Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2019 సాధారణ ఎన్నిక‌ల‌లో ఉపయోగించేందుకు వోట‌ర్ వెరిఫ‌య‌బుల్ ఆడిట్ ట్రయల్ యూనిట్ల సేక‌ర‌ణ‌కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


వోట‌రు తాను వేసిన వోటును సరిచూసుకొనే వీలు ఉండే వోట‌ర్ వెరిఫ‌య‌బుల్ పేప‌ర్ ఆడిట్ ట్రయల్ (వివిపిఎటి) యూనిట్ల‌ను 2019 సాధారణ ఎన్నిక‌ల‌లో వాడేందుకుగాను వాటి సేకర‌ణ‌కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఎ) హైద‌రాబాద్‌లోని మెస్స‌ర్స్ ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌, బెంగ‌ళూరులోని మెస్స‌ర్స్ భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ ల నుండి 2017-18, 2018-2019 సంవ‌త్స‌రాల‌లో ఒక్కొక్క యూనిట్ ప్రాథ‌మికంగా రూ.19,650 వంతున మొత్తం రూ. 3,173.47 కోట్ల అంచ‌నా వ్య‌యంతో (ప‌న్నులు, ర‌వాణా చార్జీలు మిన‌హా) కొనుగోలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

బి) ఇందుకు సంబంధించిన ఒక్కో యూనిట్ తుది ధ‌ర‌పై మెస్స‌ర్స్ భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ , మెస్స‌ర్స్ ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ల‌తో స‌త్వ‌రం సంప్ర‌దింపులు జ‌ర‌పాల్సిందిగా సంప్ర‌దింపుల సంఘాన్ని మంత్రివర్గం ఆదేశించింది.

సి) 2017-18 సంవ‌త్స‌రానికి సంబంధించి వివిపిఎటి యూనిట్ల కొనుగోలు, ఇవిఎమ్ ల (కంట్రోల్ యూనిట్లు, బ్యాలట్ యూనిట్ల‌) కొనుగోలుకు అవ‌స‌ర‌మైన నిధుల కోసం ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.1600 కోట్ల అద‌న‌పు నిధుల‌ను అనుబంధ‌, స‌వ‌రించిన ప‌ద్దుల ద్వారా స‌మ‌కూర్చ‌నున్నారు. ఈ మొత్తంలో 40 శాతం మొత్తం త‌యారీ దారుల‌కు అడ్వాన్సుగా చెల్లించ‌డానికి, మిగిలింది 2018-19 బిఇలో సర్దుబాటు చేసేందుకు ఉద్దేశిస్తారు.

డి) వివిపిఎటి యూనిట్ల‌ను 2018 సెప్టెంబ‌ర్ నాటికి స‌మ‌కూర్చుకోవ‌ల‌సి ఉన్నందున ఈ రెండు సంస్థ‌ల త‌యారీ సామ‌ర్ధ్యాన్ని బ‌ట్టి ఎన్నిక‌ల సంఘం వీటికి ఆర్డ‌ర్లు జారీ చేస్తుంది.

కేంద్ర‌ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంవ‌ల్ల 2019 సాధారణ ఎన్నిక‌ల‌లో అన్ని పోలింగ్ కేంద్రాల‌లో వివిపిఎటి యూనిట్ల‌ను భారత ఎన్నిక‌ల సంఘం (ఇసిఐ) ఏర్పాటు చేయ‌డానికి వీలు క‌లుగుతుంది. దీన‌వ‌ల్ల వోట‌రుకు సంతృప్తికి అద‌నంగా మ‌రో పార‌ద‌ర్శ‌కమైన అంచె ఏర్ప‌డిన‌ట్లయింది. ఇది ఇవిఎమ్ ల‌పైన అప‌న‌మ్మ‌కాన్ని తొల‌గించి, ఇవిఎమ్ ల‌పై విశ్వాసాన్ని పెంచ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనితో గౌర‌వనీయ సర్వోన్నత న్యాయస్థానం 2013 అక్టోబ‌ర్ 8 న జారీ చేసిన ఆదేశాలను పాటించిన‌ట్ల కూడా అవుతుంది.

పూర్వరంగం:

భారత ఎన్నిక‌ల సంఘం (ఇసిఐ) 2010 అక్టోబ‌ర్ 4 వ తేదీన నిర్వ‌హించిన స‌మావేశంలో ‘వోట‌ర్ వెరిఫ‌య‌బుల్ పేప‌ర్ ట్రయల్’ ఆలోచనను రాజ‌కీయ పక్షాలు ముందుకు తీసుకువచ్చాయి. ఇది వోట‌ర్ల సంతృప్తికి ఒక అద‌న‌పు పార‌ద‌ర్శ‌క వ్య‌వ‌స్థ‌గా ప‌నికి వ‌స్తుందని సూచించాయి. ఇందుకు అనుగుణంగా, 2013 ఆగ‌స్టు 14న ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ నిబంధ‌న‌లు 1961ని స‌వ‌రించి వివిపిఎటిల వినియోగానికి వీలు క‌ల్పించారు. అనంత‌రం 2013లో 20,300 వివిపిఎటి యూనిట్ల‌ను ఇసిఐ కొనుగోలు చేసింది. అప్ప‌టి నుండి ఈ యూనిట్ల‌ను ఎంపిక చేసిన పార్ల‌మెంటు , శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల ఎన్నిక‌ల సంద‌ర్భంగా వాడుతూ వ‌చ్చారు. ఆ త‌రువాత 2015లో అద‌నంగా 67,000 యూనిట్ల కొనుగోలుకు ఆర్డ‌ర్లు పెట్టారు. ఇందులో 33,500 యూనిట్ల‌ను మాత్ర‌మే త‌యారీదారులు స‌ర‌ఫ‌రా చేశారు. ఈ యూనిట్ల కొనుగోలుకు అవ‌స‌ర‌మైన నిధుల‌ను ఎన్నిక‌ల సంఘం ఎప్ప‌టి క‌ప్పుడు చేస్తున్న విజ్ఞ‌ప్తుల‌కు అనుగుణంగా ప్ర‌భుత్వం స‌మ‌కూరుస్తూ వ‌స్తోంది.

వివిపిఎటి యూనిట్ బ్యాలట్ యూనిట్‌కు స‌మ‌కూర్చిన ప్రింట‌ర్ లాగా ప‌నిచేస్తుంది.దీనిని వోటింగ్ కంపార్ట‌మెంట్‌లో ఉంచుతారు. వోట‌రు తాను వోటు వేయ ద‌ల‌చుకున్న వ్య‌క్తి పేరుకు ఎదురుగా గ‌ల మీట‌ను నొక్కిన‌పుడు వివిపిఎటి యూనిట్ ఒక పేప‌ర్ స్లిప్‌ను రూపొందిస్తుంది. దీనిని బ్యాలట్ స్లిప్ అంటారు. ఈ పేప‌ర్ స్లిప్‌పై పేరు, సీరియ‌ల్ నంబ‌ర్‌, వోట‌రు వోటు చేసిన అభ్య‌ర్థి గుర్తు ఉంటాయి. వోట‌రు స్లిప్పును వోట‌రు స్క్రీన్‌పైన చూడ‌వ‌చ్చు. అయితే అది తెర‌పై ఏడు సెక‌న్లు మాత్ర‌మే క‌నిపిస్తుంది. ఆ త‌రువాత స్లిప్‌ క‌ట్ అయి ఒక సీల్డు డ‌బ్బాలో ప‌డుతుంది. ఈ ప్ర‌క్రియ‌లో వోటును ధ్రువపరచే స్లిప్పు వోట‌రు చేతిలోకి పోయే అవ‌కాశం లేదు. అలాగే దానిని ఎవ‌రూ చూడ‌లేరు.

అన్ని పోలింగ్ కేంద్రాల‌లో వివిపిఎటి యూనిట్ల‌ను వినియోగించేలా ఆదేశించాల‌ని కోరుతూ డాక్ట‌ర్ సుబ్ర‌హ్మ‌ణియన్ స్వామి సివిల్ అప్పీల్ నంబర్ 9093/2013 ను దాఖ‌లు చేశారు. ఆ పిటిష‌న్‌లో ఆయన త‌న వాద‌న‌లు వినిపిస్తూ, ఎల‌క్ట్రానిక్ వోటింగ్ యంత్రాలు విశ్వ‌స‌నీయ‌మైన‌వి కావ‌ంటూ, వోటరు తాను ఎవ‌రికి వోటు వేసిందీ స‌క్ర‌మంగా న‌మోదు అయినట్లు ధ్రువీక‌రించే ఇత‌ర విశ్వ‌స‌నీయ‌మైన ఏర్పాటు ఏదైనా ఉండాల‌ని కోరారు. పిటిష‌న‌ర్ వాద‌న‌ల‌పై ఎన్నిక‌ల సంఘం త‌న స‌మాధానాన్ని తెలియ‌జేస్తూ, ఎన్నిక‌లు స్వేచ్ఛ‌గా, నిష్ఫాక్షికంగా నిర్వ‌హించేందుకు వివిపిఎటి యూనిట్ల‌ను ఏర్పాటు చేసేందుకు త‌మ‌కు అభ్యంత‌రం ఏమీ లేద‌ని పేర్కొంది. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం 2013 అక్టోబ‌ర్ 8న ఆదేశాలు జారీ చేస్తూ వివిపిఎటి యూనిట్లను ద‌శ‌ల‌వారీగా ఏర్పాటు చేయాల‌ని, ఇందుకు అవ‌స‌ర‌మైన వివిపిఎటి యూనిట్ల‌ను సేక‌రించేందుకు ఎన్నిక‌ల సంఘానికి అవ‌స‌ర‌మైన నిధులను ప్ర‌భుత్వం స‌మ‌కూర్చ‌వ‌చ్చ‌ని పేర్కొంది.

****