Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వ‌ర‌ల్డ్‌ క‌ప్ క్రికెట్ ఫైన‌ల్ సందర్భంగా భార‌తదేశ మ‌హిళా జ‌ట్టుకు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌ మంత్రి


ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వ‌ర‌ల్డ్‌ క‌ప్ ఫైనల్ సంద‌ర్భంగా భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

“మ‌న మ‌హిళా క్రికెట్ జ‌ట్టు ఈ రోజు వ‌ర‌ల్డ్‌ క‌ప్ ఫైన‌ల్స్ లో ఆడుతోంది. ఈ సంద‌ర్భంగా 125 కోట్ల మంది భార‌తీయుల‌లో నేను కూడా ఒకరుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

కెప్టెన్ మిథాలీ రాజ్ ముందు నిలబడి జ‌ట్టును న‌డిపిస్తున్నారు. ఆట‌ లో ఆమె అనుస‌రిస్తున్న సంయ‌మ‌న వైఖరి యావత్తు జ‌ట్టుకు తప్పక తోడ్పడగలదు.

చిరంజీవి స్మృతి మంథానా.. నీకు ఇవే నా శుభాకాంక్ష‌లు. మైదానంలో నీవు ప్ర‌శాంతంగా, ప‌ట్టుద‌ల‌తో గొప్ప‌గా ఆడాలి.

పూన‌మ్ రౌత్‌ కు ఈ ప్ర‌పంచ‌ క‌ప్ ఫైన‌ల్ చిర‌స్మ‌ర‌ణీయం కావాల‌ని భార‌తదేశం ఆకాంక్షిస్తోంది. ఆమె క్రీడానైపుణ్యం మాకంద‌రికీ ఎంతో గ‌ర్వ‌కార‌ణం.

హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌ కు అభిమానులు కాని వారెవ‌రు ? సెమీ ఫైన‌ల్స్‌లో ఆకాశాన్నంటిన ఆమె ప్ర‌తిభ ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. ఇవాళ కూడా నీవు చాలా బాగా ఆడాలి సుమా.

ఫైనల్స్ సందర్భంగా దీప్తి శ‌ర్మ‌ కు శుభాకాంక్ష‌లు. జ‌ట్టుకు ఆమె ఎంతో విలువను జోడిస్తున్నారు. తన ఆట‌ తీరుతో అనేక మ్యాచ్‌ల‌ గతిని మార్చివేశారు.

అనుభవజ్ఞురాలు వేదా కృష్ణ‌మూర్తి మధ్య శ్రేణి లో జ‌ట్టుకు ఎంతో అవ‌స‌ర‌మైనటువంటి నిల‌క‌డ‌ను అందిస్తూవస్తున్నారు. ఆమె ఈ రోజు రాణించాలిగాక.

వికెట్ల వెనుక సుష్మా వ‌ర్మ త‌న‌ వంతుగా కీల‌క పాత్రను పోషిస్తున్నారు. మ్యాచ్‌ల‌ను క్యాచ్ లు గెలిపిస్తాయ‌న్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

ఝూల‌న్ గోస్వామి భార‌తదేశానికే గ‌ర్వ‌ కార‌ణం. కీల‌క స‌న్నివేశాలలో ఆమె అద్భుతమైన బౌలింగ్ జ‌ట్టుకు అండగా ఉంటోంది. ఝూల‌న్‌, మీరు అత్యుత్తమమైన ఆట ఆడాలి.

శిఖా పాండే ఆల్‌ రౌండ్ నైపుణ్య ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌ట్టుకు చాలా కీల‌కమైనవి; బెస్ట్ ఆఫ్ లక్.

పూన‌మ్ యాద‌వ్ పటిష్ట బౌలింగ్ అత్యుత్త‌మ బ్యాట్స్ వుమ‌న్‌ కైనా చెమ‌ట‌లు ప‌ట్టించ‌గ‌లదు. ఆమెకు శుభాకాంక్ష‌లు..

ప్రత్యర్థి జట్టకు తక్కువ స్థాయిలో మాత్రమే పరుగులు వచ్చే విధంగా బంతులు విసరడంలో రాజేశ్వ‌రి గైక్వాడ్ పెట్టింది పేరు. అదృష్టం మీ అంద‌రి వెన్నంటి నిలవాలి ” అని ప్ర‌ధాన‌ మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.