24, 2018
Think about what you can do for water conservation in the villages. Every drop of water should be conserved: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 24, 2018
As public representatives working across the villages, I appeal to you to focus on Jan Dhan, Van Dhan, Gobar Dhan.
— PMO India (@PMOIndia) April 24, 2018
Ensure that people have Jan Dhan accounts and insurance coverage under the Government schemes: PM @narendramodi pic.twitter.com/fBLtUGgT6U
When our villages are transformed, India will be transformed: PM @narendramodi pic.twitter.com/MABEBrcc5Q
— PMO India (@PMOIndia) April 24, 2018
The recent steps taken by the Government will be beneficial in furthering the safety of women: PM @narendramodi in Madhya Pradesh
— PMO India (@PMOIndia) April 24, 2018