Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అక్టోబర్ 25న ఉత్తరప్రదేశ్, ఒడిశాలో పీఎం పర్యటన


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 25, 2026న ఉత్తరప్రదేశ్, ఒడిశాలో పర్యటించనున్నారు. ఉదయం సుమారు 11 గంటలకు వారణాసిలో నూతన వస్త్ర తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం సుమారు ఒంటి గంటకు వారణాసిలోని నమో ఘాట్ వద్ద జరిగే వైమానిక దళ దినోత్సవ విన్యాసాల ప్రదర్శన-2026కు ముఖ్య అతిథిగా హాజరై, ప్రదర్శనను వీక్షిస్తారు.

 

అనంతరం ప్రధానమంత్రి ఒడిశాకు వెళ్తారు. అక్కడ సాయంత్రం సుమారు 4:45 గంటలకు భువనేశ్వర్‌లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ డేటా సెంటర్, సైబర్ భద్రత శిక్షణ సంస్థను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగిస్తారు.

 

వారణాసిలో పీఎం పర్యటన

 

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అరవింద్ లిమిటెడ్‌ నూతన వస్త్ర తయారీ కేంద్రాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ తయారీ కేంద్రం… భారత జౌళి, వస్త్ర తయారీ వ్యవస్థను బలోపేతం చేయటం, ఈ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించే దిశగా ముందడుగును సూచిస్తుంది.

 

ఆధునిక తయారీ పద్ధతులపై దృష్టి సారించే ఈ తయారీ కేంద్రం.. ముఖ్యంగా మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించటంతో పాటు ఈ ప్రాంత ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది. పారిశ్రామిక పెట్టుబడులకు, తయారీ ఆధారిత వృద్ధికి గమ్యస్థానంగా పెరుగుతున్న ఉత్తరప్రదేశ్ పాత్రను ఈ ప్రారంభోత్సవం చాటిచెబుతుంది. అంతర్జాతీయ స్థాయిలో వినియోగదారులు ఉన్నందున, వారణాసిలో తయారైన ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు విస్తరిస్తున్నాయి. ప్రధానంగా మహిళల భాగస్వామ్యంతో నడిచే ఈ కార్యక్రమం, మహిళా నేతృత్వంలోని అభివృద్ధికి శక్తిమంతమైన ప్రతీక.

 

వారణాసిలోని నమో ఘాట్ వద్ద జరిగే వైమానిక దళ విన్యాసాల ప్రదర్శన-2026ను ప్రధానమంత్రి వీక్షిస్తారు. భారత వైమానిక దళ 94వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని “వింగ్స్ ఓవర్ గంగాస్” ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

 

ఈ వైమానిక ప్రదర్శనలో రవాణా విమానాలతో పాటు తేజస్, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ (ఎల్‌సీహెచ్) ప్రచండ్, ఎస్ యూ-30 ఎంకెఐ, రఫేల్ వంటి యుద్ధ విమానాలు కనువిందు చేస్తాయి. ఉమ్మడి కార్యాచరణను ప్రదర్శిస్తూ భారత నౌకాదళం, సైన్యానికి చెందిన విమానాలు కూడా ఇందులో పాల్గొంటాయి. సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్, సారంగ్ హెలికాప్టర్ డిస్‌ప్లే టీమ్‌తో సహా భారత వైమానిక దళానికి చెందిన ప్రతిష్ఠాత్మక ప్రదర్శన బృందాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. అత్యంత కచ్చితత్వంతో కూడిన గగనతల విన్యాసాలు, సమన్వయం, కార్యాచరణ నైపుణ్యాన్ని ఈ ప్రదర్శన కళ్లకు కడుతుంది.

భువనేశ్వర్‌లో పీఎం పర్యటన

 

భారత ఆర్థిక వ్యవస్థ సాంకేతిక పునాదులను బలోపేతం చేయటంలో కీలక ఘట్టాన్ని సూచిస్తూ.. భువనేశ్వర్‌లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ నూతనంగా ఏర్పాటు చేసిన డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ శిక్షణ సంస్థను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. బ్యాంక్ కంప్యూటింగ్ అవసరాలను తీర్చేందుకు, ఆర్బీఐతో పాటు ఆర్థిక రంగానికి సురక్షితమైన, దృఢమైన, విస్తరించదగిన, భవిష్యత్ అవసరాలకు తగిన కంప్యూటింగ్ వ్యవస్థను అందించేలా వీటిని రూపొందించారు.

 

ఇతర ప్రధాన కార్యక్రమాలతో పాటు అత్యంత కీలకమైన చెల్లింపులు, సెటిల్‌మెంట్ వ్యవస్థలను నాలుగు అత్యాధునిక డేటా సెంటర్లు నిర్వహిస్తాయి. డేటా సెంటర్ మౌలిక సదుపాయాలకు ప్రపంచ ప్రమాణమైన అప్‌టైమ్ ఇనిస్టిట్యూట్ టైర్ IV సర్టిఫికేషన్‌ను ఈ కేంద్రం పొందింది. కార్యాచరణ స్థిరత్వంలో దీన్ని ఉన్నత శ్రేణిలో నిలుపుతుంది. ప్రపంచవ్యాప్తంగా బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్) రంగంలో టైర్ IV సర్టిఫికేషన్ పొందిన అతిపెద్ద కేంద్రాల్లో ఇదొకటి. డిజిటల్ ఆర్థిక సేవల విస్తృతిని, సామర్థ్యాన్ని, విశ్వసనీయతను పెంచటానికి ఇది దోహదపడుతుంది. సాంకేతికత ఆధారంగా వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు సురక్షితమైన డిజిటల్ పునాదిగా ఇది నిలుస్తుంది. ప్రపంచ సెంట్రల్ బ్యాంకింగ్ సమాజంలో డిజిటల్ మౌలిక సదుపాయాల అగ్రగామిగా రిజర్వ్ బ్యాంక్‌కు ఉన్న ప్రత్యేక స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూడా సహాయపడుతుంది.

 

సైబర్ భద్రత, ఎంటర్‌ప్రైజ్-టెక్నాలజీ శిక్షణ, పరిశోధన, రంగాల వారీగా సామర్థ్యాల అభివృద్ధికి ప్రత్యేక సంస్థాగత వేదికను అందిస్తూ.. సైబర్ సెక్యూరిటీ శిక్షణా సంస్థ సామర్థ్య నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది. క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ, ఇతర సరికొత్త సాంకేతికతలతో సహా బీఎఫ్ఎస్ఐ రంగానికి సంబంధించిన అత్యాధునిక సాంకేతికతలపై ఈ సంస్థ దృష్టి సారిస్తుంది.

****