శ్రీ గురు నానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు శబద్ కీర్తనలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి “వాహెగురు జీ కా ఖల్సా, వాహెగురు జీ కీ ఫతే!” అనే సిక్కు సంప్రదాయ అభివాదంతో ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పవిత్ర వాతావరణంలో గురునానక్ దేవ్ జీకి భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లి, శబద్ కీర్తనలో పాల్గొనే అవకాశం లభించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
గుర్బానీలోని ప్రతి శబద్, కీర్తనలోని ప్రతి స్వరం కేవలం సంగీతానికే పరిమితం కాదని, అంతకంటే ఎంతో ఉన్నతమైనవని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దానిని ఒక ఆధ్యాత్మిక సాధనగా, జ్ఞాన సాగరంలో ఓలలాడటంగా ఆయన అభివర్ణించారు. “అందువల్లే ఇలాంటి వేడుకలకు పిలుపు అందినప్పుడల్లా, వీలు చిక్కిన ప్రతిసారీ నేను కచ్చితంగా సంగత్, కీర్తనలకు హాజరవుతుంటాను” అని ప్రధానమంత్రి తెలిపారు.
గురునానక్ దేవ్ బోధించిన ‘కిరత్ కరో, వండ్ చఖో, నామ్ జపో’ (నిజాయతీగా కష్టపడి పనిచేయండి, సంపాదించిన దానిని ఇతరులతో పంచుకోండి, భగవంతుని నామాన్ని స్మరించండి) అనే సూత్రాలను తన చిన్ననాటి నుంచే జీవితంలో సహజమైన భాగంగా అలవరచుకున్నానని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. గురుద్వారాల్లో భక్తితో తలవంచి నమస్కరించడం, గురుబాణీని ఆలకిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందడం, సేవలోని ఆనందాన్ని ఆస్వాదించడం, లంగర్ (సామూహిక భోజనం) స్వీకరించడం, పలుమార్లు శ్రీ హర్మందిర్ సాహిబ్‌ను దర్శించుకుని నమస్కరించడం వంటి అనుభవాలను ఆయన గుర్తుచేసుకున్నారు. “పాత సహచరులకు తెలిసే ఉంటుంది. నేను పంజాబ్‌లో కూడా చాలాకాలం గడిపాను. నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన జ్ఞాపకాలలో ఆ కాలం ఒకటి” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
గురువు కృపతో నిరంతరం సిక్కు సాధువుల సాంగత్యం లభిస్తుండటం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అనేకమంది సాధువులు, పండితులకు ప్రధానమంత్రి నివాసంలో ఆతిథ్యం ఇచ్చే అవకాశం లభించడాన్ని తనకు దక్కిన విశేష భాగ్యంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో వారి సమక్షం వల్ల ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక శక్తి అనుభూతికి వస్తోందని పేర్కొన్న ఆయన, సిక్కు సోదరులందరికీ అభినందనలు తెలిపారు. “ఈ పవిత్ర సందర్భంలో సాధువులు, పండితులందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను” అని శ్రీ మోదీ అన్నారు.
దేశ అస్తిత్వం, మతం, విశ్వాసం, విలువల పరిరక్షణ కోసం ఇదే ఢిల్లీ గడ్డపై తన ప్రాణాలను అర్పించిన శ్రీ గురు తేగ్ బహదూర్ జీ 350వ బలిదాన వార్షికోత్సవం కూడా ఈ ఏడాది ప్రకాశ్ పురబ్తో పాటే రావడం విశేషమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 350 ఏళ్లు గడిచినా, ఆ మహా త్యాగ స్ఫూర్తి ఈ దేశపు మట్టిలో, ప్రతి అణువణువునా గాఢంగా నాటుకుపోయి ఉందని ఆయన తెలిపారు. “ఆయన త్యాగానికి దేశంలోని ప్రతి పౌరుడూ ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటాడు” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
జాతి, సంస్కృతుల రక్షణ కోసం సర్వస్వాన్ని అర్పించడంలో సిక్కు సంప్రదాయం ఎప్పుడూ ముందుంటుందని ప్రధాని మోదీ కొనియాడారు. భాయ్ మతి దాస్ జీ, భాయ్ సతి దాస్ జీ, భాయ్ దయాలా జీల ప్రాణత్యాగాలు, అలాగే స్వాతంత్ర్య పోరాటంలో సిక్కులు చూపిన అకుంఠిత దీక్షే అందుకు ప్రతీకలని ఆయన అన్నారు. గురుద్వారా సంస్కరణల ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి, తుదిశ్వాస వరకు సేవాభావంతో జీవించిన సర్దార్ తేజా సింగ్ సముంద్రీ జీకి ప్రధాని నివాళులర్పించారు. “ఆయన అమరత్వం పొంది ఈ సంవత్సరంతో శతాబ్ది పూర్తవుతున్న సందర్భంగా, ఆ మహనీయుడికి సైతం నా ప్రణామాలు అర్పిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.
దేశం వందల ఏళ్ల బానిస సంకెళ్లలో మగ్గిన అత్యంత గడ్డు కాలాల్లో కూడా జాతి రక్షణ అనే చైతన్య దీపాన్ని ఆరిపోకుండా గురువులు కాపాడారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. నేడు మనం తీసుకున్న బృహత్తర సంకల్పాల సాధన, ‘వికసిత్ భారత్’ నిర్మాణం వారి ఆశయాలు, మార్గదర్శకత్వంతోనే నెరవేరతాయని ఆయన స్పష్టం చేశారు. “సిక్కు సంప్రదాయాలను, సిఖీ వారసత్వాన్ని ఒక దారి చూపే దీపంలా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
గడిచిన 12 సంవత్సరాలుగా తమ ప్రభుత్వం ఈ బాధ్యతను సంపూర్ణ శ్రద్ధతో నెరవేరుస్తున్న తీరును ప్రధాని మోదీ వివరించారు. ఇందులో భాగంగా భారత్‌తో పాటు విదేశాల్లోనూ గురు గోవింద్ సింగ్ జీ 350వ ప్రకాశ్ పురబ్, గురు నానక్ దేవ్ జీ 550వ ప్రకాశ్ పురబ్ ఉత్సవాలను నిర్వహించామన్నారు. ప్రత్యేక స్మారక నాణేలు, పోస్టల్ స్టాంపుల విడుదల, ప్రత్యేక రైళ్ల ఏర్పాటు, దేశవ్యాప్త గుర్బానీ కార్యక్రమాలతో పాటు గురు తేగ్ బహదూర్ జీ 400వ ప్రకాశ్ పురబ్ సందర్భంగా ఎర్రకోటలో జాతీయ వేడుకను ఘనంగా జరిపామని గుర్తుచేశారు. “అదే స్ఫూర్తితో ఇప్పుడు గురు తేగ్ బహదూర్ జీ 350వ షహీదీ దివస్‌ను కూడా మనం పాటిస్తున్నాం ” అని ప్రధాని పేర్కొన్నారు.
వచ్చే డిసెంబర్ 26న దేశవ్యాప్తంగా తదుపరి వీర బాలల దినోత్సవం (వీర్ బాల్ దివస్) నిర్వహించుకోనున్నామని పేర్కొంటూ, వీర సాహిబ్జాదాల అమరత్వపు అజరామర గాథను, మాతా గుజ్రీ జీ దృఢ సంకల్పాన్ని నేటి యువతరానికి అందించే లక్ష్యంతోనే ఈ జాతీయ దినోత్సవానికి శ్రీకారం చుట్టామని ప్రధానమంత్రి వివరించారు. “ఆ కాలంలో నెలకొన్న పరిస్థితులు, సాహిబ్జాదాలు, గురువులు చేసిన త్యాగాలు, మన విశ్వాసాన్ని వారు ఏ విధంగా కాపాడారన్న విషయాలను మన పిల్లలు తెలుసుకున్నప్పుడు, ఆ జ్ఞానం, స్ఫూర్తి దేశం పట్ల అంకితభావం కలిగిన యువతను తీర్చిదిద్దుతాయి” అని శ్రీ మోదీ అన్నారు.
గురువుల కీర్తిప్రతిష్ఠలను ప్రపంచవ్యాప్తంగా చాటే దిశగా భారత్ కృషి చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఇందుకు నిదర్శనంగా, ఇటీవల తాను ఫిలిప్పీన్స్‌లోని అత్యంత ప్రాచీన గురుద్వారా ‘ఖల్సా దివాన్’కు వెళ్లిన సందర్భాన్ని ఆయన గుర్తుచేసుకుంటూ, దాని పునర్నిర్మాణానికి భారత ప్రభుత్వం సహకారం అందిస్తోందని చెప్పారు. “మన గురువుల బోధనల వెలుగు ప్రతి వ్యక్తిని చేరుకోవాలి; వారి దీవెనలతో భారత్ నూతన శిఖరాలను చేరుకోవాలన్నదే మా సంకల్పం” అని ప్రధాని స్పష్టం చేశారు.
“నానక్ నామ్ చడ్దీ కలా, తేరే భాణే సర్బత్ దా భలా” అనే పవిత్ర అర్దాస్ ప్రార్థనను ప్రస్తావిస్తూ.. సర్వజనుల హితం కోసం పాటుపడాలనే విశ్వజనీన బోధనను గుర్బానీ చేస్తోందని శ్రీ మోదీ అన్నారు. “సమాజంలోని ప్రతి ఒక్కరినీ మన సొంతవారిగా పరిగణించడం మొదలుపెట్టినప్పుడే, సకల జనుల శుభం కోరే సద్భావన మనసులో ఉదయిస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణల వల్ల అమాయక ప్రజలు, కుటుంబాలు హింసకు, అస్థిరతకు గురవుతున్న పరిస్థితులను ప్రధాని మోదీ ప్రస్తావించారు. శాంతి స్థాపన, ప్రతి కుటుంబానికి రక్షణ, ప్రతి మనిషికీ ఆత్మగౌరవంతో కూడిన జీవితం నేడు ప్రపంచానికి ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. “ఇలాంటి తరుణంలో ‘సర్బత్ దా భలా’ (అందరికీ మేలు జరగాలి) భావన మరింత కీలకంగా మారుతుంది” అని ప్రధాని పేర్కొన్నారు.
గురు సాహిబ్ అందించిన జీవిత సత్యాలకు రోజువారీ జీవితంలోనే అసలైన పరీక్ష ఎదురవుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా సమాజంలో తీవ్ర సవాలుగా మారిన డ్రగ్స్ మహమ్మారిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “యువత మత్తు వ్యసనాలకు బానిసైనప్పుడు, వారి భవిష్యత్తుతో పాటు యావత్ కుటుంబ ఆశలు కూడా కుప్పకూలిపోతాయి” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
భారతదేశంలోని ప్రతి యువకుడు వ్యసనాలకు దూరంగా ఉండి, బాగా చదువుకుని, తమ కలలను సాకారం చేసుకుంటూ కుటుంబాలకు, దేశానికి గర్వకారణంగా నిలవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. యువతను సరైన మార్గంలో నడిపించడంలో కుటుంబాలు, భక్త సమాజాలు, గురుద్వారాలు, సామాజిక సంస్థల పాత్ర కీలకమని ఆయన స్పష్టం చేశారు.. “గురు సాహిబ్ అనుగ్రహం, సమాజం సమిష్టి కృషితో మన కొత్త తరానికి సురక్షితమైన, ఉజ్వలమైన భవిష్యత్తును అందించగలమనే పూర్తి విశ్వాసం నాకుంది” అని ప్రధాని ఉద్ఘాటించారు. ప్రకాశ్ పురబ్ శుభాకాంక్షలు, సంప్రదాయ సిక్కు వందనాలతో ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
***
Happy to join the Shabad Kirtan marking the Parkash Purab of Sri Guru Nanak Dev Ji. https://t.co/YMDdLpFvot
— Narendra Modi (@narendramodi) November 23, 2026
राष्ट्र और उसकी संस्कृति के लिए सब कुछ न्योछावर करने का जज्बा...पूरी सिख परंपरा इसका पर्याय रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 23, 2026
आज दुनिया में कितने ही स्थानों पर संघर्ष चल रहे हैं। कितने ही निर्दोष लोग, कितने परिवार हिंसा और अशांति का सामना कर रहे हैं। ऐसे में, दुनिया के हर हिस्से में शांति हो, हर परिवार सुरक्षित हो, हर व्यक्ति को सम्मान के साथ जीने का अवसर मिले...इसके लिए ‘सरबत दा भला’ की भावना और भी अहम हो जाती है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 23, 2026
देश का हर युवा नशे से आज़ाद हो। वो अपने सपनों को पूरा करे। खूब पढ़ें, आगे बढ़ें, अपने परिवार और देश का गौरव बढ़ाए। इस प्रयास में परिवारों की भूमिका बहुत बड़ी है। हमारी संगत, हमारे गुरुद्वारे, हमारी सामाजिक संस्थाएं, सब मिलकर नौजवानों को दिशा दे सकते हैं, उन्हें सही रास्ता चुनने का हौसला दे सकते हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 23, 2026