గురు ప్రియ సాధ్ సంగత్ జీ, వాహెగురు జీ ఖల్సా, వాహెగురు జీ ఫతేహ్!
సిక్కు సమాజ గౌరవనీయ సాధువులు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ తరణ్‌జిత్ సింగ్ సంధు, ఢిల్లీ ముఖ్యమంత్రి సోదరి శ్రీమతి రేఖా గుప్తా, పార్లమెంటులో నా సహచరులు, ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు, విశిష్ట అతిథులు సహా సోదరీసోదరులారా!
ఈ పవిత్ర వాతావరణంలో శ్రీ గురు నానక్ దేవ్‌కు భక్తిపురస్సరంగా శిరసాభివందనం చేస్తున్నాను. గురుదేవ్ జయంతి నేపథ్యంలో దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పావన దినాన గురుగ్రంథ్ సాహిబ్ సంకీర్తనలో పాల్గొనే అవకాశం ఇచ్చిన శ్రీ తరణ్‌జిత్ సింగ్ సంధుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
మిత్రులారా!
గుర్బానీ (గురువాణి)లోని ప్రతి పదం, కీర్తనలోని ప్రతి స్వరం రాగసహిత సంగీతాలాపానకు పరిమితం కాదు. అదొక ఆధ్యాత్మిక యజ్ఞం… జ్ఞాన సాగరంలో పుణ్యస్నానంతో సమానం. అందుకే, ఇలాంటి కార్యక్రమాలకు ఆహ్వానం లభించి, పాల్గొనే అవకాశం లభించినప్పుడల్లా సమావేశం, సంకీర్తనలో తప్పకుండా పాల్గొంటుంటాను.
మిత్రులారా!
“కిరత్ కరో, వంద్ ఛకో, నామ్ జపో” అని గురునానక్ దేవ్ ప్రబోధించారు. అంటే- “కష్టపడి పనిచేయండి.. మీకున్నదాన్ని అందరితో పంచుకోండి.. భగవన్నామం జపించండి” అని అర్థం. ఈ బోధనలు నా జీవితంలో సహజ భాగమయ్యాయి… గురుద్వారాలలో శిరసాభివందనం, గుర్బానీలో మమేకమై ఆధ్యాత్మిక అనుభూతిని అనుభవించడం, సేవాభావనలో సంతోషాన్వేషణ, ఆపై ప్రసాద సేవనం- తదితరాలన్నీ బాల్యం నుంచి సంస్థాగత కార్యకర్తగా పనిచేసిన రోజుల దాకా నా జీవన ప్రస్థానంలో అంతర్భాగమయ్యాయి. శ్రీ హర్మందిర్ సాహిబ్ (స్వర్ణాలయం)లో శిరసు వంచి నమస్కరించే అదృష్టం నాకు అనేకసార్లు లభించింది. దేశాటనలో భాగంగా నేను పంజాబ్‌లో కూడా కొంతకాలం గడిపిన సంగతి నా పాత సహచరులకు తెలుసు. ఆ కాలం నా జీవితంలోని చిరస్మరణీయ మధుర స్మృతుల్లో ఓ భాగం.
సోదరీసోదరులారా!
గురు కృప వల్ల సిక్కు సాధువుల సాంగత్యం నాకు సదా లభిస్తూనే ఉంది. ప్రధానమంత్రి నివాసానికి కూడా ఎందరో సిక్కు సాధువులను, జ్ఞానులను ఆహ్వానించే భాగ్యం నాకు దక్కింది. ఈ నేపథ్యంలో నేటి సభలో సాధువుల సాక్షాత్కారం ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తినిస్తోంది. ఈ సందర్భంగా సాధువులు.. జ్ఞానులందరికీ వందనాలతో పాటు సిక్కు సోదరీసోదరులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
మిత్రులారా!
ఈ ఏడాది శ్రీ గురునానక్ జయంతితో మరొక పవిత్ర సంస్మరణ కార్యక్రమం కూడా ముడిపడి ఉంది. ఎలాగంటే- శ్రీ గురు తేగ్ బహదూర్ బలిదానానికి 350 ఏళ్లు నిండుతున్నాయి. ఈ దేశ అస్తిత్వం, విశ్వాసం, నమ్మకాలు, విలువల పరిరక్షణ కోసం ఇదే ఢిల్లీ గడ్డపై గురు సాహిబ్ ఆత్మబలిదానం చేశారు. ఆ సంఘటనకు ఈ ఏడాదితో 350 ఏళ్లు పూర్తవుతున్నా, ఆయన త్యాగ స్ఫూర్తి నేటికీ భారత గడ్డపై అణువణువునా నిక్షిప్తమై ఉంది. ఆయన అసమాన సాహసానికి ఈ దేశ ప్రజలు ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉంటారు.
మిత్రులారా!
భారతదేశం, దాని సంస్కృతి పరిరక్షణ కోసం సర్వస్వం త్యాగం చేయగల స్ఫూర్తి సిక్కు సంప్రదాయానికి ప్రతీక. శ్రీ భాయ్ మతి దాస్, శ్రీ భాయ్ సతీ దాస్, శ్రీ భాయ్ దయాలా తదితరుల ప్రాణత్యాగం ఈ వాస్తవాన్ని మనకు ప్రస్ఫుటం చేస్తాయి. స్వాతంత్ర్య పోరాట సమయంలోనూ ఈ స్ఫూర్తి ఏమాత్రం కొరవడలేదు. మన లెఫ్టినెంట్ గవర్నర్ గారు వివరించినట్లు- సర్దార్ శ్రీ తేజా సింగ్ సముంద్రీ ఈ సంప్రదాయానికి తిరుగులేని నిదర్శనం. గురుద్వారా సంస్కరణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తన జీవితాన్ని పూర్తిగా సేవకే అంకితం చేసిన ఆయన, అమరత్వం పొంది ఈ ఏడాదితో వందేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయనకూ నా ఘన నివాళి అర్పిస్తున్నాను.
మిత్రులారా!
భారతదేశం శతాబ్దాల పాటు బానిసత్వంలో మగ్గినపుడు ఆ చరిత్రలోని అత్యంత క్లిష్ట సందర్భాల్లో మన గురువులు దేశ రక్షణ జ్యోతిని ప్రజ్వలింపజేస్తూనే వచ్చారు. నేడు మన ముందు ‘వికసిత భారత్’ వంటి గొప్ప జాతీయ లక్ష్యాలున్న నేపథ్యంలో ఈ గమ్యం దిశగా మన ప్రస్థానం ఆ గురువుల స్ఫూర్తితో, వారి ఆదర్శాల బలంతోనే వేగంగా ముందుకు సాగుతుంది. కాబట్టి, సిక్కు సంప్రదాయాలను, వారసత్వాన్ని సమాజానికి దిక్సూచిలా, కరదీపికలా ప్రకాశింపజేయడం మన బాధ్యత.
మిత్రులారా!
ఈ బాధ్యతను నిజాయితీతో నిర్వర్తించేందుకు గడచిన పన్నెండేళ్లుగా మేం కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగానే శ్రీ గురు గోవింద్ సింగ్ 350వ జయంతి, శ్రీ గురు నానక్ దేవ్ 550వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాం. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అనేక కార్యక్రమాలను నిర్వహించారు. స్మారక నాణాలు, తపాలా బిళ్లలను ఆవిష్కరించాం. ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు దేశవ్యాప్తంగా గుర్బానీ సంబంధిత ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించాం. అదేవిధంగా శ్రీ గురు తేగ్ బహదూర్ 400వ జయంతి నాడు ఎర్రకోటలో జాతీయ స్థాయి కార్యక్రమం నిర్వహించాం. అదే స్ఫూర్తితో ప్రస్తుతం ఆయన 350వ ఆత్మబలిదాన దినాన్ని సంస్మరించుకుంటున్నాం.
మిత్రులారా!
నేటి నుంచి ఓ నెల తర్వాత… డిసెంబరు 26న దేశం ‘వీర బాలల దినోత్సవం’ నిర్వహించుకోనుంది. సాహిబ్ జాదాల అమర గాథను, మాతా గుజ్రీ దృఢ సంకల్పాన్ని, వారి అసమాన ధైర్యసాహసాల చరిత్రను నేటి యువతరానికి ఎరుకపరచడం కూడా మన బాధ్యత. అందుకే, జాతీయ స్థాయిలో వీర బాలల దినోత్సవ నిర్వహణకు శ్రీకారం చుట్టాం. ఆనాటి పరిస్థితులు, సాహిబ్ జాదాల-గురువుల చిరస్మరణీయ త్యాగాలు మన విశ్వాస పరిరక్షణకు ఎలా దోహదం చేశాయో భావితరం తెలుసుకుంటే- ఆ జ్ఞానం, స్ఫూర్తి దేశం కోసం తమనుతాము అంకితం చేసుకోగల యువతను తీర్చిదిద్దుతాయి.
గురువులను గౌరవించే మా పద్ధతి స్వదేశానికి పరిమితం కాలేదు. ఇటీవలే నేను ఫిలిప్పీన్స్‌లో పర్యటించాను. అక్కడి ‘ఖాల్సా దివాన్ గురుద్వారా’ను నేను సందర్శించాను. ఇది ఫిలిప్పీన్స్‌లోని అత్యంత పురాతన ఆలయం. భారత ప్రభుత్వం ఈ గురుద్వారా పునర్నవీకరణకు మద్దతిస్తోంది. మన గురువుల దివ్య సందేశం యావత్ మానవాళికి చేరడం, గురుదేవుల ఆశీస్సులతో భారత్ నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహించడం మా ఆకాంక్ష.
మిత్రులారా!
మనం “నానక్ నామ్ చర్దీ కలా, తేరే భానే సర్బత్ దా భలా” (నానక్ నామంలో సదా ఉత్సాహం, ఉన్నతి కనిపిస్తాయి.. దైవ సంకల్పంతో అందరికీ మేలు కలగాలి) అని ప్రార్థిస్తాం. అందరికీ మేలు కలగాలనే ఈ బోధన మనకు గుర్బానీ నుంచి లభించింది. అందరూ మనవారేనని భావించినప్పుడే అందరి సంక్షేమం కోసం కృషి చేయాలనే ఆలోచన కలుగుతుంది.
మిత్రులారా!
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నేడు సంఘర్షణలు సర్వసాధారణమయ్యాయి. ఎందరో అమాయక ప్రజలు హింస, అశాంతితో నానారకాలుగా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయాల్లో ‘సర్బత్ దా భలా’ (అందరి శ్రేయస్సును కోరే) స్ఫూర్తి మరింత అవసరం. తద్వారా అంతటా శాంతి నెలకొని, ప్రతి కుటుంబం సురక్షితంగా ఉంటుంది.. ప్రతి వ్యక్తీ గౌరవప్రదంగా జీవించగలుగుతాడు.
మిత్రులారా!
గురు సాహిబ్ మనకు ప్రబోధించిన విలువలకు అసలైన పరీక్ష మన దైనందిన జీవితంలోనే ఎదురవుతుంది. మన సమాజం ముందున్న నేటి సవాళ్లలో ‘మాదకద్రవ్యాల’ సమస్య ఒకటి. ఎందుకంటే- ఒక యువకుడు వ్యసనానికి బానిసైతే, అతని జీవితం నాశనం కావడంతో పాటు కుటుంబం కలలన్నీ ఛిద్రమవుతాయి.
మిత్రులారా!
దేశంలోని యువతరమంతా వ్యసనాలకు దూరంగా ఉంటూ బాగా చదువుకుని, తమ కలలను సాకారం చేసుకుంటూ జీవితంలో పురోగమించాలి. తద్వారా కుటుంబానికి, దేశానికి గర్వకారణంగా నిలవాలి. ఈ దిశగా కృషిలో కుటుంబాల పాత్ర అత్యంత కీలకం. మనందరితో పాటు గురుద్వారాలు, సామాజిక సంస్థలన్నీ సంయుక్తంగా యువతకు సన్మార్గం చూపాలి. తద్వారా సముచిత మార్గనిర్దేశంతో ధైర్యాన్నివ్వాలి. గురు సాహిబ్ ఆశీస్సులతో, సమాజ సమష్టి కృషితో మన యువతరానికి సురక్షిత, ఉజ్వల భవిష్యత్తునివ్వగలమని నా ప్రగాఢ విశ్వాసం. ఈ సద్భావనతో శ్రీ గురునానక్ దేవ్ మహరాజ్ పవిత్ర జయంతి సందర్భంగా మీకందరికీ మరోసారి అనేకానేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
వాహెగురు జీ ఖాల్సా, వాహెగురు జీ కీ ఫతేహ్!
నాతో గళం కలిపి జయ ధ్వానం చేయండి.. బోలే సో నిహాల్! సత్ శ్రీ అకాల్!
అనేకానేక ధన్యవాదాలు!
గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే!
***
Happy to join the Shabad Kirtan marking the Parkash Purab of Sri Guru Nanak Dev Ji. https://t.co/YMDdLpFvot
— Narendra Modi (@narendramodi) November 23, 2026
राष्ट्र और उसकी संस्कृति के लिए सब कुछ न्योछावर करने का जज्बा...पूरी सिख परंपरा इसका पर्याय रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 23, 2026
आज दुनिया में कितने ही स्थानों पर संघर्ष चल रहे हैं। कितने ही निर्दोष लोग, कितने परिवार हिंसा और अशांति का सामना कर रहे हैं। ऐसे में, दुनिया के हर हिस्से में शांति हो, हर परिवार सुरक्षित हो, हर व्यक्ति को सम्मान के साथ जीने का अवसर मिले...इसके लिए ‘सरबत दा भला’ की भावना और भी अहम हो जाती है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 23, 2026
देश का हर युवा नशे से आज़ाद हो। वो अपने सपनों को पूरा करे। खूब पढ़ें, आगे बढ़ें, अपने परिवार और देश का गौरव बढ़ाए। इस प्रयास में परिवारों की भूमिका बहुत बड़ी है। हमारी संगत, हमारे गुरुद्वारे, हमारी सामाजिक संस्थाएं, सब मिलकर नौजवानों को दिशा दे सकते हैं, उन्हें सही रास्ता चुनने का हौसला दे सकते हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 23, 2026