Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నౌకాశ్ర‌యాల నేతృత్వంలో అభివృద్ధి ప్రక్రియకు ప్ర‌భుత్వ ప్రోత్సాహం


కంపెనీల చ‌ట్టం, 2013 కింద సాగ‌ర‌మాల డెవ‌ల‌ప్ మెంట్ కంపెనీ (ఎస్ డి సి)ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు. నౌకా వ్యాపార మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఎస్ డి సి ప‌నిచేస్తుంది. స్పెష‌ల్ పర్ప‌స్ వెహిక‌ల్స్ (ఎస్ పి వి) ప్రాజెక్టు కు ఈక్విటీ మ‌ద్ద‌తును ఈ కంపెనీ అందిస్తుంది. సాగ‌ర‌మాల కార్యక్రమం కింద రెసిడ్యూయ‌ల్ ప్రాజెక్టుల‌కు కూడా ఆర్థిక స‌హాయం చేస్తుంది. ఎస్ డి సిని రూ.1,000కోట్ల ఆరంభిక అధీకృత వాటా మూలధనంతో కంపెనీల చ‌ట్టం, 2013 కింద ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంది. దీని స‌బ్ స్క్రయిబ్ డ్ షేర్ క్యాపిట‌ల్ రూ. 90 కోట్లు ఉంటుంది.

గుర్తించిన ప్రాజెక్టుల‌ను సంబంధిత నౌకాశ్రయాలు, రాష్ట్ర ప్ర‌భుత్వాలు/ మారిటైమ్ బోర్డులు , కేంద్ర మంత్రిత్వ‌ శాఖలు చేప‌డుతాయి. ఈ ప్రాజెక్టులను ప్రధానంగా ప్రయివేటు లేదా పబ్లిక్- ప్రయివేట్ భాగస్వామ్యం (పి పి పి) ప‌ద్ధ‌తిలో చేప‌ట్ట‌డం జ‌రుగుతుంది. పోర్టులు/రాష్ట్ర ప్ర‌భుత్వాలు/ కేంద్ర మంత్రిత్వ‌ శాఖ‌లు ఏర్పాటు చేసిన స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహిక‌ల్స్ కు ఈక్విటీ మ‌ద్ద‌తును అందిస్తారు. ఇత‌ర ఏ విధ‌మైన ప‌ద్ధ‌తుల ద్వారాగానీ, మార్గాల‌ ద్వారాగానీ నిధులు అందించ‌లేని రెసిడ్యూయల్ ప్రాజెక్టుల‌ను కూడా అమ‌లు చేస్తుంది.

నౌకాశ్ర‌యాల నేతృత్వంలో అభివృద్ధి ప్రాజెక్టుల‌ను ఎస్ డి సి గుర్తిస్తుంది. ప్రాజెక్టు అభివృద్ధికి, నిర్మాణాత్మ‌క కార్య‌క్ర‌మాకుగాను ప్రాజెక్టు ఎస్ పి వి ల‌కు సాయాన్ని అంద‌జేస్తారు. ప్రైవేట్ రంగ భాగ‌స్వామ్యం కోసం బిడ్డింగ్ ను నిర్వ‌హిస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో చేప‌ట్టిన వ్యూహాత్మ‌క ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌లో ఎదురయ్యే ప్ర‌మాద నిర్వ‌హ‌ణ చ‌ర్య‌ల‌ను ఎస్‌ డి సి క్ర‌మ‌బ‌ద్ధీక‌రిస్తుంది. అవ‌స‌ర‌మైన అనుమ‌తుల‌ను తెస్తుంది.

గుర్తించిన ప్రాజెక్టుల‌ను ప‌లు ఏజెన్సీలు చేప‌డ‌తాయి కాబ‌ట్టి, ఎస్ డి సి నోడ‌ల్ ఏజెన్సీగా త‌న బాధ్య‌త‌ల‌ను నిర్వహిస్తుంది. ప్ర‌స్తుతం గుర్తించిన ప్రాజెక్టుల విష‌యంలో గానీ, మాస్ట‌ర్ ప్లాన్ ద్వారా పుట్టుకొచ్చే ఇత‌ర ప్రాజెక్టుల విష‌యంలో గానీ స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తుంది.

ఎన్ పి పి లో భాగంగా గుర్తించిన తీర ప్రాంత ఆర్ధిక మండ‌ళ్లకు సంబంధించిన మాస్ట‌ర్ ప్లాన్ లను స‌మ‌గ్రంగా త‌యారు చేసే ప‌నిని ఎస్‌ డి సి చేప‌డుతుంది. భార‌తీయ సముద్ర సంబంధి రంగంలో సంతులిత అభివృద్ధి జ‌ర‌గ‌డానికి వీలుగా విధివిధానాల‌ను అంద‌జేస్తుంది.

సాగ‌ర‌మాల కార్యక్రమంలోని తీర ప్రాంత ప్ర‌జ‌ల అభివృద్ధి ల‌క్ష్యానికి అనుగుణంగా నౌకా వ్యాపార మంత్రిత్వ‌ శాఖ అనేక కార్య‌క్ర‌మాల‌ను, ప్రాజెక్టుల‌ను చేప‌డుతోంది. తీర‌ ప్రాంత ప్ర‌జ‌ల నైపుణ్యాల అభివృద్ధి, స‌ముద్ర మ‌త్స్య సంప‌ద అభివృద్ధి ప్రాజెక్టుల‌ను చేప‌డుతుంది.

నైపుణ్యాల అభివృద్ధి ప్రాజెక్టులు ఇలా వున్నాయి; తీర‌ ప్రాంత జిల్లాల నైపుణ్యాలలోని అంత‌రంపైన విశ్లేష‌ణ‌, నౌక‌శ్రాయాలలో, సముద్ర సంబంధి రంగంలో క‌టింగ్ ఎడ్జ్‌ స్కిల్ ట్రయినింగ్, షిప్ బ్రేకింగ్‌, రిపేర్ రంగాలలో భ‌ద్ర‌తాప‌ర‌మైన అంశాలలో శిక్ష‌ణ‌, దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశ‌ల్య యోజ‌న లో భాగంగా కోస్తా తీర‌ ప్రాంత జిల్లాల నైపుణ్యాల శిక్ష‌ణ, నౌకా సంబంధి మ‌త్స్య‌కారుల నైపుణ్యాల అభివృద్ధి ప్రాజెక్టులు మొద‌లైన‌వి ఇందులో ఉన్నాయి.

సాగ‌ర‌మాల కార్యక్రమంలో భాగంగా ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులలో కొన్ని ఎంపిక చేసిన ప్రాజెక్ట‌ులకు వ్యవసాయ శాఖ ఆధీనంలోని ప‌శుపోషణ, పాడి, మ‌త్స్య విభాగం సమన్వయంతో నౌకా వ్యాపార మంత్రిత్వ శాఖ కొంత మేరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. పూర్తి కావ‌డానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టుల‌కు ప్రాధాన్య‌మిచ్చేలా ప్రాజెక్టుల‌ను గుర్తిస్తారు.

కోస్తా తీర‌ ప్రాంత ప్ర‌జ‌ల అభివృద్ధి ప‌థ‌క నిర్వ‌హ‌ణ అనేది ఎస్ డి సి కి కేటాయించిన బాధ్యతలలో ముఖ్య‌మైంది. సాగ‌ర‌మాల కార్యక్రమం కింద గుర్తించిన తీర‌ ప్రాంత ప్ర‌జ‌ల అభివృద్ధి ప్రాజెక్టుల‌కు నిధుల‌ను అంద‌జేయ‌డం జ‌రుగుతుంది. నిర్ణీత కాల‌ వ్య‌వ‌ధి గ‌ల ప్రాజెక్టుల‌కు, స్థానిక వ‌న‌రుల‌ సాయంతో, వినూత్నంగా రూపొందే ప్రాజెక్టుల‌కు ప్రాధాన్య‌మిస్తారు.

ప‌లు విధాలుగా ఎస్ డి సి నిధుల‌ను స‌మ‌కూర్చుకుంటుంది. రుణాలుగా గానీ, ఈక్విటీల రూపంలో గానీ (దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డి) స‌మీక‌రించ‌వ‌చ్చు. భార‌త ప్ర‌భుత్వం అందించే వ‌న‌రులను ఉప‌యోగించుకోవ‌డం ద్వారా, ప్రాజెక్టు అవ‌స‌రాల ప్ర‌కారం, బ‌హుళ అంచెలు గ‌ల ఏజెన్సీల‌ నుండి గానీ, ద్వైపాక్షికంగా నిధుల‌ను అందించే ఏజెన్సీల‌ నుండి గానీ నిధుల‌ను స‌మ‌కూర్చుకోవ‌డం జ‌రుగుతుంది.

పూర్వ రంగం :

కేంద్ర మంత్రిమండలి ఆమోదంతో 2015 మార్చి 25న సాగ‌ర‌మాల కార్యక్రమాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది. భార‌త‌దేశంలో నౌకాశ్ర‌య సార‌థ్య ఆర్ధికాభివ‌ద్ధిని సాధించ‌డం కోసం ఈ కార్యక్రమాన్నిఉద్దేశించారు. భార‌త‌దేశానికి ఉన్న 7,500 కిలోమీట‌ర్ల పొడ‌వైన కోస్తా తీర‌ ప్రాంత సామ‌ర్ధ్యం నుండి ల‌బ్ధి పొంద‌డానికి, 14,500 కిలోమీట‌ర్ల స‌ముద్ర జ‌ల ర‌వాణా మార్గాన్ని ఉప‌యోగించుకోవ‌డానికి, ముఖ్య‌మైన అంత‌ర్జాతీయ సముద్ర సంబంధి వ్యాపార మార్గాల వ్యూహాత్మ‌క ప్రాంతాల‌ నుండి ల‌బ్ధి పొంద‌డానికి ప్ర‌భుత్వం సాగ‌ర‌మాల కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని 2015 మార్చి 25న ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నేష‌న‌ల్ ప‌ర్ స్పెక్టివ్ ప్లాన్ (ఎన్ పి పి) ని రూపొందించారు. కోస్తా తీర‌ప్రాంత సముద్ర సంబంధి రంగంలో స‌మ‌గ్ర‌మైన అభివృద్ధి కోసం దీనిని రూపొందించారు. నౌకాశ్ర‌యాల ఆధునికీక‌ర‌ణ‌, కొత్త నౌకాశ్రయాల అభివృద్ధి, నౌకాశ్ర‌యాల అనుసంధానాన్ని మెరుగుప‌ర‌చ‌డం, నౌకాశ్ర‌యాల నేతృత్వంలో పారిశ్రామికీక‌ర‌ణ‌, కోస్తా తీర ప్రాంత ప్ర‌జ‌ల అభివృద్ధి మొద‌లైన అంశాలలో 150 ప్రాజెక్ట‌ులను ఎన్ పి పి గుర్తించింది.