ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్-2026ను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్న పండుగల సీజన్ సందర్భంగా అంతర్జాతీయ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలుపుతూ… ఈ సదస్సుకు హాజరైన వారందరికీ ప్రధానమంత్రి స్వాగతం పలికారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై చర్చించడానికి ఈ సదస్సును ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు.
ఎన్డీటీవీ సదస్సు చర్చల సమయోచిత ప్రాధాన్యతను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. సరికొత్త ప్రపంచ వ్యవస్థ గురించిన చర్చలు ఇప్పుడు ప్రతిచోటా వినిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో వస్తున్న మార్పులు నేరుగా సామాన్య ప్రజల రోజువారీ జీవితాలపై ప్రభావం చూపడమే దీనికి కారణమని ఆయన తెలిపారు. ఈ క్షేత్రస్థాయి పరిణామాలు ఇలాంటి అంతర్జాతీయ సదస్సుల అవసరాన్ని మరింత పెంచుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. “ఇలాంటి పరిస్థితుల్లో, ఇటువంటి ప్రపంచస్థాయి సదస్సుల ప్రాముఖ్యత ఇంకా ఎంతో పెరుగుతుంది” అని ప్రధానమంత్రి శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు.
‘ది వరల్డ్ బిట్వీన్ ఆర్డర్స్’ ప్రధానాంశంగా ఉన్న చర్చను ప్రస్తావిస్తూ… ప్రస్తుత వ్యవస్థ ఎందుకు మారుతోంది, పాత పద్ధతులు నేటి సంక్షోభాలను పరిష్కరించడంలో ఎందుకు విఫలమవుతున్నాయి అనే విషయాలను ప్రపంచ దేశాలు ప్రాథమికంగా పరిశీలించాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ద్వారా ప్రపంచ వేదికపై మన దేశానికి ఉన్న ప్రత్యేక బాధ్యతలను అర్థం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. “రెండో అంశం, మారుతున్న ఈ ప్రపంచంలో భారత్ పాత్ర ఏమిటి?” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ సంబంధాల క్రమం పరిణామాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. చర్చలు, పరస్పర సహకారం కేవలం అధికార బలం కంటే ఎంతో గొప్పవనే నమ్మకంతోనే ఐక్యరాజ్యసమితి ఏర్పాటయిందని ఆయన గుర్తుచేశారు. కొత్త ఆర్థిక వ్యవస్థలు, సాంకేతికతలు, పాత నిర్ణయాధికార వ్యవస్థలో లేని కొత్త దేశాలు తెరపైకి వచ్చినప్పుడు… దానికి అనుగుణంగా మారడంలో ప్రపంచ సంస్థలు విఫలమయ్యాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఒకప్పుడు దేశాలను అనుసంధానించిన వ్యాపారం, సాంకేతికత, సముద్ర మార్గాలు ఇప్పుడు ఒకరిపై ఒకరు ఆయుధాలుగా వాడుకునే రంగాలుగా, ఘర్షణలు-భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్రాలుగా మారిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. నిర్ణయాలు తీసుకునే సంస్థలకు, ప్రస్తుత వాస్తవ పరిస్థితులకు మధ్య అంతరాన్ని తొలగించే ఒక సమగ్రమైన నూతన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ఉద్ఘాటించారు. “ఇక్కడి నుంచే, భారత్ పాత్ర గురించిన ప్రశ్న తెరపైకి వస్తుంది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన తీవ్రమైన విభేదాలు, పరస్పర అనుమానాలు, నమ్మకరాహిత్యాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ప్రపంచీకరణను గొప్పగా సమర్థించిన దేశాలు సైతం ఆ సమయంలో తమ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చాయని ఆయన పేర్కొన్నారు. మానవాళి ఉమ్మడి సంక్షేమం, మానవత్వం కేంద్రంగా ఒక నూతన ప్రపంచ వ్యవస్థను నిర్మించాలని 2020లో తాను జీ20 వేదికగా చేసిన విజ్ఞప్తిని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అదే సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (యూఎన్జీఏ) వేదిక నుంచి ప్రపంచ సంస్థల తక్షణ మార్పు, పరిణామం గురించీ తాను ఇచ్చిన సందేశాన్ని ఆయన పునరుద్ఘాటించారు. “శతాబ్దం మారుతున్నప్పుడు మనం మారకపోతే, మార్పును సాధించే మన సామర్థ్యం కూడా బలహీనపడుతుంది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
నూతన ప్రపంచ వ్యవస్థ రూపకల్పనను ప్రస్తావిస్తూ… అంతర్జాతీయ సంస్థల్లో తక్షణ సంస్కరణలు చేపట్టాలని, ‘గ్లోబల్ సౌత్’ స్వరానికి తగిన ప్రాధాన్యమివ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అంతర్జాతీయ సహకారం కేవలం అనుకూలమైన రోజుల్లోనే కాకుండా… తీవ్రమైన సంక్షోభాలు ఎదురైనప్పుడూ బలంగా నిలబడేలా ఉండాలని ఆయన పేర్కొన్నారు. “దీనికోసం భాగస్వామ్య దేశాలన్నింటి మధ్య బలమైన ఏకాభిప్రాయం అవసరం” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
చాణక్యుడి అర్థశాస్త్రంలో చెప్పినట్లుగా… బలవంతులు బలహీనులని అణిచివేయడం గురించిన మత్స్య న్యాయాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వేదికపై ఇలాంటి ఆధిపత్య ధోరణులను నిరోధించడమే భారత్ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి సమయంలో ధనిక దేశాలన్నీ తమ స్వార్థం చూసుకుంటే… భారత్ మాత్రం 100కు పైగా దేశాలకు వ్యాక్సిన్లు, మందులను అందించి తన సేవా నిరతిని నిరూపించుకుందని శ్రీ మోదీ గుర్తుచేశారు. “ప్రపంచానికి ఇప్పుడు మత్స్య న్యాయం లాంటి పరిస్థితులు రాకుండా అడ్డుకునే బలమైన వ్యవస్థ కావాలి” అని ఆయన ఉద్ఘాటించారు.
‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే మూలమంత్రంతో పనిచేస్తూ, ప్రపంచ వేదికపై భారత్ ‘విశ్వబంధు’గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న తీరును ప్రధానమంత్రి వివరించారు. జీ20, బ్రిక్స్ సదస్సులకు భారత్ ఆతిథ్యమిచ్చిన సమయంలో.. భిన్నాభిప్రాయాలున్న దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాదంటూ ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమైన అనుమానాలనూ ఆయన ప్రస్తావించారు. ఆ విభేదాలను అధిగమించి రెండు సార్లూ ఏకగ్రీవంగా ‘ఢిల్లీ డిక్లరేషన్’ను సాధించడంలో దేశం విజయవంతమైందని శ్రీ మోదీ గుర్తుచేశారు. “విశ్వబంధుగా భారత్ పట్ల ప్రపంచానికి గల నమ్మకానికి ఇదే నిదర్శనం” అని ఆయన స్పష్టం చేశారు.
పెరుగుతున్న భారత్ బలం… ప్రపంచ సంక్షేమానికి ఏ విధంగా తోడ్పడుతుందో ప్రధానమంత్రి వివరించారు. దేశీయ విధానాలు తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా, శాశ్వతమైన సాంస్కృతిక విలువల ఆధారంగా రూపొందుతాయన్నారు. బలమైన భారత్… ప్రపంచ స్థిరత్వానికీ, నిరంతర అభివృద్ధికీ భరోసానిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇటీవల తాను ప్రకటించిన ‘పవర్ టు ఎంపవర్’ దార్శనికతను గుర్తుచేస్తూ… స్వయంసమృద్ధిని సాధించిన, ఆర్థికంగా బలంగా మారిన, నైపుణ్యాలతో కూడిన ‘వికసిత్ భారత్’… ప్రపంచ సరుకు రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ఉత్పాదకతనూ పెంచడం ద్వారా ప్రపంచ శ్రేయస్సుకు తోడ్పాటునందిస్తుందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. “అంటే, ప్రపంచ సామర్థ్యాన్ని మరింత పెంపొందించడం కోసమే భారత్ నేడు తన సొంత సామర్థ్యాన్ని పెంపొందించుకుంటోంది” అని ఆయన ఉద్ఘాటించారు.
ప్రపంచంలోని మూడు ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవాలన్న భారత్ అవిశ్రాంత కృషిని పునరుద్ఘాటిస్తూ… తీవ్రమైన అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడం దేశ మనోస్థైర్యాన్ని మరింత పెంచుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. హరిత ఇంధనం, కృత్రిమ మేధ, అంకురసంస్థలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వంటి రంగాల్లో ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో భారత్ ఉందని ఆయన గర్వంగా ప్రస్తావించారు. “రియల్-టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో భారత్ నంబర్ వన్ స్థానంలో ఉంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సాంకేతిక, పర్యావరణ రంగాల్లో భారత్ సాధించిన చరిత్రాత్మక విజయాలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలోనే తొలిసారిగా ‘ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్’ క్రిటికాలిటీని సాధించడం, జాతీయ జనాభా గణనలో డిజిటల్ సాంకేతికతను జోడించడం, మొట్టమొదటి హైడ్రోజన్ రైలును నడపడం వంటి కీలక విజయాలను ఆయన గుర్తుచేశారు. వీటితో పాటు హరిత ఇంధన రంగంలో దేశం సాధించిన భారీ ప్రగతిని శ్రీ మోదీ వివరించారు. “దేశ చరిత్రలోనే తొలిసారిగా శిలాజేతర విద్యుత్ సామర్థ్యం 300 గిగావాట్ల మార్కును దాటింది” అని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల ఆసియా క్రీడల్లో 85 పతకాలతో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారులతో తాను జరిపిన సంభాషణలను ప్రధానమంత్రి పంచుకున్నారు. క్రీడారంగంలో మన అథ్లెట్లు సాధించిన అపూర్వ విజయాలను ఆయన కొనియాడారు. ముఖ్యంగా, ఆసియా క్రీడల చరిత్రలోనే తొలిసారిగా మహిళల రికర్వ్ ఆర్చరీలో జట్టు విభాగం, వ్యక్తిగత విభాగంలోనూ స్వర్ణ పతకాలను కైవసం చేసుకోవడాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వీరితో పాటు, భారత బాక్సర్లు ఒకే ఆసియా క్రీడల ఎడిషన్‌లో ఏకంగా మూడు బంగారు పతకాలను సాధించి సరికొత్త రికార్డు సృష్టించారని శ్రీ మోదీ ప్రశంసించారు.
ఫుట్‌బాల్, వాలీబాల్ అంశాల కలయికతో కేవలం కాళ్లతో మాత్రమే ఆడే సరికొత్త క్రీడ ‘సెపక్ తక్రా’ గురించీ ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ ఆటలో అంతర్జాతీయ క్రీడాకారులు ఎప్పటి నుంచో పతకాలు సాధిస్తున్నారని పేర్కొన్న ఆయన, ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు ఈ భిన్నమైన క్రీడలోనూ సరికొత్త రికార్డు సృష్టించారని గర్వంగా ప్రకటించారు. “ఆసియా క్రీడల చరిత్రలోనే తొలిసారిగా, ఈ క్రీడల పురుషుల క్వాడ్రంట్ విభాగంలో భారత్ పతకం సాధించింది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
వివిధ రంగాల్లో దేశం సాధిస్తున్న ఈ అపూర్వ విజయాలను మారుతున్న భారత్‌కు నిదర్శనంగా ప్రధానమంత్రి అభివర్ణించారు. మన దేశం తన పాత, సంప్రదాయిక బలాలను మరింత బలోపేతం చేసుకుంటూనే.. సరికొత్త రంగాల్లోనూ తిరుగులేని శక్తిగా అవతరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ మార్పులు అనుకోకుండా జరిగినవి కావనీ… ఒక స్పష్టమైన, ప్రణాళికాబద్ధమైన పాలనా విధానం వల్లే ఇవి సాధ్యమయ్యాయని ఆయన స్పష్టం చేశారు. “రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ (సంస్కరణ, పనితీరు, పరివర్తన) అనే మా విధివిధానాల ఫలితమే ఇది” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
భారత ఉమ్మడి సంకల్ప శక్తే దేశాన్ని మార్చివేస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సంకల్ప బలంతో దేశం ముందుకు సాగుతున్నప్పుడు… ఆ దేశంలోని మౌలిక సదుపాయాలు బలహీనతగా కాకుండా ఆ దేశ స్థిరత్వానికి, ఎదురులేని శక్తికి చిహ్నంగా మారుతాయని ఆయన వ్యాఖ్యానించారు. “ఆ పవర్ గ్రిడ్ దేశ ప్రగతిని, ఆత్మవిశ్వాసాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది” అని శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు.
‘వికసిత్ భారత్’ నిర్మాణంలో యువత, మహిళలు, రైతులు, మత్స్యకారులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు చూపిస్తున్న ఉత్సాహాన్ని ప్రధానమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబరు నెలలో వస్తువుల ఎగుమతులు 25 శాతం పెరిగాయనీ, గత 12 ఏళ్లలో సముద్ర సంబంధ ఆహార ఎగుమతులూ రెండింతల కంటే ఎక్కువయ్యాయని సూచిస్తూ, సంబంధిత గణాంకాలను వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 3.5 కోట్లకు పైగా మహిళలను ‘లక్షాధికారులు’గా తీర్చిదిద్దామని, త్వరలోనే 6 కోట్ల మందిని లఖ్పతి దీదీలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అలాగే ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ కింద 70 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించామని శ్రీ మోదీ తెలిపారు. మధ్యతరగతి ప్రజలకు రూ. 12 లక్షల వరకు ఆదాయం కోసం ఆదాయ పన్నును పూర్తిగా మినహాయించామని ప్రధానమంత్రి వెల్లడించారు. “దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయనీ, ఉపాధికి సరికొత్త అవకాశాలూ లభిస్తున్నాయని” ఆయన స్పష్టం చేశారు.
గతంలో ‘ప్రపంచ దేశాల బ్యాక్ ఆఫీస్’ (సేవా కేంద్రం) గాను, సాధారణ సేవలందించే దేశంగానే ఉండిపోయిన భారత్.. నేడు ఆ స్థితి నుంచి ఎంతగానో ఎదిగి ‘ప్రపంచ దేశాల బ్రెయిన్ ఆఫీస్’గా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ ఇప్పుడు ప్రపంచం కోసం సరికొత్త సాంకేతికతలను ఆవిష్కరిస్తూ, రూపొందిస్తూ, సొంతంగా నిర్మిస్తోందని ఆయన స్పష్టం చేశారు. పరిశోధనా వ్యాసాల ప్రచురణలోనూ మన దేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచిందని, ఒక్క 2025 సంవత్సరంలోనే దాదాపు 1.5 లక్షల పేటెంట్ దరఖాస్తులు నమోదయ్యాయని ఆయన గణాంకాలతో వివరించారు. “పరిశోధనలు, ఆవిష్కరణల పరంగా చూస్తే.. దేశంలో ఉన్న అపారమైన అవకాశాలకు ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు
దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని గురించి ప్రస్తావిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా చిప్ డిజైనింగ్ రంగంలో పనిచేస్తున్న మొత్తం నిపుణుల్లో 20 శాతం మంది భారత్‌లోనే ఉన్నారని ప్రధానమంత్రి వెల్లడించారు. మన దేశానికి చెందిన ఇంజనీర్లు అత్యాధునికమైన ‘2 నుంచి 3 నానోమీటర్ల’ చిప్‌లను రూపొందించుటలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిభావంతుల సమూహాన్ని మరింతగా విస్తరించడం కోసం విద్యా సంస్థల్లో ప్రభుత్వం అన్ని రకాల వసతులను కల్పిస్తోందని ఆయన తెలిపారు. “మన దేశ విద్యార్థులు ఇప్పటివరకు 325 కంటే ఎక్కువ చిప్ డిజైన్లను సిద్ధం చేశారు” అని శ్రీ మోదీ సగర్వంగా ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్’ (జీసీసీ)లో సగానికి పైగా భారత్‌లోనే ఉన్నాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ కేంద్రాలు కేవలం సాధారణ సహాయక సేవలకే పరిమితం కాకుండా.. ప్రస్తుతం అత్యాధునికమైన కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంజనీరింగ్, అనలిటిక్స్, సరికొత్త ఉత్పత్తుల రూపకల్పన దిశగా దూసుకుపోతున్నాయని ఆయన వివరించారు. ప్రపంచ దేశాల నమ్మకం, భారతీయుల శ్రమతో భారత్ ఇప్పుడు మేధోశక్తిగా మారుతోందన్నారు. మన దేశం ‘టాలెంట్ ఎట్ స్కేల్’ నుంచి ‘థింకింగ్ ఎట్ స్కేల్’ (ఉన్నత ఆలోచనా విధానం) స్థాయికి ఎదిగిందని ఆయన ప్రకటించారు. “మనం ఇప్పుడు ప్రపంచ దేశాలకు కేవలం ఒక బ్యాక్ ఆఫీస్‌గా మాత్రమే కాదు, ఒక ‘బ్రెయిన్ ఆఫీస్’ (మేధో కేంద్రం)గానూ సేవలందిస్తున్నాం” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
దేశీయ సామర్థ్యాలను పెంపొందించడం, విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, భవిష్యత్తులో ఎదురయ్యే సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవడం లక్ష్యంగా గల ప్రభుత్వ విధానాలు, దీర్ఘకాలిక పెట్టుబడుల వెనక ఉన్న వ్యూహాత్మక ఆలోచనను ప్రధానమంత్రి వివరించారు. ఔషధ రంగం గతంలో ముడిసరుకుల కోసం విదేశాలపై ఎలా ఆధారపడేదో ఆయన గుర్తుచేశారు. యాంటీబయాటిక్స్ తయారీకి అత్యంత కీలకమైన ‘పెన్సిలిన్ జి’ ముడిపదార్థాన్ని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం కిందికి తీసుకురావడం ద్వారా… దశాబ్దాలుగా నిలిచిపోయిన దాని దేశీయ ఉత్పత్తిని ప్రభుత్వం విజయవంతంగా పునరుద్ధరించిందని ఆయన వివరించారు. “ఇప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో చాలా ఏళ్ల తర్వాత పెన్సిలిన్ జి దేశీయ ఉత్పత్తి మళ్లీ ప్రారంభమైంది” అని శ్రీ మోదీ తెలిపారు.
ఔషధ రంగంలో కేవలం పెన్సిలిన్ జి మాత్రమే కాకుండా… సంపూర్ణ స్వయంసమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని ప్రధానమంత్రి తెలిపారు. ఇందుకోసం ‘పీఎల్ఐ’ పథకం ద్వారా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐలు – మందుల తయారీకి వాడే ముడిపదార్థాలు) కోసం దేశీయంగా ఒక పూర్తి స్థాయి సరుకు రవాణా వ్యవస్థను ప్రభుత్వం నిర్మిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్దిష్ట విధానాల వల్ల ఇప్పటికే దాదాపు 40 కార్యాచరణ ప్రాజెక్టుల్లో రూ. 5,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని ఆయన వెల్లడించారు. “ఇలాంటి విధానాలు, నిర్ణయాలే దేశాన్ని స్వయంసమృద్ధి వైపు నడిపిస్తున్నాయి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
140 కోట్ల మంది భారత పౌరుల అపరిమితమైన ఆకాంక్షలు, అలాగే ‘వి విల్ డూ ఇట్’ (మనం దీనిని సాధించగలం) అనే నినాదంతో సాగే ‘వికసిత్ భారత్’ మహోన్నత లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. సరికొత్త ఆవిష్కరణలు చేయడం, కొత్త మార్గాలను నిర్మించడం, సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడం ద్వారా భారత్ విజయాలను ప్రపంచ శ్రేయస్సుతో అనుసంధానిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సదస్సులో వ్యక్తమయ్యే అద్భుత ఆలోచనలు దేశ సంకల్పాలకు మరింత శక్తినిస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తూ… హాజరైన ప్రతినిధులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. “మనం పెద్ద కలలు కంటాం, ప్రతి సవాలును ఒక అవకాశంగా మారుస్తాం, ప్రతి సంకల్పాన్ని కచ్చితంగా నెరవేరుస్తాం” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
***
Speaking at the NDTV World Summit. @ndtv https://t.co/JFVAkeRZWQ
— Narendra Modi (@narendramodi) October 22, 2026
The changing world order calls for stronger global institutions, a greater voice for the Global South and international cooperation that stands firm in times of crisis. https://t.co/vGxL8xZSyW
— PMO India (@PMOIndia) October 22, 2026
Viksit Bharat is not just a promise for its people, but a guarantee of a better world. https://t.co/XFDMCTmZcK
— PMO India (@PMOIndia) October 22, 2026
India is strengthening its own capabilities to help strengthen the world. https://t.co/Qc3NljPQPW
— PMO India (@PMOIndia) October 22, 2026
From Back Office to Brain Office of the world. https://t.co/hG0CZpPhiP
— PMO India (@PMOIndia) October 22, 2026