పిఎంఇండియా
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. అభినందనలు. దేశ విజయాలను, దేశ పౌరుల సాఫల్యాలను ప్రస్తావించేందుకు ‘మన్ కీ బాత్’ ఒక శక్తిమంతమైన వేదిక. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా దేశం అలాంటి విజయాన్ని చవిచూసింది. అనేక దేశాల నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, స్టార్ట్-అప్ రంగంతో సంబంధం ఉన్నవారు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం భారత్ మండపంలో సమావేశమయ్యారు. కృత్రిమ మేధా శక్తిని భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉపయోగించుకుంటుందో చెప్పడానికి ఈ సమ్మేళనాన్ని ఒక కీలక మైలురాయిగా చెప్పవచ్చు.
మిత్రులారా! ఈ సమ్మేళనంలో ప్రపంచ దేశాల నాయకులు, సాంకేతిక సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో సమావేశమయ్యే అవకాశం నాకు లభించింది. ఏఐ సమ్మిట్ ఎగ్జిబిషన్‌లో ప్రపంచ నాయకులకు నేను చాలా విషయాలు చూపించాను. నేను ముఖ్యంగా రెండు విషయాలను ప్రస్తావించాలనుకుంటున్నాను. ఈ రెండు ఉత్పత్తులు సమ్మిట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులను బాగా ఆకట్టుకున్నాయి. మొదటి ఉత్పత్తిని అమూల్ సంస్థ ప్రదర్శించింది. జంతువుల ఆరోగ్య పరిరక్షణలో కృత్రిమ మేధ మనకు ఎలా సహాయపడుతుందనే విషయాన్ని ఇందులో వివరించారు. ప్రతిరోజూ నిరంతరం కృత్రిమ మేధ సహాయంతో రైతులు వారి డైరీ లెక్కలను, జంతువుల గణనను ఎలా సరి చూస్తారో ఇందులో పేర్కొన్నారు.
మిత్రులారా! రెండవ ఉత్పత్తి మన సంస్కృతికి సంబంధించింది. మన పురాతన గ్రంథాలను, మన పురాతన జ్ఞానాన్ని, మన లిఖిత ప్రతులను కృత్రిమ మేధ సహాయంతో సంరక్షిస్తున్న తీరును, నేటి తరానికి అనుగుణంగా వాటిని మారుస్తున్న విధానాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు ఆశ్చర్యపోయారు.
మిత్రులారా! ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా శుశ్రుత సంహితను ప్రదర్శనకు ఉంచారు. సాంకేతికత సహాయంతో మనం లిఖితప్రతుల ఇమేజీల నాణ్యతను మెరుగుపరుస్తూ, వాటిని చదవగలిగేలా చేస్తున్న విధానాన్ని మొదటి దశలో చూపించారు. రెండవ దశలో ఈ చిత్రాన్ని యంత్రం చదవగలిగే వచనంగా మార్చారు. తదుపరి దశలో యంత్రం-చదవగలిగే వచనాన్ని ఏఐ అవతార్ ద్వారా చదివించారు. ఆ తర్వాతి దశలో సాంకేతికత సహాయంతో ఈ విలువైన భారతీయ జ్ఞానాన్ని భారతీయ, విదేశీ భాషలలోకి ఎలా అనువదించవచ్చో కూడా మనం ప్రదర్శించాం. ఆధునిక అవతార్ ద్వారా భారతదేశ పురాతన జ్ఞానం గురించి తెలుసుకోవడానికి ప్రపంచ నాయకులు చాలా ఆసక్తిని చూపించారు.
మిత్రులారా! ఈ శిఖరాగ్ర సమ్మేళనంలో కృత్రిమమేధా రంగంలో భారతదేశ అద్భుతమైన సామర్థ్యాలను ప్రపంచం దర్శించింది. ఈ సందర్భంగా భారతదేశం మూడు మేడ్ ఇన్ ఇండియా ఏఐ మోడళ్లను కూడా ప్రారంభించింది. ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఏఐ శిఖరాగ్ర సమ్మేళనం. ఈ శిఖరాగ్ర సమ్మేళనం పట్ల యువత ఉత్సాహం, ఆసక్తి స్పష్టంగా కనిపించాయి. ఈ శిఖరాగ్ర సమ్మేళనం విజయవంతం అయినందుకు నా దేశవాసులందరినీ నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా! ‘ఆడేవారు వికసిస్తారు’ అని నేను తరచుగా చెప్తూ ఉంటాను. క్రీడలు మనల్ని ఏకం చేస్తాయి. ఈ రోజుల్లో మీరు టి-20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను చూస్తూ ఉంటారు. మ్యాచ్‌లను చూస్తున్నప్పుడు మీ కళ్లు తరచుగా ఒక ఆటగాడి వైపు ఆకర్షితమై ఉంటాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వారు ధరించిన జెర్సీ వేరే దేశానికి చెందినది కావచ్చు. కానీ ఆ పేరు వినగానే “ఆ క్రీడాకారుడు మన దేశానికి చెందినవాడే” అని మీరు భావిస్తారు. అప్పుడు హృదయం ఒక చిన్న ఆనందంతో నిండిపోతుంది. ఎందుకంటే ఆ క్రీడాకారులు భారతీయ సంతతికి చెందినవారు. వారి కుటుంబం స్థిరపడిన దేశం కోసం ఆడుతున్నారు. వారు తమ తమ దేశాల జెర్సీని ధరించి మైదానంలోకి ప్రవేశిస్తారు. హృదయపూర్వకంగా ఆ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. కెనడా జట్టులో అత్యధిక సంఖ్యలో భారత సంతతికి చెందిన ఆటగాళ్ళు ఉన్నారు. జట్టు కెప్టెన్ దిల్‌ప్రీత్ బాజ్వా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో జన్మించారు. నవనీత్ ధలివాల్ చండీగఢ్ కు చెందినవారు. ఈ జాబితాలో హర్ష్ ఠాకర్, శ్రేయస్ మోవా వంటి వారు ఉన్నారు. వీరు కెనడా, భారతదేశం- రెండింటికీ గర్వకారణం. అమెరికన్ జట్టులో చాలా మంది భారత దేశీయ క్రికెట్ నుండి ఎదిగారు. అమెరికన్ జట్టు కెప్టెన్ మోనాంక్ పటేల్ గుజరాత్ అండర్-16, అండర్-18 జట్లకు కూడా ఆడారు. ముంబాయికి చెందిన సౌరభ్, హర్మీత్ సింగ్, ఢిల్లీకి చెందిన మిలింద్ కుమార్ – అందరూ అమెరికన్ జట్టుకు గర్వకారణం. నేడు ఒమన్ జట్టులో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ఆడిన చాలా మంది ఆటగాళ్లున్నారు. జతీందర్ సింగ్, వినాయక్ శుక్లా, కరణ్, జయ్, ఆశిష్ వంటి ఆటగాళ్ళు ఒమన్ క్రికెట్‌కు బలమైన స్తంభాలు. న్యూజిలాండ్, యుఎఇ, ఇటలీ జట్లలో కూడా భారత సంతతికి చెందిన ఆటగాళ్ళు తమ ముద్ర వేస్తున్నారు. తమ దేశానికి గర్వకారణంగా నిలుస్తూ, అక్కడి యువతకు ప్రేరణగా మారుతున్న అనేక మంది భారత సంతతికి చెందిన ఆటగాళ్ళు ఉన్నారు. ఇదే భారతీయత సారాంశం. భారతీయులు ఎక్కడికి వెళ్లినా వారు తమ మాతృభూమి మూలాలతో అనుసంధానమై ఉంటారు. వారు తమ పని ప్రదేశమైన తాము నివసించే దేశం అభివృద్ధికి కూడా దోహదపడతారు.
నా ప్రియమైన దేశప్రజలారా! ఏ తల్లిదండ్రులకైనా తమ బిడ్డను కోల్పోవడం కంటే గొప్ప దుఃఖం లేదు. చిన్న బిడ్డను కోల్పోవడం వల్ల కలిగే బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. కొన్ని రోజుల కిందట కేరళకు చెందిన ఆలిన్ షెరిన్ అబ్రహాం అనే చిన్న పాపను మనం కోల్పోయాం. ఆ పాప కేవలం 10 నెలల వయసులోనే మరణించింది. ఊహించుకోండి – ఆమె ముందు మొత్తం ఎంతో భవిష్యత్ జీవితం ఉంది. ఆ జీవితమంతా అకస్మాత్తుగా ముగిసిపోయింది. చాలా కలలు, ఆనందాలు నెరవేరలేదు. ఆమె తల్లిదండ్రులు అనుభవిస్తున్న బాధ మాటల్లో చెప్పలేనిది. కానీ ఇంత తీవ్రమైన బాధ మధ్య కూడా ఆలిన్ తండ్రి అరుణ్ అబ్రహం, తల్లి షెరిన్ ప్రతి పౌరుడి హృదయాన్ని గర్వంతో నింపే నిర్ణయం తీసుకున్నారు. వారు ఆలిన్ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఒక్క నిర్ణయం వారి లోతైన దృష్టిని, వారి విశాల వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది. ఒకవైపు వారు తమ కుమార్తెను కోల్పోయినందుకు దుఃఖిస్తున్నారు. అదే సమయంలో ఇతరులకు సహాయం చేయాలనే గొప్ప భావనతో కూడా వారు నిండిపోయారు. ఏ కుటుంబం కూడా ఇలాంటి విధిని ఎదుర్కోకూడదని వారు కోరుకున్నారు. ఆలిన్ షెరిన్ అబ్రహాం ఇప్పుడు మన మధ్య లేదు. కానీ ఆమె పేరు దేశంలోని అతి పిన్న వయస్కులైన అవయవ దాతల జాబితాలో చేరింది. మిత్రులారా! ఈ రోజుల్లో భారతదేశంలో అవయవ దానం గురించి అవగాహన క్రమంగా పెరుగుతోంది. ఇది అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తోంది. వైద్య పరిశోధనలను కూడా ఇది బలోపేతం చేస్తోంది. భారతదేశంలో ఈ దిశలో అసాధారణమైన పని చేస్తున్న అనేక సంస్థలున్నాయి. ఎందరో వ్యక్తులు కూడా ఉన్నారు.
అవయవ దానం ద్వారా ఇతరులకు రెండవ జీవితాన్ని ఇచ్చిన కేరళకు చెందిన ఆలిన్ లాంటి చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు ఢిల్లీకి చెందిన లక్ష్మీ దేవి గత సంవత్సరం కేదార్‌నాథ్‌కు 14 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి ప్రయాణించారు. గుండె మార్పిడి తర్వాత ఆమె ఈ ప్రయాణం చేశారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆమె గుండె కేవలం 15 శాతం మాత్రమే పనిచేస్తోంది. మరణించిన దాత నుండి ఆమెకు గుండె వచ్చింది. ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన గౌరంగ్ బెనర్జీ సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉన్న నాథులాకు రెండుసార్లు వెళ్ళారు. ఊపిరితిత్తుల మార్పిడి తర్వాత ఈ ఘనతను సాధించారు. రాజస్థాన్‌లోని సీకర్‌కు చెందిన రామ్‌దేవ్ సింగ్ కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. నేడు ఆయన క్రీడా కార్యకలాపాలలో రాణిస్తున్నారు. మిత్రులారా! మీకు ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు చాలా కనిపిస్తాయి. ఒక వ్యక్తి చేసే గొప్ప పని లెక్కలేనంత మంది జీవితాలను మార్చగలదని ఇది మరోసారి రుజువు చేస్తుంది. అటువంటి గొప్ప పనులను చేపట్టిన వారందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! స్వాతంత్ర్య అమృత మహోత్సవం సందర్భంగా నేను ఎర్రకోట నుండి ఐదు ప్రాణశక్తుల గురించి మాట్లాడాను. వాటిలో ఒకటి బానిస మనస్తత్వం నుండి విముక్తి. నేడు దేశం బానిసత్వ చిహ్నాలను వదిలి భారతీయ సంస్కృతికి సంబంధించిన వాటికి విలువ ఇవ్వడం ప్రారంభించింది. మన రాష్ట్రపతి భవన్ కూడా ఈ దిశలో ఒక ముఖ్యమైన అడుగు వేసింది. రేపు- ఫిబ్రవరి 23వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో ‘రాజాజీ ఉత్సవ్’ జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ కేంద్రీయ ప్రాంగణంలో సి. రాజగోపాలాచారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రాజగోపాలాచారి స్వతంత్ర భారతదేశానికి తొలి భారతీయ గవర్నర్ జనరల్. అధికారాన్ని ఒక పదవిగా కాకుండా సేవగా భావించిన వారిలో ఆయన ఒకరు. ప్రజా జీవితంలో ఆయన ఆచరణ, ఆత్మ సంయమనం, స్వతంత్ర చింతన నేటికీ మనకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. దురదృష్టవశాత్తూ స్వాతంత్ర్యం తర్వాత కూడా బ్రిటిష్ పరిపాలకుల విగ్రహాలను రాష్ట్రపతి భవన్‌లో ఉంచడానికి అనుమతించారు. కానీ ఎంతో గొప్పవారైన దేశపుత్రుల విగ్రహాలకు స్థానం ఇవ్వలేదు. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుట్యెన్స్ విగ్రహాన్ని కూడా రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ విగ్రహం స్థానంలో రాజాజీ విగ్రహం ఉంటుంది. రాజాజీ ఉత్సవ్ సందర్భంగా రాజగోపాలాచారిపై ప్రదర్శన కూడా జరుగుతుంది. ఈ ప్రదర్శన ఫిబ్రవరి 24వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు జరుగుతుంది. మీకు అవకాశం ఉంటే దయచేసి దీన్ని సందర్శించండి.
నా ప్రియమైన దేశప్రజలారా! డిజిటల్ అరెస్ట్ గురించి నేను గతంలో ‘మన్ కీ బాత్’లో మీతో వివరంగా మాట్లాడాను. దీని తర్వాత డిజిటల్ అరెస్ట్, డిజిటల్ మోసాలపై మన సమాజంలో చాలా అవగాహన వచ్చింది. అయితే ఇటువంటి సంఘటనలు ఇప్పటికీ మన చుట్టూ జరుగుతున్నాయి. ఇవి క్షమించరానివి. డిజిటల్ అరెస్టుకు, ఆర్థిక మోసానికి అమాయకులు గురవుతున్నారు. చాలా సార్లు సీనియర్ సిటిజన్ల జీవిత కాల పొదుపు మొత్తాన్ని కూడా మోసంతో తీసుకున్నట్టు వెల్లడైంది. కొన్నిసార్లు కొందరు తమ పిల్లల ఫీజులు చెల్లించడానికి ఆదా చేసిన డబ్బును మోసగాళ్లు మాయం చేస్తారు. వ్యాపారవేత్తలు కూడా మోసాలకు గురయినట్టు మనం చూస్తున్నాం. ఎవరో ఫోన్ చేసి “నేను సీనియర్ అధికారిని. మీరు కొన్ని వివరాలను పంచుకోవాలి” అని అంటారు. దీని తర్వాత అమాయకులు అలాగే వివరాలను పంచుకుంటారు. అందుకే అప్రమత్తంగా, అవగాహనతో ఉండటం చాలా ముఖ్యం.
మిత్రులారా! ‘కేవైసీ- నో యువర్ కస్టమర్- మీ వినియోగదారు గురించి తెలుసుకోండి’ ప్రక్రియ గురించి మీ అందరికీ తెలిసి ఉండవచ్చు మీ కేవైసీ లేదా రీ- కేవైసీని అప్‌డేట్ చేయమని కొన్నిసార్లు మీ బ్యాంక్ నుండి సందేశాలు రావచ్చు. అప్పుడు “నేను ఇప్పటికే కేవైసీ చేశాను. మళ్ళీ ఎందుకు?” అనే ప్రశ్న మీ మనసులో తలెత్తుతుంది. అలాంటప్పుడు చింతించవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇది మీ డబ్బు భద్రత కోసమే. ఈ రోజుల్లో పెన్షన్, సబ్సిడీ, భీమా, యూపీఐ -ప్రతిదీ బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉందని మనందరికీ తెలుసు. అందుకే మీ బ్యాంక్ ఖాతా సురక్షితంగా ఉండేలా బ్యాంకులు ఎప్పటికప్పుడు తిరిగి- కేవైసీ నిర్వహిస్తాయి. అవును.. ఇక్కడ కూడా మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. నేరస్థులు నకిలీ కాల్స్ చేస్తారు. ఎస్ ఎం ఎస్, లింకులను పంపుతారు. అందుకే మనం అప్రమత్తంగా ఉండాలి. అలాంటి మోసగాళ్ల బారిన పడకూడదు. మీ కేవైసీ లేదా రీ- కేవైసీని మీ బ్యాంక్ శాఖ లేదా అధికారిక యాప్, అధీకృత మాధ్యమం ద్వారా మాత్రమే చేయించుకోండి. మీ ఓటీపీ, ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. ముఖ్యంగా మీ పాస్‌వర్డ్‌ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి. ప్రతి సీజన్‌తో ఆహారం, దుస్తులు మారుతున్నట్లే, ప్రతి కొన్ని రోజులకు మీ పాస్‌వర్డ్‌ను మార్చడమనే ఒక నియమాన్ని చేసుకోండి.
మిత్రులారా!ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అంశాలపై ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాన్ని నిర్వహించింది. ఈ ఆర్థిక అక్షరాస్యత ప్రచారం ఇప్పుడు సంవత్సరం పొడవునా కొనసాగుతుంది. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సందేశాన్ని గమనించండి. మీ కేవైసీని నవీకరించండి.
మీ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి సరైన కెవైసీ చేయించండి. సకాలంలో రీ- కెవైసీ చేయించుకోవాలి.
సాధికారత ఉన్న పౌరులుగా మారండి
ఎందుకంటే సాధికారత ఉన్న పౌరులు మాత్రమే బలమైన, ఆత్మనిర్భర భారతదేశాన్ని నిర్మించగలరు.
నా ప్రియమైన దేశవాసులారా! మన రైతులు కేవలం అన్నదాతలు మాత్రమే కాదు. వారు భూమికి నిజమైన సంరక్షకులు. మట్టిని బంగారంగా ఎలా మార్చాలో మన రైతుల నుండే నేర్చుకోవాలి. నేడు మన రైతులు సంప్రదాయాన్ని, సాంకేతికతను మిళితం చేస్తున్నారు. మన రైతులు ఇప్పుడు ఉత్పత్తిపై మాత్రమే కాకుండా నాణ్యత, విలువ జోడింపు, కొత్త మార్కెట్లపై కూడా దృష్టి సారిస్తున్నారని చూసి నేను సంతోషంగా ఉన్నాను. ఒడిషాలోని హిరోద్ పటేల్ అనే యువ రైతు కథ నిజంగా స్ఫూర్తిదాయకం. దాదాపు ఎనిమిది సంవత్సరాల కిందటి వరకు ఆయన, ఆయన తండ్రి శివశంకర్ పటేల్ సాంప్రదాయిక పద్ధతిలో ధాన్యాన్ని పండించారు. కానీ ఆయన వ్యవసాయాన్ని కొత్త దృక్కోణం నుండి చూడడం ప్రారంభించారు. తన వ్యవసాయ చెరువుపై దృఢమైన జాలి నిర్మాణాన్ని పూర్తి చేశారు. దానిపై తీగ కూరగాయలను పండించారు. చెరువు నాలుగు వైపులా అరటిపండ్లు, జామపండ్లు, కొబ్బరికాయలను పండించారు. చెరువులో చేపలను పెంచడం ప్రారంభించారు. ఆయన వ్యవసాయం కూడా మొదలుపెట్టారు. దీని అర్థం సాంప్రదాయిక వ్యవసాయం, కూరగాయలు, పండ్లు, చేపల పెంపకం- అన్నీ ఒకే చోట జరుగుతున్నాయి. దీని వలన మెరుగైన భూ వినియోగం, నీటి పొదుపు, అదనపు ఆదాయం లభించాయి. నేడు ఆయన నమూనాను చూడటానికి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరో రైతులు వస్తారు.
మిత్రులారా! కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఒకే పొలంలో 570 రకాల ధాన్యాన్ని పండించే గ్రామం ఉంది. ఇందులో స్థానిక రకాలు, మూలికా రకాలు, ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకున్న రకాలు కూడా ఉన్నాయి. ఇది కేవలం వ్యవసాయం మాత్రమే కాదు- విత్తనాల వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఒక భారీ ఉద్యమం. మన రైతుల కృషి ఫలితాలు గణాంకాలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేడు భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద వరి ఉత్పత్తిదారుగా మారింది. 15 కోట్ల టన్నులకు పైగా బియ్యాన్ని ఉత్పత్తి చేయడం ఆషామాషీ విజయం కాదు. మనం మన స్వంత అవసరాలను తీర్చుకుంటున్నాం. ప్రపంచ ఆహార అవసరాలను తీర్చడంలో దోహదపడుతున్నాం.
మిత్రులారా! వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పుడు వాయుమార్గంలో కూడా విదేశాలకు సులభంగా చేరుతున్నాయి. కర్ణాటక నుండి నంజన్‌గుడ్ అరటిపండ్లు, మైసూరు తమలపాకులు, ఇండి నిమ్మకాయలు మాల్దీవులకు రవాణా అయ్యాయి. ఈ ఉత్పత్తులు వాటి రుచి, నాణ్యతకు ప్రసిద్ధి చెందాయి. జీఐ ట్యాగ్‌ను కూడా పొందాయి. నేటి రైతు నాణ్యతను కోరుకుంటాడు. పరిమాణాన్ని కూడా పెంచుతున్నాడు. తన స్వీయగుర్తింపును కూడా సాధిస్తున్నాడు.
నా ప్రియమైన దేశప్రజలారా! గత సంవత్సరం ఇదే సమయంలో జరిగిన మహా కుంభమేళా అద్భుతమైన చిత్రాలు మీకు గుర్తు ఉండవచ్చు. త్రివేణీ సంగమం ఒడ్డున ఉప్పొంగుతున్న జన సముద్రం, అపారమైన విశ్వాస ప్రవాహం, స్నానం చేసే ఆ పవిత్ర క్షణాన భారతదేశం దాని శాశ్వత చైతన్యంతో తిరిగి అనుసంధానం అవుతున్నట్లు అనిపించింది. మిత్రులారా! అదే మహా కుంభ్ ప్రవాహం అదే మాఘ మాసం, అదే భక్తి స్వరం ఉత్తరం నుండి దక్షిణానికి కదులుతున్నప్పుడు కొత్త గుర్తింపును పొందుతుంది.
మిత్రులారా! కేరళ భూమిపై భరతప్పుళ నది ఒడ్డున ఉన్న తిరునావాయాలో శతాబ్దాల నాటి సంప్రదాయం ఉంది. అదే మామంగం. చాలా మంది దీన్ని మహా మాఘ పండుగ లేదా కేరళ కుంభ్ అని కూడా పిలుస్తారు. మాఘ మాసంలో పవిత్ర నదిలో స్నానం చేయడం, ఆ క్షణాన్ని జీవితంలో చెరగని జ్ఞాపకంగా మార్చడం దాని ఉద్దేశం. కాలక్రమేణా ఈ సంప్రదాయం మసకబారింది. దాదాపు రెండు వందల యాభై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని మునుపటిలాగా గొప్పగా జరుపుకోలేదు. కానీ నేడు దాని వారసత్వాన్ని తిరిగి గుర్తిస్తున్న మన దేశంలో చరిత్ర మలుపు తిరిగింది. ఈసారి ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా కేరళ కుంభ్ విజయవంతంగా జరిగింది. ప్రజలు ఒకరికొకరు దాని గురించి చెప్పుకున్నారు. నోటి మాట ద్వారా వార్త వ్యాపించింది. త్వరలోనే భక్తులు తిరునావాయాకు రావడం ప్రారంభించారు.
మిత్రులారా! అది మహా కుంభమైనా లేదా కేరళ కుంభమైనా- కేవలం స్నానాల పండుగ కాదు. ఇది జ్ఞాపకశక్తిని మేల్కొల్పడం. ఇది సంస్కృతి పునరుద్ధరణ. ఉత్తరం నుండి దక్షిణం వరకు నదులు భిన్నంగా ఉండవచ్చు, ఒడ్డులు భిన్నంగా ఉండవచ్చు, కానీ విశ్వాస ప్రవాహం ఒకటే – ఇదే భారతదేశం.
మిత్రులారా! సమాజ సంక్షేమం కోసం పనిచేసినవారు, తమ గొప్ప పనులలో ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చిన వారు మన దేశంలో ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో ఉంటారు. అమ్మ జయలలిత గారు అటువంటి ప్రజాదరణ పొందిన నాయకురాలు. ఫిబ్రవరి 24న ఆమె పుట్టినరోజు. తమిళనాడు ప్రజలకు ఆమెపై ఉన్న గాఢమైన ప్రేమను నేను ఇప్పటికీ చూస్తున్నాను. నేటికీ నేను ఆ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు, అమ్మ జయలలిత గారి ప్రస్తావనతో తమిళనాడు ప్రజల ముఖాలు వెలిగిపోవడాన్ని చూస్తున్నాను. ఆమెతో మన మహిళా శక్తికి ఉన్న సంబంధం మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు తల్లులు, సోదరీమణులు, కుమార్తెల కోసం ఆమె అనేక ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటానికి కూడా ఆమె కఠినమైన చర్యలు తీసుకున్నారు. ఆమెలో దేశభక్తి అత్యంత అధికంగా ఉండేది. భారతదేశ సాంస్కృతిక వారసత్వం పట్ల ఆమెకు ఎంతో గర్వం కూడా ఉండేది. అమ్మ జయలలిత గారితో నా ప్రతి సమావేశం, నా ప్రతి సంభాషణ ఇప్పటికీ నా మనస్సులో తాజాగా ఉన్నాయి. 2002, 2012 సంవత్సరాల్లో గుజరాత్‌లో జరిగిన నా రెండు ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు ఆమె హాజరయ్యారు. మేం ఇద్దరం ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తరచుగా సుపరిపాలన వంటి అంశాలను చర్చించేవాళ్ళం. ఆమె ఆలోచనలు చాలా స్పష్టంగా ఉండేవి. ఇది ఆమెలో ఒక ముఖ్యమైన లక్షణం. చాలా సంవత్సరాల కిందట పొంగల్ శుభ సందర్భంగా ఆమె నన్ను చెన్నైకి భోజనానికి ఆహ్వానించారు. ఆ ఆప్యాయత నాకు మరపురానిది. నేను ఆమెకు మరోసారి నా వినయపూర్వకమైన శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను.
జయలలిత అవర్ గలక్క్,
యెన్ నినైవాజన్లి-గల్,
సముదాయత్తిక్ ర్కు,
అవర్ ఆట్రియ సేవై
యెండ్రూమ్ నినైవిల్ ఇరుక్కుం
జయలలిత గారికి నా శ్రద్ధాంజలి.
ప్రజలకు ఆమె చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి.
నా ప్రియమైన దేశవాసులారా! ఇప్పుడు నేను మన ప్రియమైన, తెలివైన, ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న పిల్లలతో మాట్లాడతాను. మీరు ఈ నెల ప్రారంభంలో ‘పరీక్షా పే చర్చ’ చూసి ఉంటారు. ఆ కార్యక్రమం నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. కానీ నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను- మీరు మీ చదువుల గురించి ఎక్కువ టెన్షన్ పడడం లేదు కదా!
నా ప్రియమైన పిల్లలారా! మీరు పరీక్షా యోధులు. మీరందరూ మీ పరీక్షలకు దృఢ చిత్తంతో సిద్ధమవుతున్నారన్న విశ్వాసం నాకు ఉంది. అవును…. ఇలాంటి సమయాల్లో కొన్ని సందేహాలు రావడం సహజం. ప్రతిదీ గుర్తుంచుకుంటామా లేదా అని కొన్నిసార్లు మీకు అనిపిస్తూ ఉంటుంది. సమయం సరిపోతుందో లేదో అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ప్రతి తరం పిల్లలు ఈ భావాలను అనుభవించారు. ఈ విషయంలో మీరు ఒంటరి కాదు. గుర్తుంచుకోండి… మీ విలువ మీ మార్కుల జాబితా ద్వారా నిర్ణయం కాదు. కాబట్టి మిమ్మల్ని మీరు విశ్వసించండి. మీరు చదివిన ప్రతిదాన్ని పూర్తి మనసు పెట్టి రాయండి. ఏదైనా ప్రశ్నకు జవాబు తెలియకపోతే మీరు అర్థం చేసుకోని ఆ ఒక్క ప్రశ్న మీ మనస్సుపై సవారీ చేసేలా చేయకండి. ఇంకొక విషయం…. మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ఉండండి. వారు మీ మార్కుల ద్వారా కాదు- మీ ప్రయత్నాల ద్వారా మిమ్మల్ని గుర్తిస్తారు. మీ కృషి వారికి సంతోషం కలిగిస్తుంది. మీరు పరీక్షలలో విజయం సాధిస్తారని, మీ జీవితాల్లో కూడా కొత్త విజయాలను సాధిస్తారని నాకు నమ్మకం ఉంది.
మిత్రులారా! ఈ రోజుల్లో రంజాన్ నెల జరుగుతోంది. అందరికీ ఈ పవిత్ర మాస శుభాకాంక్షలు. కొన్ని రోజుల్లో హోలీ కూడా వస్తోంది. దీని అర్థం రంగులు, గులాల్, నవ్వులతో నిండిన సమయం రాబోతోంది. మీరందరూ మీ కుటుంబంతో, ప్రియమైనవారితో అన్ని పండుగలను సంతోషంగా జరుపుకోండి. అవును…. వోకల్ ఫర్ లోకల్ వంటి కొన్ని మంత్రాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అనేక విదేశీ తయారీ వస్తువులు మన హోలీ వేడుకల్లోకి, ఇతర పర్వదినాల్లోకి ప్రవేశించాయి. ఈ వస్తువులను అన్ని పండుగల నుండి, హోలీ నుండి కూడా దూరంగా ఉంచండి. స్వదేశీని స్వీకరించండి. మీరు స్వదేశీని కొనుగోలు చేసినప్పుడు దేశాన్ని ఆత్మ నిర్భర్ భారత్ గా చేసేదిశగా స్వావలంబన ఉద్యమానికి కూడా మీరు దోహదపడతారు.
మిత్రులారా! ‘మన్ కీ బాత్’ కోసం ప్రతి నెలా మీ నుండి నాకు అనేక సూచనలు అందుతాయి. మీ సందేశాలు దేశంలోని ప్రతి మూలలో దాగి ఉన్న అద్భుతమైన ప్రతిభ గురించి తెలుసుకోవడానికి సహాయపడతాయి. వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా ఎదగడం, సమాజానికి తిరిగి ఇవ్వడం గురించి అనేక స్ఫూర్తిదాయకమైన కథలు మీ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు చేరాయి. మీరు మీ ప్రయత్నాలను ఇలాగే కొనసాగించండి. మీ సందేశాల కోసం నేను ఎదురు చూస్తున్నాను. రాబోయే పండుగల సందర్భంగా మీకు, మీ కుటుంబాలకు మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
****
Sharing this month’s #MannKiBaat. Do listen! https://t.co/XbKxZCLo9s
— Narendra Modi (@narendramodi) February 22, 2026
At the India AI Impact Summit, world leaders were impressed by these AI breakthroughs... #MannKiBaat pic.twitter.com/Mrm5qoo0Ct
— PMO India (@PMOIndia) February 22, 2026
There are numerous players of Indian origin bringing pride to the countries they represent and this is clearly visible in the T20 World Cup. #MannKiBaat pic.twitter.com/Iu1Y2imsr2
— PMO India (@PMOIndia) February 22, 2026
Just days ago, 10-month-old Aalin Sherin Abraham from Kerala passed away. In the midst of that pain, her parents chose to donate her organs. Their decision has touched countless hearts and given hope to others. #MannKiBaat pic.twitter.com/nGeS2XhZp4
— PMO India (@PMOIndia) February 22, 2026
Tomorrow, 23rd of February, 'Rajaji Utsav' will be celebrated at Rashtrapati Bhavan. On this occasion, a statue of C. Rajagopalachari Ji will be unveiled. #MannKiBaat pic.twitter.com/tehikIxlX5
— PMO India (@PMOIndia) February 22, 2026
KYC is crucial for your bank account's safety. #MannKiBaat pic.twitter.com/Lb89EMywFW
— PMO India (@PMOIndia) February 22, 2026
It is gladdening to see farmers focusing not just on production but also on quality, value addition and new markets. #MannKiBaat pic.twitter.com/mP339dhYBc
— PMO India (@PMOIndia) February 22, 2026
In Kerala, the centuries-old Mamangam tradition, often called the Kerala Kumbh, has come alive again after nearly 250 years. #MannKiBaat pic.twitter.com/BrMUtTeOYe
— PMO India (@PMOIndia) February 22, 2026
Amma Jayalalithaa Ji lives on in the hearts of people across Tamil Nadu. #MannKiBaat pic.twitter.com/cy1Kj2iC9O
— PMO India (@PMOIndia) February 22, 2026
Don't let marksheet define you: PM @narendramodi's message to #ExamWarriors in #MannKiBaat pic.twitter.com/mbEKPH99Bf
— PMO India (@PMOIndia) February 22, 2026