పిఎంఇండియా
షాంఘైలో నిర్వహించిన ‘వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ – 2026’లో పాల్గొంటున్న టీమిండియా ప్రతినిధులతో 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు.
పోటీలో తమ అనుభవాలను ఈ సందర్భంగా ప్రతినిధులు పంచుకున్నారు. ప్రపంచ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించడం తమకెంతో గర్వకారణమన్నారు. అంతర్జాతీయ పోటీ సమయంలో సరికొత్త పరికరాలు, సాఫ్ట్వేర్, సాంకేతిక వ్యవస్థలు, పని విధానాలను సానుకూలంగా మలచుకున్న తీరుపై వారు చర్చించారు. నైపుణ్యాభివృద్ధి దిశగా ప్రభుత్వ చర్యలు యువతకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వారు పేర్కొన్నారు.
అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన వారికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. నైపుణ్యాభివృద్ధికి ప్రతినిధులుగా నిలవాలని ఆయన వారిని కోరారు. విద్యాపరమైన డిగ్రీల మాదిరిగానే ఆచరణాత్మక నైపుణ్యాలు కూడా అత్యంత కీలకమైనవన్నారు.
ప్రత్యేక నైపుణ్యాల ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. సాంకేతికత వేగంగా మారుతున్న తరుణంలో.. యువత నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. నూతన సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని కోరారు. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు తగినట్లుగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, తమ అనుభవాలు, సూచనల ద్వారా దేశీయ నైపుణ్య శిక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిపుణులైన మానవ వనరుల అంతర్జాతీయ నిలయంగా భారత్‌ను నిలిపే దిశగా యువత, ప్రభుత్వం, శిక్షణ సంస్థలు సమన్వయంతో పనిచేయడం అత్యావశ్యకమన్నారు.
నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న లక్ష్యాన్ని ప్రధానమంత్రి వివరించారు. నైపుణ్య శిక్షణ సంస్థలు.. ఐఐటీలు, ఐఐఎంలకు ఏమాత్రం తీసిపోవని ఆయన వ్యాఖ్యానించారు. తమ అనుభవాలను, సూచనలను ప్రభుత్వంతో పంచుకోవడం ద్వారా.. దేశ నైపుణ్య శిక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో తోడ్పాటునందించాలని ప్రతినిధులను శ్రీ మోదీ కోరారు.
‘వరల్డ్ స్కిల్స్’… అంతర్జాతీయంగా పేరెన్నికగన్న ప్రముఖ నైపుణ్యాల పోటీ. భాగస్వామ్య దేశాలు, ప్రాంతాల యువ నిపుణులను ఒక్కచోటకు తెచ్చి వివిధ వృత్తి, సాంకేతిక నైపుణ్యాల్లో తమ ప్రతిభను చాటుకునే వేదికను ఇది కల్పిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు షాంఘైలోని నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో ‘వరల్డ్ స్కిల్స్ షాంఘై – 2026’ పోటీలు నిర్వహించారు. ఈ 48వ పోటీల్లో 6 వెండి పతకాలు, 20 మెడల్స్ ఫర్ ఎక్సలెన్స్‌లను సాధించి టీమిండియా పదో స్థానంలో నిలిచింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. 63 నైపుణ్య విభాగాల్లో 70 మంది పోటీదారులతో కూడిన బృందం భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం విశేషం.
నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికవేత్తల ప్రోత్సాహక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి, భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
Hosted the bright youngsters who took part in the 48th WorldSkills Competition held in Shanghai. Proud of them! https://t.co/5lzQwcer6h
— Narendra Modi (@narendramodi) October 9, 2026