పిఎంఇండియా
కేంద్ర మంత్రివర్గంలో గౌరవ సహచరులు అన్నపూర్ణాదేవి, సావిత్రి ఠాకూర్, రవ్నీత్ సింగ్, హర్ష్ మల్హోత్రా.. గౌరవ ఢిల్లీ మంత్రివర్యులు, ఇతర ప్రముఖులు.. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన అతిథులూ.. ప్రియమైన బాలలారా!
నేడు దేశం వీరబాల దివస్‌ను జరుపుకొంటోంది. ఇప్పుడే అద్భుతమైన వందేమాతర ప్రదర్శనను చూశాం. అందులో మీ కృషి స్పష్టంగా కనిపిస్తోంది.
మిత్రులారా,
దేశానికి గర్వకారణమైన వీర సాహిబ్‌జాదాలను ఈ రోజు మనం స్మరించుకుంటున్నాం. అజేయమైన భారత ధైర్యసాహసాలకు, వీరత్వానికి వారు ప్రతీకలు. వయస్సు, పరిస్థితుల పరిమితులను ఛేదించుకున్న ఈ సాహిబ్జాదాలు క్రూర మొఘల్ సామ్రాజ్యం ఎదుట కొండలా అడ్డు నిలిచారు. మతోన్మాదాన్నీ, ఉగ్ర మూలాలనూ పెకలించారు. ఇంతటి మహోజ్వల చరిత్ర ఉన్న, స్ఫూర్తిదాయకమైన ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఈ దేశ యువత సాధించలేనిదంటూ ఏమీలేదు.
మిత్రులారా,
డిసెంబర్ 26వ తేదీ వస్తే చాలు.. సాహిబ్జాదాల పరాక్రమ స్ఫూర్తితో ‘వీరబాల దివస్’ వేడుకలను మా ప్రభుత్వం ప్రారంభించిందన్న సంతృప్తి కలుగుతుంది. నాలుగేళ్లుగా ఈ కొత్త సంప్రదాయంతో సాహిబ్జాదాల స్ఫూర్తిని యువతరం అందిపుచ్చుకుంటోంది. యువతను వీరులుగా, ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే దిశగా ఇది ఓ వేదికగా నిలిచింది. ఏటా వివిధ రంగాల్లో దేశానికి విశేష విజయాలను అందించిన బాలలు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని స్వీకరిస్తారు. ఈ సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా 20 మంది పిల్లలు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వారంతా మన మధ్యే ఉన్నారు. వారితో సంభాషించే అవకాశం నాకు దక్కింది. కొందరు పిల్లలు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. కొందరు సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణలో ప్రశంసనీయ సేవలందించారు. ఇంకొందరు శాస్త్ర, సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయగా.. మరికొందరు క్రీడలు, కళ, సంస్కృతి రంగాల్లో విశేష కృషి చేశారు. ఈ పురస్కారాలను గెలుచుకున్న వారికి చెబుతున్నాను… ఈ గౌరవం మీకు మాత్రమే కాదు.. మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మామార్గదర్శకులది కూడా. వారి కృషికి కూడా ఇది గుర్తింపు. పురస్కార విజేతలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. వారి కుటుంబాలకు శుభాకాంక్షలు.
మిత్రులారా,
వీరబాల దివస్ భావోద్వేగానికీ, భక్తిభావానికీ ప్రతీక. వీర సాహిబ్జాదాలు అజిత్ సింగ్, జుఝార్ సింగ్, జొరావర్ సింగ్, ఫతే సింగ్‌లు.. అత్యంత చిన్న వయస్సులోనే నాడు అత్యంత శక్తిమంతమైన మొఘల్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచారు. ప్రాథమిక భారతీయ ఆదర్శాలకూ, మత మౌఢ్యానికీ నడుమ.. సత్యానికీ, అసత్యానికీ నడుమ ఆ పోరాటం సాగింది. పదో గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ ఒకవైపు నిలబడగా, మరోవైపు ఔరంగజేబు క్రూర పాలన సాగింది. ఆ సమయానికి మన సాహిబ్జాదాలు చాలా చిన్నవారు. కానీ క్రూరత్వంతో వ్యవహరించిన ఔరంగజేబు వారి వయస్సును ఏమాత్రం పట్టించుకోలేదు. భారతీయులను భయపెట్టి మతమార్పిడి చేయించాలంటే, ముందుగా వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని అతనికి తెలుసు. అందుకే సాహిబ్‌జాదాలను లక్ష్యంగా చేసుకున్నాడు.
కానీ మిత్రులారా,
గురు గోవింద్ సింగ్ సామాన్యుడు కాదనీ.. తపస్సుకూ, త్యాగానికీ ప్రతీక అయిన ఆయన వారసత్వాన్ని సాహిబ్జాదాలు అందిపుచ్చుకున్నారనీ… ఔరంగజేబు, అతని సేనానులు విస్మరించారు. అందుకే మొఘలు సామ్రాజ్యం మొత్తం వెంబడించినప్పటికీ, ఆ నలుగురిలో ఒక్కరు కూడా వెనుకాడలేదు. సాహిబ్జాదా అజిత్ సింగ్ చెప్పిన మాటల్లో వారి శౌర్యం ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది – “నా పేరు అజిత్. నన్ను ఎప్పటికీ జయించలేరు. నేను ఓడిపోయినా, ఎప్పటికీ లొంగిపోను!”
మిత్రులారా,
కొన్ని రోజుల కిందటే శ్రీ గురు తేగ్ బహదూర్ జీని ఆయన 350వ బలిదాన దినం సందర్భంగా స్మరించుకున్నాం. ఆ రోజు కురుక్షేత్రలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. ఆయన త్యాగం నుంచి స్ఫూర్తి పొందిన సాహిబ్జాదాలు మొఘలుల అకృత్యాలకు భయపడతారనుకోవడమే పొరపాటు.
మిత్రులారా,
మాతా గుజ్రీ, శ్రీ గురు గోవింద్ సింగ్, నలుగురు సాహిబ్జాదాల ధైర్యమూ, ఆదర్శాలూ ప్రతి భారతీయుడికీ ఉత్తేజాన్నిస్తాయి. వారిలో నిరంతరం స్ఫూర్తిని నింపుతాయి. సాహిబ్జాదాల త్యాగనిరతి ప్రతి పౌరుడికీ కంఠోపాఠమై ఉండాల్సింది. దురదృష్టవశాత్తు స్వాతంత్య్రానంతరం కూడా బానిసత్వ మనస్తత్వమే బలంగా ఉండిపోయింది. 1835లో బ్రిటిష్ రాజకీయవేత్త మెకాలే ఈ మనస్తత్వానికి బీజం వేయగా.. స్వాతంత్య్రానంతరం కూడా దేశం దీన్నుంచి బయటపడలేకపోయింది. అందుకే దశాబ్దాల పాటు ఇలాంటి సత్యాలు అణచివేతకు గురయ్యాయి.
కానీ మిత్రులారా,
బానిస మనస్తత్వం నుంచి విముక్తిని నేడు భారత్ సంకల్పించింది. మన త్యాగాలకూ, శౌర్యానికీ సంబంధించిన స్మృతులను ఇకపై సమాధి చేయబోము. మన దేశ వీరులను, వీరాంగనలను పక్కనపెట్టడం ఇక జరగబోదు. అందుకే వీరబాల్ దివస్‌ను పూర్తి భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ఇక్కడితోనే ఆగిపోలేదు. 2035 నాటికి మెకాలే కుట్రకు 200 ఏళ్లు పూర్తవుతుంది. దానికి మరో పదేళ్లే మిగిలుంది. ఈ పదేళ్లలో బానిస మనస్తత్వం నుంచి భారత్ సంపూర్ణ విముక్తిని సాధిస్తుందని మేం హామీ ఇస్తున్నాం. ఇది 140 కోట్ల భారతీయుల సంకల్పం కావాలి. ఎందుకంటే, ఈ మనస్తత్వం నుంచి బయటపడితే.. స్వదేశీ అస్తిత్వం పట్ల ఆదరాభిమానాలు పెరుగుతాయి. స్వావలంబన పథంలో దేశం పురోగమిస్తుంది.
మిత్రులారా,
వలసవాద మనస్తత్వం నుంచి దేశాన్ని విముక్తం చేసే ప్రచారానికి సంబంధించిన ఛాయలు ఇటీవల పార్లమెంటులో కనిపించాయి. శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు సభ్యులు హిందీ, ఇంగ్లిషు కాకుండా ఇతర భారతీయ భాషల్లో దాదాపు 160 ప్రసంగాలు చేశారు. సుమారు 50 ప్రసంగాలు తమిళంలో, 40కి పైగా ప్రసంగాలు మరాఠీలో, దాదాపు 25 ప్రసంగాలు బెంగాలీలో చేశారు. ప్రపంచంలోని ఏ పార్లమెంటులో అయినా ఇలాంటి సన్నివేశం చాలా అరుదు. ఇది మనందరికీ గర్వకారణం. దేశంలో భాషా వైవిధ్యాన్ని అణచివేసేందుకు మెకాలే ప్రయత్నించాడు. కానీ బానిస మనస్తత్వం నుంచి భారత్ నేడు విముక్తమవుతున్న తరుణంలో.. ఆ భాషా వైవిధ్యమే మనకు గొప్ప శక్తిగా నిలుస్తోంది.
మిత్రులారా,
యువ భారత్ సంఘటన్‌కు చెందిన ఇంతమంది యువత ఇక్కడున్నారు. ఒక రకంగా మీదంతా జెన్ జీ, జెన్ ఆల్ఫా తరం. అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేలా భారత్‌ను నడిపించేది మీ తరమే. జెన్ జీ తరం సమర్థతనూ, ఆత్మవిశ్వాసాన్ని నేను చూశాను. అందుకే మీపై నాకు అపారమైన నమ్మకముంది. మన సంప్రదాయం ఇలా చెబుతోంది: ‘బాలాదపి గ్రహీతవ్యం, యుక్తముక్తం మనీషిభిః..’ అంటే వివేచనతో ఓ చిన్న పిల్లవాడు మాట్లాడినా, దానిని అంగీకరించాలి. మరో మాటలో చెప్పాలంటే.. ఓ వ్యక్తి చిన్నవాడో పెద్దవాడో నిర్ణయించేది అతడి వయస్సు కాదు. ఆలోచనలు, విజయాల ద్వారానే ఎవరైనా గొప్పవారవుతారు. మీ వయస్సు చిన్నదే అయినా.. పది మందికీ స్ఫూర్తిదాయకమైన విజయాలను మీరు సాధించగలరు. మీరు ఇప్పటికే దీన్ని నిరూపించారు. అయితే ఈ విజయాలను ఆరంభంగానే చూడాలి. మీరింకా ఎంతగానో ముందుకెళ్లాలి. మీ కలలు ఆకాశాన్నంటాలి. ప్రతిభకు దేశం గట్టిగా అండగా నిలిచే తరంలో జన్మించడం మీ అదృష్టం.
గతంలో యువత కలలు కనడానికి కూడా భయపడేవారు. ఎందుకంటే పాత వ్యవస్థలు ఏ మంచీ జరగడం సాధ్యం కాదేమోనన్న వాతావరణాన్ని సృష్టించాయి. అంతటా నిరాశ ఆవరించి ఉండేది. కష్టపడి పనిచేయడం వల్ల ఉపయోగం ఏమిటన్న భావనా ప్రజల్లో మొదలైంది. కానీ నేడు మన దేశం ప్రతిభను వెతికి పట్టుకుంటోంది. వారికి ఒక వేదికను అందిస్తోంది. 140 కోట్ల భారతీయుల బలం వారి కలలకు అండగా నిలుస్తోంది.
డిజిటల్ ఇండియా విజయవంతమైంది. ఇంటర్నెట్ శక్తి మీకు అందుబాటులో ఉంది. నేర్చుకోవడానికి మీకు వనరులున్నాయి. విజ్ఞాన శాస్త్రాలు, సాంకేతికత, అంకుర సంస్థల వ్యవస్థాపనల్లో అడుగుపెట్టాలనుకునే వారికోసం అంకుర భారత్ వంటి కార్యక్రమాలున్నాయి. క్రీడల్లో ముందుకు సాగుతున్న వారి కోసం ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలున్నాయి. రెండు రోజుల కిందటే సంసద్ ఖేల్ మహోత్సవ్‌లో కూడా పాల్గొన్నాను. మీరు ముందుకు సాగేలా దోహదపడే లెక్కలేనన్ని వేదికలున్నాయి. మీరు చేయాల్సిందల్లా గట్టిగా దృష్టి పెట్టడమే. ఇందుకోసం స్వల్పకాలిక ప్రాచుర్యం పట్ల ఆకర్షితులవకుండా మీరు జాగ్రత్త వహించాలి. మీ ఆలోచన స్పష్టంగా ఉంటేనే, మీ సిద్ధాంతాలు స్పష్టంగా ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. దేశ మహనీయుల ఆదర్శాల నుంచి స్ఫూర్తిని పొందాలి. మీ విజయాన్ని కేవలం మీకు మాత్రమే పరిమితమైనదిగా భావించకూడదు. మీ విజయాన్ని దేశం సాధించిన విజయంగా చూడాలి.
మిత్రులారా,
నేడు యువత సాధికారతపై దృష్టి సారించి కొత్త విధానాలను రూపొందిస్తున్నాం. దేశ నిర్మాణంలో యువతను కేంద్ర స్థానంలో నిలిపాం. ‘మేరా యువ భారత్’ వంటి వేదికల ద్వారా.. యువతను అనుసంధానించడానికి, వారికి అవకాశాలు కల్పించడానికి, వారిలో నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడానికి కృషి చేస్తున్నాం. అంతరిక్ష ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం, క్రీడలకు ప్రోత్సాహం, ఫిన్‌టెక్, ఉత్పాదక రంగాల విస్తరణ, నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్‌షిప్‌లకు అవకాశాల కల్పన… ఇలా ప్రతి ప్రయత్నం వెనుకా యువ మిత్రులే ఉన్నారు. ప్రతి రంగంలోనూ యువతకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి.
మిత్రులారా,
మునుపెన్నడూ లేని విధంగా ఈ రోజు దేశంలో పరిస్థితులున్నాయి. ప్రపంచంలో అత్యంత యువ దేశాల్లో భారత్ ఒకటి. వచ్చే ఇరవై అయిదేళ్లు మన దేశ భవితను నిర్దేశిస్తాయి. దేశ సామర్థ్యాలు, ఆకాంక్షలు, భారత్‌పై ప్రపంచం అంచనాలన్నీ ఒక్కటవ్వడం స్వాతంత్య్రానంతరం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. గతంలో ఎన్నడూ లేనన్ని అవకాశాలున్న సమయంలో నేటి యువత ముందుకు సాగుతున్నారు. దేశ యువత ప్రతిభ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ సామర్థ్యాలకు మెరుగైన అవకాశాలను అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం.
యువ మిత్రులారా,
అభివృద్ధి చెందిన భారత్‌కు బలమైన పునాది వేయడం కోసం.. మన విద్యా విధానంలోనూ గణనీయమైన సంస్కరణలు చేపట్టాం. కొత్త జాతీయ విద్యా విధానం 21వ శతాబ్దానికి అనుగుణమైన నూతన అభ్యాస పద్ధతులపై దృష్టి సారిస్తుంది. ఆచరణాత్మక అభ్యసనానికి నేడు ప్రాధాన్యమిస్తున్నాం. బట్టీ విధానానికి బదులు ఆలోచించే అలవాటును పెంపొందిస్తున్నాం. పిల్లలు ప్రశ్నలడిగి, జవాబులు పొందేలా ప్రోత్సహిస్తున్నాం. మొదటిసారి ఈ దిశగా అర్థవంతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. బహుళ అంశాల అధ్యయనం, నైపుణ్యాధారిత అభ్యసనం, క్రీడలకు ప్రోత్సాహం, సాంకేతికత వినియోగం విద్యార్థులకు ఎంతో సహాయపడుతున్నాయి. అటల్ టింకరింగ్ ల్యాబుల ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు ఆవిష్కరణలు, పరిశోధనల్లో పాలుపంచుకుంటున్నారు. పాఠశాలల్లోనూ పిల్లలకు రోబోటిక్స్, ఏఐ, సుస్థిరత, డిజైన్ ఆలోచనలను పరిచయం చేస్తున్నాం. వీటితోపాటు మాతృభాషలో చదువుకునే అవకాశాన్ని కూడా జాతీయ విద్యా విధానం కల్పించింది. ఇది పిల్లలకు నేర్చుకోవడాన్ని సులభతరం చేయడంతోపాటు వారు పాఠ్యాంశాలను మరింత బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతోంది.
మిత్రులారా,
ధైర్యవంతులైన సాహిబ్జాదాలు ఆ మార్గం ఎంత కష్టంగా ఉందో చూడలేదు.. అది సరైనదేనా అని మాత్రమే చూశారు. నేడూ అదే స్ఫూర్తి అవసరం. దేశ యువత పెద్ద కలలు కనాలని, కష్టపడి పనిచేయాలని, ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ సన్నగిల్లనివ్వకూడదని ఆశిస్తున్నాను. పిల్లలు, యువత భవితతోనే దేశ భవిత వెలుగొందుతుంది. వారి ధైర్యం, వారి ప్రతిభ, వారి అంకితభావం దేశ ప్రగతిని నిర్దేశిస్తాయి. ఈ విశ్వాసంతో, ఈ బాధ్యతతో, ఈ నిరంతర వేగంతో.. భవిష్యత్తు దిశగా భారత్ ముందుకు సాగుతూనే ఉంటుంది. మరోసారి సాహిబ్‌జాదాలకు భక్తితో నమస్కరిస్తున్నాను. పురస్కార గ్రహీతలందరికీ హృదయపూర్వక అభినందనలు. మీ అందరికీ చాలా ధన్యవాదాలు.
Addressing a programme on Veer Baal Diwas. We remember the exemplary courage and sacrifice of the Sahibzades.
— Narendra Modi (@narendramodi) December 26, 2025
https://t.co/kQPb0RmaIj
Today, we remember the brave Sahibzades, the pride of our nation. They embody India's indomitable courage and the highest ideals of valour. pic.twitter.com/gOoSf5FQlE
— PMO India (@PMOIndia) December 26, 2025
The courage and ideals of Mata Gujri Ji, Sri Guru Gobind Singh Ji and the four Sahibzades continue to give strength to every Indian. pic.twitter.com/9mwfF0VL00
— PMO India (@PMOIndia) December 26, 2025
India has resolved to break free from the colonial mindset once and for all. pic.twitter.com/9l6Dt3F0XI
— PMO India (@PMOIndia) December 26, 2025
As India frees itself from the colonial mindset, its linguistic diversity is emerging as a source of strength. pic.twitter.com/6TA3P9JzA9
— PMO India (@PMOIndia) December 26, 2025
Gen Z… Gen Alpha… will lead India to the goal of a Viksit Bharat. pic.twitter.com/XzwUt2nvtt
— PMO India (@PMOIndia) December 26, 2025