పిఎంఇండియా
అట్టడుగు స్థాయి రంగాలలో నవకల్పన (ఇన్నోవేషన్)కు సంబంధించిన సహకార స్థాపనకు గాను దక్షిణ ఆఫ్రికాతో సంతకాలు జరిగిన ఎం ఒ యు కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎం ఒ యు)పైన 2016 జులై 7న ప్రిటోరియాలో సంతకాలు జరిగాయి. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞాన రంగాలలో సహకరించుకోవడానికి సంబంధించి ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒక ఒప్పందానికి లోబడి ఈ ఎం ఒ యు పై సంతకాలు జరిగాయి.
ఈ ఎం ఒ యు లో భాగంగా నవకల్పనలకు సంబంధించిన అంశాలలో వివిధ కార్యక్రమాలను అంటే చర్చా వేదికలను, చర్చాసభ లను, కార్యశాల లను, శిక్షణ కార్యక్రమాలను ఉభయ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఇరు దేశాలు ఓపన్ సోర్స్ టెక్నాలజీలను ఒకదానితో మరొకటి పంచుకొంటాయి. ప్రాజెక్టులను ఉమ్మడిగా అభివృద్ధి చేస్తాయి (ఇరు దేశాలలోను సంబంధిత పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం కూడా ఇందులో భాగమే). ఇన్నోవేటర్లకు వారి ఆలోచనలను వ్యాపారాత్మకంగా మలచుకోవడానికి తోడ్పడడం జరుగుతుంది. సమాజానికి లబ్ధి చేకూరడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని సంయుక్తంగా అభివృద్ధిపరచడం, సాంకేతిక విజ్ఞానాన్ని సమాజ ప్రయోజనం కోసం బదలాయించడం దీనివల్ల సాధ్యపడగలదు.
ఇరు దేశాలలోను అట్టడుగు స్థాయి రంగాలలో అందరినీ కలుపుకొనిపోయేటట్లు నవకల్పనకు, ఔత్సాహిక పారిశ్రామిక తత్వానికి ఉపయోగపడేలా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన వ్యవస్థను ఈ ఎం ఒ యు కల్పిస్తుంది. అగ్రికల్చర్ బయోటెక్నాలజీ పైన, స్థానిక విజ్ఞాన వ్యవస్థల పైన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది.
***