Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్‌లోని బనస్కాంతలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

గుజరాత్‌లోని బనస్కాంతలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం


భారత్‌ మాతాకీ జై!

భారత్‌ మాతాకీ జై!

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘవి, శాసనసభాపతి శ్రీ శంకర్ భాయ్ చౌధరి, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు సహా నా సోదరీసోదరులారా!

   గుజరాత్‌లోని అన్ని గ్రామాల రైతులు సహా దేశంలోని ప్రతి జిల్లాలోగల అన్నదాతలంతా సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని నేడు మనతో అనుసంధానమయ్యారు. ప్రత్యేకించి కర్షకుల కోసం ఏర్పాటు చేసిన ఈ కీలక కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ప్రముఖులందరికీ నా హృదయపూర్వక స్వాగతం.

బనస్కాంత ఇవాళ తనదైన ప్రత్యేకతను చాటుకుంది… ఎలాగంటే- నేనిప్పుడే తెరమీద చూసిన మేరకు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు మంచాల (చార్పాయీ) మీద కూర్చుని ఈ సభతో ముడిపడి ఉండటం ప్రపంచంలో బహుశా ఎక్కడా కానరాదు. అంతెందుకు… దేశ ప్రజలకూ ఇదొక అద్భుత దృశ్యమేనన్నది నా భావన. మన గ్రామీణ ప్రాంతాల ఈ విశిష్ట సంప్రదాయాన్ని బనస్కాంత ప్రజలు నేడు మరోసారి ఇలా చాటిచెప్పారు. మీరొక వేళ ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ వారికి ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే, కచ్చితంగా ఇది ప్రపంచ రికార్డుగా నమోదయ్యేది. ఓ క్షణం కిందటే ఇక్కడ ఆ విషయం ప్రస్తావనకూ వచ్చింది.

ఇక మీరు నాకు అప్పగించిన బాధ్యతల నిర్వహణలో నేటితో 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఇదెంత యాదృచ్ఛికమో చూడండి- ఈ పాతికేళ్ల ప్రస్థానం తర్వాత, నా తొలి పర్యటన మన బనస్కాంతలోనే కావడం గమనార్హం. మీకు గుర్తుందో లేదో.. 2001లో నేను ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశాక నా తొలి ప్రధాన బహిరంగ సభ ‘డీసా’లోనే నిర్వహించాం. నాడిక్కడ అందులో పాల్గొన్న నేటి పెద్దలకు సదరు ‘లోక కళ్యాణ మేళా’ గుర్తుండే ఉంటుంది. ఆ కార్యక్రమం నిజంగా చరిత్రాత్మకం! ఆ రోజున కేవలం ఒక్క జిల్లా నుంచి 3 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. ఆనాటి రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదనే భావిస్తున్నాను.. అది బనస్కాంతకే సొంతం. నా ప్రస్థానం అలా అక్కడ మొదలు కాగా, ఇప్పుడిక్కడే నా పాతికేళ్ల సేవా ప్రస్థాన వివరాలను మీతో పంచుకునే అవకాశం నాకు లభించింది.

నవరాత్రి వేడుకలు ముగిసిన కొద్ది రోజులకే అంబా మాత పావన భూమికి వచ్చే అదృష్టం నాకు దక్కింది. ఆ జగదేక మాతకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. కొద్దిసేపటి కిందటే మహిళలు, బాలలు, రైతులు, పశుపోషకులకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు  ఇక్కడ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసుకున్నాం. దీంతోపాటు దేశవ్యాప్తంగా గల కోట్లాది చిన్న రైతులకు ‘పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి’ కింద తాజా విడత ఆర్థిక సహాయం వారి ఖాతాల్లో జమ చేశాం. ఈ సందర్భంగా గుజరాత్ సహా దేశ ప్రజలకు, రైతులందరికీ నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా!

గుజరాత్, బనస్కాంత ప్రజలంతా నన్ను మన్నించాలి… నేనీ రోజు గుజరాతీలో కాకుండా హిందీలో మాట్లాడాల్సి వస్తోంది. ఎందుకంటే- దేశం నలుమూలల నుంచి ఈ కార్యక్రమంతో ప్రజలెందరో ఈ కార్యక్రమంతో ముడిపడి ఉన్నారు. ఇందుకు అనుమతిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది.

మిత్రులారా!

మన రైతులే మనకు అన్నదాతలు.. ‘వికసిత భారత్’ సంకల్ప సాకారంలో అత్యంత బలమైన మూలస్తంభాలలో వారూ ఒకరు. కాబట్టే, మా ప్రభుత్వం సదా రైతు సంక్షేమానికి, సాధికారతకు అత్యంత ప్రాధాన్యమిచ్చింది. ఆ మేరకు 2013-14తో పోలిస్తే, దేశ వ్యవసాయ బడ్జెట్ ఇప్పుడు 5 రెట్లకు మించి పెరిగింది. ‘పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి’  కోట్లాది చిన్నకారు రైతుల జీవితాల్లో అంతర్భాగమైంది. ఈ రోజు దాదాపు 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ₹18,000 కోట్లకు పైగా నగదు జమ అయింది. వీరిలో గుజరాత్‌ రాష్ట్ర రైతులు 50 లక్షల మందికి పైగా లబ్ధి పొందారు. వారి ఖాతాల్లో ₹1,000 కోట్లకు పైగా  జమ అయ్యాయి. ఒక్క బనస్కాంత జిల్లాలోనే, లక్షలాది రైతు కుటుంబాల ఖాతాలకు దాదాపు ₹50 కోట్లు చేరాయి.

మిత్రులారా!

మా ప్రభుత్వం కొన్నేళ్లుగా అనుసరించిన విధానాల వల్ల రైతులకు ₹50 లక్షల కోట్లు… 50 లక్షల కోట్ల రూపాయలకుపైగా విలువైన ప్రయోజనాలు అందాయి. ఇప్పుడు కేవలం ఓ 5 పథకాలను మీ సమక్షంలో ఉటంకిస్తాను. ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ కింద దాదాపు ₹4.5 లక్షల కోట్లు నేరుగా చిన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. అదిగో అక్కడొక సోదరి ఓ చిత్రం పట్టుకుని చాలా సేపటినుంచీ నిలుచుంది.. తల్లీ నువ్వు నన్ను ఓడించావ్‌… చేతులు నొప్పెట్టి కాసేపటికే ఆ చిత్రాన్ని కిందకు దించేస్తావని నేను భావించాను. నా అంచనా తప్పింది.. ఆమె తెచ్చిన అందమైన చిత్రాన్ని అందుకోవాలని ఎస్‌పీజీ సిబ్బందిని కోరుతున్నాను. ఆమె అంతసేపు పట్టుకుని అలసిపోతోంది.. కాబట్ట్టి వారు అక్కడే ఆ చిత్రాన్ని తీసుకుంటారు, తల్లీ! అక్కడే ఉండమ్మా! మా సిబ్బంది దాన్ని తీసుకుంటారు.

ఇక మన కార్యక్రమంలోకి వద్దాం… స్వాతంత్ర్యం వచ్చాక చిన్న-సన్నకారు రైతుల అవసరాలను ఏ ప్రభుత్వమూ సరిగ్గా అర్థం చేసుకోలేదు. వారి ఇక్కట్లపై దృష్టి సారించింది లేదు. మన దేశంలోని మొత్తం రైతుల్లో 85 శాతం.. 85 శాతానికిపైగా చిన్న రైతులే! అంత పెద్ద సంఖ్యలోగల రైతుల సమస్యలను మా ప్రభుత్వం మాత్రమే అర్థం చేసుకుంది. కాబట్టే, ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా వారికి అండగా నిలిచింది.

మిత్రులారా!

ప్రపంచవ్యాప్తంగా కొన్నేళ్ల నుంచీ అనిశ్చితి నెలకొన్న ఫలితంగా ఎరువుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయినప్పటికీ, రైతులపై నిబద్ధతగల మా ప్రభుత్వం ఆ భారం వారిపై పడకుండా జాగ్రత్త వహించింది. ఇందుకోసం దాదాపు ₹16 లక్షల కోట్లు వెచ్చించింది. మీకందరికీ ఎరువులు అందుబాటు ధరలో లభించేలా చూడటం కోసం ప్రభుత్వ ఖజానా నుంచి ₹16 లక్షల కోట్లు కేటాయించింది. తద్వారా రైతులపై ఎలాంటి భారం పడకుండా చూశాం.

మిత్రులారా!

మునుపటి ప్రభుత్వాలు కనీస మద్దతు ధర విషయంలో రైతులను పదేపదే తప్పుడు హామీలతో మోసగించాయి. కానీ, మా ప్రభుత్వం తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చింది. గడచిన పన్నెండేళ్లలో గోధుమ, వరి సాగు చేసే రైతులకు కనీస మద్దతు ధర రూపేణా ₹24 లక్షల కోట్లదాకా నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది.

మిత్రులారా!

‘ప్రధానమంత్రి పంటల బీమా పథకం’ (పీఎంఎఫ్‌బీవై) ద్వారా మా ప్రభుత్వం రైతులకు ఒక బలమైన రక్షణ వలయం నిర్మించింది. ఆ పథకాన్ని మేం భారీ స్థాయిలో అమలు చేశాం. ఈ మేరకు పది-పన్నెండేళ్ల కాలంలో పంట నష్టం వాటిల్లినప్పుడల్లా రైతులకు బీమా రూపేణా ₹2 లక్షల కోట్లకు పైగా పరిహారం అందింది. పంటలు దెబ్బతిన్న ప్రతిసారి  బీమా మద్దతు ద్వారా ఆ సొమ్ము వారి ఖాతాలకు చేరింది. మరోవైపు రైతుల సాగునీటి వ్యయం తగ్గించడానికీ నిరంతరం కృషి చేస్తున్నాం. ఈ దిశగా పీఎం కుసుమ్’ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. దీనికింద ఇప్పటికే సాగునీటి అవసరాల కోసం సౌరశక్తితో పనిచేసే దాదాపు 12 లక్షల సౌర పంపులను రైతులకు సమకూర్చాం. దీనివల్ల విద్యుత్తు మాత్రమేగాక డీజిల్ అవసరం కూడా గణనీయంగా తగ్గింది. వీటిని సమకూర్చని పక్షంలో రైతులు 80 కోట్ల లీటర్లకు పైగా డీజిల్‌ కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు లక్షలాది రైతులకు ఈ భారీ వ్యయం తప్పటమే కాదు.. ఆదా అయింది. ఇంకొకవైపు విద్యుదుత్పాదన కూడా అదనంగా పెరిగింది. ఒక్కమాటలో- కేవలం ఈ 5 పథకాలు, నిర్ణయాలతోనే రైతులకు ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూరడం వల్ల సుమారు ₹50 లక్షల కోట్ల మేర వారికి ఆదా అయింది. ఇదేమీ చిన్న మొత్తం కాదు… ఈ ₹50 లక్షల కోట్లు రైతు ఆదాయం పెంచడమేగాక దేశ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేశాయి.

మిత్రులారా!

వ్యవసాయం మన సంప్రదాయం… సంస్కృతి. కనుకనే పన్నెండేళ్లుగా మా ప్రభుత్వం ఈ రంగంలో విజ్ఞాన శాస్త్రం, సాంకేతికతలను విస్తృతంగా అనుసంధానించింది. అలాగే, వ్యవసాయం, పశుపోషణను శాస్త్రీయ పద్ధతులతో జోడించాం. భూసార కార్డులు ఇందుకు అద్భుత ఉదాహరణ. లోగడ తమ పొలాల్లో ఏ పంటకు.. ఏ రకమైన ఎరువులు.. ఎంత పరిమాణంలో అవసరమో తెలుసుకోవడం రైతులకు కష్టంగా ఉండేది. భూసార కార్డులతో ఈ సమస్య కాస్తా పరిష్కృతమైంది. ఇవాళ రైతుల చేతిలో గల 26 కోట్లకు పైగా భూసార కార్డులు సాగు పద్ధతులను ఆధునికీకరించాయి.

మిత్రులారా!

వాతావరణ పరిస్థితులలో మార్పులు రైతులకు పెను సవాలుగా పరిణమించాయి. అందుకే, ఆ పరిస్థితులకు తగిన కొత్త రకం వంగడాలను రైతులకు నిరంతరం సరఫరా చేసేందుకు మేం కృషి చేస్తున్నాం. కొన్నేళ్లుగా సుమారు 3 వేల కొత్త రకం వంగడాలను రైతులకు అందుబాటులోకి తెచ్చాం.

మిత్రులారా!

మన గ్రామీణార్థిక వ్యవస్థలో పశుపోషణ ఓ కీలక భాగం. ఇందులో మన అక్కచెల్లెళ్ల పాత్ర చాలా కీలకం. గత దశాబ్దం నుంచీ పశుపోషణ-పాడి పరిశ్రమ రంగాల్లోనూ విజ్ఞాన శాస్త్రం, సాంకేతికల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాం. పశు జాతులు మెరుగుపడితే పాడి ఉత్పత్తి పెరుగుతుంది. ఇంతకుముందే శంకర్ భాయ్ చెప్పినట్టుగా ఒకప్పుడు 4 ఆవులు ఇచ్చే పాలు ఇప్పుడు ఒక్క ఆవు ద్వారానే లభించేలా చేయడంపై మేం లక్ష్యనిర్దేశం చేసుకున్నాం. పశువులకు సరైన సమయంలో టీకాలిచ్చి, తరచూ సోకే వ్యాధులకు చికిత్స సదుపాయం కల్పిస్తే వ్యాధుల వల్ల కలిగే నష్టాలను తగ్గించవచ్చు. మరో మాటలో- పశువులు ఆరోగ్యంగా ఉంటే పశుపోషణలో గల మన సోదరీసోదరులకు ఆదాయం పెరుగుతుంది.

మిత్రులారా!

మీకందరికీ తెలిసే ఉంటుంది… ‘జాతీయ గోకుల మిషన్’ ద్వారా దేశీయ పశుజాతుల  సంరక్షణ, శాస్త్రీయ పద్ధతుల్లో పశుపోషణను ప్రోత్సహిస్తున్నాం. బనస్కాంతలో ఏర్పాటు చేసిన కొత్త పరిశోధన కేంద్రం ఈ మిషన్‌ను మరింత బలోపేతం చేస్తుంది. ‘గిర్, సాహివాల్, కాంక్రేజ్’ వంటి దేశీయ ఆవు జాతులతోపాటు మెహసానా, ముర్రా, జాఫరాబాదీ వంటి గేదె జాతులను ఇక్కడ సంరక్షిస్తారు. అదే సమయంలో వీటి నాణ్యత మెరుగుకూ విస్తృత కృషి సాగుతోంది. కాంక్రేజ్ జాతి పశువుల కోసం దేశంలోనే ఇలాంటి సదుపాయం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఒక రైతువద్ద అత్యుత్తమ నాణ్యత గల ఆవు ఉందనుకుందా.. అది ఎక్కువ పాలివ్వడంతోపాటు తక్కువ ఖర్చుతో ఆరోగ్యంగానూ ఉంటుంది! అలాంటప్పుడు రైతు సహజంగానే ఆ పశువుకున్న మంచి లక్షణాలు దాని తదుపరి తరానికీ సంక్రమించాలని ఆకాంక్షిస్తాడు. ఇలాంటి లక్ష్యాలను సాధించడంలో ‘ఐవీఎఫ్’ వంటి ఆధునిక సాంకేతికతలు తోడ్పడతాయి. తద్వారా ఈ ఉత్తమ లక్షణాలు తర్వాతి తరం పశువులకు అందే అవకాశం పెరుగుతుంది. దీనివల్ల నేరుగా పశుపోషకులకే ప్రయోజనం చేకూరుతుంది.

మిత్రులారా!

వ్యాధుల బారినుంచి పశువులను రక్షించడం కూడా మా ప్రాథమ్యాలలో ఒకటి. ముఖ్యంగా ‘గాలికుంటు వ్యాధి’ పశువుల ఆరోగ్యంపైనే కాకుండా, పాల ఉత్పత్తిపైనా దుష్ప్రభావం చూపుతుంది. అందుకే, దేశవ్యాప్తంగా మేం ఉచిత టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పటిదాకా పశువులకు దాదాపు 150 కోట్ల టీకాలు అందించగా, రైతుల వద్దగల కోట్లకుపైగా పశువులకు ఉచితంగా టీకాలు వేశారు. దీనివల్ల పశుపోషకులపై ఆర్థిక భారం తగ్గింది.

మిత్రులారా!

మేం చేస్తున్న ఈ కృషి ప్రభావం పాల దిగుబడిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎలాగంటే… 2013–14లో ఒక ఆవు లేదా గేదె రోజుకు సగటున 5 లీటర్లకన్నా తక్కువగా పాలు ఇచ్చేది. మీరు నన్ను ఢిల్లీ స్థాయికి పంపినప్పుడు ఇదే పరిస్థితి.. రోజుకు 5 లీటర్లకన్నా తక్కువే! అయితే, ఇవాళ జాతీయ సగటు రోజుకు సుమారు 8 లీటర్ల స్థాయికి పెరిగింది. పాల దిగుబడిలో భారత్‌ వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యంత వేగంగా పురోగమిస్తూ నేడు మన దేశం అంతర్జాతీయంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ ప్రయోజనాలు ఇవాళ గ్రామాలకు చేరి, రైతు కుటుంబాల ఆదాయం పెరిగింది.

మిత్రులారా!

పశుపోషకులు కేవలం పాడితోనే కాకుండా, పేడతోనూ ఆదాయం పొందాలన్నది మా యోచన. ఆ మేరకు పేడ, వ్యవసాయ వ్యర్థాలనుంచి బయోగ్యాస్, బయో సీఎన్‌జీ, సేంద్రియ ఎరువుల తయారీకి తగిన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. ఇందులో ‘బనస్ డెయిరీ’ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజున రెండు బయో సీఎన్‌జీ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. ఈ మేరకు ఆరోగ్యకర పశుసంపద, అధిక పాల దిగుబడి, పేడ సంపూర్ణ సద్వినియోగం తదితరాలపై మా లక్ష్యం స్పష్టమవుతోంది. పశుపోషణను ఒక సంప్రదాయంగానే కాకుండా రైతుల ఆదాయం పెంచి, గ్రామాలను సుసంపన్నం చేసే బలమైన మార్గంగా మేం మారుస్తున్నాం. కాసేపటి కిందటే నేనిక్కడి మహిళలతో సంభాషించినపుడు- తాము ₹2 కోట్ల విలువైన పాలను సరఫరా చేస్తున్నామని వారు చెప్పారు. రోజుకు ₹2 కోట్ల విలువైన పాలు… ఆశ్చర్యమే కదా! అప్పుడు మీరెంత వరకూ చదువుకున్నారని వారినడిగాను. బదులుగా “నాలుగు పుస్తకాలు” అని వారు చెప్పారు. కానీ, వారు ₹2 కోట్ల విలువైన పాలను నిత్యం సరఫరా చేస్తున్నారంటే అద్భుతమేగా!

మిత్రులారా!

సమగ్ర గ్రామీణాభివృద్ధి కోసం కొన్నేళ్లుగా మేమొక సమ్మిళిత దృక్పథంతో పనిచేశాం. మత్స్య రంగాన్నే ఉదాహరణగా తీసుకుంటే- అదెంతగా విస్తరించిందో మీకే తెలుసు. దేశం నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు రెట్టింపును మించి పెరిగాయని తెలిస్తే మీరెంతో ఆనందిస్తారు. మన మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి చేపలు, రొయ్యలు వేటాడి విక్రయిస్తున్నారు. ఈ రంగం నేడు అద్భుత ప్రగతి సాధించింది.. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో మత్స్య రంగంలో సహకార వ్యవస్థను కూడా ప్రోత్సహిస్తున్నాం.

మిత్రులారా!

మరొక రంగం కూడా మన రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారింది.. అదే తేనెటీగల పెంపకం. ఈ పన్నెండేళ్లలో తేనె ఉత్పత్తి రెట్టింపు పెరిగింది. నాకింకా గుర్తుంది… లోగడ బనస్కాంతకు వచ్చిన సందర్భంలో ‘మధుర విప్లవం’ (స్వీట్‌ రివల్యూషన్‌) తేవాలని మిమ్మల్నందర్నీ నేను కోరాను. నా కోరికను మన్నించి బనస్కాంత నేడు తేనె ఉత్పత్తిలో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. కొద్దిసేపటి కిందట ఇక్కడి మహిళలతో మాట్లాడినప్పుడు- తాము ₹35 లక్షల విలువైన తేనెను విక్రయించామని వారు చెప్పారు. ప్రకృతి సహజ తేనె ఎగుమతిలో భారత్‌ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం స్థాయికి చేరిందని తెలిస్తే మీరంతా తప్పక గర్విస్తారు. ఈ మధుర విప్లవంలో మన మహిళా స్వయం సహాయ సంఘాల పాత్ర కూడా నిరంతరం పెరుగుతోంది.

మిత్రులారా!

నేను ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టి కొద్ది రోజుల కిందట.. అంటే- అక్టోబరు 7న పాతికేళ్లు పూర్తయ్యాయి. అయితే, ఇదంతా నిన్నమొన్ననే జరిగిందన్నట్లు అనిపిస్తోంది. అవును… 2001 అక్టోబరు 7న నేను తొలిసారి పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు. నాటి నుంచీ మీరంతా మీ నరేంద్ర భాయ్‌కి ఎంతో ఆదరణను, అపార ప్రేమాభిమానాలను అందించారు. అయితే, ఇవాళ నాకిక్కడ కాస్త ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే- దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎవరెలా పిలిచినా పర్వాలేదుగానీ, ఇక్కడ శంకర్ భాయ్ నన్ను “ప్రధానమంత్రి సాహెబ్, ప్రధానమంత్రి సాహెబ్” అని సంబోధించారు. మీరే చెప్పండి.. ఇక్కడ ఇలాంటి పిలుపు నాకెలా నచ్చుతుంది? ప్రజానీకం సహజంగానే “మన నరేంద్ర భాయ్ వచ్చారు” అంటుంటారు. ఆ పిలుపే నాకెంతో సంతోషాన్నిస్తుందా.. లేదా? మీరే చెప్పండి. “ప్రధానమంత్రి సాహెబ్” అనడంలో ఏముంది? గుజరాత్‌లోని నా సోదరులంతా “మన నరేంద్ర భాయ్” అన్నపుడు నా హృదయం భావోద్వేగంతో నిండిపోతుంది. ఈ పిలుపు ద్వారా కేవలం ప్రేమను పంచడం మాత్రమే కాదు.. ప్రతి గుజరాతీ వ్యక్తి నాకు ఏదో ఒకటి నేర్పించారు.

    నాకు సముచిత మార్గనిర్దేశం చేసి, నన్నెంతో ఉత్తేజపరిచారు. అప్పట్లో నాకు ప్రభుత్వ కార్యాలయాల గురించి, పనితీరు గురించి లేదా ఫైళ్ల గురించి ఏమీ తెలియదు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన నేను ఏ తరంలోనూ కనీసం గ్రామ నాయకుడిని కావాలని కూడా ఆలోచించని ఓ సామాన్యుడిని. అలాంటిది- మొదట రాష్ట్ర స్థాయిలో గుజరాత్‌కు, ఆ తర్వాత జాతీయ స్థాయిలో దేశానికి సేవ చేసే బాధ్యతను అప్పగించింది మీరే! ఇంతకుముందు ఇక్కడి మహిళలతో మాట్లాడుతున్న సందర్భంగా ‘జ్యోతిగ్రామ్’  (గ్రామాల్లో నిరంతర విద్యుత్ సరఫరా), నీటి సదుపాయం, ప్రకృతి వ్యవసాయం, పశుసంపద సంబంధిత కార్యక్రమాల వంటి ఆలోచనలు నాకు ఎలా వచ్చాయని వారు అడిగారు. నేను బదులిస్తూ- “దీని వెనుక ప్రత్యేక సూత్రమేమీ లేదు.. నాకు అన్నీ నేర్పింది మీరే.. నేను చేసిందల్లా వాటిని అమలులోకి తేవడమే” అని చెప్పాను.

మిత్రులారా!

ప్రజా సేవే.. దేశ చేసే సేవ అని, గుజరాత్ అభివృద్ధి చెందితేనే భారత్‌ కూడా పురోగమిస్తుందని, ఈ రెండు విషయాలు మాత్రమే నాకు తెలుసు. ఎలా పనిచేయాలి.. ఎలా ముందుకు సాగాలి? అనేదంతా మీరే నాకు నేర్పారు. దేశం కోసం నేను చేయగలిగినదంతా పౌరులందరికీ.. ముఖ్యంగా మీ అందరికీ చెందుతుంది. ఇందుకుగాను నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. తుదిశ్వాస దాకా ప్రజా సేవకే అంకితమవుతాను.. మీకందరికీ సేవ చేయడం.. కేవలం సేవ ఒక్కటే నా జీవిత పరమావధి.

మిత్రులారా!

ఇప్పుడిక్కడున్న పెద్దలకు ఆనాటి రోజులు గుర్తుండే ఉంటాయి. పాతికేళ్ల కిందట నేనిక్కడికి వచ్చినప్పుడు నీరు, విద్యుత్తు సమస్యలు తీవ్రంగా ఉండేవి. అందుకే, నేను అప్పుడు “మనం విద్యుత్తును, నీటిని పొదుపు చేయాలి” అని చెప్పేవాణ్ని. అప్పుడు రైతులు- “నీరు పొదుపు చేయమని చెప్పడానికి మోదీ ఎవరు? కనీసం మాకు కరెంటు కూడా ఇవ్వటం లేదు కదా!” అని నన్ను నిలదీసే వారు. అప్పుడు నేనూ మీతో వాదిస్తూ వచ్చాను.. చివరికి మీరు నా మాటను అంగీకరించారు. నేడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకోగలిగామో చూడండి! ఆ పాత సమస్యలు ఇప్పుడు జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలాయి. మీకు మళ్లీ అదే విషయం చెబుతున్నాను.. ఇప్పుడు కూడా మనం నీటిని, విద్యుత్తును కూడా పొదుపు చేయాలి.

మిత్రులారా!

నర్మదా నది జలాలు, బిందు సేద్యం వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు బనస్కాంత రూపురేఖలను ఆమూలాగ్రం మార్చేశాయి. ఈ ప్రాంత స్వరూపాన్నేగాక దాని గతిని కూడా మార్చేశాయి. బనస్కాంత బంగాళదుంపలు ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. కాబట్టి, బనస్కాంత వాస్తవ్యుడితో ఎవరూ “బంగాళదుంపను నేను బంగారంగా మారుస్తాను” అనలేరు. ఎందుకంటే- “నేనిప్పుడు చేస్తున్నది అదే”నని అతడు జవాబిస్తాడు. ఇక్కడ మనకు ‘బనస్ డెయిరీ’ వంటి సహకార సంస్థ ఉంది. ఇది కాశీ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకూ సహకార ఉద్యమ వ్యాప్తికి దోహదం చేస్తోంది. ఇందుకుగాను బనస్ డెయిరీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ అనుభవం, మీ సేవలతో నా నియోజకవర్గం కాశీలో కూడా ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ బంగాళదుంపల ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా తన సామర్థ్యాన్ని విస్తరించింది. దీనివల్ల మరింత ఎక్కువగా బంగాళదుంపలను కొనుగోలు సాధ్యమవుతుంది. తద్వారా రైతులకు ఒక ప్రధాన సౌకర్యం, మద్దతు లభిస్తాయి.

మిత్రులారా!

పండ్లు, కూరగాయలు సాగు చేసే రైతుల కోసం క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం అమలవుతోంది. ఈ కార్యక్రమం కింద ఈ రోజు 12 క్లస్టర్లకు ఆమోదం ఇచ్చాం. టమోటా, బంగాళాదుంప, మిరప, ద్రాక్ష, అరటిపండ్లు, ఉల్లిపాయలు, నారింజ, దానిమ్మ, కోకో వంటి పండ్లు-కూరగాయలతో ఇవన్నీ ముడిపడి ఉంటాయి. ఈ కార్యక్రమం కింద రైతులకు కొత్త తోటల ఏర్పాటు, పాతవి పునరుద్ధరణలో మద్దతిస్తాం. పాత తోటల పునరుజ్జీవనం దిశగా ప్రజలకు శిక్షణ, మార్గనిర్దేశం లభిస్తుంది. అంతేకాకుండా మొత్తం ప్రాజెక్టుకు సబ్సిడీలు లభిస్తాయి. ఉత్తర గుజరాత్‌లో ఆమోదం పొందిన రెండు క్లస్టర్లు బనస్కాంత, సబర్కాంత బంగాళాదుంప రైతులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తాయి.

మిత్రులారా!

ఈ రోజు గుజరాత్‌ రాష్ట్రానికి సంబంధించిన అనేక ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకూ ప్రారంభోత్సవం చేశాం. దీంతోపాటు గుజరాత్‌కు రెండు కొత్త రైల్వే సేవలు లభించాయి. ఆ మేరకు అహ్మదాబాద్-వారణాసి సబర్మతి ఎక్స్‌ప్రెస్, మెహసానా–బెచరాజీ–సబర్మతి మెము రైలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి రెండూ అత్యంత కీలక రైలు సంధాన ప్రాజెక్టులు. వీటికి అదనంగా అహ్మదాబాద్ మెట్రో సేవలను కూడా విస్తరిస్తున్నాం. మరోవైపు గిఫ్ట్ సిటీ, విమానాశ్రయ సంధాన మెట్రో ప్రాజెక్టులకు ఈ రోజు శంకుస్థాపన చేశాం. అహ్మదాబాద్–మెహసానా హైవే 4 వరుసల నుంచి 8 వరుసలకు విస్తరించనుంది.

మిత్రులారా!

గుజరాత్‌లోని బాలల కోసం 4,000కు పైగా ఆధునిక అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. వీటి ద్వారా దాదాపు 4 లక్షల మంది పిల్లలు, గర్భిణులు ప్రయోజనం పొందుతారు.

మిత్రులారా!

వికసిత భారత్‌ స్వప్నం నెరవేరడమే లక్ష్యంగా ఈ తరహాలో అన్నింటా కృషి చేస్తున్నాం. దేశంలోని ప్రతి రైతు, యువకుడు, కుమార్తె, సోదరి నేడు ఇదే సంకల్పంతో దూసుకెళ్తున్నారు. దురదృష్టవశాత్తూ, కొందరికి ఇదంతా నచ్చడం లేదు… ఈ పురోగమనాన్ని కొందరు సహించలేకపోతున్నారు. దేశం కష్టాల్లో కూరుకుపోవడమే వాళ్లకు కావాలి. ప్రజలు ఇక్కట్లు పడటమే వారికి ఆనందం. జాతికి పెను సవాలు ఎదురైనప్పుడు ఇలాంటి వ్యక్తులు సంతోషిస్తారు.

మిత్రులారా!

ఇరాన్, గల్ఫ్ ప్రాంతాల్లో యుద్ధమే ఇందుకు తాజా ఉదాహరణ. దీని దుష్పరిణామాలను ఎదుర్కోవడానికి యావద్దేశం ఏకమైన తరుణాన, వీరు వదంతుల వ్యాప్తికి ప్రయత్నించారు. ఇకపై ఎరువులు దొరకవని రైతులలో ఆందోళన రేకెత్తించారు. కృత్రిమ కొరతతో జనం బారులు తీరేలా చేసి, గందరగోళ వాతావరణం సృష్టించారు. వంట గ్యాస్ ఇక సులభంగా దొరకదని, వంట ఎలా చేస్తారు.. పిల్లలు బడికి ఎలా వెళ్తారు? అంటూ మహిళల్లో భయాందోళనలు పుట్టించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి భయం, ఆందోళన, అశాంతి చెలరేగేలా చేయడం ద్వారా మోదీకి చెడ్డపేరు తేవాలన్నది వారి కుతంత్రం.

మిత్రులారా!

ఈ సందర్భంగా దేశంలోని రైతులందరికీ నేనొక విషయం గుర్తు చేయదలిచాను. మోదీ మీకు అండగా ఉంటాడని అప్పట్లోనే చెప్పాను… ఇప్పుడు యుద్ధం కొనసాగుతున్నా, అదే మాట ప్రకారం రైతులకు ఎరువుల కొరత రాకుండా మోదీ జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎరువుల సరఫరాకు ఎలాంటి ఆటంకం, లోటు లేకుండా శ్రద్ధ వహిస్తున్నాం.

మిత్రులారా!

ఈ యుద్ధం వల్ల ప్రపంచమంతటా ఎరువుల ధరలే కాకుండా వాటి తయారీకి వాడే రసాయనాల ధరలూ విపరీతంగా పెరిగిపోయాయి. అయినప్పటికీ, ఈ భారం రైతులపై పడకుండా ప్రభుత్వం నిభాయించింది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో దాదాపు ₹3,000 పలికే బస్తా యూరియా ధర మన రైతులకు ₹300కన్నా తక్కువకే లభిస్తోంది. ప్రపంచ మార్కెట్‌లో బస్తా యూరియా ధర ₹3,000దాకా ఉన్నా, ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. అలాగే బస్తా డీఏపీ ఎరువు ధర ₹5,000 దాటినా, మన రైతులకు ₹1,350కే లభిస్తోంది. మన రైతులు మరింత సాధికారత సాధించాలని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని కృతనిశ్చయంతో ఉన్నందునే దేశం వారికి ఇలా మద్దతిస్తోంది.

మిత్రులారా!

అనిశ్చితితో కొట్టుమిట్టాడుతున్న నేటి ప్రపంచంలో, భారత్‌ శరవేగంగా పురోగమించడం అంతర్జాతీయంగా ఆశలు చిగురింపజేస్తోంది. ఇటువంటి పరిస్థితుల నడుమన మనం ‘ఒకే భారత్-శ్రేష్ఠ భారత్’ మార్గంలో ముందడుగు వేయాలి. ఈ దిశగా రేపు.. అక్టోబరు 31న మన సంకల్పాన్ని మరింత దృఢంగా చాటాల్సిన రోజు… సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి. అంటే- ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’… దేశమంతా ఈ వేడుకను ఘనంగా నిర్వహించుకుంటుంది. ఇందులో భాగంగా ‘ఐక్యతా పరుగు’ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ దిశగా దేశవ్యాప్తంగా భారీ సన్నాహాలు పూర్తయ్యాయని సమాచారం లభిస్తోంది. దేశ పౌరులందరినీ.. ముఖ్యంగా మన యువ మిత్రులను రేపు ‘ఐక్యతా పరుగు’లో ఉత్సాహంగా పాల్గొనాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను.

మిత్రులారా!

ఏటా అక్టోబరు 31న ఉదయం ‘ఏక్తా నగర్’లో ‘ఐక్యతా దినోత్సవం’ నిర్వహిస్తుంటారు. అయితే, ఈ ఏడాది ‘ఐక్యతా పరుగు’, తదితర కార్యక్రమాల దృష్ట్యా దీన్ని సాయంత్రం నిర్వహిస్తారు. మునపటితో పోలిస్తే ఈ ఏడాది ఇదొక మార్పు.. ఈ మేరకు రేపు సాయంత్రం 5:30 గంటలకు ఏక్తా నగర్‌లో అద్భుత ‘ఐక్యతా దినోత్సవం’ నిర్వహిస్తారు. దీన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తారు కాబట్టి, మీరంతా టీవీలలో తప్పక చూడండి. గుజరాత్ గడ్డపై నిర్వహించే ఈ కవాతు, ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాల నాటి కార్యక్రమాలను గుర్తుచేస్తుంది కాబట్టి,. తప్పకుండా చూడండి. ఇందులో పోలీసు, భద్రత దళాల కవాతు సహా ఆకట్టుకునే శకట ప్రదర్శన కూడా ఉంటుంది. దేశ పౌరులంతా రేపు సాయంత్రం నిర్వహించే ఈ కార్యక్రమంతో మమేకం కావాలని ఆకాంక్షిస్తున్నాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కామాఖ్య దాకా- యావద్దేశం సర్దార్ పటేల్‌కు నివాళి అర్పిస్తూ, ‘ఒకే భారత్-శ్రేష్ఠ భారత్’ సంకల్పాన్ని పునరుద్ఘాటించాలి. ఈ పిలుపుతో పాటు నేటి అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి మీకందరికీ మరోసారి నా శుభాకాంక్షలు.

అనేకానేక ధన్యవాదాలు.

అక్కడ వెనుక వరుసలోని తల్లులు, అక్కచెల్లెళ్లు నన్ను ఆశీర్వదిస్తున్నారు. తల్లులారా!  మీకు పాదాభివందనం.. మీ ఆశీస్సులే సదా నాకు శ్రీరామ రక్ష! మీకందరికీ ఎంతో కృతజ్ఞుడినై ఉంటాను.

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

గమనిక: ప్రధానమంత్రి హిందీ (కొంత గుజరాతీ) ప్రసంగానికి ఇది స్వేచ్చానువాదం మాత్రమే. ప్రసంగంలోని ప్రధానాంశాల వివరణే ఈ అనువాదం ధ్యేయం.

 

***