Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

“ప‌ర్యావ‌ర‌ణ‌హిత జీవ‌న‌శైలి – లైఫ్” పేరిట ప్ర‌పంచ స్థాయి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి

“ప‌ర్యావ‌ర‌ణ‌హిత జీవ‌న‌శైలి – లైఫ్”  పేరిట ప్ర‌పంచ స్థాయి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి


“ప‌ర్యావ‌ర‌ణహిత జీవ‌న‌శైలి – లైఫ్ మూవ్ మెంట్”  పేరిట ఒక ప్ర‌పంచ శ్రేణి కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా నేడు ప్రారంభించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ర్యావ‌ర‌ణ చైత‌న్యంతో కూడిన జీవ‌న శైలిని అనుస‌రించేలా వ్య‌క్తులు, స‌మాజం, సామాజిక‌ సంఘాల‌ను ప్ర‌భావితం చేయ‌డానికి అనుస‌రించాల్సిన విధానాల‌పై ఆలోచ‌న‌లు, స‌ల‌హాలతో కూడిన అధ్య‌య‌న ప‌త్రాలు –“లైఫ్ గ్లోబ‌ల్ కాల్ ఫ‌ర్ పేప‌ర్స్” ఆహ్వానిస్తూ చేప‌ట్టిన కార్య‌క్ర‌మం ఇది.

 

ఈ సంద‌ర్భంగా స‌మావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ లైఫ్ మూవ్ మెంట్ పేరిట ప‌ర్యావ‌ర‌ణహిత జీవ‌న శైలి కోసం ఒక కార్య‌క్ర‌మం ప్రారంభించేందుకు ఇది స‌రైన స‌మ‌య‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. తాను కూడా లైఫ్ – ప‌ర్యావ‌ర‌ణహిత జీవ‌న శైలిని ప్రారంభిస్తాన‌ని ఆయ‌న చెప్పారు. మాన‌వ కేంద్రీకృత‌, ఉమ్మ‌డి చ‌ర్య‌లు, సుస్థిరాభివృద్ధికి విస్తార‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక ద్వారా మ‌నం ఎదుర్కొంటున్న స‌వాళ్ల‌ను ప‌రిష్క‌రించ‌డం త‌క్ష‌ణావ‌స‌ర‌మ‌ని ఆయ‌న నొక్కి చెప్పారు.

గ‌త ఏడాది జ‌రిగిన కాప్ 26 సద‌స్సులోనే తాను ఈ ప్ర‌పంచ శ్రేణి కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌తిపాదించిన విష‌యం ప్ర‌ధాన‌మంత్రి గుర్తు చేశారు. మ‌న భూగోళానికి అనుకూల‌మైన‌, హాని క‌లిగించ‌ని జీవ‌న‌శైలి అనుస‌రించ‌డ‌మే ఈ లైఫ్ ప్ర‌ధాన విజ‌న్ అని ఆయ‌న చెప్పారు. ఇలాంటి జీవ‌న విధానం అనుస‌రించే వారిని “భూగోళ అనుకూల ప్ర‌జ‌లు”గా పిలుస్తార‌న్నారు. మిష‌న్ లైఫ్ గ‌తంలో గ‌త  పాఠాల‌ను మ‌న‌నం చేసుకుంటూ వ‌ర్త‌మానంలో ప‌ని చేస్తూ భ‌విష్య‌త్తుపై దృష్టి పెట్టే కార్య‌క్ర‌మం అని తెలిపారు. త‌గ్గించు, తిరిగి వినియోగించు, రీసైకిల్ చేయి అనేది మ‌న జీవితంతో అల్లుకుపోయిన కాన్సెప్ట్ అని చెబుతూ స‌ర్కుల‌ర్ ఎకాన‌మీ మ‌న సంస్కృతి, జీవ‌న‌శైలిలో అంత‌ర్భాగ‌మ‌ని ఆయ‌న అన్నారు.

భార‌త‌దేశంలో ప‌ర్యావ‌ర‌ణానికి సంబంధించిన ప‌లు కార్య‌క్ర‌మాలు తాను చేసేందుకు మ‌ద్ద‌తు ఇచ్చిన 1.3 బిలియ‌న్ భార‌తీయుల‌కు ప్ర‌ధాన‌మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. భార‌త‌దేశ అడ‌వుల విస్తీర్ణం పెరుగుతోంద‌ని, ఫ‌లితంగా సింహాలు, పులులు, చిరుత‌పులులు, ఏనుగులు, ఖ‌డ్గ‌మృగాల జ‌నాభా పెరుగుతున్న‌ద‌ని ఆయ‌న చెప్పారు. శిలాజేత‌ర ఇంధ‌నాల ద్వారా 40% స్థాపిత  విద్యుత్ ఉత్ప‌త్తి చేసేందుకు ప్ర‌క‌టించిన క‌ట్టుబాటును భార‌త్ నిర్దేశిత స‌మ‌యం క‌న్నా 9 సంవ‌త్స‌రాల ముందే సాధించింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. దేశంలో 2022 న‌వంబ‌ర్ నాటికి 10% ఇథ‌నాల్ మిశ్ర‌మ పెట్రోల్ ఉత్ప‌త్తి చేయాల‌న్న ల‌క్ష్యాన్ని 5 నెల‌లు ముందుగానే సాధించామ‌ని చెప్పారు. పెట్రోల్  లో ఇథ‌నాల్ మిశ్ర‌మం 2013-14 నాటికి  1.5% లోపు, 2019-20 నాటికి 5% అయిన‌ప్ప‌టికీ ఇంత స్వ‌ల్ప‌వ్య‌వ‌ధిలో 10% శాతం ల‌క్ష్యాన్ని చేర‌డం అసాధార‌ణ‌ విజ‌య‌మ‌ని ఆయ‌న అభివ‌ర్ణించారు. పున‌రుత్పాద‌క ఇంధ‌నానికి ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు చెప్పారు. న‌వ‌క‌ల్ప‌న‌లు, దాప‌రికం లేని వైఖ‌రి మాత్ర‌మే భ‌విష్య‌త్తుకు మార్గ‌ద‌ర్శి అని ఆయ‌న అన్నారు. టెక్నాల‌జీ, సాంప్ర‌దాయం మిళిత‌మైన‌ప్పుడు విజ‌న్ ఆఫ్ లైఫ్ మ‌రింత పురోగ‌మించ‌గ‌లుగుతుంద‌ని చెప్పారు.

క‌ర్బ‌న‌ర‌హిత జీవ‌న‌శైలి గురించి మ‌హాత్మా గాంధీ ఎంత‌గానో మాట్లాడిన విష‌యం ప్ర‌ధాన‌మంత్రి గుర్తు చేశారు. మ‌న రోజువారీ కార్య‌క‌లాపాల‌న్నింటిలోనూ అత్యంత సుస్థిర‌త‌తో కూడిన విధానాల‌ను మాత్ర‌మే ఎంచుకోవాల‌ని ఆయ‌న ఉద్బోధించారు. రీయూజ్‌,  రెడ్యూస్‌, రీసైకిల్ సిద్ధాంతం అనుస‌రించాల‌ని ఆయ‌న ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వారిని అభ్య‌ర్థించారు. మ‌న భూమండ‌లం ఒక‌టే, కాని ప్ర‌య‌త్నాలు మాత్రం అనేకం అన్నారు. “మ‌రింత మెరుగైన ప‌ర్యావ‌ర‌ణానికి, ప్ర‌పంచ సంక్షేమాన్ని మ‌రింత‌గా పెంచ‌డానికి జ‌రిగే ఎలాంటి కృషికైనా భార‌త‌దేశం మ‌ద్ద‌తు ఇస్తుంది, మేం గ‌తంలో ప‌య‌నించిన కాలంలో సాధించిన విజ‌యాలే మా గురించి తెలియ‌చేస్తాయి” అంటూ ప్ర‌ధాన‌మంత్రి త‌న ప్ర‌సంగం ముగించారు.

బిల్ అండ్ మెలిందా ఫౌండేష‌న్ కో చైర్మ‌న్ బిల్ గేట్స్;  వాతావ‌ర‌ణ ఆర్థికవేత్త లార్డ్ నికోలాస్ స్టెర్న్;  న‌డ్జ్ సిద్ధాంత ర‌చ‌యిత ప్రొఫెస‌ర్ కాస్ స‌న్ స్టైన్‌;   వ‌ర‌ల్డ్ రీసోర్సెస్ ఇన్ స్టిట్యూట్ సిఇఓ, ప్రెసిడెంట్ అనిరుద్ధ దాస్ గుప్తా;  యుఎన్ఇపి గ్లోబ‌ల్ హెడ్ శ్రీ‌మ‌తి ఇంగ‌ర్ ఆండ‌ర్స‌న్‌;   యుఎన్ డిపి గ్లోబ‌ల్ హెడ అషిం స్టైన‌ర్‌;  ప్ర‌పంచ బ్యాంకు అధ్య‌క్షుడు డేవిడ్ మ‌ల్పాస్  ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. అలాగే కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాద‌వ్‌, నీతి ఆయోగ్ సిఇఓ శ్రీ అమితాబ్ కాంత్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.

“నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యాల‌ను అదుపు చేయ‌డంలో భార‌త  నాయ‌క‌త్వం, కృషి చూసి తాను స్ఫూర్తి పొందాన‌ని బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేష‌న్ కో చైర్మ‌న్ బిల్ గేట్స్ అన్నారు.  లైఫ్ ఉద్య‌మం, ఉమ్మ‌డి శ‌క్తిని పూర్తిగా వెలుప‌లికి తీసుకురావ‌డంలో దాని  సామ‌ర్థ్యం విని నేనెంతో ఉత్తేజం పొందాను.  వాతావ‌ర‌ణంలో హ‌రిత వాయువుల‌కు ప్ర‌మాద‌కారి అయిన వ్య‌ర్థాల‌ను  హ‌రించే ఆధునిక టెక్నాల‌జీలు రావ‌డంతో పాటు అంద‌రి భాగ‌స్వామ్యం అత్యంత అవ‌స‌రం, అలాగే విస్తృత వినియోగానికి అవ‌స‌ర‌మైన ఈ ఆధునిక టెక్నాల‌జీలు అమ‌లుప‌రిచేందుకు భారీ పెట్టుబ‌డులే కాదు, ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు, వ్య‌క్తిగ‌త భాగ‌స్వామ్యాలు కూడా అవ‌స‌రం. ఇలాంటి వ్య‌క్తిగ‌త కార్యాచ‌ర‌ణ‌లే ఇలాంటి ఆధునిక టెక్నాల‌జీల‌పై పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ప్ర‌భుత్వానికి, వ్యాపారాల‌కు ప్రోత్సాహం అందించ‌డంతో పాటు మ‌నం ఆశిస్తున్న విజ‌యాలు న‌మోదు చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి“ అని ఆయ‌న అన్నారు. “వాతావ‌ర‌ణ అనుకూల ప్ర‌వ‌ర్త‌న‌ల‌ను ప్రోత్స‌హించ‌డానికి పౌరుల కార్యాచ‌ర‌ణ‌పై ప్ర‌పంచ స్థాయిలో ఇలాంటి కార్య‌క్ర‌మానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్నందుకు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ మోదీని నేను అభినందిస్తున్నాను. మ‌నంద‌రం క‌లిసి ఉమ్మ‌డిగా హ‌రిత పారిశ్రామిక విప్ల‌వం సృష్టించ‌గ‌లం“ అని చెప్పారు. “వాతావ‌ర‌ణ మార్పుల‌కు సంబంధించిన ఉమ్మ‌డి ప్ర‌పంచ కార్యాచ‌ర‌ణ ఆవ‌శ్య‌క‌త గ‌తంలో క‌న్నా ఇప్పుడు ఎంతో అవ‌స‌రం. మ‌నం వాతావ‌ర‌ణ ల‌క్ష్యాల‌ను చేర‌డంలో భార‌త‌దేశం పాత్ర‌, నాయ‌క‌త్వం అత్యంత కీల‌కం“ అన్నారు.

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, వాతావ‌ర‌ణ మార్పులు, మాన‌వ ప్ర‌వ‌ర్త‌నలో మార్పు తేవ‌డం వంటి అంశాల్లో భార‌త‌దేశం, ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌పంచ నాయ‌కులుగా నిలుస్తార‌ని న‌డ్జ్ సిద్ధాంత ర‌చ‌యిత ప్రొఫెస‌ర్  కాస్ స‌స్టైన్  అన్నారు. మాలో చాలా మంది మంచి ఆలోచ‌న‌లు, స్ఫూర్తి కోసం భార‌త‌దేశం వైపు చూస్తున్నాం అని చెప్పారు. వాతావ‌ర‌ణ మార్పుల‌కు ఈస్ట్ (ఈజీ, అట్రాక్టివ్‌, సోష‌ల్‌, టైమ్ లీ)  ఫ్రేమ్ వ‌ర్క్ గురించి ప్రొఫెస‌ర్ మాట్లాడారు. అంటే సామాజికంగా ఉప‌యోగించేందుకు అనువైన తేలిక‌పాటి, ఆక‌ర్ష‌ణీయ టెక్నాల‌జీలు స‌కాలంలో అందుబాటులో తేవ‌డం అని అర్ధం. దానికి “ఎఫ్” అక్ష‌రాన్ని కూడా ఆయ‌న జోడించి ఫీస్ట్ చేశారు. ఎఫ్ అంటే ఫ‌న్‌. వాతావ‌ర‌ణ అనుకూల కార్యాచ‌ర‌ణ‌లు ఎప్పుడూ ఆనందంగా ఉంటాయి, ఇటీవ‌ల కాలంలో భార‌త‌దేశం దీన్ని ప్ర‌పంచానికి చూపింది.

ఈ స‌మావేశంలో పాల్గొన్న యుఎన్ఇపి గ్లోబ‌ల్ హెడ్ శ్రీ‌మ‌తి ఇంగ‌ర్ ఆండ‌ర్స‌న్ ప్ర‌ధాన‌మంత్రి లైఫ్ కార్య‌క్ర‌మం ప్రారంభించ‌డాన్ని ఆహ్వానించారు. “1 బిలియ‌న్ కు పైగా జ‌నాభా;  అన్వేష‌ణ‌లు, ఎంట‌ర్ ప్రెన్యూర్ షిప్ పై ఆస‌క్తి గ‌ల ఉత్సాహ‌వంతులైన త‌రం అధిక సంఖ్య‌లో ఉన్న భార‌త‌దేశం ప్ర‌పంచ వాతావ‌ర‌ణ కార్యాచ‌ర‌ణ  ప్ర‌ణాళిక‌క‌కు కేంద్ర‌స్థానం” అని ఆమె వ్యాఖ్యానించారు.

భార‌త్ వంటి దేశాలు ప్ర‌పంచ య‌వ‌నిక‌పై నిర్ణ‌యాత్మ‌క కార్యాచ‌ర‌ణ‌లు అమ‌లుప‌ర‌చ‌డానికి వెనుక‌ ప్ర‌ధాన‌శ‌క్తిగా నిలుస్తున్నాయ‌ని యుఎన్ డిపి గ్లోబ‌ల్ హెడ్ అచిమ్ స్టైన‌ర్ అన్నారు. అంత‌ర్జాతీయ సోలార్ అల‌య‌న్స్, వైప‌రీత్యాల‌ను త‌ట్టుకోగ‌ల మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న కూట‌మి, ఒక సూర్యుడు–ఒక ప్రపంచం–ఒక గ్రిడ్ వంటి ఆధునిక చొర‌వ‌ల‌న్నీ వీటిలో ఉన్నాయి.

మ‌నం ఎలా జీవించాలి, మ‌నం ఎలా వినియోగించాలి, మ‌నం భూగోళం విష‌యంలో ఎంత జాగ్ర‌త్త తీసుకోవాలి అనే చైత‌న్యం క‌ల్పించే  అత్యంత ప్ర‌ధాన‌మైన ప్ర‌పంచ శ్రేణి ఉద్య‌మం ప్రారంభించినందుకు ప్ర‌ధాన‌మంత్రికి వ‌ర‌ల్డ్ రీసోర్సెస్ ఇన్ స్టిట్యూట్ సిఇఓ, ప్రెసిడెంట్ అనిరుద్ధ దాస్ గుప్తా ధ‌న్య‌వాదాలు తెలిపారు.

అభివృద్ధికి కొత్త ప‌థానికి సంబంధించిన విజ‌న్ ను ఆవిష్క‌రిస్తూ గ్లాస్గోలో జ‌రిగిన కాప్ 26 స‌ద‌స్సులో ప్ర‌ధాన‌మంత్రి చేసిన స్ఫూర్తిదాయ‌క‌మైన ప్ర‌సంగాన్ని వాతావ‌ర‌ణ ఆర్థిక‌వేత్త లార్డ్ నికోలాస్ స్టెర్న్ గుర్తు చేశారు. స‌మాజాల జీవ‌న ప్ర‌మాణాలు పెంచ‌డానికి, భ‌విష్య‌త్ త‌రాల‌కు సుర‌క్షిత‌మైన భ‌విష్య‌త్ ను అందించ‌డానికి 21వ శ‌తాబ్దిలో జ‌రిగే అభివృద్ధి, వృద్ధి ప్ర‌ణాళికే ఇది.

భార‌త ప్ర‌వృత్తిలో ప‌ర్యావ‌ర‌ణ చైత‌న్యం ర‌గిలించే గ్రంథాల్లోని మాట‌ల‌ను ప్ర‌పంచ బ్యాంకు అధ్య‌క్షుడు డేవిడ్ మ‌ల్పాస్ గుర్తు చేశారు. 2019లో గుజ‌రాత్ లో సివిల్ స‌ర్వీసుల సామ‌ర్థ్యాల‌ను పెంచ‌డానికి ప్ర‌ధాన‌మంత్రి చేసిన కృషిలో ఇది క‌నిపించింద‌ని ఆయ‌న కొనియాడారు. ప్ర‌జ‌లంద‌రినీ ఆర్థిక కార్య‌క‌లాపాల్లో భాగ‌స్వాముల‌ను చేయ‌డానికి, ప్ర‌తీ ఒక్క కార్య‌క్ర‌మం ప‌రిధిని కింది స్థాయిలో స్థానికంగా అమ‌లుప‌ర‌చ‌డానికి దోహ‌ద‌ప‌డిన పోష‌ణ్‌, ఆశా, స్వ‌చ్ఛ భార‌త్  వంటి కార్య‌క్ర‌మాల‌ను కూడా ఆయ‌న ప్ర‌శంసించారు.

గ‌త ఏడాది గ్లాస్గోలో జ‌రిగిన ఐక్య‌రాజ్య‌స‌మితి భాగ‌స్వామ్య ప‌క్షాల‌ 26వ వాతావ‌ర‌ణ మార్పుల సద‌స్సులో (కాప్ 26) ప్ర‌ధాన‌మంత్రి ఈ లైఫ్ ఆలోచ‌న‌ను ఆవిష్క‌రించారు. ఆలోచ‌నార‌హిత‌మైన‌, విధ్వంస‌క వినియోగం అనుస‌రించేందుకు బ‌దులు ఆలోచ‌నాత్మ‌క‌మైన‌, మంచి ఉద్దేశంతో కూడిన వినియోగ ధోర‌ణులు అల‌వ‌రిచే ప‌ర్యావ‌ర‌ణ చైత‌న్య స‌హిత జీవ‌న శైలిని ఇది ప్రోత్స‌హిస్తుంది.

 

***