పిఎంఇండియా
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) కు మరియు సౌత్ ఆఫ్రికా ఇస్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ఎస్ఎఐసిఎ) కు మధ్య పరస్పర మాన్యత ఒప్పందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
వివరాలు:
ఐసిఎఐ మరియు ఎస్ఎఐసిఎ కు మధ్య పరస్పర మాన్యత ఒప్పందం (ఎమ్ఆర్ఎ) విషయంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని మంజూరు చేసింది. దక్షిణాఫ్రికా మరియు భారతదేశం లలో అకౌంటింగ్ వృత్తి వికాసానికి సకారాత్మకమైన తోడ్పాటును అందించడంతో పాటు అకౌంటింగ్ పరమైన జ్ఞానం, వృత్తిపరమైన మరియు మేధో సంబంధమైన అభివృద్ధి, ఇంకా ఈ రంగంలో పని చేస్తున్న వారి ప్రయోజనాలు పురోగమించేటట్లు చూసేందుకు ఒక పరస్పర సహకారపూర్వకమైన ఫ్రేమ్ వర్క్ ను నెలకొల్పాలన్నదే ఎమ్ఆర్ఎ ఉద్దేశం.
ఈ ఒప్పందం :
భారతీయ అకౌంటెన్సీ వృత్తి నిపుణులకు ఐసిఎఐ అర్హత కు అదనంగా స్థానిక అకౌంటెన్సీ అర్హతను కూడా గుర్తించేందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది; ఇది వారికి దక్షిణాఫ్రికా మార్కెట్ లలో వృత్తి సంబంధ అవకాశాలను మరింత అధికం చేయగలదు.
రెండు దేశాలకు చెందిన అకౌంటింగ్ ఇన్స్టిట్యూట్ ల మధ్య పటుతరమైన పని సంబంధాలు వర్ధిల్లగలవు.
ఇరు పక్షాలకు చెందిన వృత్తి నిపుణులు అటు నుండి ఇటు, ఇటు నుండి అటు జరిపే రాకపోకలు హెచ్చుతాయి. రెండు దేశాలలోను చిన్న మరియు మధ్యతరహా వ్యాపార సంస్థలకు ఒక కొత్త పార్శ్వం ఆవిష్కారం కాగలదు.
ప్రయోజనాలు :
ఎస్ఎఐసిఎ సన్నిహిత సంబంధం కలిగి ఉండటమనేది ఐసిఎఐ కు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీనివల్ల రెండు సంస్థల సభ్యులు వారి ప్రయోజనాలను పెంపొందించుకోగలుగుతారు. గత కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న సంబంధం ఇరు పక్షాలకు లాభాన్ని చేకూర్చింది. ఎమ్ఆర్ఎ కారణంగా భారతదేశ చార్టర్డ్ అకౌంటెంట్ల కు ఈ ప్రాంతంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు అంది రావచ్చు. అంతేకాకుండా, వారి వద్ద నుండి భారతదేశానికి జరిగే చెల్లింపులు అధికం కాగలవు.
పూర్వరంగం:
భారతదేశ పార్లమెంటు లో ‘ది చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్, 1949’ పేరిట ఒక చట్టాన్ని చేయడం ద్వారా ఐసిఎఐ ని స్థాపించడమైంది. భారతదేశంలో చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తిని నియంత్రించడం ఈ చట్టం ధ్యేయం. ఇక ఎస్ఎఐసిఎ దక్షిణాఫ్రికా లో అగ్రేసర అకౌంటెన్సీ సంస్థే కాకుండా ప్రపంచంలో అగ్రగామి సంస్థలలో ఈ సంస్థ కూడా ఒకటిగా ఉన్నది.
***