పిఎంఇండియా
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డిఒఎన్ఇఆర్- DoNER) ప్రతిపాదించిన విధంగా ఈశాన్య మండలి (ఎన్ఇసి) ఎక్సఫిశియో చైర్మన్ గా కేంద్ర హోం మంత్రి ని నామినేట్ చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. 8 ఈశాన్య రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఈ చట్టబద్ధ సంస్థ లో సభ్యులుగా ఉంటారు. డిఒఎన్ఇఆర్ కు చెందిన సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ఈ మండలి కి వైస్ చైర్మన్ గా వ్యవహరించే ప్రతిపాదన కు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ప్రభావం :
ఎన్ఇసి వివిధ పథకాలను కేంద్ర , రాష్ట్ర ఏజెన్సీ ల ద్వారా అమలు చేస్తుంది. ఈ సంస్థ కు హోం మంత్రి చైర్మన్ గా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కు చెందిన మంత్రి వైస్ చైర్మన్ గా వ్యవహరించే కొత్త ఏర్పాటు వల్ల ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అందరు గవర్నర్లు, ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటూ అంతర్ రాష్ట్ర సమస్యలను మరింత సమగ్రంగా చర్చించేందుకు ఇది ఒక వేదికగా ఉపయోగపడనుంది. అలాగే భవిష్యత్తు లో ఉమ్మడి విధానాలను అనుసరించడానికి వీలు కల్పిస్తుంది.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాలు మరియు మందుగుండు దొంగ రవాణా, సరిహద్దు వివాదాలతో పాటు పలు అంతర్ రాష్ట్ర అంశాలపై చర్చించే బాధ్యత ను చేపట్టిన జోనల్ కౌన్సిల్స్ లక్ష్యాలను కూడా ఇప్పుడు ఎన్ఇసి చేపట్టగలుగుతుంది.
ఇలా ఎన్ఇసి లో తీసుకు వచ్చిన మార్పుల వల్ల ఇది ఈశాన్య ప్రాంత సంస్థ గా మరింత సమర్ధంగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది.
ఈ కౌన్సిల్ ఎప్పటికప్పుడు ఆయా ప్రాజెక్టుల, పథకాల అమలు ను సమీక్షించి, ఈ ప్రాజెక్టు లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెరుగైన సమన్వయానికి తగిన సూచనలు చేయనుంది. ఈ మండలి కి కేంద్ర ప్రభుత్వం బదలాయించే అధికారాలు ఉంటాయి.
పూర్వరంగం :
నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ చట్టం, 1971 లో భాగంగా సమతుల్యతతో, సమన్వయంతో కూడిన అభివృద్ధికి, రాష్ట్రాలతో సమన్వయం సాధించేందుకు ఉన్నత స్థాయి వ్యవస్థగా ఎన్ఇసి ని ఏర్పాటు చేశారు. 2002 నాటి సవరణ అనంతరం, ఎన్ఇసి ని ఈశాన్య రాష్ట్రాల ప్రాంతాల కోసం ప్రాంతీయ ప్రణాళికా వ్యవస్థ గా కార్యకలాపాలను సాగించేందుకు,ఈ ప్రాంతానికి సంబంధించి ప్రాంతీయ ప్రణాళిక ను రూపొందించే వీలు కల్పించారు. ఇది రెండు లేదా మూడు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులు, పథకాలకు ప్రాధాన్యమిస్తుంది. సిక్కిమ్ విషయంలో ఈ మండలి ప్రత్యేక ప్రాజెక్టులను, పథకాలను రూపొందిస్తుంది.
***