పిఎంఇండియా
వాతావరణ, పర్యావరణ మార్పులను రోజులవారీగా కాకుండా రుతువులవారీగా సూక్ష్మంగా వివరించే సూచనల సంయుక్త విధానం (యూఎమ్) కోసం చేసుకోబోతున్న అంతర్జాతీయ ఒప్పందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. భూశాస్ర్త మంత్రిత్వ శాఖకు చెందిన ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ (ఈఎస్ఎస్ఓ), యునైటెడ్ కింగ్‌డమ్ వాతావరణ విభాగం (యూకేఎంఓ), కొరియా వాతావరణ నిర్వహణ విభాగం (కేఎంఏ), కామన్వెల్త్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రిసర్చి ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్ఓ) ద్వారా ఆస్ట్రేలియా లతో కలసి కన్సార్టియం ఒప్పందానికి సిద్ధమవుతున్నాయి.
యూఎమ్ కన్సార్టియానికి కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా లక్ష పౌండ్లను సభ్యత్వ వాటాగా చెల్లిస్తుంది. వాతావరణ, భూ వ్యవస్థ మార్పులపై పరిశోధనల్లో భారత శాస్త్రవేత్తలు, విద్యావేత్తలకు ఈ ఒప్పందం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కలసి పనిచేయటానికి వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా భారత రుతుపవన ప్రాంతంపై వాతావరణ సూచనల్ని పసిగట్టడంలో, భూవ్యవస్థ విధానాలను పరిశోధించటంలో శాస్ర్త సాంకేతిక నైపుణ్యాలను ఇచ్చిపుచ్చుకోవటానికి, అభివృద్ధికి దోహదం చేస్తుంది. వచ్చే జనవరిలో జరిగే ఒప్పందం ద్వారా భారత్ యూఎంలో నాలుగో భాగస్వామిగా చేరబోతోంది. ఒప్పందం ప్రకారం నాలుగు దేశాలు ప్రణాళికాబద్ధంగా, సంయుక్తంగా ప్రాధాన్య రంగాలను గుర్తించుకొని, వనరులను సమీకరించుకొని పనిచేస్తాయి.
ఒప్పందం వివరాలు…..
భారత్ లోని వివిధ ప్రాంతాల వాతావరణ ముందస్తు సూచికలను ఈఎస్ఎస్ఓ ద్వారా మంత్రిత్వ శాఖ యూఎంకు అందజేస్తుంది. తద్వారా రుతుపవనాలకు సంబంధించిన మరింత కచ్చితమైన అంచనాలు వేయటానికి వీలవుతుంది. పరస్పర ప్రయోజనం చేకూరేలా అంతర్జాతీయ సంస్థలతో కలసి మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది. యూఎంలోని నాలుగు దేశాలూ కలసి ఈ ప్రాంతంలోనే కాకుండా ప్రపంచ వాతావరణ, పర్యావరణ అంచనాలను కచ్చితంగా లెక్కించటంలో శాస్ర్త సహకారాలను అందించుకుంటూ, పరస్పర ప్రయోజనబద్ధంగా పరిశోధనలు కొనసాగిస్తాయి. నేషనల్ మాన్ సూన్ మిషన్ కింద రోజువారీగా కాకుండా రుతువుల వారీగా రుతుపవనాల గమనాలను అంచనా వేయటానికి 2008 నుంచే మంత్రిత్వ శాఖ యూకేఎంఓ తో కలసి పనిచేస్తోంది. మరింత కచ్చితమైన అంచనాలకు, పరిశోధనలకు వీలుగా యూఎమ్ కన్సార్టియంలో భాగస్వామి కావాలని నిర్ణయించింది.