Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారా గేమ్స్‌లో భారత్ గెలిచిన పతకాలు 14 నుంచి 114కు చేరిక.. ఈ అసాధారణ ప్రగతిని ప్రస్తావించిన ప్రధానమంత్రి


ఆసియా పారా గేమ్స్‌లో భారత్ గెలిచిన పతకాల సంఖ్య 14 నుంచి 114కు చేరుకోవడంలోని అసాధారణ వృద్ధిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ విజయం దేశ క్రీడాకారుల అపార సామర్థ్యాలకు, ప్రతిభకు అద్దం పడుతోందని ఆయన అన్నారు.
భారతీయ క్రీడాకారులు 30 స్వర్ణ పతకాలను చేజిక్కించుకున్నారని, అయిదు ప్రపంచ రికార్డులతో పాటు తొమ్మిది ఆసియా రికార్డులను నెలకొల్పారని, అంతేకాకుండా నాలుగు పోటీలలో  ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నారని ప్రధానమంత్రి వివరించారు.
రెండు కీలక విజయాలను గురించి శ్రీ మోదీ తెలియజేస్తూ, ఆసియా పారా గేమ్స్‌లో మొదటిసారి పాల్గొన్న 61 మంది క్రీడాకారులలో 36 మంది పతకాలు గెలుచుకువచ్చారన్నారు. 56 మంది మహిళా క్రీడాకారులలో 34 మంది పతకాలను సాధించారని ఆయన వెల్లడించారు.
దృఢసంకల్పంతో ప్రయత్నించినప్పుడు ఏ కలను అయినా నెరవేర్చుకోవచ్చని, ఏ సవాలునైనా సరే  అధిగమించవచ్చని క్రీడాకారులు నిరూపించారని ప్రధానమంత్రి అన్నారు. క్రీడలంటే ఆసక్తినిగల వారి పట్ల  సమాజం  చిన్నచూపు చూపించే రోజులు పోాయాయని, ప్రతిభావంతులకు భారత్ మద్దతిచ్చి ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా రాశారు:
“1️⃣4️⃣ నుంచి 1️⃣1️⃣4️⃣ కు
ఒక కోణంలో చూస్తే ఇవి సంఖ్యలే.. ఇవి ఆసియా పారా గేమ్స్‌లో భారత్ సాధించిన అద్భుత ప్రగతిని కూడా చాటిచెబుతున్నాయి.  
అయితే, ఇంత కన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, అది మన క్రీడాకారుల అపార శక్తిసామర్థ్యాలను, ప్రతిభను ఇది తెలియజేస్తోంది.
ఈ ఏడాది భారతీయ క్రీడాకారులు ఈ కింద పేర్కొన్న విజయాల్ని సాధించారు:
30 స్వర్ణ పతకాలు, 5 ప్రపంచ రికార్డులు, 9 ఆసియా రికార్డులకు తోడు, పోడియంలో ఉండే మూడు స్థానాల్లోనూ భారతీయులే విజేతలుగా నిలబడటం.
రెండు గణాంకాలు నాకు ఎంతో నచ్చాయి.. అవి:
ఆసియా పారా గేమ్స్‌లో తొలి సారి పాల్గొన్న 61 మంది అథ్లెట్లలో, 36 మంది అథ్లెట్లు పతకాలు తేవడం.
56 మంది మహిళా అథ్లెట్లలో 34 మంది పతకాలు సాధించడం.

దృఢసంకల్పంతో ప్రయత్నిస్తే ఏ కలనైనా నెరవేర్చుకోవచ్చని, ఏ సవాలునైనా సరే అధిగమించగలమని మన క్రీడాకారులు నిరూపించారు.
క్రీడలంటే మక్కువను కనబరిచే యువజనులపై సమాజం కన్నెర్ర చేసే రోజులు పోయాయి.
ప్రస్తుతం, మీలో ప్రతిభ ఉందంటే, భారత్ మీకు అండగా నిలచి  అడుగడుగునా ప్రోత్సహిస్తుంది. 
రండి, ఆడుతూ ప్రకాశించండి’’.

***