పిఎంఇండియా
ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ ఆరు నెలల్లో ‘మన్ కీ బాత్’ లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్‌కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఇటీవల నాకు లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ నౌకలను భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీ వరకు ప్రతి పనీ స్వదేశీయులే చేశారు.
మిత్రులారా! దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం సి-295. ఈ సి-295 విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాలను భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది ఎంఎస్ఎంఈ, ఏరోస్పేస్ రంగానికి కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఆత్మనిర్భర భారత్ కోసం సంకల్పం కూడా బలపడుతోంది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ- డి.ఆర్.డి.ఓ.- స్వదేశీ ‘లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్’ను కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని డి.ఆర్.డి.ఓ. ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈ రోజు మన భారతదేశం సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది.
మిత్రులారా! భారతదేశ ప్రయత్నాలలో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్‌లోనే జరిగింది. ఆ కార్యక్రమమే ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాలలో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాలలో జరిగిన యోగా కార్యక్రమాలలో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్‌లో జరిగిన ‘ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్’ కూడా ఎంతో చర్చనీయాంశమైంది. భారతదేశం 102 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 114 పతకాలను గెలుచుకుంది. ఈ ఛాంపియన్‌షిప్‌లో పతకాల పట్టికలో భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఛాంపియన్ షిప్ లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా! ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తీ వారిని ఆ లక్ష్యం నుండి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజా భాగస్వామ్యమనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజా భాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తోంది.
మిత్రులారా! పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు- కొంతకాలం పాటు బంగారం కొనడం మానుకోవాలని కోరాను. ప్రజలు విహారయాత్రలకోసం విదేశాలకు వెళ్లడం మానుకోవాలని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలని కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేశాను. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాలను కాపాడుకోవాలని, సాధ్యమైనంత వరకు సహజ ఎరువులను ఉపయోగించాలని నేను కోరాను. మిత్రులారా! నా విజ్ఞప్తికి మద్దతు ఇవ్వడమే కాకుండా అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను కృతజ్ఞుడిని. చాలా కుటుంబాలు తమ అనుభవాలను పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వారు పాత బంగారాన్ని పునర్వినియోగించి కొత్త ఆభరణాలు తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాలను తాము ఎలా వాయిదా వేసుకున్నామో చాలా మంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
మిత్రులారా! కార్ పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాలను పంచుకున్నారు. ప్రతిరోజూ తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణిస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు, మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మిత్రులారా! భారతీయులందరం ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఈ ప్రజా భాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి, విజయం సాధించేలా చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! మన దేశంలో పుట్టినరోజులు, పెళ్లిళ్లు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకోవాలని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తారు. మిత్రులారా! మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవడానికి చేసిన పని చర్చనీయాంశంగా మారింది. పేఠ్కర్ కుటుంబం నాందేడ్‌లోని బహదూర్‌పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలని ఈ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఈ కుటుంబం గ్రామంలోని సుమారు మూడున్నర వేల మందికి ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయల బీమా కవరేజీని అందించారు. ఈ చొరవ వెనుక ఉన్న భావన చాలా హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడాన్ని ఆ కుటుంబం చూసింది. అటువంటి సమయాల్లో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది.
మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో- అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో- 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటివరకు 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీరిలో సుమారు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు ఉన్నారు. మహిళలున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటివరకు 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి.
మిత్రులారా! ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) కూడా అంతే ముఖ్యమైనది. ఈ పథకం ఒక వ్యక్తి విషాదకరంగా మరణించిన సందర్భంలో వారి కుటుంబానికి 2 లక్షల రూపాయల బీమా కవరేజీని అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం ఒకటిన్నర రూపాయలు మాత్రమే. ఇప్పటివరకు 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా సుమారు 11 లక్షల కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువులను కొనసాగించడానికి సహాయం పొందింది. ఇంకొకచోట ఒక భార్య ఇంటి బాధ్యతలను నిర్వహించడంలో సహకారం పొందింది. మిత్రులారా! కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ప్రారంభం కావచ్చు. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పును తీసుకురాగలదు. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలని నేను కోరుతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! ‘మన్ కీ బాత్’లో మనం ఇప్పుడు వేల సంవత్సరాల పురాతనమైన, మానవ సమాజంలో వేల సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశం గురించి చర్చిద్దాం. ఈ అంశం మూఢనమ్మకం గురించినది. మూఢనమ్మకం తరచుగా కేవలం ఒక అపోహ మాత్రమే కాదు. అది భయాన్ని సృష్టిస్తుంది. భయం మనసును ఆవరించినప్పుడు ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తర్కించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా, చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. అదే సమయంలో సమాజంలో విజ్ఞానశాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాలను సవాలు చేసేవారు కూడా ఉన్నారు. మూఢనమ్మకం నుండి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం సులభం కాదు. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను.
మిత్రులారా1 అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. దాని పేరు ‘హర్గిలా’. ‘హర్గిలా’ ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాలలో దీనిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీనిని చూడటానికి ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికివేసేవారు. ఊహించండి… పర్యావరణాన్ని శుభ్రపరిచే హర్గిలా పక్షే ప్రజల భయానికి బలి అయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమా దేవి బర్మన్ దీనిని చూశారు. ప్రజల మనసుల్లో పాతుకుపోయిన అపోహలను దూరం చేయాలని ఆమె సంకల్పించారు. ఆమె మహిళలతో మాట్లాడి, వాటిని శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ప్రారంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హర్గిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకు వచ్చారు—ఈ రోజు వారిని “హర్గిలా సైన్యం” అని పిలుస్తున్నారు. ఈ మహిళలు సమాజంతో పోరాడారు. సమాజానికి అవగాహన కల్పించడానికి, మూఢనమ్మకాలను తొలగించడానికి రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు, తరతరాల ఆలోచనా విధానం కూడా మారగలదని వారు నిరూపించారు.
మిత్రులారా1 నేను తరచుగా చెప్తుంటాను. ఆడుకునేవారే వికసిస్తారు. ఈ రోజు దేశంలో ఆడుకుంటూ, అభివృద్ధి చెందుతున్న యువత సంఖ్య వేగంగా పెరుగుతోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత క్రీడలను వృత్తిగా ఎంచుకుంటోంది. నాగాలాండ్‌లో రెండు చాలా ఆసక్తికరమైన కార్యక్రమాల గురించి నాకు తెలిసింది.
వాటిలో మొదటిది ‘నాగాలాండ్ బేబీ లీగ్’. ఈ పేరు వింటే ఇది చాలా చిన్న పిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అని అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు. ఇది 5 నుండి 10-12 సంవత్సరాల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్‌బాల్ ఆడే పిల్లల వేగం, ప్రతిభలకు ఇది స్ఫూర్తినిస్తుంది. అంతే కాకుండా వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్‌లో వీలైనంత ఎక్కువ మంది పిల్లలను ఫుట్‌బాల్‌తో అనుసంధానించడానికి దీనిని ప్రారంభించారు. ఐదు నుండి పన్నెండు సంవత్సరాల మధ్య వయస్సున్న అబ్బాయిలు, అమ్మాయిలు ఇందులో పాల్గొనవచ్చు. ఈ లీగ్ ఇప్పుడు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది పిల్లల మనసులపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది.
మిత్రులారా! నాగాలాండ్‌లో మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు ‘నాగాలాండ్ ఉమెన్ ఫుట్సల్ లీగ్’. బహుశా ‘ఫుట్సల్’ అనే పేరు మీకు కొత్తగా ఉండవచ్చు. ఫుట్సల్ను ఇండోర్ ఫుట్‌బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్‌బాల్ మైదానం కంటే చాలా చిన్నదిగా ఉంటుంది. దీని కోసం క్రీడాకారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలి. వారి సాంకేతికత, నైపుణ్యాలను ఉత్తమంగా ఉపయోగించుకోవాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సల్ లీగ్ మన అమ్మాయిలకు వారి ప్రతిభను ప్రదర్శించడానికి ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ఇటువంటి కార్యక్రమాలను చేపట్టిన నాగాలాండ్ ప్రజలను నేను అభినందిస్తున్నాను. ఇటువంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి.
మిత్రులారా! ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజూ కొత్త పరిశోధనలు జరుగుతున్నాయి. కొత్త ఏఐ ఆవిష్కరణలు ఆవిర్భవిస్తున్నాయి. ఈ యుగంలో ఒక కీలకమైన ప్రశ్న తలెత్తుతుంది: మనం ప్రజల సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో ముందుకు సాగుతూనే మన మూలాలతో ఎలా అనుసంధానమై ఉండాలి? నలంద విశ్వవిద్యాలయం ఈ ప్రశ్నలకు పరిష్కారాలను కనుగొంది. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారతదేశ భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. రెండు సంవత్సరాల కిందట నలంద విశ్వవిద్యాలయ కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన శాస్త్రార్థ సంప్రదాయానికి పునరుజ్జీవం కల్పించింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాలను వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు. అది చర్చ, సంప్రదింపుల ఒక క్రమబద్ధమైన ప్రక్రియ. ఇందులో అభిప్రాయాలను తర్కం, వాస్తవాలతో వ్యక్తపరచడం చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియ ఇతరుల అభిప్రాయాలను ఓపికగా విని, అర్థం చేసుకోవడాన్ని కూడా మనకు నేర్పుతుంది. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తన స్నాతకోత్సవంలో భాగంగా చేర్చింది. ఇందులో పాల్గొన్న విద్యార్థులలో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారు. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ప్రశంసనీయం. ఈ విషయంలో నేను నలంద విశ్వవిద్యాలయాన్ని అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇటువంటి కార్యక్రమాలను చేపట్టాలని నేను కోరుతున్నాను.
మిత్రులారా! యువతను వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేసేందుకు మరో మంచి ప్రయత్నం జరుగుతోంది. ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్‌లో బి.టెక్. కోర్సును ప్రారంభిస్తోంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. మన ప్రాచీన గ్రంథాలను, తాళపత్రాలను డిజిటల్‌గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ కృషి చేసిన కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా! నేడు భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, సంగీతం, ఆధ్యాత్మికతలను నేర్చుకుంటూ, స్వీకరిస్తున్నారు. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో కరీబియన్ సముద్రంలో డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం ఉంది. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు వంద. బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ అక్కడ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని ‘బ్రహ్మకమల్ డొమినికానా’ అని పిలుస్తారు. ఆ బృంద సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వారు వేద మంత్రాలను ఉచ్చరించడం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు. కానీ ఆడియో రికార్డింగులను వినడం ద్వారా వేద మంత్రాల సరైన ఉచ్చారణను నేర్చుకున్నారు. ఈ రోజు వారు అనేక మంత్రాలను చాలా చక్కగా జపించగలుగుతున్నారు. వీటిలో పురుష సూక్తం, శ్రీ సూక్తం, శ్రీ రుద్రం, దుర్గా సూక్తం , దేవీ మహాత్యం ఉన్నాయి. భారతదేశానికి ఇంత దూరంగా నివసిస్తూ మన సంప్రదాయాలను నేర్చుకోవడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు నిజంగా స్ఫూర్తిదాయకం. “బ్రహ్మకమల్ డొమినికానా” సభ్యులందరి ప్రయత్నాలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నాను. వీటిలో పురుష సూక్తం, శ్రీ సూక్తం, శ్రీ రుద్రం, దుర్గా సూక్తం, దేవీ మాహాత్మ్యం ఉన్నాయి. భారతదేశానికి ఇంత దూరంగా నివసిస్తూ మన సంప్రదాయాలను నేర్చుకోవడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు నిజంగా స్ఫూర్తిదాయకం. ‘బ్రహ్మకమల్ డొమినికానా’ సభ్యులందరి ప్రయత్నాలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! మేఘాలయ మేఘాలకు, అందమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. మేఘాలయను సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ, మేఘాలయకు మరో ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేను ఈ రోజు ‘మన్ కీ బాత్’ లో మీతో చర్చించాలనుకుంటున్నాను. అదే మేఘాలయలోని రూట్ బ్రిడ్జి. మార్గం చూపించే ‘రూట్’ (route) కాదు. చెట్ల వేర్ల ‘రూట్’ (root). ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తికరమైనది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో, సంవత్సరాల్లోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందడానికి దశాబ్దాలు పడుతుంది. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగులను దాటుతూ, వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను ప్రతిబింబిస్తాయి. అవి సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాలను సృష్టించగలరో ఈ వంతెనలు నిరూపిస్తాయి. అవి మన దేశానికి, ఈ భూమికి వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్‌వర్క్‌లో చేర్చడానికి భారతదేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది.
మిత్రులారా! వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను స్వీకరించారు. గతంలో ఇటువంటి వంతెనల సంఖ్యను నిర్ధారించడం కూడా కష్టంగా ఉండేది. స్థానిక ప్రజలు స్వయంగా వాటిని లెక్కించడం ప్రారంభించారు. ఆ తర్వాత ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలు చేపట్టాయి. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనలను సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాలను బలోపేతం చేయడానికి నర్సరీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థ రూపొందింది. మీరు గమనించే ఉంటారు- ఈ సంవత్సరం హైలీ వార్ గారికి పద్మ పురస్కారం లభించింది. ఆయన తన జీవితంలోని 50 సంవత్సరాలకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణకు అంకితం చేశారు. ఆయన అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా! మీరు ఎప్పుడైనా ఈ వేర్ల వంతెనలను సందర్శించి ఉంటే దయచేసి వాటి ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. మీ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వం గురించి తెలుసుకోవడానికి ఇతరులను ప్రేరేపిస్తాయి.
నా ప్రియమైన దేశవాసులారా! మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని, మన నగరాలు అందంగా కనిపించాలని మనమందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలనే విషయాన్ని మనం అరుదుగా ఆలోచిస్తాం. చాలా మంది ఇది వేరొకరి బాధ్యత అని, వారే శుభ్రం చేస్తారని అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో మనకు స్ఫూర్తినిస్తారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు లభించింది. వారు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని నిశ్చయించుకున్నారు. వేరేవాళ్ళు ఎవరైనా మార్పు తీసుకువస్తారని వారు ఆశించలేదు. వారు నగరం నలుమూలల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను, ఖాళీ సీసాలను సేకరించడం ప్రారంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్‌ను ఎకో-బ్రిక్స్‌గా మార్చడం మొదలైంది. ఈనాడు ఈ ఎకో-బ్రిక్స్‌ను బహిరంగ ప్రదేశాలను సుందరీకరించేందుకు ఉపయోగిస్తున్నారు. రాజ్‌గఢ్‌లో గత కొన్ని నెలల్లో వందలాది కిలోల ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసి, మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. మరో మాటలో చెప్పాలంటే ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టిక్ ఇప్పుడు ఈ సోదరీమణుల కృషి ఫలితంగా నగర సౌందర్యానికి దోహదపడుతోంది. బ్యావరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! ఒక నిర్దిష్ట అంశంపై చర్చ జరపాలని సూచిస్తూ చాలా మంది నాకు లేఖలు రాశారు. ఈ అంశం గణేష్ ఉత్సవానికి సంబంధించినది. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఈ అంశంపై ఇప్పుడే చర్చ జరగాలని ప్రజలు కోరారు. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ప్రారంభమవుతుంది. విగ్రహాలు తయారుచేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమైన వారు ఇప్పటి నుంచే చురుకుగా ఉంటారు. అందువల్ల, మీ అందరికీ నాదొక విజ్ఞప్తి: దయచేసి మీ ఇల్లు, సొసైటీ లేదా చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో, మన కుమ్మరులు, స్థానిక కళాకారులు రూపొందించినదేనని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారుచేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేనితో, ఏ దేశంలో తయారు చేయబడిందో తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలను నివారించండి. మిత్రులారా! పూజ తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయి. ఇది మన నదులను, చెరువులను, పర్యావరణాన్ని కాపాడుతుంది. దీనివల్ల మన విశ్వాసం చెక్కుచెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుండి విగ్రహాలను కొనుగోలు చేసినప్పుడు ‘స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత’ అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం. ఈసారి గణేష్ ఉత్సవం లోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇటువంటి అన్ని విషయాలపై దృష్టి పెట్టాలి. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు తీసుకుంటారని నేను దృఢంగా నమ్ముతున్నాను.
మిత్రులారా! మన దేశపు గొప్ప బలం మన ప్రజలలోనే ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న చిన్న, పెద్ద ప్రయత్నాలు మనకు ఎంతో నేర్పిస్తాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉన్నప్పుడు ఎలాంటి పెద్ద మార్పునైనా తీసుకురావచ్చని ఈ ప్రయత్నాలు చూపిస్తున్నాయి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల గురించి నాకు తెలియజేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, సూచనలు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవవచ్చు. మనం వచ్చే నెలలో మళ్ళీ కలుద్దాం. మన దేశ ప్రజలు చేస్తున్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చిద్దాం. అప్పటి వరకు మీరు, మీ కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలి. అవును! నీటి సంరక్షణ తప్పనిసరి. మనం వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేయాలి. ఈ ‘వర్షాన్ని పట్టుకోండి’- ‘క్యాచ్ ద రెయిన్’ అనే ప్రచారం ఏమాత్రం సడలడానికి అనుమతించకూడదు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటంటే మనమందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేయాలి. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
***
#MannKiBaat has begun. Do hear! https://t.co/KxXEVbfnmI
— PMO India (@PMOIndia) June 28, 2026
This month, India has witnessed several achievements that make every citizen proud. These achievements have further strengthened India's journey towards self-reliance.#MannKiBaat pic.twitter.com/CkEa0CiFJP
— PMO India (@PMOIndia) June 28, 2026
International Day of Yoga once again united people across the world.
— PMO India (@PMOIndia) June 28, 2026
India's outstanding performance at the World Yogasana Championship made the occasion even more special.#MannKiBaat pic.twitter.com/mXUX9W5Bv4
A thoughtful gesture by a family in Maharashtra...#MannKiBaat pic.twitter.com/1uZiS2eOrC
— PMO India (@PMOIndia) June 28, 2026
Affordable social security schemes are providing families across India with financial protection and support during times of need.#MannKiBaat pic.twitter.com/2KXB40ITwN
— PMO India (@PMOIndia) June 28, 2026
An inspiring community-led movement in Assam has shown how awareness and collective effort can transform mindsets and protect nature.#MannKiBaat pic.twitter.com/6aIkb7Clpu
— PMO India (@PMOIndia) June 28, 2026
Grassroots sporting initiatives are empowering young talent... Here are two commendable efforts from Nagaland.#MannKiBaat pic.twitter.com/2F25YC5sQW
— PMO India (@PMOIndia) June 28, 2026
Nalanda University is making a commendable effort to connect India's ancient tradition of 'Shaastraarth' with the needs of the modern world.#MannKiBaat pic.twitter.com/1Sibd2DDSI
— PMO India (@PMOIndia) June 28, 2026
A noteworthy initiative by the Central Sanskrit University...#MannKiBaat pic.twitter.com/fzcMD7sOiL
— PMO India (@PMOIndia) June 28, 2026
A remarkable initiative in the Dominican Republic reflects the growing global appeal of India's culture and traditions.#MannKiBaat pic.twitter.com/if4tZ3YWkX
— PMO India (@PMOIndia) June 28, 2026
Meghalaya's root bridges are a remarkable example of harmony between people and nature. #MannKiBaat pic.twitter.com/bpvT4lR3rG
— PMO India (@PMOIndia) June 28, 2026
An inspiring initiative by women in Madhya Pradesh is transforming plastic waste into eco-bricks. #MannKiBaat pic.twitter.com/w7RmFnq4Xe
— PMO India (@PMOIndia) June 28, 2026
This Ganesh Utsav, let us choose eco-friendly clay idols crafted by local artisans.#MannKiBaat pic.twitter.com/ct7pYNrER6
— PMO India (@PMOIndia) June 28, 2026