పిఎంఇండియా
బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, సీనియర్ భద్రతా అధికారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ప్రస్తుత ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో బ్రిక్స్ కూటమికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు.
అంతర్జాతీయ పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో కీలకమైన భద్రతా అంశాలపై సహకారాన్ని బలోపేతం చేయడంలో బ్రిక్స్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉగ్రవాదం, సైబర్ భద్రత, అధునాతన సాంకేతికతలు సహా ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడానికి సభ్య దేశాల మధ్య బలమైన సహకారం అవసరమన్నారు.
భారత్ అధ్యక్షత వహిస్తున్న వేళ.. సభ్య దేశాల మధ్య ఆచరణాత్మక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై బ్రిక్స్ కూటమి ప్రధానంగా దృష్టి సారిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యాలను ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. సురక్షితమైన, మరింత భద్రమైన, సమ్మిళిత ప్రపంచాన్ని నిర్మించడంలో భారత్ ఎల్లప్పుడూ సహకారాన్ని అందిస్తుందని స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, సీనియర్ భద్రతా అధికారులను కలవడం సంతోషంగా ఉంది.
అంతర్జాతీయ పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో.. భద్రతా సహకారాన్ని పెంపొందించడంలోనూ, అలాగే ఉగ్రవాదం, సైబర్ భద్రత నుంచి అధునాతన సాంకేతికతల దాకా ఉమ్మడి సవాళ్లకు పరిష్కారాలను అందించడంలోనూ బ్రిక్స్ కీలక పాత్ర పోషిస్తుంది.
ఆచరణాత్మక సహకారాన్ని పెంపొందించడానికీ, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యాలకు ప్రోత్సాహాన్నివ్వడానికీ, అలాగే సురక్షితమైన, భద్రమైన, సమ్మిళిత ప్రపంచ నిర్మాణానికీ భారత్ అధ్యక్షతన బ్రిక్స్ కృషి చేస్తుంది.
***
Pleased to meet National Security Advisors and senior security officials of BRICS countries.
— Narendra Modi (@narendramodi) June 23, 2026
In a changing global landscape, BRICS has a vital role in deepening security cooperation and addressing shared challenges, from terrorism and cyber security to emerging technologies.… pic.twitter.com/ezPEASimJp