నిత్యోత్సాహి అయిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రిమండలిలో నా సీనియర్ సహచరుడు-ఇదే స్థానం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్, శ్రీ జయంత్ చౌదరి, పార్లమెంటులో సహచరులు శ్రీ పంకజ్ చౌదరి, ఉప ముఖ్యమంత్రులు శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య, శ్రీ బ్రజేశ్ పాఠక్, ఇతర ప్రజా ప్రతినిధులు, నా యువ మిత్రులారా!
ఇంతటి భారీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం కోసం మన మిత్రుడు శ్రీ జయంత్ చౌదరి లక్నో నగరాన్ని ఎంపిక చేసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. నా మాటలు విని మీరు కరతాళధ్వనులు చేస్తున్నారుగానీ, నేనెందుకు సంతోషిస్తున్నానో ఇంకా చెప్పలేదు కదా! నేను ఉత్తరప్రదేశ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తుండటమే అందుకు కారణం. అంతేకాదు… దేశం నలుమూలల నుంచి వచ్చిన యువ మిత్రులకు స్వాగతం పలికే అవకాశం లభించడం కూడా నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను.
మిత్రులారా!
ఈ రోజు మీరు మీ జీవితంలో ఓ కీలక మలుపును చేరుకున్నారు. దేశ ప్రగతి ప్రస్థానంతో ప్రత్యక్షంగా అనుసంధానితులు కాబోతున్నారు. ఇది నాకూ చాలా ముఖ్యమైన రోజే. ఎందుకంటే- ఈ ఉదయం నేను ఢిల్లీ నుంచి బెంగాల్ వెళ్లాను.. అక్కడ మొదట ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నాను. దేశంలోనే మొదటి ఐఐటీ ఏర్పాటైంది ఆ నగరంలోనే కాగా, ఇప్పుడది తన 75వ వార్షికోత్సవం నిర్వహించుకుంటోంది. అక్కడి విద్యార్థులతో కలిసినప్పటి ఉత్సాహం, కలలు, ఆశలు, ఆకాంక్షలతో ఇప్పుడిక్కడి ఐటీఐ విద్యార్థులను కలిసిన సందర్భంలోనూ నాలో ఉప్పొంగుతున్నాయి. ఐఐటీ లేదా ఐటీఐ ఏదైనా నా దృష్టిలో అవి రెండూ మన దేశానికి అమూల్య సంపదే. దేశ శక్తిసామర్థ్యాలకు, భవిష్యత్తుకు పునాదులివే. ఐటీఐలలో మీరు పొందిన నైపుణ్యం, పరిజ్ఞానం ఇక ‘వికసిత భారత్’ సాకారానికి నవ్యోత్తేజమిస్తాయి. ఈ అభివృద్ధి చెందిన భారత దేశం మీ చేతుల మీదుగా, మీ నైపుణ్యాలతోనే రూపుదిద్దుకుంటుంది. ఏ దేశమైనా తన యువత నైపుణ్యాల ఆధారంగానే నిస్సందేహంగా పురోగమిస్తుంది. మన దేశం సదా నైపుణ్యాన్ని, కళా ప్రతిభనూ గౌరవిస్తూ వచ్చింది. లక్నో నగరాన్నే ఉదాహరణగా తీసుకోండి- ఇక్కడ ‘చికన్’ ఎంబ్రాయిడరీ పనితనం ఎంత అద్భుతంగా ఉంటుందో గమనించండి! ఒకప్పుడు ఇలాంటి నిపుణులు, కళల ద్వారానే భారత్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. అత్యంత నాణ్యమైన మస్లిన్ వస్త్రాలు, బెనారస్-కాంచీపురం పట్టు వస్త్రాలు, కాశ్మీరీ పష్మీనా, పత్తి వస్త్రాలు, కలంకారీ కళ, ప్రపంచంలోనే అత్యుత్తమ ఖడ్గాల తయారీకి వాడే ఉక్కు, కాంస్యం, పంచలోహాలతో చేసిన శిల్పాలు ఇందుకు నిదర్శనాలు. లెక్కలేనన్ని ఇలాంటి కళలు, నైపుణ్యాలకు మన దేశం నెలవు. ఈ జాబితాను ఏకరవు పెట్టాలంటే ఎవరి వల్లా కాదంటే అతిశయోక్తి లేదు! ఒకనాడు మన సమాజానికి మూలస్తంభాలివే.
మిత్రులారా!
మన సామాజిక వ్యవస్థ యావత్తూ లోగడ నైపుణ్య పునాదిపై నిర్మితమై ఉండేది. ఈ క్రమంలో గుజరాత్ వాస్తవ్యుడినైన నేను, అక్కడి ఓ సంప్రదాయం గురించి మీతో చెప్పాలని భావిస్తున్నాను. మా రాష్ట్రంలో ‘వస్వాయ’ అనే పదం వినిపిస్తూంటుంది. అంటే- ఒక గ్రామం ఏర్పడినప్పుడు, అక్కడి ప్రజల జీవనానికి అవసరమైన వస్తుతయారీ నైపుణ్యం గల వ్యక్తులంతా అక్కడే స్థిరపడేవారు. అప్పుడు మాత్రమే ఏ గ్రామం ఉనికికైనా సంపూర్ణ అర్థం ఉంటుంది. వారి నైపుణ్యాలు ఎంత కీలకమైనవంటే- వారు లేని గ్రామ జీవనాన్ని ఊహించడం కూడా అసాధ్యం!
మిత్రులారా!
దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ అనాదిగా ఇలాంటి వ్యవస్థలుండేవి. దురదృష్టవశాత్తూ, కాలక్రమంలో ఈ వ్యవస్థకు ప్రాధాన్యం తగ్గిపోయింది. మన జీవితాలు దుర్భరం కాకుండా ఉండాలంటే ఎలాంటి నైపుణ్యాలు అవసరం? అనే ప్రశ్న నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా మదిలో మెదిలింది. దాంతో ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా అధికారులను కోరాను. వారు ఒక అధ్యయనం అనంతరం 30–35 రకాల నైపుణ్యాల జాబితా ఇచ్చారు. అయితే, ఆ విధంగా మరో కోణంలో ఆలోచించాలని సూచించాను. ఒక వ్యక్తి ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మళ్లీ రాత్రి నిద్రించే దాకా… అలాగే పుట్టినప్పటి నుంచి మరణించే వరకూ… సదరు వ్యక్తికేగాక కుటుంబానికి, సమాజానికి ఎటువంటి సేవలు అవసరమవుతాయి? వాటిలో అత్యంతావశ్యకమైనవి ఏవి? తదితరాలపై స్వీయానుభవాల ద్వారా జాబితా రూపొందించమని కోరాను. దాంతో వారు ఒక వారం పాటు లోతుగా ఆలోచించి, దాదాపు వెయ్యి రకాల వృత్తుల జాబితాను నా చేతిలో పెట్టారు. పుష్పగుచ్ఛాలు తయారు చేసేవారు, బొమ్మలు చేసేవారు, మెహందీ పెట్టేవారు…ఇలా ఎన్నో రకాల సేవలందించేవారు మనకు అవసరమని అప్పుడు వారికీ అర్థమైంది. ఇటువంటి కళా ప్రతిభ, నైపుణ్యమే సమాజాన్ని ముందుకు నడిపిస్తాయి. కాబట్టి, ఆ కోణంలో దృష్టి సారించాలని అధికారులను కోరాను. ఇదంతా ఆ తర్వాత గుజరాత్లో ఒక ఆధునిక నైపుణ్యాభివృద్ధి వ్యవస్థ స్థిరపడేందుకు దారితీసింది.
మిత్రులారా!
భారత నిపుణుల వ్యవస్థ నాశనానికి ఓ కారణం ఉంది. మన దేశంపై దండయాత్రలు మొదలు కావడానికి ముందు నాగరకత స్వర్ణయుగం ప్రస్ఫుటంగా కనిపించేది. యావత్ ప్రపంచం ఇది చూసి ఎంతో మురిసిపోతే, మరికొందరు అసూయపడేవారు. అలాంటి అసూయతోనే దురాక్రమణదారులు తొలుత మన నైపుణ్యాలను, కళా ప్రతిభను లక్ష్యం చేసుకున్నారు. మన అద్భుత కళాకారులు సృష్టించిన అత్యుత్తమ వస్తువులను కానుకలుగా స్వీకరించి, మరెవరి వద్దా అలాంటివి ఉండటానికి వీల్లేదనే స్వార్థంతో వారి బొటనవేళ్లను నరికేసిన చరిత్ర మీలో ఎంతమంది చదివి ఉంటారు? భారతదేశపు సంపదకు, గొప్పదనానికి ప్రజల నైపుణ్యమే మూలమని వారికి తెలుసు. ఆ నైపుణ్యాలను నాశనం చేస్తే, దేశాన్నే బలహీనపరచవచ్చన్నది వారి ఆలోచన. ఆ తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు… వారు మరింత తెలివిగా, పద్ధతిగా వ్యవహరించారు. మన నైపుణ్యాధారిత సంప్రదాయాలను పక్కనపెట్టి, కేవలం గుమాస్తాలను తయారు చేసే మెకాలే విద్యా విధానాన్ని మనపై రుద్దారు. ఆ విధంగా మన దేశ నైపుణ్యాలను నాశనం చేసి, తమ పరిశ్రమలను అభివృద్ధి చేసుకున్నారు. మన వనరులను దోచుకుని, తమ తయారీ రంగాన్ని విస్తరించుకున్నారు. కాలక్రమేణా కాగితం ఆధారిత క్లర్కుగా పనిచేయడమే ఒక గౌరవంగా పరిగణనలోకి వచ్చింది. ఈ రోజున కూడా ఒక బిడ్డ ఐటీఐలో చేరితే, చాలామంది తల్లిదండ్రులు ఆ విషయాన్ని స్నేహితులకు, బంధువులకు గర్వంగా చెప్పరు. తమ బిడ్డ విశ్వవిద్యాలయానికి లేదా కళాశాలకు వెళ్లడం లేదనే వాస్తవాన్ని ఇబ్బందిగా భావిస్తారు కాబట్టి ఈ విషయాన్ని దాచిపెడతారు. వారి బిడ్డ నీలిరంగు ఓవరాల్స్ ధరించి, చేతులతో పనిచేయడానికి వెళ్లడం వారికి నామోషీగా అనిపిస్తుంది. కాలక్రమేణా ఈ మనస్తత్వం విస్తరిస్తూ వచ్చిన నేపథ్యంలో దీన్ని మార్చాలని నేను సంకల్పించాను. ఐఐటీ పట్టభద్రులకు దక్కే గౌరవం నా ఐటీఐ విద్యార్థులకూ సమానంగా దక్కాలన్నదే నా తపన. అతిపెద్ద కంపెనీలోనైనా డిగ్రీలు, సర్టిఫికేట్లతో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఉండవచ్చునేమోగానీ, 200-300 మంది ఐటీఐ శిక్షణ పొందిన కార్మికులతోనే వాస్తవానికి ఆ కంపెనీ నడుస్తూంటుంది.
అందువల్ల, మిత్రులారా!
మన సామాజిక జీవనంలో మానసిక పరివర్తన ఎంతో అవసరం. ఈ కార్యక్రమంతో ముడిపడిన శ్రీ జయంత్ చౌదరి సహా అధికారులందరికీ ఈ సందర్భంగా నా అభినందనలు. ఇవాళ సర్టిఫికెట్లు అందుకోవడానికి వచ్చిన భరతమాత పుత్రులు, పుత్రికలను నేనిక్కడ చూస్తున్నాను. వారి శైలిని, వస్త్రధారణను గమనిస్తున్నాను… విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాలలో కూడా నేటి నా ఐటీఐ విద్యార్థులలో కనిపించే గర్వం, హుందాతనం ఉండవు. ఈ ఆత్మవిశ్వాసం, గర్వం అత్యంత ప్రత్యేకం.. భారత ప్రధాని బెంగాల్లో ఓ కార్యక్రమం ముగించుకుని, ఇప్పుడిక్కడ లక్నోలో నిలబడి ఐటీఐ విద్యార్థులకు సగర్వంగా సర్టిఫికెట్లు అందజేస్తున్నారు.
మిత్రులారా!
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ వలసవాద మనస్తత్వం నుంచి మనం నేటికీ పూర్తిగా విముక్తం కాలేదు. గుమాస్తా ఉద్యోగాలకే ప్రాధాన్యమిస్తూ వచ్చాం కాబట్టి, నైపుణ్యాలు క్రమంగా వెనుకబడ్డాయి. ఒకసారి నేను దాదా ధర్మాధికారి పుస్తకం చదివాను. ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉద్యోగం కోసం ఆయన వద్దకు వచ్చి, సహాయం చేయమని అడిగాడు. ‘నువ్వు ఏమేం చేయగలవు?’ అని దాదా ధర్మాధికారి అతన్ని అడిగారు. ఆ వ్యక్తి “నేను పోస్ట్ గ్రాడ్యుయేట్‌ని” అని బదులిస్తే- “కావచ్చు.. నువ్వు చేయగలిగిందేమిటో చెప్పు” అని దాదాజీ మళ్ళీ అడిగారు. “చదువులో నేను స్వర్ణపతకం సాధించాను. నా దగ్గర సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి” అని ఆ యువకుడు బదులిచ్చాడు. అప్పుడు దాదాజీ- “నువ్వు వాహనం నడపగలవా.. వంట చేయగలవా?” అని అడిగారు. “లేదు” అన్నాడా యువకుడు. “మరి నువ్వేం చేయగలవు?” అని ఆయన రెట్టించారు. ఆ యువకుడు మాత్రం తాను పోస్ట్ గ్రాడ్యుయేట్‌నని పదే పదే చెబుతూ వచ్చాడు. ఒకప్పుడు కాగితపు సర్టిఫికెట్లకు మాత్రమే విలువ ఉండేది కాలమది. కానీ, రోజులు మారాయి… ఇప్పడు నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజున మాధ్యమాలలో, సామాజిక మాధ్యమాలలో చర్చలను మీరు గమనించే ఉంటారు. భారత ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులు పెట్టి సంపన్నులు కావాలని 2023లో నేను పార్లమెంటులో సూచించానని కొందరు ఇప్పుడు గుర్తుచేస్తున్నారు. అలా చెప్పినందుకు అప్పట్లో కొందరు నన్ను అపహాస్యం కూడా చేశారు. కానీ, పెట్టుబడి పెట్టిన వారు గణనీయంగా లాభపడ్డారని చరిత్ర నిరూపించింది. అలాగే, అత్యవసరమైతే తప్ప ఏడాది పాటు బంగారం కొనవద్దని దేశ ప్రజలను కోరాను. ఒకప్పుడు దేశం కోసం ఒక పూట భోజనం మానేయాలన్న లాల్ బహదూర్ శాస్త్రి గారి విజ్ఞప్తిని ప్రజలు పాటించిన తీరులోనే నా సూచనను కూడా పౌరులు ఆలకించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ దేశ స్వభావమే అంత.. నాలాంటి సాధారణ వ్యక్తి ప్రజలను బంగారం కొనడం తగ్గించమంటే వారలాగే చేశారు. ఫలితంగా నేడు బంగారం ధరలు తగ్గాయి. దీంతో నా సలహాను పాటించి డబ్బు ఆదా చేశామని ప్రజలు నేడు నాతో చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ మరో విషయం చెప్పాలని భావిస్తున్నాను. బాగా గుర్తుంచుకోండి… కాలం మారుతోంది… కోటు-ప్యాంటు, టై ధరించి సర్టిఫికెట్లు పట్టుకుని తిరిగే వారికన్నా నైపుణ్యాలు, పనితనం గల వ్యక్తులకు డిమాండ్ పెరగబోతోంది. నిజమైన నైపుణ్యాలు ఉన్నవారికి మరింత ప్రాధాన్యం లభిస్తుంది. నేను సౌదీ అరేబియా, దుబాయ్, అబుధాబి, ఖతార్ లేదా కువైట్‌లను సందర్శించినప్పుడల్లా- అక్కడి రాజ కుటుంబీకులు ఒక మాట చెబుతుంటారు. ఆయా దేశాల్లోని అద్భుత ఆధునిక నగరాలు కేవలం వారి డబ్బుతోనే కాకుండా, భారతీయ కార్మికుల శ్రమ, నైపుణ్యాలతో నిర్మితమయ్యాయని వారు పేర్కొంటారు. దుబాయ్ వైభవం, అబుధాబి మెరుపులు, సౌదీ అరేబియా అభివృద్ధి- వగైరాలన్నీ భారతీయ కార్మికుల నైపుణ్యం, శ్రమ ఫలితాలే. ప్రతి రాజ కుటుంబం భారతీయ మానవ వనరులను, ప్రతిభను అభినందిస్తుంది. నేడు మనతో ఒప్పందాలు చేసుకుంటున్న ప్రపంచ దేశాలు తమకు ఏటా 90 వేల మంది, లక్షన్నర మంది లేదా లక్ష మంది అవసరమని పదేపదే కోరుతున్నాయి. ప్రపంచమంతా భారతీయ ప్రతిభ కోసం ఎదురుచూస్తోంది. వారు విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులను మాత్రమే కాకుండా ఐటీఐల నుంచి నైపుణ్యంతో బయటకు వచ్చే వారిని కోరుకుంటున్నారు. నైపుణ్యం, ప్రతిభ ఉన్నవారికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. అందుకే, మిత్రులారా… రాబోయే ఇరవయ్యేళ్లు… (ఇదేదో సినిమా పేరు కాదు సుమా) రాబోయే రెండు దశాబ్దాలు ‘వికసిత భారత్’ సొంతం!
మిత్రులారా!
ప్రస్తుత 21వ శతాబ్దంలో భారత్ ముందంజ వేయాలంటే నైపుణ్యాలను గౌరవించడం ఎంతో అవసరం. అందుకే, కొన్నేళ్లుగా మా ప్రభుత్వం ‘శ్రమయేవ జయతే’ స్ఫూర్తితో అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. గతంలో కళాశాలలు, విశ్వవిద్యాలయాల పట్టభద్రులకు మాత్రమే స్నాతకోత్సవాలు నిర్వహించేవారు. వారు ప్రత్యేక తలపాగాలు, గౌన్లు ధరించేవారు. కానీ, అలా ఉండరాదని నేను భావించాను… స్నాతకోత్సవాలు ఘనంగా సాగాలని ఎవరైనా కోరేట్లయితే, అవి మన ఐటీఐ విద్యార్థుల కోసం కూడా అలాగే నిర్వహించాలని చెప్పేవాణ్ని. వారి వేళ్లలో నాకు భారత్ భవిష్యత్తు కనిపిస్తోంది.. వారి నైపుణ్యాల్లోనే దేశం శక్తిసామర్థ్యాలు దాగి ఉన్నాయి. అంతేకాదు.. కొత్త జాతీయ విద్యా విధానం రూపకల్పనలోనూ నైపుణ్యాభివృద్ధికి మేం ప్రత్యేక ప్రాధాన్యమిచ్చాం.
మిత్రులారా!
ఈ ఆధునిక శకంలో కృత్రిమ మేధ (ఏఐ) గురించి ఎంతో చర్చ సాగుతోంది. దీనివల్ల ఉద్యోగాలు పోతాయని, జీవనోపాధి దెబ్బతింటుందని కొందరు ఆందోళన పడుతున్నారు. కానీ, ఒక వాస్తవాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి… నైపుణ్యం గల వ్యక్తి ఉపాధిని ఎవరూ లాక్కోలేరు. కోవిడ్ సమయంలో పరిస్థితులు ఎంత కష్టంగా మారాయో మనం చూశాం. ప్రజలు నిస్సహాయ స్థితిలో పడ్డారు… సమాజం ఎవరి సేవలపైన ఆధారపడిందో, వారంతా ప్రాణరక్షణ కోసం సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. ఎంత సంపద ఉన్నా, నిపుణ మానవ వనరులు లేకపోతే ఏ పనీ సాగదనే వాస్తవం అప్పుడు అందరికీ అర్థమైంది. ఆ క్లిష్ట సమయంలో నైపుణ్యం గలవారే జన జీవనానికి అవసరమైన అనేక అంశాలలో ఆదుకున్నారు.
మిత్రులారా!
మీరొక నైపుణ్యం సాధించడం ద్వారా యంత్రాలతో పనిచేయడం మాత్రమే కాకుండా జన జీవన సౌలభ్యం కల్పిస్తున్నారు. దేశ శక్తిసామర్థ్యాలను ఇనుమడింపజేస్తున్నారు. ఒకప్పుడు భారత్ మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునేది… నేడు, మన బిడ్డలే ఆ ఫోన్లను తయారు చేస్తున్నారు. భారతత్ తయారీ మొబైల్ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మీ వల్లే భారత్ తయారీ సామర్థ్యం పెరుగుతోంది. అందుకే, నేడు ఐటీఐలకు ఇంత ప్రాధాన్యం లభిస్తోంది. దేశంలో 2014 నుంచి దశాబ్దం వ్యవధిలో మా ప్రభుత్వం దాదాపు 5,000 కొత్త ఐటీఐలను ఏర్పాటు చేసింది. వీటిలో చేరే విద్యార్థుల సంఖ్య ఐదు లక్షలకు పైగా పెరిగింది. ముఖ్యంగా- బాలికల సంఖ్య రెండున్నర రెట్లకు మించి పెరగడం విశేషం!
మిత్రులారా!
ఐటీఐలలో శిక్షణ నాణ్యత సహా అధ్యాపకుల నియామకం, మౌలిక సదుపాయాల కల్పన కూడా మాకెంతో కీలక ప్రాథమ్యాలు. గతంలో ఐటీఐ నెట్వర్క్ చాలా వెనుకబడి ఉండేది. నైపుణ్య విద్య, వృత్తి విద్య ముసుగులో అవే పాత ట్రేడ్లను బోధించేవారు. ఇవాళ ఐటీఐలలో 30కి పైగా నవతరం కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జెన్ జీ ప్రతినిధులు చెప్పినట్లు, ఇవాళ ఏరోనాటికల్ స్ట్రక్చర్స్, ఏఐ అసిస్టెంట్స్, సైబర్ సెక్యూరిటీ అసిస్టెంట్స్, డ్రోన్ టెక్నీషియన్స్, గ్రీన్ హైడ్రోజన్ టెక్నీషియన్స్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, యానిమేషన్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్, సెమీకండక్టర్ టెక్నీషియన్స్ వంటి మరెన్నో కోర్సులున్నాయి. వర్తమాన, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ కోర్సులన్నిటినీ ప్రవేశపెట్టాం. ఆసుపత్రి ఎంత పెద్దదైనా, వైద్యులు ఎంత ఉన్నత విద్యావంతులైనా, యంత్రాలు నడవాలంటే ఐటీఐ శిక్షణ పొందిన టెక్నీషియన్లు ఉండాలి. లేకపోతే ఒక్క రోగికైనా ఆరోగ్యం బాగుపడదు. అదే మీ బలం… దాన్ని మీకు ఎరుకపరచడం కోసమే నేనిక్కడికి వచ్చాను. మీ సామర్థ్యాన్ని గౌరవించడానికే వచ్చాను… ఎందుకంటే- ఐటీఐలు భవిష్యత్తులో ఒక అద్భుత అధ్యాయం లిఖిస్తాయనే వాస్తవం నాకు తెలుసు.
అంతేగాక, మిత్రులారా!
ఇదంతా భారత్ అవసరాల కోసమే కాకుండా, యావత్ ప్రపంచ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని చేస్తున్నాం. ఏదో ఒక దేశంతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని, మరో దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై చర్చిస్తున్నామని మీరు నిత్యం వార్తలు వింటూనే ఉంటారు. మీలాంటి యువతకు కొత్త అవకాశాలను కల్పించేది ఇలాంటి ఒప్పందాలే.
మిత్రులారా!
ఐటీఐ పాఠ్యప్రణాళికల మార్పు, యంత్రాల ఆధునికీకరణ, శిక్షకులకు నవ్య పరిజ్ఞాన కల్పన, శిక్షణకు-పరిశ్రమలకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచడం మా ప్రాథమ్యాలు. అందుకే ‘పీఎం సేతు’ పథకం ద్వారా ₹60,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నాం. దీనివల్ల మీ యువతరం మొత్తానికీ గణనీయ ప్రయోజనం చేకూరుతుంది.
మిత్రులారా!
దేశం వేగంగా పురోగమిస్తున్న కొ్ద్దీ, నిపుణ కార్మికులకు కొత్త అవకాశాలు వస్తున్నాయి. గత 12-13 ఏళ్లలో 50 కోట్ల మంది పేదరిక విముక్తులయ్యారని మీరిప్పటికే విని ఉంటారు. ఇదొక చారిత్రక విజయం… నా దృష్టిలో స్వాతంత్ర్యం తర్వాత భారత్ సాధించిన గొప్ప విజయాలలో ఒకటి 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడటమే. సమైక్య భారత్ గమ్యాన్ని చేర్చే మార్గమిదే. ప్రభుత్వం సౌకర్యాలు కల్పించి, పేదలకు సాధికారత కల్పించడం ద్వారి పేదరికం నుండి బయటపడగలమనే విశ్వాసాన్ని వారిలో పెంచింది. ఈ విశిష్ట కార్యక్రమంలో నైపుణ్యం గల కార్మికులకూ లక్షలాది అవకాశాలు అందివచ్చాయి. పేద కుటుంబాల కోసం నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించినప్పుడు ఎలక్ట్రీషియన్లు, వడ్రంగులకు పని దొరికింది. పైప్లైన్లు వేసి, గ్రామాలకు తొలిసారి విద్యుత్ సరఫరా చేసినప్పుడు, మీలాంటి యువతే ఆ కార్యక్రమాలను విజయవంతం చేశారు.
మిత్రులారా!
అనేక కొత్త రంగాలలో నేడు వివిధ నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోంది. మీకిప్పుడు మరో వాస్తవాన్ని ఉదాహరిస్తాను… కొన్ని నెలల కిందట పశ్చిమాసియాలో యుద్ధం మొదలవడంతో గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనిశ్చితి మేఘాలు కమ్ముకోవడంతో ఎల్పీజి లభ్యతపై ప్రశ్నలు తలెత్తాయి. ఇదే అదనుగా కొందరు భయాందోళనలు సృష్టిస్తూ రెచ్చిపోయారు. గ్యాస్ మాయమవుతుందని, స్టవ్‌లు పనిచేయబోవని, ప్రజలు ఆకలితో అలమటిస్తారని, పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతారని వదంతులు వ్యాపింపజేశారు. వార్తాపత్రికలను చూస్తే, వాళ్లు ఏమేం అంచనాలు వేశారో అర్థమవుతుంది. కానీ, వాటిలో ఏ ఒక్కటీ నిజం కాలేదు… ఇక హోర్ముజ్ జలసంధి సంక్షోభం తలెత్తినప్పుడు, మేం చేతులు కట్టుకు కూర్చోకుండా చర్యలు తీసుకున్నాం. పట్టణ ప్రాంతాల్లో నిత్యం కనీసం లక్ష పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని సంకల్పించాం. భవిష్యత్తులో ఎలాంటి అంతరాయాలనైనా తట్టుకునేలా పైప్లైన్ల ద్వారా గృహాలకు గ్యాస్ చేరేలా చూడాలని మేం ఆకాంక్షిస్తున్నాం.
రోజుకు లక్ష కనెక్షన్లు ఇవ్వాలన్నది నా లక్ష్యం కాబట్టి, స్వయంగా ఈ కార్యక్రమాన్ని సమీక్షించాను. అయితే, నేను ఈ సమావేశాలు నిర్వహించినప్పుడల్లా ఆ సంఖ్య కేవలం 15 వేలు, 20 వేలు, 22 వేలు, 23 వేలుగా మాత్రమే ఉండేది. లక్ష కనెక్షన్ల లక్ష్యాన్ని అందుకోలేకపోయాం. ప్రభుత్వం నిధులు వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నా, ఎలాంటి సమాధానం వచ్చిందో మీకు తెలుసా? చేయగలిగినదంతా చేశామని, తగినంత మంది ప్లంబర్లు దొరక్క లక్ష్యం చేరలేకపోయామని అధికారులు చెప్పారు. అంటే- నిపుణుల కొరత ఉంది… మీ బలమేమిటో దీన్ని బట్టి మీరే ఊహించుకోండి. దేశం ప్లంబర్ల కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది. నైపుణ్యం ఉంటే ఉపాధి అవకాశాలు తప్పక లభిస్తాయని ఈ ఉదంతం రుజువు చేస్తోంది. ఇవాళ మనకు సౌరశక్తి రంగంలో నిపుణ కార్మికులు భారీ సంఖ్యలో అవసరం. ఇక దేశంలో కొత్త క్రీడా ఆర్థిక వ్యవస్థ కూడా ఆవిర్భవిస్తోంది. క్రీడా పరికరాల, క్రీడలు-ఫిట్నెస్ సంబంధిత అనేక ఇతర ఉత్పత్తుల తయారీదారులు కూడా అవసరం. మరో మాటలో- అవకాశాలు ఆకాశమే హద్దుగా విస్తరిస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకునే బాధ్యత యువతరానిదే.
మిత్రులారా!
భారత్ నేడు ప్రపంచ ‘నైపుణ్య రాజధాని’ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించేది మీరే. నేను ఒక్క మన దేశం గురించి మాత్రమే కాదు.. యావత్ ప్రపంచం గురించి మాట్లాడుతున్నాను. మీ సామర్థ్యాన్ని చూస్తున్నందు వల్లనే ఈ విషయాన్ని పూర్తి విశ్వాసంతో చెబుతున్నాను. యువతకు.. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఓ శుభవార్త… వచ్చే ఏడాది- 2027లో భారత్ ‘వరల్డ్ స్కిల్స్ ఆసియా’ పోటీలకు ఈ రాష్ట్రం ఆతిథ్యమిస్తోంది. ఆసియా ఖండంలోని యువతరం ఇందులో పాలుపంచుకుంటారు. గ్రేటర్ నోయిడాలో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా అనేక దేశాల యువతకు ఉత్తరప్రదేశ్ ఆతిథ్యమిస్తుంది. ఇలాంటి గొప్ప అవకాశం కోసం దక్కించికున్న ఉత్తరప్రదేశ్‌కు ముందుగానే శుభాకాంక్షలు చెబుతున్నాను.
మిత్రులారా!
దేశాభివృద్ధికి ఉత్తరప్రదేశ్ నేడు సారథ్యం వహిస్తోంది. ఒకనాడిక్కడ యువతకు అవకాశాలు చాలా పరిమితం. కానీ, శ్రీ యోగి ఆదిత్యనాథ్, శ్రీ మౌర్య, శ్రీ బ్రజేశ్, శ్రీ పంకజ్ చౌదరి తదితర నాయకుల సారథ్యాన ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వ కృషి ఫలితంగా ఈ దుస్థితి పూర్తిగా రూపుమాసింది. ఇక్కడి ప్రజలు ఇవాళ ‘యూపీ అంటే ‘ఎక్స్‌ప్రెస్’వేల రాష్ట్రం’ అని సగర్వం చెబుతున్నారు. అనేక అంతర్జాతీయ విమానాశ్రయాలు ఇక్కడున్నాయి. ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఏర్పాటవుతుండగా, మరోవైపు పర్యాటక రంగం వృద్ధి చెందుతోంది. భారీ మొబైల్ తయారీ కేంద్రాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సెమీకండక్టర్ ప్లాంట్ కూడా నిర్మితమవుతోంది. అంతేకాకుండా, ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించి, మన శత్రువులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ‘బ్రహ్మోస్’ క్షిపణి కూడా ఈ రాష్ట్రంలోనే తయారవుతోంది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీలాంటి యువతరానికి కొత్త అవకాశాలు కల్పిస్తున్నాయి.
మిత్రులారా!
ఉత్తరప్రదేశ్ ఇంతకుముందు ఎలా ఉండేదో కూడా మనం గుర్తుంచుకోవాలి. కొద్ది రోజుల కిందట నా పార్లమెంటరీ నియోజకవర్గమైన కాశీకి వెళ్లాను. అక్కడొక కర్మాగారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఓ యువతి నాతో మాట్లాడింది. తాను రాత్రి 11 గంటల దాకా పని చేసి కూడా ఒంటరిగానే సురక్షితంగా ఇంటికి వెళ్తున్నానని ఆమె చెప్పింది. ఇది సాధారణ విషయం కాదు… చీకటి పడ్డాక ఒక కుమార్తె బయటకు రావాల్సి వస్తే గతంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవో ఈ రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. అలాంటిది… రాత్రి 11 గంటలకు పని ముగించుకుని, ఎటువంటి భయం లేకుండా ఒక యువతి ఒంటరిగా ఇంటికి వెళ్లగలగడమంటే- శ్రీ యోగి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సురక్షిత వాతావరణం కల్పించిందనడానికి నిదర్శనం. భద్రత భావం, శ్రేయస్సుపై విశ్వాసమే వికసిత భారత్‌ను సాకారం చేస్తాయి. అందువల్ల, దేశంలోని యువతరానికి నేను చెప్పేదొకటే… అపార అవకాశాలు మీ ముందున్నాయి. ఆకాశమే హద్దుగా మీరంతా భారీ కలలు కనండి. మీ నైపుణ్యాలను పెంచుకుంటూ స్వప్న సాకారానికి శక్తివంచన లేకుండా కృషి చేయండి. మీరెన్నటికీ ఒంటరులు కారు… ఎప్పుడైనా అలా అనిపిస్తే- మీకు అండగా నేనున్నానని గుర్తు తెచ్చుకోండి. ఈ విశ్వాసంతోనే మీరంతా ఇవాళ జీవితంలోని కొత్త దశలో అడుగుపెడుతున్నారు. ఇక మీ తల్లిదండ్రుల కలలన్నింటినీ నెరవేరుస్తూ, మీరు సముపార్జించిన నైపుణ్యాన్ని సమాజ బలోపేతానికి అంకితం చేయండి. మీరు పురోగమిస్తే.. దేశం ప్రగతి పథంలో పరుగులు తీస్తుంది. మీ కుటుంబ సభ్యుల హృదయాలు సగర్వంతో ఉప్పొంగుతాయి. ఈ ప్రత్యేక సందర్భంలో.. ఈ స్ఫూర్తితో మీకందరికీ నా అభినందనలు. దేశవ్యాప్తంగా గల ఐటీఐల నుంచి ఎందరో యువతీయువకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడాన్ని నేను టీవీలో చూశాను. వారందరికీ కూడా నా అభినందనలు… శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
నాతో గళం కలపండి:
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
అనేకానేక ధన్యవాదాలు!
గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.
***
Celebrating the hard work and achievements of India's skilled youth at the Kaushal Deekshant Samaroh in Lucknow. https://t.co/HJ8DAt1bpY
— Narendra Modi (@narendramodi) November 21, 2026
21वीं सदी का भारत कौशल को, स्किल को सम्मान देकर ही आगे बढ़ सकता है। इसलिए, बीते वर्षों में हमारी सरकार ने श्रमेव जयते की भावना से एक के बाद एक कई कदम उठाए हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 21, 2026
जब आप कोई हुनर सीखते हैं, तो आप केवल मशीनों पर काम नहीं करते। आप लोगों की जिंदगी को आसान बनाते हैं। आप देश का सामर्थ्य बढ़ाते हैं: PM @narendramodi during Kaushal Deekshant Samaroh in Lucknow
— PMO India (@PMOIndia) November 21, 2026
आज भारत, विश्व की स्किल कैपिटल बनने की तरफ आगे बढ़ रहा है: PM @narendramodi at Kaushal Deekshant Samaroh in Lucknow
— PMO India (@PMOIndia) November 21, 2026
मैं देश के हर युवा से कहता हूं कि आपके सामने इस समय पूरा आसमान है…बड़े सपने देखिए, अपने कौशल का विकास करिए और अपने सपनों को पूरा करने के लिए पूरी ताकत लगा दीजिए: PM @narendramodi at Kaushal Deekshant Samaroh in Lucknow
— PMO India (@PMOIndia) November 21, 2026