పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) కి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని హయ్యర్ కాలేజెస్ ఆఫ్ టెక్నాలజీకి (హెచ్ సిటి)కి మధ్య ఒక అవగాహన పూర్వక ఒప్పందం (ఎమ్ఒయు) నవీకరణకు మరియు 2011లో సంతకాలు జరిగిన ఎమ్ఒయు కు ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
యుఎఇ కి చెందిన హెచ్ సిటితో ఎమ్ఒయు నవీకరణ ఈ కింది షరతులకు లోబడి ఉంటుంది:-
1. అకౌంటింగ్ మరియు ఫైనాన్స్ కు సంబంధించి హెచ్ సిటి ప్రస్తుతం అనుసరిస్తున్న పాఠ్య ప్రణాళికను ఐసిఎఐ సమీక్షించి సాంకేతిక సంబంధ సహాయాన్ని అందజేస్తుంది;
2. హెచ్ సిటి విద్యార్థులు ఐసిఎఐ నిర్వహించే టెక్నికల్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ ను రాసి ఐసిఎఐ సభ్యత్వాన్ని పొందేందుకు అనువుగా కొత్త కోర్సులను/సవరించిన కోర్సులను మరియు మాడ్యుల్స్ ను ప్రారంభించడం గురించి ఐసిఎఐ సిఫారసు చేస్తుంది;
3. అర్హులైన హెచ్ సిటి విద్యార్థులకు ఐసిఎఐ యొక్క ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ నిర్వహణకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని ఐసిఎఐ అందిస్తుంది;
4. హెచ్ సిటి విద్యార్థులకు, అధ్యాపకులకు చర్చా సభలు మరియు వర్క్ షాప్ లను నిర్వహించడంలో ఐసిఎఐ సహకరిస్తుంది;
5. పరస్పరం అంగీకారం కుదిరిన మేరకు ప్రత్యేకత కలిగిన సంబంధిత సమ్మిళిత ఫ్యాకల్టీని ఐసిఎఐ సమకూర్చుతుంది;
6. హెచ్ సిటి విద్యార్థులకు సర్టిఫికేషన్ కోర్సులను ఐసిఎఐ అందజేస్తుంది;
7. ఐసిఎఐ యొక్క ప్రొఫెషనల్, టెక్నికల్ ఎగ్జామినేషన్ ల నిర్వహణకు అవసరమైన సదుపాయాలను హెచ్ సిటి సమకూర్చుతుంది;
8. హెచ్ సిటి, ఐసిఎఐ లు అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్థుల రాకపోకల కార్యక్రమాలను ప్రోత్సహిస్తాయి;
9. యుఎఇ లో హెచ్ సిటి కి చెందిన వివిధ కళాశాలల్లో వృత్తిపరమైన అభివృద్ధి మరియు సాంకేతిక కార్యక్రమాలు, చర్చా సభలు, సమావేశాలను నిర్వహించడంలో హెచ్ సిటి, ఐసిఎఐ లు సమన్వయంతో పని చేస్తాయి. అటువంటి కార్యక్రమాలకు సభా స్థలాన్ని హెచ్ సిటి సమకూర్చడంతో పాటు తన విద్యార్థులు మరియు అధ్యాపక సిబ్బంది ఆయా కార్యక్రమాలకు హజరు అయ్యేటట్లుగా వారిని ప్రోత్సహిస్తుంది కూడా.
10. యుఎఇ లో హెచ్ సిటి కి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సె లెన్స్ ఫర్ అప్లయిడ్ రిసర్చ్ అండ్ ట్రైనింగ్ (సిఇఆర్ టి)లో అకౌంటింగ్, ఫైనాన్స్ మరియు ఆడిట్ విభాగంలో స్వల్పకాలిక ప్రొఫెషనల్ కోర్సులను అందించడానికి హెచ్ సిటి మరియు ఐసిఎఐ లు కలిసి పని చేస్తాయి.
ఈక్విటీ, పబ్లిక్ అకౌంటబిలిటీ మరియు ఇన్నొవేషన్ లకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంతో పాటు మరింత ముందుకు సాగడానికి ఈ ప్రతిపాదనను ఉద్దేశించారు.
పూర్వరంగం:
భారతదేశంలో చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తిని క్రమబద్ధం చేయడం కోసం ది చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్, 1949 పేరుతో ఒక చట్టాన్నిభారత పార్లమెంట్ తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా ఏర్పడిన చట్టబద్ధ సంస్థే ఐసిఎఐ. ఇక యుఎఇ లోని హెచ్ సిటి లో 2,000 మంది సిబ్బందికి తోడు 23,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. అబు ధాబి, అల్ అయిన్, దుబై, ఫుజైరా, మదీనా జాయేద్, రస్ అల్ ఖైమా, రువాయీస్ మరియు షార్జా లలో హెచ్ సిటికి 17 అత్యాధునికమైన, సాంకేతికంగా సుసంపన్నమైన క్యాంపస్ లు ఉన్నాయి. యుఎఇ లో అతి పెద్దదైన ఉన్నత విద్యా సంస్థ ఇదే. తన విద్యార్థులకు అత్యున్నత స్థాయి నాణ్యతతో కూడిన సాంకేతిక మరియు వృత్తి విద్యా కార్యక్రమాలను అందించాలని హెచ్ సిటి కంకణం కట్టుకుంది. అన్ని విశ్వాసాలు మరియు విలువల పట్ల చిత్తశుద్ధితో కూడిన ఆదరణను కనబరుస్తూ, సాంకేతిక మరియు వృత్తిపరమైన తృతీయ స్థాయి విద్యా బోధనలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన, అధికృత ప్రాతినిధ్యం కలిగిన విద్యా సంస్థగా పేరు తెచ్చుకోవాలనే దార్శనికత హెచ్ సిటికి ఉంది. ఒక ఆధునిక దేశం నిర్మాణానికి సహకరించే కీలకమైన విద్యా సంబంధ ఆధార స్థంభంగా రూపుదిద్దుకోవాలనేది హెచ్ సిటి ఆశయంగా ఉంది.
యుఎఇ లో అకౌంటింగ్, ఫైనాన్షియల్ మరియు ఆడిట్ విభాగాలకు సంబంధించిన విజ్ఞానాన్ని బలోపేతం చేసే కృషిలో ఈ ఎమ్ఒయు ద్వారా హెచ్ సిటి తో పాలుపంచుకొనేందుకుగాను, హెచ్ సిటి తో ఉన్న ఎమ్ఒయును నవీకరించుకోవాలన్న అంశాన్ని ఐసిఎఐ పరిశీలించింది. హెచ్ సిటితో 5 ఏళ్ళ పాటు వర్తించే ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రాలపై 2011 జనవరి 4వ తేదీన సంతకాలయ్యాయి.
***