పిఎంఇండియా
2026-27 నుంచి 2030-31 కాలానికి ‘చిన్న నీటి విద్యుత్ (ఎస్‌హెచ్‌పీ) అభివృద్ధి పథకానికి’ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సుమారు 1500 మెగావాట్ల సామర్థ్యం గల చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ. 2584.60 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
వివిధ రాష్ట్రాల్లో 1 మెగావాట్ నుంచి 25 మెగావాట్ల (ఎండబ్ల్యూ) సామర్థ్యం గల చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టులకు ఈ పథకం మద్దతునిస్తుంది. ముఖ్యంగా అపారమైన సామర్థ్యం ఉన్న పర్వత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలకు ఇది ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో, అంతర్జాతీయ సరిహద్దులు కలిగిన జిల్లాలలో ఒక్కో మెగావాట్‌కు రూ. 3.6 కోట్లు లేదా ప్రాజెక్ట్ వ్యయంలో 30 శాతం (ఏది తక్కువైతే అది).. గరిష్టంగా ఒక ప్రాజెక్ట్‌కు రూ. 30 కోట్ల వరకు కేంద్ర ఆర్థిక సహాయం అందుతుంది. ఇతర రాష్ట్రాల్లో మెగావాట్‌కు రూ. 2.4 కోట్లు లేదా ప్రాజెక్ట్ వ్యయంలో 20 శాతం (ఏది తక్కువైతే అది).. గరిష్టంగా రూ. 20 కోట్ల పరిమితితో ఆర్థిక సహాయం లభిస్తుంది. దూర ప్రాంతాలు, చేరుకోవడానికి కష్టతరమైన ప్రాంతాల్లో ఉన్న చిన్న నీటి విద్యుత్ సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి ఇది తోడ్పడుతుంది. ఇటువంటి ప్రాజెక్టుల కోసం రూ. 2,532 కోట్లు కేటాయించారు. దీనివల్ల ఈ రంగంలో రూ. 15,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇది స్వచ్ఛ ఇంధన లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఊతమిస్తుంది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన ప్లాంట్, యంత్రాలను 100 శాతం స్వదేశీ వనరుల నుంచే సమకూర్చుకోవడం ద్వారా ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని ఇది నెరవేరుస్తుంది.
భవిష్యత్తులో చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టుల జాబితాను సిద్ధం చేయడం కోసం సుమారు 200 ప్రాజెక్టులకు సంబంధించిన ‘సవివర ప్రాజెక్ట్ నివేదికలను’ (డీపీఆర్) రూపొందించేలా రాష్ట్రాలను ఈ పథకం ప్రోత్సహిస్తుంది. ఇటువంటి డీపీఆర్‌ల తయారీలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మద్దతుగా రూ. 30 కోట్ల నిధులను కేటాయించారు.
ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో సుమారు 51 లక్షల పని దినాల ఉపాధిని ఈ పథకం కల్పిస్తుంది. ప్రధానంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటయ్యే ఈ చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టుల (ఎస్‌హెచ్‌పీ) నిర్వహణ, కార్యకలాపాలలో కూడా నిరంతర ఉపాధికి ఇది దోహదపడుతుంది. ఈ ప్రాజెక్టులు వికేంద్రీకృత స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల సుదీర్ఘమైన విద్యుత్ సరఫరా లైన్ల అవసరం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల విద్యుత్ సరఫరా నష్టాలు కూడా తగ్గుతాయి.
ఈ పథకం ప్రారంభమవటం వల్ల చిన్న నీటి విద్యుత్ (ఎస్‌హెచ్‌పీ) రంగం పునరుజ్జీవనం పొందుతుంది. అంతేకాకుండా అందుబాటులో ఉన్న సామర్థ్యాన్ని మరింత వేగంగా వినియోగించుకోవడానికి ఇది తోడ్పడుతుంది. పెద్ద ఎత్తున భూసేకరణ, అడవుల నరికివేత, ప్రజల తరలింపు వంటి సమస్యలు ఉండవు కాబట్టి చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టులు పర్యావరణపరంగా సుస్థిరమైనవి. స్థానిక పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా ఇవి మారుమూల ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. సాధారణంగా ఈ ప్రాజెక్టుల కాలపరిమితి 40 నుంచి 60 సంవత్సరాలకు పైగా ఉండటం వల్ల ఇవి దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తాయి.
***
The Union Cabinet has approved the Small Hydro Power Development Scheme, which will boost clean energy, attract investments and create employment across rural and remote regions. The Northeast in particular will gain significantly from the scheme.https://t.co/h3OHcxtmwZ
— Narendra Modi (@narendramodi) March 18, 2026