పిఎంఇండియా
దేశం లోని వివిధ ఉన్నత విద్య సంస్థలకు ప్రవేశ పరీక్షల నిర్వహణ కోసం ఇండియన్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం, 1860 కింద ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగివుండే, స్వయంపోషణ సామర్ధ్యం కలిగి ఉండే జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ)ను ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ప్రధాన లక్షణాలు:
· ప్రస్తుతం సిబిఎస్ఇ నిర్వహిస్తున్న వివిధ ప్రవేశ పరీక్షలను ప్రారంభంలో ఎన్‌టిఎ నిర్వహిస్తుంది.
· ఎన్‌టిఎ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తరువాత ఇతర పరీక్షల నిర్వహణ బాధ్యత కూడా తీసుకుంటుంది.
· అభ్యర్థులకు వారి ప్రతిభను పూర్తి స్థాయిలో ప్రదర్శించేందుకు తగినంత అవకాశం కల్పించేందుకు సంవత్సరంలో కనీసం రెండు సార్లు ఆన్‌లైన్ పద్ధతిలో ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహిస్తారు.
·గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల అవసరాలను తీర్చడం కోసం జిల్లా స్థాయిలోను/జిల్లా కన్నా తక్కువ స్థాయిలోను ఇది కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. వీలైనంత వరకు గ్రామీణ విద్యార్థులకు అవసరమైన శిక్షణను కూడా చేపడుతుంది.
నిర్మాణం:
– మానవ వనరుల శాఖ నియమించిన ఒక ప్రముఖ విద్యావేత్త ఎన్‌టిఎ కు సారథిగా వ్యవహరిస్తారు.
– ప్రభుత్వం లోని డైరెక్టర్ జనరల్ హోదా గల అధికారి సిఇఒ గా వ్యవహరిస్తారు.
– ఎన్‌టిఎ సేవలను వినియోగించుకొనే సంస్థల నుండి ఎంపిక చేసిన సభ్యులతో గవర్నర్ల బోర్డు ను ఏర్పాటు చేస్తారు.
– 9 వేర్వేరు విభాగాలకు అధిపతులుగా ఉండే విద్యావేత్తలు/నిపుణులు డైరెక్టర్ జనరల్ కు సహాయ సహకారాలు అందిస్తారు.
ఆర్థిక వనరులు:
ఒకటో సంవత్సరంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్‌టిఎ కు 25 కోట్ల రూపాయలు ఏక కాలిక గ్రాంటుగా ప్రభుత్వం అందచేస్తుంది. ఆ తరువాత నుండి అది ఆర్థికంగా స్వీయపోషణ సామర్థ్యాన్ని సంతరించుకోగలుగుతుంది.
ప్రభావం:
వివిధ ప్రవేశ పరీక్షలకు హాజరవుతున్న 40 లక్షల మంది విద్యార్థులకు ఎన్‌టిఎ లాభం చేకూర్చుతుంది. సిబిఎస్ఇ, ఎఐసిటిఇ ల వంటి సంస్థల భారాన్ని తగ్గిస్తుంది. ప్రవేశ పరీక్షల నిర్వహణలో విశ్వసనీయతను తీసుకురావడంతో పాటు విద్యార్థుల అభిరుచి, తెలివితేటలు, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలకు ప్రమాణాలు నిర్ణయిస్తుంది.
పూర్వరంగం:
పలు అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్న విధంగానే భారత్‌లో కూడా వివిధ పోటీ పరీక్షల నిర్వహణకు జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక సంస్థ ఉండాలన్న లక్ష్యంతో పూర్తి స్వయం ప్రతిపత్తి, స్వీయపోషణ సామర్థ్యాలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ)ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి 2017-18 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
***