Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన 5వ కౌశల్ దీక్షాంత్ సమారోహ్‌లో పాల్గొన్న ప్రధానమంత్రి

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన 5వ కౌశల్ దీక్షాంత్ సమారోహ్‌లో పాల్గొన్న ప్రధానమంత్రి


ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన 5వ కౌశల్ దీక్షాంత్ సమారోహ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగించారు. లక్నో వేదికగా భారీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం జరగటం సంతోషంగా ఉందన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఆయనకు ఈ కార్యక్రమం గర్వకారణమని తెలిపారు.

జీవితంలో కీలక ఘట్టాన్ని దాటి పట్టభద్రులైన యువత… ఇప్పుడు దేశ నిర్మాణ ప్రక్రియలో నేరుగా పాలుపంచుకుంటారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఐటీఐలో నేర్చుకున్న నైపుణ్యాలు, హస్తకళా నైపుణ్యం వికసిత్ భారత్ నిర్మాణానికి కీలక శక్తిగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. యువత నైపుణ్యాల ద్వారానే ఏ దేశమైనా సమర్థవంతంగా పురోగమిస్తుందని అన్నారు. హస్తకళల పట్ల భారతదేశానికి ఉన్న గౌరవాన్ని ప్రస్తావిస్తూ… లక్నో చికన్‌కారీ, నాణ్యమైన మస్లిన్ వస్త్రాలు, బనారస్, కంజీవరం పట్టు, కశ్మీర్ పష్మినా, నూలు వస్త్రాలు, కలంకారీ, ప్రపంచంలోనే పదునైన కత్తుల తయారీకి ఉపయోగించే ఉక్కు, కాంస్య, పంచలోహ విగ్రహాల వంటి వందలాది సంప్రదాయ కళలు ఒకప్పుడు సమాజానికి కీలక ఆధారంగా నిలిచాయని చెప్పారు. “చాలా కాలంగా ప్రపంచ వేదికపై భారత్‌కు ఇలాంటి నైపుణ్యాల ద్వారానే ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది” అని ప్రధానమంత్రి అన్నారు.

భారతదేశ ప్రాచీన సామాజిక వ్యవస్థ నైపుణ్యాల ఆధారంగా రూపొందించినదని వివరిస్తూ… గుజరాత్‌లోని ‘వసవాయ‘ సంప్రదాయాన్ని ఉదహరణగా ప్రధానమంత్రి చెప్పారు. ఈ సంప్రదాయం ప్రకారం… నూతనంగా ఏర్పడిన గ్రామాల్లో జీవనానికి అవసరమైన నైపుణ్యం గల చేతివృత్తుల వారు అక్కడ స్థిరపడేవారు. “వీరు లేకుండా గ్రామ జీవనాన్ని ఊహించటం కష్టతరం అనేంతగా నైపుణ్యం గల వ్యక్తులుండేవారు” అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

ప్రాచీన కాలం నుంచి భారతదేశంలోని ప్రతి ప్రాంతంలో ఇలాంటి వ్యవస్థ ఉండేదని, కాలక్రమేణా అది ప్రాధాన్యతను కోల్పోయిందని ప్రధానమంత్రి అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి నిద్రలేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు, పుట్టినప్పటి నుంచి మరణించే వరకు అవసరమయ్యే ప్రతి పనిని, సేవను జాబితా చేయాలని అధికారులకు బాధ్యతను అప్పగించినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ కసరత్తులో సమాజాన్ని నడిపించే దాదాపు వెయ్యి ముఖ్యమైన నైపుణ్యాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. “ఈ అంశంపైనే దృష్టి పెట్టాలని నేను అధికారులను కోరాను. ఆ తర్వాత గుజరాత్‌లో నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ఆధునిక వ్యవస్థ రూపుదిద్దుకుంది” అని పీఎం శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

భారతదేశ నైపుణ్య వ్యవస్థ క్షీణించటానికి వలసవాద విద్యా వ్యవస్థే కారణమని ప్రధానమంత్రి అన్నారు. బ్రిటిష్ వారు సొంత పరిశ్రమలను, తయారీ రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ… నైపుణ్య ఆధారిత సమాజాన్ని కేవలం గుమస్తాలను తయారుచేసే వ్యవస్థగా మార్చేశారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా గుమాస్తా ఉద్యోగాలకే గౌరవం లభించిందని, నైపుణ్యం గల హస్తకళాకారులు, వృత్తి నిపుణులు ఆత్మన్యూనతా భావానికి గురై, తమ వృత్తులకు దూరమయ్యారని తెలిపారు. “ఈ బానిస మనస్తత్వం వల్ల మన దేశం భారీగా నష్టపోయింది” అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

శ్రమయేవ జయతే స్ఫూర్తితో ప్రభుత్వం చేపట్టిన వరుస కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల డిగ్రీ పట్టభద్రులకే పరిమితమైన స్నాతకోత్సవ సంప్రదాయాన్ని ఐటీఐ నైపుణ్య ధ్రువపత్రాలు పొందే విద్యార్థులకు కూడా విస్తరించటం, నూతన జాతీయ విద్యా విధానంలో నైపుణ్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం వంటి చర్యలను వివరించారు. హస్తకళా నైపుణ్యాన్ని గౌరవించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. “నైపుణ్యానికి గౌరవం ఇచ్చినప్పుడే 21వ శతాబ్దపు భారత్ ముందుకు సాగుతుంది” అని పీఎం శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

ఆధునిక యుగంలో కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయన్న విస్తృత చర్చలు, ఆందోళనలను ప్రస్తావిస్తూ.. కొవిడ్ మహమ్మారి సమయంలో అందరూ నిస్సహాయంగా ఉన్నప్పుడు, కీలక కార్యకలాపాలను నిర్వహించి వ్యవస్థలను నడిపించింది నైపుణ్యం గల కార్మికులేనని ప్రధానమంత్రి గుర్తు చేశారు. “నా మాటను బాగా అర్థం చేసుకోండి. నైపుణ్యాలున్న వారికి ఉపాధి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి” అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

ఒక వృత్తి నైపుణ్యాన్ని నేర్చుకోవటం అంటే కేవలం యంత్రాలతో పనిచేయటం మాత్రమే కాదని… అది ప్రజల జీవితాలను సులభతరం చేయటంతో పాటు దేశ సామర్థ్యాన్ని, తయారీ శక్తిని బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. 2014 నుంచి ఐటీఐలపై ప్రభుత్వం చూపిన శ్రద్ధను ప్రస్తావిస్తూ… కేవలం ఒకే దశాబ్దంలో దాదాపు 5,000 కొత్త ఐటీఐలను నిర్మించినట్లు తెలిపారు. “ఐటీఐల్లో చదువుతున్న వారి సంఖ్య కూడా 5 లక్షలకు పైగా పెరిగింది. ఇందులోనూ బాలికల సంఖ్య రెండున్నర రెట్లుకు పైగా పెరిగింది” అని పీఎం శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు.

కాలం చెల్లిన కోర్సులతో వెనుకబడి ఉన్న ఐటీఐల్లో శిక్షణ, నాణ్యత, అధ్యాపకులు, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారతదేశ ప్రస్తుత వాణిజ్య ఒప్పందాలు, ఎఫ్‌టీఏ చర్చలకు అనుగుణంగా దేశీయ, అంతర్జాతీయ అవసరాల కోసం విమానయాన నిర్మాణం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్, సైబర్ సెక్యూరిటీ అసిస్టెంట్, డ్రోన్ టెక్నీషియన్, గ్రీన్ హైడ్రోజన్ టెక్నీషియన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, యానిమేషన్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్, సెమీకండక్టర్ టెక్నీషియన్‌తో సహా 30కి పైగా నూతన–తరం కోర్సులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. “ఇదంతా యువత కోసమే. యువత భవిష్యత్తు కోసం నూతన అవకాశాలను సృష్టిస్తున్నాం” అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

ఐటీఐ పాఠ్యాంశాలు, యంత్రాల ఆధునీకరణ, నూతన సాంకేతికతల్లో బోధకులకు శిక్షణ ఇవ్వటం, శిక్షణకు, పరిశ్రమలకు మధ్య ప్రత్యక్ష అనుసంధానాన్ని ఏర్పరచేందుకు చేస్తున్న కృషిని వివరిస్తూ… పీఎం–సేతు పథకం ద్వారా రూ. 60,000 కోట్ల పెట్టుబడిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. “దీనివల్ల యువతకు అపారమైన ప్రయోజనం చేకూరనుంది” అని పీఎం శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

భారతదేశంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి… నైపుణ్యం గల కార్మికులకు విస్తారమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. గత 12 నుంచి 13 ఏళ్లలో ప్రభుత్వ సదుపాయాల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని నింపి 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చినట్లు ప్రధానమంత్రి గుర్తుచేశారు. పేదల కోసం 4 కోట్ల ఇళ్ల నిర్మాణం, నీటి పైప్‌లైన్ల ఏర్పాటు, తొలిసారి విద్యుత్ లైన్ల ఏర్పాటు వంటి బృహత్తర కార్యక్రమాల్లో ఎలక్ట్రీషియన్లు, వడ్రంగులు, ఇతర నైపుణ్యం గల యువతకు ఉపాధి లభించిందని వివరించారు. “ఈ బృహత్తర కార్యక్రమంలో దేశంలోని నైపుణ్యం గల కార్మికులకు లక్షలాది నూతన అవకాశాలు కూడా లభించాయి” అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెరుగుతున్న నైపుణ్య అవసరాలను ప్రస్తావిస్తూ… కొన్ని నెలల కిందట పశ్చిమాసియా సంఘర్షణ సమయంలో గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన సందర్భాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఆ సమయంలో రోజుకు కనీసం లక్ష పీఎన్‌జీ కనెక్షన్లను ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు, ప్లంబర్ల కొరత కారణంగా లక్ష్యాలు ఆలస్యమవుతున్నాయని సమీక్షా సమావేశాల్లో పదేపదే ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపారు. సౌరశక్తి రంగంలో, క్రీడా పరికరాల తయారీ, ఫిట్‌నెస్‌ రంగాల వరకు విస్తరించి, వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడా ఆర్థిక వ్యవస్థలో నైపుణ్యం గల మానవ వనరుల అవసరం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. “మీకు నైపుణ్యం ఉంటే, ఉపాధి పొందటానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి” అని పీఎం శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

ప్రపంచ నైపుణ్య కేంద్రంగా భారత్ వేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి తెలిపారు. 2027లో గ్రేటర్ నోయిడాలో వరల్డ్‌స్కిల్స్ ఆసియా పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని ప్రకటించి దేశ యువతకు, ఉత్తరప్రదేశ్‌కు శుభవార్తను చెప్పారు. ఇందులో అనేక దేశాల యువత పాల్గొంటారని తెలిపారు. “ఇందుకోసం ఉత్తరప్రదేశ్‌కు నేను ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

దేశాభివృద్ధిని వేగవంతం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ను ప్రధానమంత్రి ప్రశంసించారు. ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం… అంతర్జాతీయ విమానాశ్రయాలు, ప్రధాన విశ్వవిద్యాలయాలు, పురోగమిస్తున్న పర్యాటక రంగం, భారీ మొబైల్ తయారీ కర్మాగారాలు, త్వరలో రానున్న చిప్ ఫ్యాక్టరీతో పాటు ఆపరేషన్ సిందూర్‌లో శత్రువులను వణికించిన బ్రహ్మోస్ క్షిపణుల తయారీ కేంద్రంగా, యూపీని ఎక్స్‌ప్రెస్‌వే రాష్ట్రంగా మార్చిందని కొనియాడారు. “యూపీలో జరుగుతున్న ఈ అభివృద్ధి పనులన్నింటి వల్ల మీలాంటి యువతకు నూతన అవకాశాలు లభిస్తున్నాయి” అని పీఎం శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో ఇటీవల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సందర్భంగా జరిగిన సంభాషణను ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు రాత్రి 11 గంటలకు కూడా ఎంతో సురక్షితంగా, నిశ్చింతగా ఇంటికి తిరిగి వెళ్లగలుగుతున్నానని ఒక యువతి చెప్పిన విషయాన్ని ప్రదానమంత్రి ప్రస్తావించారు. రాష్ట్రంలో ఇటువంటి సురక్షిత వాతావరణాన్ని కల్పించినందుకు శ్రీ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ భద్రతా భావం, సంక్షేమంపై ఉన్న విశ్వాసమే ‘వికసిత్ భారత్‘ను నిర్మిస్తాయని స్పష్టం చేస్తూ యువతకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “ఈ సమయంలో మీ ముందు అనంతమైన అవకాశాలున్నాయి. పెద్ద కలలు కనండి. నైపుణ్యాలను పెంపొందించుకోండి. కలలను నెరవేర్చుకునేందుకు శాయశక్తులా కృషి చేయండి” అని శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

 

***