పిఎంఇండియా
కేంద్ర బడ్జెట్ 2026-27లోని 28వ పేరాగ్రాఫ్ ప్రకారం ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ (ఎస్జీఎఫ్) ఏర్పాటుకు రూ.10,000 కోట్ల నిధులను కేటాయించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. భారతదేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఆర్థికవృద్ధికి అవసరమైన పెట్టుబడులకు ఊతమివ్వటం, తయారీ, సేవలు, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, వ్యూహాత్మక రంగాల్లో భారత అగ్రగామి సంస్థలను ఏర్పాటు చేయటమే ఈ నిధి ప్రధాన లక్ష్యం. ఎంఎస్ఎంఈ రంగానికి ఈక్విటీ, లిక్విడిటీ, నిపుణుల మద్దతును అందించటంపై 2026-27 కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన అంశంలో ఇదొక భాగం.
ఈక్విటీ సహాయాన్ని అందించే కొన్ని నిధులు ఇప్పటికే ఉన్నాయి. వాటిలో ఎక్కువగా ప్రాథమిక సంస్థలు, సూక్ష్మ పరిశ్రమలపై దృష్టి సారిస్తున్నాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ఈక్విటీ వృద్ధికి పెట్టుబడుల విషయంలో నిర్ణయాత్మక అంతరం ఉంది.
భారత పారిశ్రామిక వ్యవస్థాపకతను బలోపేతం చేసేందుకు, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలకు దేశీయ పెట్టుబడుల మార్కెట్‌ను విస్తరించేందుకు, ప్రపంచస్థాయిలో పోటీపడగల తదుపరి తరం భారతదేశ కంపెనీలను సృష్టించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నట్లు ఈ చరిత్రాత్మక నిర్ణయం తెలియజేస్తుంది. ఇది 2047 నాటికి వికసిత్ భారత్ కల సాకారమయ్యేందుకు తోడ్పడుతుంది.
భారత ఆర్థిక వ్యవస్థలో ఎస్ఎంఈలు కీలకం. ఉపాధి కల్పన, ఎగుమతులు, తయారీ రంగం, నూతన ఆవిష్కరణల్లో ఇవి గణనీయమైన సహకారాన్ని అందిస్తున్నాయి. ఎస్ఎంఈల కోసం రుణ లభ్యతను మెరుగుపరిచేందుకు పలు కార్యక్రమాలు అందుబాటులో ఉన్నప్పటికీ… సంస్థలు వృద్ధి చెందేందుకు, నూతన ఆవిష్కరణలు చేపట్టేందుకు, అంతర్జాతీయంగా విస్తరించేందుకు, ఆధునిక సాంకేతికతలను స్వీకరించేందుకు, కొనుగోళ్లు చేపట్టటానికి, పరిశ్రమల్లో అగ్రగామిగా మారేందుకు అవసరమైన లాంగ్ టర్మ్ రిస్క్ క్యాపిటల్ లభ్యతలో ఇప్పటికీ లోటు ఉంది. వ్యాపార సాధ్యాసాధ్యాలు, విస్తరణ సామర్థ్యాన్ని నిరూపించుకుని, అభివృద్ధికి అవకాశాలున్న ఎస్ఎంఈలకు స్థిరంగా వృద్ధి ఈక్విటీ పెట్టుబడులను అందించటం ద్వారా ఈ కీలక ఆర్థిక అంతరాన్ని పూడ్చేందుకు ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్‌ను రూపొందించారు.
వ్యాపార సంస్థల అభివృద్ధి ప్రయాణంలో కీలక సమయాల్లో అండగా నిలిచే విప్లవాత్మక సాధనంగా ఈ ఫండ్ రూపుదిద్దుకుంది. ఎస్జీఎఫ్ నుంచి కేటాయించే నిధుల్లో అధిక భాగం… చిన్న, మధ్యతరహా తయారీ రంగ సంస్థల కేటాయింపునకే వెళ్తుంది. టైర్-II, టైర్-III నగరాల్లోని పారిశ్రామిక క్లస్టర్లలో ఎస్ఎంఈ కార్యకలాపాలకు కూడా ఈ నిధిని కేటాయిస్తారు.
ఈ కార్యక్రమం ద్వారా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టటం వల్ల ఎస్ఎంఈలు కార్యకలాపాలను విస్తరించుకునేందుకు, సాంకేతికత, తయారీ సామర్థ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశానికి, ప్రపంచ విలువ వ్యవస్థతో అనుసంధానానికి, వ్యూహాత్మక పెట్టుబడులకు వీలవుతుంది. సంబంధిత రంగాల్లో అగ్రగామి సంస్థలుగా ఎదిగేందుకు అవసరమైన స్థాయి, ఆవిష్కరణ, సామర్థ్యం, పోటీతత్వం గల భారత కంపెనీల వ్యవస్థ వేగంగా రూపుదిద్దుకునేందుకు ఈ ఫండ్ దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
సంస్కరణలు, డిజిటలైజేషన్ కార్యక్రమాలు, రుణ మద్దతు విధానాలు, సులభతర వ్యాపార సౌలభ్యం, ప్రభుత్వ కొనుగోళ్ల సంస్కరణలు, స్టార్టప్ ప్రోత్సాహకాలు, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాల ద్వారా ఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు, ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ పట్ల ప్రభుత్వానికున్న నిబద్ధత తోడ్పడుతుంది.
ఎస్జీఎఫ్ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్)కి రూ.10,000 కోట్ల నిధులను ఈ పథకం ద్వారా భారత ప్రభుత్వం సమకూరుస్తుంది. తయారీ రంగ సంస్థలు ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించుకునేందుకు, ఆధునిక సాంకేతికతలను స్వీకరించేందుకు, మరింత వృద్ధి చెందేందుకు ఎస్జీఎఫ్ తోడ్పడుతుంది. తద్వారా సంస్థల స్థాయి, ఉత్పాదకత మెరుగుపడటంతో పాటు ఎగుమతి పోటీతత్వం బలోపేతం అవుతుంది. టైర్-II, టైర్-III నగరాలతో సహా పారిశ్రామిక క్లస్టర్లలో పెట్టే పెట్టుబడులు ప్రాంతీయ పరిశ్రమల అభివృద్ధికి మద్దతిస్తాయి. స్థానిక సరఫరా వ్యవస్థలను బలోపేతం చేస్తాయి. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసే ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి.
భారతదేశ పారిశ్రామికవేత్తలను శక్తిమంతం చేసేందుకు, నూతన పోటీతత్వ సంస్థలను పెంపొందించటానికి ప్రభుత్వానికున్న నిబద్ధతను ఈ పథకం ద్వారా స్పష్టం చేసింది. అధిక వృద్ధి సాధించే ఎస్ఎంఈల పెట్టుబడులకు ఊతమివ్వటం ద్వారా అగ్రగామి సంస్థలను సృష్టించేందుకు, ఆవిష్కరణల ఆధారిత పారిశ్రామికీకరణను కొనసాగించేందుకు, దేశవ్యాప్తంగా ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసే ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఈ ఫండ్ సహాయపడుతుంది. తద్వారా వికసిత్ భారత్-2047 లక్ష్యసాధనలో కీలక ఆధారంగా ఈ కార్యక్రమం నిలుస్తుంది.
***